
రియో: ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే బ్రెజిల్ దేశంలో నిర్వహణాపరంగా ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. ఇకపై పురుష ఫుట్‌బాల్ ఆటగాళ్లతో సమానంగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే మహిళా ఆటగాళ్లకు వేతనాలు ఇవ్వాలని బ్రెజిల్ ఫుట్‌బాల్ సంఘం (సీబీఎఫ్) నిర్ణయించింది. జాతీయ ఫుట్‌బాలర్లందరికీ వేతనాలతో పాటు ప్రైజ్‌మనీ కూడా సమానంగా ఇవ్వనున్నట్లు సీబీఎఫ్ అధ్యక్షుడు రోజెరియో కబోల్కో ప్రకటించారు.
‘ఈ ఏడాది మార్చి నుంచి జాతీయ పురుషులు, మహిళల ఫుట్‌బాలర్లకు ప్రతీది సమానంగా ఇవ్వాలని నిర్ణయించాం. ఇక ఏ అంశంలోనూ లింగ వివక్ష ఉండబోదు. పురుషులకు, మహిళలకు సీబీఎఫ్ సమాన ప్రాధాన్యతనిస్తుంది. వరల్డ్‌కప్, ఒలింపిక్స్ వేదికల్లో ప్రదర్శనలకు కూడా సమాన బహుమతులు లభిస్తాయి’ అని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, నార్వే, న్యూజిలాండ్ జట్లు మాత్రమే పురుష, మహిళా క్రీడాకారులకు సమాన వేతనాలు అందజేస్తున్నాయి. ఇప్పుడు వీటి సరసన బ్రెజిల్ చేరింది. 2007 ప్రపంచ కప్‌లో ఫైనల్ చేరడం బ్రెజిల్ మహిళల జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత ఏడాది ప్రపంచకప్‌లో గ్రూప్ దశకే పరిమితమైన జట్టు... సొంత గడ్డపై జరిగిన 2016 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.
(చదవండి: అయ్యో...ముర్రే)
Comments
Please login to add a commentAdd a comment