Yoga training
-
యోగాంజలి – ఎందుకంటే సినిమా కంటే ధ్యానం ఇష్టం
‘ఔత్సాహికులకు 60 పౌండ్లు మాత్రమే. వెంటనే రిజిస్టర్ చేసుకోండి’ అంటున్న పూర్వ సినీనటి గీతాంజలి యోగా ప్రస్థానం ఆసక్తి కలిగిస్తోంది. ‘గీతాంజలి’ సినిమాతో ఒక వెలుగు వెలిగిన గిరిజా షెట్టార్ యు.కె.లో స్థిరపడింది. 35 ఏళ్ల తర్వాత ఇటీవలే ఒక కన్నడ సినిమాలో సింగిల్ మదర్‌గా నటించిన గిరిజ ‘ఆ పాత్ర స్థితి. నా స్థితి ఒకటే కనుక ఒప్పుకున్నాను’ అని చెబుతోంది. గతంలో పత్రికా రిపోర్టర్‌గా పని చేసిన గిరిజ ఇప్పుడు మనిషికి ఆరు వేల రూపాయల ఫీజుతో యోగా నేర్పిస్తోంది. ఆమె రాబడి ఎలా ఉన్నా యోగా అవసరం గురించి ఆమె చెప్తున్న విషయాలు అందరూ వినదగ్గవి.‘2023 సంవత్సరం మే నెలలో నాకు అనిపించింది ఇక మీదట నేను యోగా, ధ్యాన మార్గాలలో మార్గదర్శిగా నిలవాలని. ఆ నిర్ణయం తీసుకున్నాక ఎంతోమందికి సాయపడుతున్నాను’ అంటున్నారు గిరిజ. ‘గీతాంజలి’ (1989) సినిమాతో నేటికీ మరపు రాని ఈ నటి చాలా యేళ్లుగా యు.కెలో స్థిరపడినా, రకరకాల ఉద్యోగాలు చేసినా 55 ఏళ్ల వయసులో యోగా టీచర్‌గా నూతన ప్రస్థానం సాగిస్తున్నారు. భారతీయ సినిమాలు చూడటమే మానేసిన గిరిజ అందుకు కారణం ఏమంటారంటే ‘చూశానంటే మనసు పాడవుతుంది. ఆ సినిమాలలో నేను చాలా చేసి ఉండే అవకాశం ఉందప్పుడు. అవన్నీ వదులుకొని వచ్చినందుకు ఒక్కోసారి అది సరైన నిర్ణయం కాదని అనిపిస్తుంది’ అంటారు.2024 సెప్టెంబర్ 5న విడుదల అయిన ‘ఇబ్బని తబ్బిద ఇలెయాలి’ అనే కన్నడ సినిమా లో సింగిల్ మదర్‌గా నటించారు గిరిజ (ప్రైమ్‌టైమ్‌లో ఉంది). ‘నేను ఉన్న స్థితి ఆ పాత్ర స్థితి ఒక్కటే కనుక నిర్మాత రక్షిత్ శెట్టి అడిగాక అంగీకరించాను’ అంటారామె. అయితే సినిమాల మీద కంటే ఆమె ధ్యాస, ఆసక్తి కేవలం యోగా గురువుగా తాను చేయవలసిన సేవ మీదే ఉన్నట్టుగా ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.గీతాంజలి గర్ల్తెలుగు మూలాలు ఉన్న కన్నడ తండ్రికి, యు.కె.కు చెందిన క్రిస్టియన్ తల్లికి జన్మించిన గిరిజ తన 17వ ఏట వరకూ యు.కె.లోనే పెరిగారు. ఆ తర్వాత ఇండియా వచ్చి పదేళ్లపాటు ఉన్నారు. ఆ సమయంలోనే గీతాంజలిలో నాగార్జున పక్కన నటించి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను పొందారు. ఆ తర్వాత కేవలం రెండు మూడు సినిమాలు చేసిన గిరిజ వివాహం చేసుకుని లండన్‌లో స్థిరపడ్డారు. కొన్నాళ్లు ఒక బిజినెస్ పత్రికకు, మరికొన్నాళ్లు మరో పత్రికకు రిపోర్టర్‌గా పని చేశారు. సముద్రయాన కార్మికుల మానవ హక్కుల కోసం కూడా పని చేశారు. ఆమె ముందు నుంచి యోగ సాధకురాలు. అంతేకాకుండా యోగాలో పీహెచ్డీ చేశారు. రాజయోగ ను ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వివిధ దేశాలలో యోగాకోర్సులు కూడా చేశారు. వీటన్నింటి భూమికతో ఆమె తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలని ఇప్పుడు యోగా టీచర్‌గా మారారు.ఆమె చెప్తున్న విషయాలు→ మీలో చెడు భావాలు, నెగెటివిటీ ఉన్నాయంటే మీలోని దైవత్వం సుషుప్తి లో ఉన్నట్టే. మీలోని దివ్యత్వాన్ని మీరు మేల్కొలిపితే ఈ మలినాలు పోతాయి.→ మీలోని మంచి లక్షణాలను మీరు తరచూ గుర్తు చేసుకోవాలి. లేకపోతే మీలోని మంచి లక్షణాలను మీరు చూడటం మొదలెడితే ఇతరులలోని మంచి లక్షణాలు కూడా కనిపించడం మొదలెడతాయి.→ మొత్తం మీరే చేయాలేమో అన్న భావనతో అలసిపోవద్దు. మీరు చేయాల్సింది చేయండి మీతోపాటు విశ్వాత్మ కూడా దానికోసం పాటుపడుతుంది. అది గ్రహింపులోకి వస్తే మీరు అలసిపోరు. నేను పత్రికలో పనిచేసేటప్పుడు డెడ్‌లైన్ సమయంలో పేజీలు ఖాళీగా ఉంటే చాలా టెన్షన్ పడేదాన్ని. కాని సమయానికి అన్నీ ఆటోమేటిక్‌గా పూర్తయ్యేవి. అంటే మనతోపాటుగా మన ఆత్మ, విశ్వాత్మ కూడా పని చేస్తున్నాయన్న మాట. → ధ్యానం మీ స్వభావానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆత్మకు రక్షణ కల్పిస్తుంది. మిమ్మల్ని అనుక్షణం చూసుకునే ఆప్తుని తోడు ఉంటే ఎలా ఉంటుందో యోగ, ధ్యానాలు మీకు తోడైతే అలాంటి భావన కలుగుతుంది.→ చెడు చాలా పరిమితం. మంచి అనంతం. ఆ అనంతమైన మంచిని మనలో నిత్యం జాగృతం చేసుకుంటూ ఉంటే మంచి జీవనం తప్పకుండా మనకు చేరువ అవుతుంది.యోగా ఒక రక్షణ‘నేను కోవిడ్ సమయంలో తీవ్రంగా అనారోగ్యం బారిన పడ్డాను. వైరస్ నా బ్రెయిన్ వరకూ వెళ్లనుందని అర్థమైంది. అయినా, నేను భయపడలేదు. నా యోగతో, ధ్యానంతో కోవిడ్ నుంచి బయటపడ్డాను. శరీరం, మనసు ప్రశాంతతను కోల్పోకుండా ఉంటే చాలా విజయాలు సాధించవచ్చు. యోగా శరీరాన్ని, ధ్యానం మనసును అలజడుల నుంచి కాపాడుతాయి. అంతేకాదు, అంతర్గత శత్రువులను నెమ్మదింప చేస్తాయి. నేను రోజుకు మూడుగంటలు ధ్యానం చేస్తాను. మీరు కనీసం అరగంట అయినా చేయండి. లేదంటే నిద్ర లేవగానే కనీసం పది నిమిషాలు చేయండి. ‘ఓ విశ్వాత్మా... ఈ జగత్తులో నన్ను ఒక సంపదగా గ్రహించు’ అని వేడుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఓపిక పట్టాలి... కాలం చాలా గాయాలను మాన్పుతుంది... మీరు దానికి అనుమతిస్తే’ అంటారు గిరిజ. -
సాధనతో ఆరోగ్య యోగం
మదనపల్లె సిటీ: నాటి కాలంలో ధ్యానం, చక్కటి ఆహారపు అలవాట్లుతో జీవనం సాగేది. ప్రస్తుతం అడుగడుగునా ఆధునికత రంగులు పులుముకుంటున్న వేళ వివిధ రకాల అనారోగ్యాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు, మానసిక ప్రశాంతతకు ఇటీవల కాలంలో పలువురు యోగాపై మక్కువ పెంచుకుని సాధన అలవాటుగా మార్చుకున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది యోగాపై మక్కువ చూపుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా గురువు శిల్ప గురించి ప్రత్యేక కథనం.. 12 ఏళ్లుగా తర్ఫీదు.. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శిల్ప వివాహానంతరం మదనపల్లెలో స్థిరపడ్డారు. 2010లో శిల్ప బెంగుళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసాధన సంస్థలో ప్రత్యేక శిక్షణ పొందారు. 2011 నుంచి పట్టణంలో పలు పాఠశాలల్లో యోగాపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణిస్తున్నారు. ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులకు యోగా నేర్పిస్తూ ఆరోగ్య పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. సుమారు 12 సంవత్సరాలుగా పట్టణంలోని పలు పాఠశాలల్లో యోగాపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ►జాతీయ స్థాయిలో ఆలిండియా కల్చర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2012లో హైదరాబాదులో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. యోగాలో ప్రత్యేక ప్రతిభ కనబరిచినందుకు