
సాకర్ కిక్
ఫుట్‌బాల్ అంటే కేవలం ఓ ఆటేనా..! 22 మంది ఆటగాళ్లు ఓ బంతి కోసం చేసే విన్యాసాలేనా..!
కాదేమో..! ఫుట్‌బాల్ ఓ ఆటే అయితే నెల రోజులుగా ప్రపంచం ఎందుకు ఊగిపోయింది..? ఇంకా ఏదో ఉంది. ఏంటది..?
ఫుట్‌బాల్ అంటే... ప్రపంచాన్ని ఏకం చేసే ఓ మతం.
ఫుట్‌బాల్ అంటే... వేల కోట్ల రూపాయలను సృష్టించే
ఓ మంత్రదండం.
ఫుట్‌బాల్ అంటే.... ప్రపంచానికే ప్రాణం.
ఏడాది పొడవునా ప్రపంచంలో ఏదో ఒక మూలన ఏదో ఒక చోట ఓ ఫుట్‌బాల్ లీగ్ జరుగుతూనే ఉంటుంది. కానీ వాటన్నింటినీ మించిన కిక్ ప్రపంచకప్‌లో ఉంది. అందుకే నెల రోజుల కోసం అభిమానులు నాలుగేళ్ల పాటు కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూశారు. ఎందుకంటే ఫుట్‌బాల్ ప్రపంచక ప్ ఓ మైకం.ఒక్కసారి రుచిమరిగితే ఇక దానికి బానిస కావలసిందే.
చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి. ప్రపంచం మొత్తం ఈ నెల రోజుల పాటు బ్రెజిల్ వైపు చూసింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ పుణ్యమాని ఆసియా దేశాల్లో అభిమానులు నిద్రలు మానేశారు. యూరోప్, అమెరికా దేశాల్లో అభిమానులు పనులు మానేశారు. ఆఫ్రికా దేశాల్లో ఆకలిని మరచిపోయారు. మైమరిపించే గోల్స్... కళ్లు చెదిరే కిక్స్... కనికట్టు చేసే పాస్‌లు... ప్రత్యర్థులను మొరటుగా తోసైనా సరే బంతిని అందుకోవాలనే పట్టుదల... మైదానంలో ఆడుతుంది 22 మందే కావచ్చు... ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఆ బంతి కోసం ఆరాటపడ్డారు.
నేటితో తెర..
ప్రపంచంలో అత్యధిక ఆదరణ గల క్రీడ అయిన ఫుట్‌బాల్‌లో ప్రతి నాలుగేళ్లకోసారి ప్రపంచకప్ జరుగుతుంది. ఇందుకోసం మూడేళ్ల ముందు నుంచే ఖండాల వారీగా క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా అదే పద్ధతిన నిర్వహించిన క్వాలిఫయర్స్ నుంచి 31 జట్లు ప్రధాన టోర్నీకి అర్హత సాధించాయి. ఆతిథ్య జట్టుగా బ్రెజిల్ నేరుగా ప్రపంచకప్‌లో ఆడింది. మొత్తంగా 32 జట్లు ఎనిమిది గ్రూఫులుగా తలపడ్డాయి. గ్రూప్ దశలోనే 16 జట్లు వెనుదిరగగా, మిగిలిన జట్లు నాకౌట్ దశల్లో ఆడుతూ వచ్చాయి. ఆదివారం (జూలై 13న) జరగనున్న తుదిపోరుతో నెల రోజులుగా సాగిన సాకర్ సంబరానికి తెరపడనుంది.
బ్రెజిల్ ఆతిథ్యం అదరహో...
ఎప్పుడో 1950లో తొలిసారి ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్.. మళ్లీ ఇన్నాళ్లకు ఆ అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈసారి ప్రపంచకప్ నిర్వహణలో తమదైన ముద్ర వేసేందుకు బ్రెజిల్ భారీగా ఖర్చు చేసింది. ఏకంగా 7 కొత్త స్టేడియాలు నిర్మించింది. అప్పటికే ఉన్న మరో 5 స్టేడియాలకు నూతన హంగుల్ని ఏర్పాటు చేసింది. సకల సౌకర్యాలతో కూడిన స్టేడియాలు, ఆటగాళ్లకు అన్ని వసతులతో కూడిన ఆతిథ్యం, రవాణా సౌకర్యం, బసకు అవసరమైన హోటళ్లు.. ఇలా ప్రతి విషయంలోనూ ‘భారీతనం’ ఉట్టిపడింది. ఇందుకోసం బ్రెజిల్ దాదాపు రూ. 90 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రపంచకప్ చరిత్రలోనే ఇది గతంలో ఎన్నడూ లేనంత భారీ వ్యయం. ఇందులో స్టేడియాల నిర్మాణానికే సుమారు రూ. 22 వేల కోట్లు ఖర్చు చేశారు.
