మజిలీ
‘ఔత్సాహికులకు 60 పౌండ్లు మాత్రమే. వెంటనే రిజిస్టర్ చేసుకోండి’ అంటున్న పూర్వ సినీనటి గీతాంజలి యోగా ప్రస్థానం ఆసక్తి కలిగిస్తోంది. ‘గీతాంజలి’ సినిమాతో ఒక వెలుగు వెలిగిన గిరిజా షెట్టార్ యు.కె.లో స్థిరపడింది. 35 ఏళ్ల తర్వాత ఇటీవలే ఒక కన్నడ సినిమాలో సింగిల్ మదర్‌గా నటించిన గిరిజ ‘ఆ పాత్ర స్థితి. నా స్థితి ఒకటే కనుక ఒప్పుకున్నాను’ అని చెబుతోంది. గతంలో పత్రికా రిపోర్టర్‌గా పని చేసిన గిరిజ ఇప్పుడు మనిషికి ఆరు వేల రూపాయల ఫీజుతో యోగా నేర్పిస్తోంది. ఆమె రాబడి ఎలా ఉన్నా యోగా అవసరం గురించి ఆమె చెప్తున్న విషయాలు అందరూ వినదగ్గవి.
‘2023 సంవత్సరం మే నెలలో నాకు అనిపించింది ఇక మీదట నేను యోగా, ధ్యాన మార్గాలలో మార్గదర్శిగా నిలవాలని. ఆ నిర్ణయం తీసుకున్నాక ఎంతోమందికి సాయపడుతున్నాను’ అంటున్నారు గిరిజ. ‘గీతాంజలి’ (1989) సినిమాతో నేటికీ మరపు రాని ఈ నటి చాలా యేళ్లుగా యు.కెలో స్థిరపడినా, రకరకాల ఉద్యోగాలు చేసినా 55 ఏళ్ల వయసులో యోగా టీచర్‌గా నూతన ప్రస్థానం సాగిస్తున్నారు. భారతీయ సినిమాలు చూడటమే మానేసిన గిరిజ అందుకు కారణం ఏమంటారంటే ‘చూశానంటే మనసు పాడవుతుంది. ఆ సినిమాలలో నేను చాలా చేసి ఉండే అవకాశం ఉందప్పుడు. అవన్నీ వదులుకొని వచ్చినందుకు ఒక్కోసారి అది సరైన నిర్ణయం కాదని అనిపిస్తుంది’ అంటారు.
2024 సెప్టెంబర్ 5న విడుదల అయిన ‘ఇబ్బని తబ్బిద ఇలెయాలి’ అనే కన్నడ సినిమా లో సింగిల్ మదర్‌గా నటించారు గిరిజ (ప్రైమ్‌టైమ్‌లో ఉంది). ‘నేను ఉన్న స్థితి ఆ పాత్ర స్థితి ఒక్కటే కనుక నిర్మాత రక్షిత్ శెట్టి అడిగాక అంగీకరించాను’ అంటారామె. అయితే సినిమాల మీద కంటే ఆమె ధ్యాస, ఆసక్తి కేవలం యోగా గురువుగా తాను చేయవలసిన సేవ మీదే ఉన్నట్టుగా ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.
గీతాంజలి గర్ల్
తెలుగు మూలాలు ఉన్న కన్నడ తండ్రికి, యు.కె.కు చెందిన క్రిస్టియన్ తల్లికి జన్మించిన గిరిజ తన 17వ ఏట వరకూ యు.కె.లోనే పెరిగారు. ఆ తర్వాత ఇండియా వచ్చి పదేళ్లపాటు ఉన్నారు. ఆ సమయంలోనే గీతాంజలిలో నాగార్జున పక్కన నటించి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను పొందారు. ఆ తర్వాత కేవలం రెండు మూడు సినిమాలు చేసిన గిరిజ వివాహం చేసుకుని లండన్‌లో స్థిరపడ్డారు.