అప్పటి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. గురువుల పర్యవేక్షణలో ఆసనాలు సాధన చేయాలి.. యోగాసనాలు నిత్య జీవితంలో జరిగే క్రియల్లో భాగం కావాలి. అనారోగ్యం పేరుతో వేలాది రూపాయలు ఔషధాలకు వినియోగించేకంటే, రోజు కొంత సమయం వ్యక్తి గత ఆరోగ్యం కోసం కేటాయించి గురువుల పర్యవేక్షణలో ఆసనాలు సాధన చేస్తే రోగాలకు దూరంగా ఉండొచ్చు. చిన్నతనం నుంచి యోగాసనాలపై ఆసక్తితో నిష్ణాతులైన గురువుల శిక్షణలో సాధన చేశాను. – శిల్ప, యోగా గురువు, మదనపల్లె -
తెరుచుకున్న జిమ్‌లు, యోగా కేంద్రాలు
-
కరోనాకు దూరంగా యోగా, వాట్ యాన్ ఐడియా!
కెనాడా: కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం కచ్చితంగా చేయాలి. ఈ క్రమంలోనే సామాజిక దూరం పాటించడానికి అంతగా వీలుండని జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లను తెరవడానికి ప్రభుత్వాలు ఇంకా అనుమతినివ్వలేదు. అయితే కెనడానలోని ఒక హోటల్లో మాత్రం యోగా క్లాసులను చాలా విచిత్రంగా నిర్వహించారు. సామాజిక దూరం పాటించేందుకు వీలుగా ఒకరిని మరొకరు తాకకుండా చాలా జాగ్రత్తగా యోగా చేశారు. మొదట హోటల్లోకి వచ్చే ముందే అందరికి టెంపరేచర్ అని పరీక్షించి లోపలికి అనుమతించారు. తరువాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డోమ్‌ల లోపల యోగాసనాలను వేశారు. ఈ ఆలోచనను చూసి అందరూ శభాష్ అంటున్నారు. (కరోనా అంటిస్తున్నాడని ఇటుకతో..) ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ మేఘన్ వెదర్ స్టన్ ఆధ్వర్యంలో కెనడాలోని హోటల్ ఎక్స్‌లో జూన్23న అవుల్డోర్ ఫిట్నెస్ తరగతులను నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాల్సిన క్రమంలో బబూల్ పాడ్స్‌లో యోగా తరగతులను నిర్వహించారు. కెనడా లాక్‌డౌన్‌ను ఎత్తివేసి తిరిగి ఆర్థివ్యవస్థను పెట్టే గాడిలో పెట్టేపనిలో పడింది. ఈ మేరకు అన్ని కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. (మళ్లీ షూటింగ్‌లకు బ్రేక్) -
ముస్లిం యోగా గురువుకు ఫత్వా
న్యూఢిల్లీ: యోగా శిక్షణ ఇస్తున్నందుకు ఇటీవల ఫత్వా అందుకున్న ముస్లిం యోగా గురువు రఫియా నాజ్ ఇంటిపై శుక్రవారం ఓ గుంపు రాళ్లదాడికి పాల్పడింది. జార్ఖండ్‌లోని దరోందాలో ఉంటున్న రఫియా మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. లైవ్ ఇంటర్వ్యూలో రఫియా వ్యాఖ్యలు విన్న ఓ మతపెద్ద ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని రగిలిపోయాడు. వెంటనే ఓ గుంపుతో రఫియా ఇంటివద్దకు చేరుకుని హంగామా సృష్టించాడు. ఈ గుంపు ఆమె ఇంటిపై రాళ్లు విసురుతూ నినాదాలిచ్చింది. ఇటీవల ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి వేదిక పంచుకోవడంతో రఫియాకు కొందరు మతపెద్దలు గురువారం ఫత్వా జారీచేశారు. దీంతో ఆ రాష్ట్ర సీఎం రఘుబర్‌దాస్ ఆమెకు భద్రత కల్పించాలని పోలీసుల్ని ఆదేశించారు. తాజాగా రఫియా ఇంటిపై దాడి ఘటనపై బాబా రాందేవ్ స్పందిస్తూ..‘ఇరాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా సహా పలు దేశాల్లోని ముస్లింలు యోగాను ఆచరిస్తారు. యోగా అన్నది మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించినది. ఇందులో మతం అన్న విషయాన్ని తీసుకురాకూడదు’ అని తెలిపారు. -
దంపతులపై డ్రగ్స్ ‘యోగా’!
