
ఎడ్లబండికి బ్రేకులొచ్చాయి !
ప్రయోగం
బైకు మోడల్‌లో సంతోష్ ఎద్దుల బండికి బ్రేకు కనిపెట్టాడు. బండి తోలే వ్యక్తి కూర్చునే దగ్గరే ఆ బ్రేకు ఉంటుంది. ఇది ఎద్దుకు, మనిషికి సులువుగా ఆపడానికే కాకుండా కాస్త ఏటవాలుగా ఉన్నచోట కూడా బండిని వెనక్కు రాకుండా ఆపుచేయడానికీ తోడ్పడుతుంది.
వైఫల్యాలు ఉన్నాయంటే ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్థం. ఏదో ఒక ప్రయత్నం చేసేవారు ఆశాజీవులు. పని చేసి సాధించేవారు సమర్థులు. అందరికోసం కష్టపడి, తనతో పాటు అందరికీ పని సులువు చేసేవారు మార్గదర్శి. అవసరమే అన్నింటినీ నేర్పిస్తుందంటారు. ఆ మాటను నిజం చేసిన కుర్రాడు సంతోష్.
ఊళ్లలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సైకిలు తొక్కాం, బైకుల్లో తిరిగాం.... కార్లు కూడా తెచ్చుకున్నాం. కానీ ఇంతకాలం... ‘అరె వీటన్నింటికీ ఉన్న బ్రేకులు అదే చక్రాల మీద నడిచే ఎద్దుల బండికి ఎందుకు లేవు’ అని ఎవరైనా ఆలోచించారా? లేదు... కానీ కర్ణాటకలోని బెల్గాంకు చెందిన సంతోష్ ఆలోచించాడు. ఉత్తినే ఆలోచించి కూర్చోలేదు, ఆలోచనకు రూపం తెచ్చి సక్సెస్ అయ్యాడు. ఇపుడు ఎద్దుల బండికీ బ్రేకులొచ్చాయి. చిత్రమేంటంటే సంతోష్ శాస్త్రవేత్త కాదు, ఓ చిన్న కుర్రాడు. అతి సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడు.
ప్రతి పల్లెలో చిరు రైతు కుటుంబంలో పిల్లలకు చదువుతో పాటు పనిచేయడం తప్పదు. పైగా ఇష్టమైన కోర్సులు చదువుకునే అవకాశం కూడా ఉండదు. అంతెందుకు బస్సుకు టిక్కెట్లు లేక నడుచుకుంటూ వెళ్లి చదవుకునే వాళ్లింకా అక్కడక్కడా ఉన్నారు. సంతోష్ కూడా దాదాపు అలాంటి పరిస్థితిలో ఉన్న వాడే. ఉంటే బడిలో, లేకుంటే పొలంలో. రెండింటిపైన ఆసక్తి ఉంది. అందుకే దేనికీ తప్పేవాడు కాదు. కానీ, ఊరికే పొట్టకూటి కోసం మాత్రమే సంతోష్ పనిచేయకుండా కాస్త సునిశితంగా ఆలోచిస్తూ వచ్చాడు.
వ్యవసాయ కుటుంబాల్లో చిన్న రైతులు పడే ఇబ్బందులు చూస్తూ పెరిగాడు. వాటికి ఒక్కోదానికి అతను పరిష్కారాలు కనుక్కుంటూ వచ్చాడు. ఎద్దుల బండిని ఆపాలంటే బండిని లాగే ఎద్దుల ముక్కులకు కట్టిన తాడును గట్టిగా లాగితే అవి నొప్పి కలిగి ఆగిపోతాయి. ఇది తోలే రైతుకు, లాగే ఎద్దుకు ఇద్దరికీ కష్టమే. బైకు మోడల్‌లో సంతోష్ దీనికి బ్రేకు కనిపెట్టాడు. బండి తోలే వ్యక్తి కూర్చునే దగ్గరే ఆ బ్రేకు ఉంటుంది. ఇది ఎద్దుకు, మనిషికి సులువుగా ఆపడానికే కాకుండా కాస్త ఏటవాలుగా ఉన్నచోట కూడా బండిని వెనక్కు రాకుండా ఆపుచేయడానికీ తోడ్పడుతుంది. అలాగే సరుకు నింపుతున్నపుడు, మిట్టలు ఎక్కుతున్నపుడు రకరకాలుగా ఉపయోగపడుతుంది.
సంతోష్ మరో ఇన్వెన్షన్ క్యారెట్ క్లీనింగ్ మెషీన్. క్యారెట్ నేలలో పండే దుంప. దానికి మట్టి ఉంటుంది. అది క్లీన్ చేసే అమ్మాలి. క్వింటాలు క్యారెట్ శుభ్రం చేయాలంటే పన్నెండు మందికి గంట పడుతుంది. సంతోష్ కనిపెట్టిన యంత్రం వల్ల ఆ పనిని పది నిమిషాల్లో ఇద్దరు చేసేయొచ్చు. దీనికి కరెంటు అవసరం లేదు. ఖరీదు కూడా తక్కువే. దీనిని ఇప్పటికే బెల్గాం చుట్టుపక్కల రైతులు పెద్ద సంఖ్యలో కొన్నారు. వీటితో పాటు గ్యాసును వృథా చేయకుండా నీళ్లు వేడిచేసే విధానం కనిపెట్టాడు సంతోష్. అంటే గ్యాసు స్టౌతో వంట చేసుకుంటూనే అదే వేడిని నీటిని కాచడానికి కూడా వాడేస్తున్నాడు. దీనిని బెల్గాం హాస్టళ్లలో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు.
ఒకప్పుడు సంతోష్ అంటే ఎవరికీ తెలియదు, ఇపుడు బెల్గాం పరిసరాల్లో సంతోష్ అంటే తెలియని వారే లేరు. అతను నమ్మేది ఒకటే విషయం... సమస్య ఎప్పుడూ మనలోని శక్తిసామర్థ్యాలను వెలికితీయడానికే వస్తుంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుంటానంటాడు సంతోష్. ఇబ్బందులను మెట్లుగా మలచుకునే సంతోష్‌ను..భేష్ అని మెచ్చుకోవాల్సిందే.