బొద్దు... బంధం | she gain weight for his boy friend | Sakshi
Sakshi News home page

బొద్దు... బంధం

Published Sun, Jul 13 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

బొద్దు... బంధం

బొద్దు... బంధం

హృదయం
 
క్రిస్టీ రాబర్ట్‌సన్ గురించి చెప్పేముందు... ఆమె ప్రియుడు కాస్పర్ లూయిస్ గురించి, అతనికున్న ఓ చిత్రమైన అభిరుచి గురించి తెలుసుకోవాలి. స్క్రీన్ రైటర్ అయిన ఈ లడ్డుబాబుకు బొద్దుగా ఉండే అమ్మాయిలంటే భలే ఇష్టం. జీరో సైజు అమ్మాయిల్ని చూస్తే ‘వ్యాక్’ అంటాడు. అలాంటి వాళ్ల జోలికే వెళ్లడు. సన్నగా ఉన్న అమ్మాయులు ఎముకల గూళ్లు అన్నది అతని అభిప్రాయం. అతని తొలి గర్ల్‌ఫ్రెండ్ తాను కోరుకున్న విధంగా లావవ్వలేదని ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు కాస్పర్.

ఇలాంటి సమయంలో ఓ పబ్‌లో పరిచయమైంది క్రిస్టీ రాబర్ట్‌సన్. లూయిస్‌ను చూడగానే పడిపోయింది క్రిస్టీ. తర్వాత అతనికి ప్రపోజ్ చేసింది. కానీ అతను ఒప్పుకోలేదు. కారణం... క్రిస్టీ అప్పటికి నాజూగ్గా ఉండటమే. ఈ విషయమే ఆమెకు చెప్పాడు. ఇంకొకరైతే నవ్వి ఊరుకునేవాళ్లు. కానీ క్రిస్టీ మాత్రం... లూయిస్ కోసం తనను తాను మార్చుకోవడానికి సిద్ధమైంది.

ఆ రోజు వరకూ క్రిస్టీ జీవనశైలే వేరు. ఆమెకు మోడల్ కావాలన్నది లక్ష్యం. అందుకోసం రోజూ జిమ్‌కు వెళ్లి గంటలకొద్దీ కసరత్తులు చేయడం, డైటింగ్ నియమాలు పాటించడం, ఏం తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం... ఇదీ ఆమె లైఫ్ స్టైల్. సన్నగా ఉండటానికి ఇంత కష్టపడుతున్న ఆమె, లూయిస్ కోసం మొత్తం అవన్నీ వదిలేసింది. అంటే చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు తెగ తినడం మొదలుపెట్టింది. ఎక్సర్‌సైజులు మానేసి, గంటలకొద్దీ పడుకోవడం అలవాటు చేసుకుంది.
 
దీంతో కొన్ని నెలల్లోనే క్రిస్టీ రూపంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించడం మొదలైంది. ఆమె బాగా లావైంది. ఒంటి కొలతలు మారిపోయాయి. అప్పటిదాకా ఆమె వాడుతున్న డ్రెస్సులన్నీ టైట్ అయిపోయాయి. అన్నీ కొత్త డ్రెస్సులు కొనుక్కోవాల్సి వచ్చింది. తనకోసం క్రిస్టీ పడుతున్న కష్టం చూసి, లూయిస్ కరిగిపోయాడు. పెరుగుతున్న ఆమె బరువుతో పాటు ఆమెపై అతని ప్రేమ కూడా పెరిగింది. ఇద్దరూ కలిసి షికార్లు మొదలుపెట్టారు. ఐతే ఎక్కడికెళ్లినా క్రిస్టీకి కడుపు నిండా తినిపించడమే లూయిస్ పని. ఆమెకిచ్చే బహుమతులన్నీ కూడా తిండికి సంబంధించినవే అయి ఉంటాయి.
 
బాయ్‌ఫ్రెండ్ కోసం సన్నబడేవాళ్లను చూసుంటారు కానీ, ఇలా లావవ్వడం చిత్రమైన విషయం కదా! అందుకే క్రిస్టీని అందరూ తిట్టిపోశారు. క్రిస్టీ తల్లిదండ్రులైతే, తమ కూతురికేమైనా పిచ్చి పట్టిందేమో అనుకున్నారు. స్నేహితులు కూడా ఇది మంచిది కాదన్నారు. కానీ క్రిస్టీ వినలేదు. తను లావవ్వడం లూయిస్‌కు ఎంత ఆనందాన్నిచ్చిందో ఆమెకు తెలుసు. ఒకప్పుడు సన్నబడటానికి అనేక కష్టాలు పడ్డానని, వాటితో పోలిస్తే ఇది పెద్ద కష్టం కాదని అంటోందామె. సాధారణంగా బాయ్‌ఫ్రెండ్స్ అయినా, భర్తలైనా సన్నబడమని పోరుపెడతారని, కానీ కడుపు నిండా తిని లావవ్వమని చెప్పే బాయ్‌ఫ్రెండ్ దొరకడం తన అదృష్టమని కూడా చెబుతోంది క్రిస్టీ.
 
ఎవరేమన్నా లూయిస్, తాను కలిసి ఆనందంగా ఉండటమే ముఖ్యమని అంటోందామె. ఐతే క్రిస్టీ కథ తెలుసుకున్న వైద్యులు... ఆమె లైఫ్ స్టైల్ ప్రమాదకరమని, ఇలాగే తింటూ మరీ లావెక్కిపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఇదే విషయం క్రిస్టీ దగ్గర ప్రస్తావిస్తే... ఆరోగ్యం విషయంలో మరీ అజాగ్రత్తగా ఏమీ లేనని, ఇంకొన్నాళ్లు శృంగార జీవితం అనుభవించిన తర్వాత కాస్త సన్నబడే ప్రయత్నం చేస్తానని, ప్రస్తుతానికైతే తన ప్రియుణ్ని సంతృప్తి పరచడమే తన పని అంటోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement