మణి | director maní ratnam special chit chat | Sakshi
Sakshi News home page

మణి

Published Sat, May 31 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

మణి

మణి

అందరికీ అవే విశేషణాలు వాడి, మణిరత్నానికీ అవే ప్రయోగించాలంటే- దగ్గరి బంధువు కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఏమీ వండలేకపోతినే అని చింతించే ఇల్లాలు గుర్తొస్తోంది. నిశ్శబ్దంగా మంచుతెరను దాటుతూ, ఎక్కడో పసుపు వర్ణపు పూవును సుతారంగా తాకుతూ, దూరంగా వినిపిస్తున్న రైలుకూతతో మేఘాల్లోకి మేల్కొంటూ... మణిరత్నం దృశ్యం అందంగా ఉంటుందన్నది మామూలు విషయమే. కానీ అందగత్తె మరింత వన్నెలద్దుకున్నట్టుగా ఉంటుంది(ఒక్కోసారి, ఆభరణాలే అతివను కప్పేయొచ్చు కూడా!). భారతదేశానికి వెలుపల- అడ్రియన్ లైన్, కీస్లోవ్‌స్కీ, మాజిది మాత్రమే ఇలాంటి మ్యాజిక్ చేశారనిపిస్తుంది.

 ‘కొన్ని పాత్రలేవో లీలగా మనసులో కదలాడుతాయి. ఇక అవి నన్ను సాధిస్తాయి, ఉత్సాహపరుస్తాయి, కష్టపెడతాయి, మోహపడేలా చేస్తాయి... అది సినిమా అవుతుందో అవదో! అయినా ఆ నోట్సంతా రాస్తూవుంటాను. ఎప్పుడో ఒకసారి ఇక ఇదంతా జరుగుతుందనిపిస్తుంది. సంభాషణలు రాయడానికి కూర్చున్నప్పుడు మరింత స్పష్టత వస్తూవుంటుంది. కానీ దానికి తుదిరూపం మాత్రం దానికివ్వాల్సినంత పరిధిని ఇచ్చే నటులవల్లే వస్తుంది. అందుకే నటుడు, నటి తమకే సొంతమైనదేదో ఆ పాత్రకు కలపాలనుకుంటాను,’ అని చెబుతాడాయన సినిమాకు సిద్ధపడే తీరు గురించి. ‘రోజా’ తెరమీదకు రావడానికి ఏడేళ్లకు ముందునుంచీ తన లోలోపల ఆలోచన సాగుతూనేవుందట!

 నటులంతా అప్పుడే కొత్తగా జన్మెత్తినట్టు కనిపిస్తారు ఆయన సినిమాల్లో. పిల్లల్నుంచి నటన రాబట్టుకోవడంలో ఏ తాయిలాలు ఇవ్వజూపుతాడో అంతుపట్టదు. అంజలి, అమృత, గీతాంజలి , బొంబాయిలో పిల్లలు మాత్రం!ఎప్పుడూ ఇంపుగా ధ్వనించని శేఖర్ అనే మామూలు పేరుకూడా కేవలం మణిరత్నం పెట్టాడు కాబట్టి ప్రియమైపోతుంది. అర్జున్ తండ్రి శేఖర్... కబీర్ నారాయణ తండ్రీ శేఖరే!
 పోలికతో ఉన్న సమస్యేమిటంటే, అది అసలైన మనిషిని మరుగుపరుస్తుంది. కానీ ఒకమేరకు అంచనా వేయడానికి పనికిరావొచ్చు. సావిత్రి-సత్యవంతుడు, దుర్యోధనుడు-కర్ణుడు, రావణుడు-సీత... ఒక్కోసారి, ప్రాచ్య ఇతివృత్తాలకు పాశ్చాత్య ఆధునికత అద్దిన రవివర్మలా తోస్తారు మణిరత్నం. తమిళ రాజకీయాలు, క్యాన్సర్ మరణాలు, కశ్మీర్, బొంబాయి, శ్రీలంక, ఈశాన్యం, వరదరాజ మొదలియార్, ధీరూభాయ్ అంబానీ... లోగొంతుకల అబ్బాయిలూ, కీచుమనే అమ్మాయిలూ, భాష తెలిసిన సంగీతమూ, వెలుగు నీడలూ, మౌనరాగాలూ వీటన్నింటికీ సాహిత్యమో, జీవితమో దన్నుగా ఉంది కాబట్టే అవి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కట్టిన మేడల్లా కాకుండా ఇప్పటికీ నిలబడగలిగాయి.

