నకిలీ యోగా శిక్షకురాలు ఉషశ్రీ,, ఆమెభర్త శ్రీకాంత్ రెడ్డి (కుడివైపు), ఎడమ పక్కన ఉన్న దంపతులు కిరణ్మయి, జగదీశ్ (ఫైల్)
తిరువణ్ణామలై (తమిళనాడు): యోగా శిక్షణ పేరుతో మత్తు మందులకు బానిసలు చేసి.. డబ్బు దోచుకుంటున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ధనికులను టార్గెట్ చేసి.. బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు దండుకుంటున్న ఘరానా దంపతులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని హిసాద్ నగర్‌కు చెందిన జగదీశ్ కేండీ, ఆయన భార్య కిరణ్మయి నగరంలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. హిసాద్‌నగర్‌కే చెందిన ఉషశ్రీ అనే మహిళ నడిపిస్తున్న యోగా శిక్షణ కేంద్రం గురించి వెబ్‌సైట్‌లో ప్రచురించిన ప్రకటనను చూసి గత నెలలో కిరణ్మయి, జగదీశ్ చేరారు. ఈ నేపథ్యంలో యోగా శిక్షణ పేరుతో ఉషశ్రీ వారిద్దరికీ మత్తు మందు ఇచ్చింది.
అలా భార్యాభర్తలను మత్తు మందులకు బానిసలుగా చేసి.. వారి వద్ద నుంచి 20 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగదును ఉషశ్రీ దోచుకుంది. అనంతరం వారి వద్దనున్న మరో రూ.10 లక్షల నగదును తీసుకునేందుకు ప్రణాళిక వేసింది. ఇందుకోసం భక్తి ప్రయాణం పేరుతో తీసుకెళ్లి కుండలిని అనే యోగా నేర్పిస్తామని వారికి చెప్పింది. భర్త శ్రీకాంత్ రెడ్డితో కలసి ఉషశ్రీ.. కిరణ్మయి, జగదీశ్‌లకు «అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి వారిని ఈనెల 3వ తేదీన తమిళనాడుకు తీసుకెళ్లింది. 4న శ్రీరంగం ఆలయం వద్ద అద్దె భవనంలో మూడు రోజులు ఉంచారు. అనంతరం గత శుక్రవారం ఉదయం తిరువణ్ణామలైలోని మాడవీధుల్లోగల ఓ లాడ్జిలో ఉంచారు.
బంధువుల ఫిర్యాదుతో..
3వ తేదీన కిరణ్మయి, జగదీశ్‌లకు బంధువులు ఫోన్ చేశారు. ఆ సమయంలో వారిద్దరూ తడబడుతూ మాట్లాడటంతో అనుమానం వచ్చి హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. విచారణలో ఉషశ్రీ వీరిద్దరినీ కిడ్నాప్ చేసి తమిళనాడుకు తీసుకెళ్లినట్లు తెలిసింది. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ద్వారా పరిశీలించగా తిరువణ్ణామలైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విషయాన్ని తిరువణ్ణామలై ఎస్పీ పొన్నికి హైదరాబాద్ పోలీసులు తెలిపారు. దీంతో వారు లాడ్జిలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
ధనికులను గుర్తించి..
యోగా శిక్షణ పేరుతో ధనికులను గుర్తించి వారిని మత్తుకు బానిస చేయడం, వారి వద్ద నుంచి నగదు దోచుకోవడం తరచూ చేస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. బాధితులు మత్తులో ఉన్న సమయంలో వారిని నగ్నంగా చేసి వీడియో తీసి.. దానితో బ్లాక్ మెయిల్‌చేసి నగదు దోచుకోవడం పనిగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి మత్తుకు ఉపయోగించే వస్తువులు, క్రెడిట్, డెబిట్, ఆధార్, రేషన్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.