దీంతోబ్రెజిల్‌లో వ్యతిరేకత మొదలైంది. ఓవైపు దేశంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే.. ఫుట్‌బాల్ కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడమేంటంటూ నిరసనలు వెల్లువెత్తాయి. జూన్ 12న రాజధాని బ్రెజిలియాలో ఓవైపు టోర్నీ ప్రారంభ వేడుకలు జరుగుతుండగా, స్టేడియం బయట పెద్ద సంఖ్యలో పౌరులు నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో దేశాధ్యక్షుడితోపాటు ఫిఫా అధ్యక్షుడి ఉపన్యాసం కూడా లేకుండానే వేడుకలు ముగించారు.
రూ.3470 కోట్ల ప్రైజ్‌మనీ..
మనవరకైతే నమ్మడానికి కూడా కష్టంగానే ఉంటుంది.. కానీ, నిజం. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం ప్రైజ్‌మనీ ఇది. టోర్నీ విజేతకు రూ. 210 కోట్లు చెల్లించనుండగా, రన్నరప్‌కు రూ.150 కోట్లు దక్కనున్నాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లతోపాటు గ్రూప్ దశలో నిష్ర్కమించిన జట్ల దాకా ప్రతి జట్టుకూ భారీగానే అందజేయనున్నారు. గతంలో ఎన్నడూ ఇంత భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ అందించిన దాఖలాలు లేవు.
గ్రూప్ దశలోనే గోల్స్ వర్షం
ఖర్చులోనేగాక గోల్స్ పరంగానూ ఈసారి ప్రపంచకప్ రికార్డులు నమోదు చేసింది. గత 19 ప్రపంచకప్ టోర్నీలను మించి.. గ్రూప్ దశలోనే గోల్స్ వర్షం కురిసింది. టోర్నీ రెండో రోజే నెదర్లాండ్స్ స్ట్రయికర్ రాబిన్ వాన్ పెర్సీ అద్భుతమైన హెడర్ గోల్ సాధించి అభిమానుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. ముందుకు డైవ్ చేస్తూ గాల్లోనే తలతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపిన తీరు టోర్నీపై ఆసక్తిని మరింత పెంచింది. అర్జెంటీనా స్టార్ మెస్సి అద్భుత విన్యాసాలు ఫ్యాన్స్‌ను మైమరపిస్తే, మెక్సికో గోల్‌కీపర్ గిలెర్మో ఓకో.. ఆతిథ్య బ్రెజిల్‌ను గోల్ సాధించకుండా అడ్డుకున్న తీరు అబ్బురపరిచింది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో స్టార్ ఆవిర్భవిస్తూ గోల్స్ పండగ చేశారు. 32 జట్లు కలిసి గ్రూప్ దశలో 48 మ్యాచ్‌లాడగా, మొత్తం 129 గోల్స్ నమోదయ్యాయి. సగటున మ్యాచ్‌కు 2.9 గోల్స్ రికార్డయ్యాయి. గత ప్రపంచకప్ (2010)లో ఈ సగటు 2.3గా నమోదైంది.
వ్యక్తుల కంటే జట్టు గొప్పది..
ప్రపంచకప్ ప్రారంభానికి ముందు పలువురు స్టార్ ఆటగాళ్ల పేర్లు మారుమోగాయి. వివిధ లీగ్‌లలో మెరుపులు మెరిపించే ఆయా ఆటగాళ్లు ప్రపంచకప్‌లోనూ తాము ప్రాతినిధ్యం వహించే జట్లకు ఘనవిజయాలు సాధించిపెట్టగలరని అంతా భావించారు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), లియోనెల్ మెస్సి (అర్జెంటీనా), వేన్ రూనీ (ఇంగ్లండ్), లూయిస్ స్వారెజ్ (ఉరుగ్వే), నెయ్‌మార్ (బ్రెజిల్), ఫెర్నాండో టోరెస్ (స్పెయిన్) వంటి ఆటగాళ్లపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ రూనీని నమ్ముకున్న ఇంగ్లండ్, రొనాల్డోను నమ్ముకున్న పోర్చుగల్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి. ప్రపంచంలోనే నంబర్‌వన్ ప్లేయర్‌గా కీర్తించబడుతున్న రొనాల్డో.. తన స్థాయితో పోలిస్తే పూర్తిగా విఫలమయ్యాడు. ఆలస్యంగా టచ్‌లోకి వచ్చి తమ చివరి మ్యాచ్‌ను గెలిపించినా.. ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ స్ట్రయికర్ రూనీదీ అదే కథ.
బ్రెజిల్ విజయాల్లో నెయ్‌మార్ కీలకపాత్రే పోషించినా.. సమష్టి కృషే ఆ జట్టును ముందుకు నడిపించింది. ఇక గత ప్రపంచకప్‌లో ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయిన మెస్సీ మాత్రం ఈసారి చెలరేగాడు. ఉరుగ్వే స్టార్ స్వారెజ్ మూర్ఖపు చర్య కారణంగా ఆ జట్టు తీవ్రంగా నష్టపోయింది. మరోవైపు ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి, సమష్టి కృషినే నమ్ముకున్న మెక్సికో, చిలీ, కోస్టారికా, కొలంబియా, అల్జీరియా వంటి జట్లు తమ స్థాయిని మించిన ప్రదర్శనతో నాకౌట్ దశకు చేరుకున్నాయి. తద్వారా వ్యక్తి కంటే జట్టు గొప్పది అని ఈ ప్రపంచకప్ ద్వారా మరోసారి నిరూపితమయింది.
బ్యాడ్ బాయ్ స్వారెజ్
ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల సత్తా ఉన్నా.. మైదానంలో దుష్ర్పవర్తనతో బ్యాడ్ బాయ్‌గా ముద్ర వేయించుకున్న ఉరుగ్వే స్టార్ లూయిస్ స్వారెజ్ ఈ ప్రపంచకప్‌లో మరోసారి తన స్వభావాన్ని బయటపెట్టుకుని భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో స్వారెజ్.. ప్రత్యర్థి జట్టు డిఫెండర్ జియార్జియో చిలిని భుజాన్ని కొరికాడు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఫిఫా.. సంఘటనపై విచారణ జరిపి స్వారెజ్‌ను ఏకంగా 9 అంతర్జాతీయ మ్యాచ్‌లతోపాటు 4 నెలలపాటు ఫుట్‌బాల్ జోలికే వెళ్లకుండా నిషేధం విధించింది. మూర్ఖపు చర్యతో స్వారెజ్ నిషేధానికి గురి కావడం ఇది మూడోసారి.
ఫిఫాకు పంటే
ఎప్పుడు ఎక్కడ ప్రపంచకప్ జరిగినా ఫిఫాకు కాసుల పంట పండుతుంది. అయితే ఈసారి మాత్రం మునుపెన్నడూ లేనంత భారీ ఆదాయం చేకూరింది. టీవీ ప్రసార హక్కులు, టిక్కెట్ల అమ్మకం, మార్కెటింగ్ వంటి మార్గాల ద్వారా టోర్నీ ముగిసేటప్పటికి ఫిఫాకు మొత్తం రూ. 24 వేల కోట్లు (4 బిలియన్ డాలర్లు) ఆదాయం లభించనున్నట్లు అంచనా. గత ప్రపంచకప్ ద్వారా లభించిన ఆదాయంతో పోలిస్తే ఇది 66 శాతం అధికం. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా టీవీ ప్రసార హక్కుల ద్వారానే రూ. 10 వేల కోట్లకు పైగా సమకూరింది.
భారత్‌లో ఇలాంటి ఈవెంట్..!
ఊహించడం కూడా కష్టమేనేమో! క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ గల మన దేశంలో ఫుట్‌బాల్‌ను పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే కోల్‌కతా వంటి ఒకటి రెండు నగరాల్లో అభిమానులు ఫుట్‌బాల్ పట్ల బాగానే ఆసక్తి కనబరుస్తుంటారు. పైగా ఇటీవల ఫుట్‌బాల్ లీగ్ ఏర్పాటు కావడం, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, పలువురు బాలీవుడ్ నటులు ఇందులో భాగస్వాములు కావడం వంటి అంశాలు భారత్‌లో ఫుట్‌బాల్‌పై క్రేజ్‌ను పెంచుతున్నాయి. అంతేకాదు... 2017లో జరగనున్న అండర్-17 ప్రపంచకప్‌కు భారతే ఆతిథ్యమివ్వనుంది. భారత్‌లో ఓ అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నీ జరగనుండడం ఇదే తొలిసారి.