కొన్నాళ్లు ఒక బిజినెస్ పత్రికకు, మరికొన్నాళ్లు మరో పత్రికకు రిపోర్టర్‌గా పని చేశారు. సముద్రయాన కార్మికుల మానవ హక్కుల కోసం కూడా పని చేశారు. ఆమె ముందు నుంచి యోగ సాధకురాలు. అంతేకాకుండా యోగాలో పీహెచ్‌డీ చేశారు. రాజయోగ ను ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వివిధ దేశాలలో యోగాకోర్సులు కూడా చేశారు. వీటన్నింటి భూమికతో ఆమె తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలని ఇప్పుడు యోగా టీచర్‌గా మారారు.
ఆమె చెప్తున్న విషయాలు
→ మీలో చెడు భావాలు, నెగెటివిటీ ఉన్నాయంటే మీలోని దైవత్వం సుషుప్తి లో ఉన్నట్టే. మీలోని దివ్యత్వాన్ని మీరు మేల్కొలిపితే ఈ మలినాలు పోతాయి.
→ మీలోని మంచి లక్షణాలను మీరు తరచూ గుర్తు చేసుకోవాలి. లేకపోతే మీలోని మంచి లక్షణాలను మీరు చూడటం మొదలెడితే ఇతరులలోని మంచి లక్షణాలు కూడా కనిపించడం మొదలెడతాయి.
→ మొత్తం మీరే చేయాలేమో అన్న భావనతో అలసిపోవద్దు. మీరు చేయాల్సింది చేయండి మీతోపాటు విశ్వాత్మ కూడా దానికోసం పాటుపడుతుంది. అది గ్రహింపులోకి వస్తే మీరు అలసిపోరు. నేను పత్రికలో పనిచేసేటప్పుడు డెడ్‌లైన్ సమయంలో పేజీలు ఖాళీగా ఉంటే చాలా టెన్షన్ పడేదాన్ని. కాని సమయానికి అన్నీ ఆటోమేటిక్‌గా పూర్తయ్యేవి. అంటే మనతోపాటుగా మన ఆత్మ, విశ్వాత్మ కూడా పని చేస్తున్నాయన్న మాట.
→ ధ్యానం మీ స్వభావానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆత్మకు రక్షణ కల్పిస్తుంది. మిమ్మల్ని అనుక్షణం చూసుకునే ఆప్తుని తోడు ఉంటే ఎలా ఉంటుందో యోగ, ధ్యానాలు మీకు తోడైతే అలాంటి భావన కలుగుతుంది.
→ చెడు చాలా పరిమితం. మంచి అనంతం. ఆ అనంతమైన మంచిని మనలో నిత్యం జాగృతం చేసుకుంటూ ఉంటే మంచి జీవనం తప్పకుండా మనకు చేరువ అవుతుంది.
యోగా ఒక రక్షణ
‘నేను కోవిడ్ సమయంలో తీవ్రంగా అనారోగ్యం బారిన పడ్డాను. వైరస్ నా బ్రెయిన్ వరకూ వెళ్లనుందని అర్థమైంది. అయినా, నేను భయపడలేదు. నా యోగతో, ధ్యానంతో కోవిడ్ నుంచి బయటపడ్డాను. శరీరం, మనసు ప్రశాంతతను కోల్పోకుండా ఉంటే చాలా విజయాలు సాధించవచ్చు. యోగా శరీరాన్ని, ధ్యానం మనసును అలజడుల నుంచి కాపాడుతాయి. అంతేకాదు, అంతర్గత శత్రువులను నెమ్మదింప చేస్తాయి.
నేను రోజుకు మూడుగంటలు ధ్యానం చేస్తాను. మీరు కనీసం అరగంట అయినా చేయండి. లేదంటే నిద్ర లేవగానే కనీసం పది నిమిషాలు చేయండి. ‘ఓ విశ్వాత్మా... ఈ జగత్తులో నన్ను ఒక సంపదగా గ్రహించు’ అని వేడుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఓపిక పట్టాలి... కాలం చాలా గాయాలను మాన్పుతుంది... మీరు దానికి అనుమతిస్తే’ అంటారు గిరిజ.
Comments
Please login to add a commentAdd a comment