విషాదంలో అర్జెంటీనా
బ్యూనస్ ఎయిర్స్: 1986 అనంతరం మరోసారి కప్ గెలుచుకునే సువర్ణావకాశం చేజారిందనే ఆవేదనలో అర్జెంటీనా వాసులు మునిగిపోయారు. అయితే చాలామంది తమ జట్టు ఈ టోర్నీలో చూపిన ప్రతిభపై సంతోషం వ్యక్తం చేసినా ఇంకొందరు మాత్రం తమ కోపాన్ని విధ్వంసకర రీతిలో వ్యక్తం చేశారు. ఫైనల్ అవగానే కొందరు ఫలితంతో సంబంధం లేకుండా తమ దేశ పతాకాలతో తిరుగుతూ సంబరాలు జరుపుకున్నారు. మెస్సీ బృందాన్ని పొగుడుతూ బాణసంచా కాల్చారు. డ్రమ్స్ వాయిస్తూ ట్రాఫిక్ లైట్లు, బస్ స్టాప్స్ పైకి ఎక్కి నృత్యాలు చేశారు. అయితే కొన్ని గంటల అనంతరం అల్లరి మూకలకు పెట్టింది పేరైన ‘బారా బ్రవాస్’ రంగంలోకి దిగింది. సెక్యూరిటీగా ఉన్న పోలీసులపైకి వీరు రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో వెంటనే పోలీసులు రబ్బర్ బుల్లెట్స్, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్‌లను ప్రయోగించారు. ఈ ఘటనలో 15 మంది పోలీసులు, 40 మంది ఇతరులు గాయపడినట్టు మీడియా పేర్కొంది.
జట్టుకు ఘనస్వాగతం: అర్జెంటీనా జట్టుకు స్వదేశంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఇక్కడికి చేరుకున్న మెస్సీ బృందానికి విమానాశ్రయంలో వేలాది మంది శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా దేశాధ్యక్షుడు క్రిస్టినా కిర్‌చ్నెర్‌ను కోచ్ సాబెల్లాతో కలిసి ఆటగాళ్లు కలుసుకున్నారు. దారి పొడుగునా అభిమానులు నిలబడి దేశ పతాకాలు ఊపుతూ కనిపించారు.