తిరువణ్ణామలై (తమిళనాడు): యోగా శిక్షణ పేరుతో మత్తు మందులకు బానిసలు చేసి.. డబ్బు దోచుకుంటున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ధనికులను టార్గెట్ చేసి.. బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు దండుకుంటున్న ఘరానా దంపతులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని హిసాద్ నగర్‌కు చెందిన జగదీశ్ కేండీ, ఆయన భార్య కిరణ్మయి నగరంలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. హిసాద్‌నగర్‌కే చెందిన ఉషశ్రీ అనే మహిళ నడిపిస్తున్న యోగా శిక్షణ కేంద్రం గురించి వెబ్సైట్లో ప్రచురించిన ప్రకటనను చూసి గత నెలలో కిరణ్మయి, జగదీశ్ చేరారు. ఈ నేపథ్యంలో యోగా శిక్షణ పేరుతో ఉషశ్రీ వారిద్దరికీ మత్తు మందు ఇచ్చింది. అలా భార్యాభర్తలను మత్తు మందులకు బానిసలుగా చేసి.. వారి వద్ద నుంచి 20 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగదును ఉషశ్రీ దోచుకుంది. అనంతరం వారి వద్దనున్న మరో రూ.10 లక్షల నగదును తీసుకునేందుకు ప్రణాళిక వేసింది. ఇందుకోసం భక్తి ప్రయాణం పేరుతో తీసుకెళ్లి కుండలిని అనే యోగా నేర్పిస్తామని వారికి చెప్పింది. భర్త శ్రీకాంత్ రెడ్డితో కలసి ఉషశ్రీ.. కిరణ్మయి, జగదీశ్‌లకు «అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి వారిని ఈనెల 3వ తేదీన తమిళనాడుకు తీసుకెళ్లింది. 4న శ్రీరంగం ఆలయం వద్ద అద్దె భవనంలో మూడు రోజులు ఉంచారు. అనంతరం గత శుక్రవారం ఉదయం తిరువణ్ణామలైలోని మాడవీధుల్లోగల ఓ లాడ్జిలో ఉంచారు. బంధువుల ఫిర్యాదుతో.. 3వ తేదీన కిరణ్మయి, జగదీశ్‌లకు బంధువులు ఫోన్ చేశారు. ఆ సమయంలో వారిద్దరూ తడబడుతూ మాట్లాడటంతో అనుమానం వచ్చి హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో బంధువులు ఫిర్యాదు చేశారు. విచారణలో ఉషశ్రీ వీరిద్దరినీ కిడ్నాప్ చేసి తమిళనాడుకు తీసుకెళ్లినట్లు తెలిసింది. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ద్వారా పరిశీలించగా తిరువణ్ణామలైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విషయాన్ని తిరువణ్ణామలై ఎస్పీ పొన్నికి హైదరాబాద్ పోలీసులు తెలిపారు. దీంతో వారు లాడ్జిలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ధనికులను గుర్తించి.. యోగా శిక్షణ పేరుతో ధనికులను గుర్తించి వారిని మత్తుకు బానిస చేయడం, వారి వద్ద నుంచి నగదు దోచుకోవడం తరచూ చేస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. బాధితులు మత్తులో ఉన్న సమయంలో వారిని నగ్నంగా చేసి వీడియో తీసి.. దానితో బ్లాక్ మెయిల్‌చేసి నగదు దోచుకోవడం పనిగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి మత్తుకు ఉపయోగించే వస్తువులు, క్రెడిట్, డెబిట్, ఆధార్, రేషన్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.