‘డాన్’ దొరికాడు
ప్రపంచకప్.. అభిమానులకు వినోదం పంచడం మాత్రమే కాదు. కరడుగట్టిన నేరస్తుణ్ని పట్టించి పోలీసులకూ సహాయపడింది. డ్రగ్స్ వ్యాపారంతో ఎన్నో ఏళ్లుగా మెక్సికో దేశాన్ని వణికించిన ‘డాన్’ సాంచెజ్ అరెలానో ఫుట్‌బాల్‌పై ఉన్న అభిమానంతో పోలీసుల వలలో చిక్కాడు. తలపై దాదాపు రూ. 14 కోట్ల (14 లక్షల పౌండ్లు) రివార్డున్న అరెలానో.. మెక్సికో-క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్‌ను టీవీలో మైమరచిపోయి చూస్తూ తిజువానా నగరంలో పోలీసులకు దొరికిపోయాడు.
ఆసియా స్థాయికే భారత్ పరిమితం
కేవలం లక్షల్లో మాత్రమే జనాభా కలిగిన దేశాలు కూడా ప్రపంచకప్ స్థాయిలో సత్తా చాటుతుంటే 120 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం కనీసం దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి. 1948లో జాతీయ జట్టును తీర్చిదిద్దాక భారత్ గొప్పగానే రాణించింది. ఈ క్రమంలో 1950లో క్వాలిఫయర్స్‌లో ప్రత్యర్థి జట్లు పోటీ నుంచి వైదొలగడంతో ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత కూడా సాధించింది. కానీ, బ్రెజిల్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో పలు కారణాలతో భారత్ పాల్గొనలేదు. సౌకర్యాల లేమి, ప్రయాణ ఖర్చులు భరించేవారు లేకపోవడం వంటి ఆర్థికపరమైన సమస్యలతోపాటు ప్రపంచకప్ కన్నా ఒలింపిక్స్‌కే భారత్ ఎక్కువ ప్రాధాన్యమివ్వడం వంటి అంశాలు ఇందుకు కారణం. ఆ తరువాత ఇంకెప్పుడూ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. అయితే దేశంలో జూనియర్ స్థాయి నుంచి ఫుట్‌బాల్ అభివృద్ధికి చర్యలు చేపడితే ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం రావచ్చు.
- కంచర్ల శ్యాంసుందర్
అభిమానులకు కావలసినంత సరదా...
బ్రెజిల్ అంటేనే సాకర్, సాంబా, సెక్స్.. అన్నవిధంగా ముద్రపడింది. అందుకు తగ్గట్టుగానే ఫుట్‌బాల్ అంటే ప్రాణమిచ్చే ఈ దేశం నెలరోజులపాటు సాకర్ ఫీవర్‌తో ఊగిపోయింది. ఇదంతా ఒక ఎత్తు. వ్యభిచారం చట్టబద్ధమైన బ్రెజిల్‌లో శృంగార రసాస్వాదన మరో ఎత్తు. ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చే వారిని ఆకర్షించేందుకు, వారితో సంభాషించేందుకు అక్కడి సెక్స్‌వర్కర్లు ప్రత్యేకంగా శిక్షణ తరగతులకు హాజరై ఇంగ్లీష్ నేర్చుకున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. కండోమ్ కంపెనీలు లక్షల సంఖ్యలో కండోమ్‌లను సరఫరా చేసినా సరిపోలేదట!
భారత్ నుంచీ వెళ్లారు..!
క్రికెట్‌కే తప్ప ఫుట్‌బాల్‌కు అంతగా ఆదరణ లేదని భావించే భారత్‌నూ ఈసారి సాకర్ ఫీవర్ బాగానే పట్టుకుంది. ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇక్కడి నుంచి బ్రెజిల్‌కు వెళ్లినవారు, అందులోనూ 81 ఏళ్ల తాతయ్య, బామ్మ ఉండడం విశేషం. కోల్‌కతాకు చెందిన ఈ వృద్ధ దంపతులు పన్నాలాల్ చటర్జీ, చైతాలి బ్రెజిల్‌కు వెళ్లి మరీ మ్యాచ్‌లను వీక్షించారు. సాధారణ మధ్య తరగతికి చెందిన వారే అయినా.. వీరు ప్రపంచకప్ వీక్షించేందుకు వెళ్లడం ఇదే తొలిసారి కాదు. 1982 నుంచి ఎక్కడ ప్రపంచకప్ జరిగితే అక్కడికి వెళ్తూనే ఉన్నారు.