 జాలర్ల నేపథ్యం తీసుకుంటే... వాళ్ల ఇండ్లు ఎలా ఉంటాయి? వానలు పడినప్పుడు ఏం చేస్తారు? పడవలు ఎక్కడ ఉంచుతారు? వలలు ఎక్కడ తగిలిస్తారు? ‘పాత్రికేయుడు, న్యాయవాదిలాంటివాడే దర్శకుడు కూడా’! సినిమా దానికదే జరిగే అద్భుతం అనుకునే బాల్యపు భ్రమ నుంచి బయటపడి, ‘సినిమాను కూడా ఎవరో ఒక మనిషి నిర్దేశిస్తాడు’ అన్న జ్ఞానోదయం కలిగాక, సహజ పండితుడిలాగా ‘పల్లవి-అనుపల్లవి’(1983)తో తన ప్రస్థానం ప్రారంభించాడు మణిరత్నం. మితంగా, హితంగా, సున్నితంగా... ప్రేక్షకులకు కొత్తగా చూడటం నేర్పాడు. ‘సఖి’లో ఇద్దరు తండ్రులు మాట్లాడుకున్నప్పుడు, అసలు ఇందులో ఘర్షణ ఎక్కడుందీ అనిపిస్తుంది! చాలదా, ఒక్క పెళుసుమాట!

 అయితే, ఇదంతా శ్రీధర్, మహేంద్రన్, బాలచందర్, భారతీరాజా లాంటివాళ్లు పరిచిన బాటని ఆయనకు తెలుసు. ఇదేకాదు, ఒక భాష సినిమాను మరో భాషలోకి డబ్ చేయడంలో కోల్పోయే ‘ఎలాస్టిసిటీ’ ఆయనకు తెలుసు; చాలా ఆత్మవిశ్వాసంతో మొదలయ్యే ప్రాజెక్టు కూడా విడుదలకుముందు అభద్రతకు గురిచేస్తుందని తెలుసు; స్క్రిప్టు దశనుంచి చివరిదాకా ఉండాల్సినంత సత్యంగా ఉన్నామా అని మథనపడాల్సివచ్చే అనివార్యపు రాజీలు కూడా తెలుసు!

 ‘కాటుక కళ్లతో కాటు’ వేసే ప్రధానస్రవంతి మాయలో చిక్కుకుని, మరో సత్యజిత్ రే కాగలిగీ మణిరత్నంగా మిగిలిపోయాడే అని దిగులు వేస్తూంటుంది ఒక్కో సారి. కానీ ఆయనంటాడూ: ‘కమర్షియల్ సక్సెస్ అనేది దానికదే చెడ్డది కాదు. ప్రధానస్రవంతిలో ఉండటమంటే మూర్ఖంగా ఉండటం కాదు. తార్కికంగా, కళాత్మకంగావుంటూ కూడా ప్రధాన స్రవంతిలో పనిచేయొచ్చు’. దీన్నీ ఒప్పుకోవాలేమో! మరి, ‘టైమ్ 100 ప్రపంచ గొప్ప చిత్రాల జాబితా’ను గనక ఒక ప్రమాణంగా అంగీకరిస్తే... అందులో, భారతీయ సినిమాకు ప్రాతినిధ్యంగా, పథేర్ పాంచాలి(సత్యజిత్ రే), ప్యాసా(గురుదత్)తోపాటు ఉన్నది మణిరత్నం ‘నాయకు’డే!

 - పూడూరి రాజిరెడ్డి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement