ఇటు హోరు... అటు భోరు
సంబరాల్లో జర్మనీ
బెర్లిన్: జర్మనీలో ఇప్పుడు ఎటుచూసినా పండగ వాతావరణమే. ఆదివారం రాత్రి ఆ దేశస్థులు అసలు నిద్రపోలేదనడంలో సందేహం లేదు. సమయంతో పాటు వయసుతో సంబంధం లేకుండా వారు తనివి తీరా సంబరాలు చేసుకున్నారు. రాజధాని బెర్లిన్ అయితే బాణసంచా వెలుగులతో నిండిపోయింది. వీధుల్లో అభిమానుల చిందులకు అంతే లేకుండా పోయింది. అదే పనిగా తమ కార్ల హారన్‌లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 25వేలకు పైగా అభిమానులు బెర్లిన్‌కు తరలివెళ్లి దేశ పతాకాన్ని చూపుతూ అంతటా తిరుగాడుతూ కనిపించారు. ప్రముఖ బ్రాండెన్‌బర్గ్ గేట్ దగ్గర సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
స్పేస్ నుంచి శుభాకాంక్షలు
ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జర్మనీ జట్టుకు అంతరిక్షం నుంచి కూడా శుభాకాంక్షలు అందాయి. స్పేస్ స్టేషన్‌లో ఉన్న జర్మన్ వాసి అలెగ్జాండర్ గెర్స్ట్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘మనకు మరో నక్షత్రం జత కలిసింది’ అంటూ నాలుగు స్టార్స్‌తో కూడిన జర్మన్ జెర్సీని వేసుకున్న తన ఫొటో పంపాడు.
బ్రెజిల్‌లోనూ...: తమ చిరకాల ప్రత్యర్థి అర్జెంటీనా ఫైనల్లో ఓడిపోవడంతో బ్రెజిల్‌లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. రోడ్లపైకి వేలాదిగా వచ్చి అర్జెంటీనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాణసంచా కాల్చారు.