ప్రమాదంలో పుడమి కవచం | Article About Ozone Layer | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో పుడమి కవచం

Published Sun, Sep 15 2019 3:50 AM | Last Updated on Sun, Sep 15 2019 4:47 AM

Article About Ozone Layer  - Sakshi

పుడమి చుట్టూ ఆవరించి ఉన్న సహజ కవచానికి చిల్లు పడింది. ఈ చిల్లు నానాటికీ విస్తరిస్తోంది. కవచానికి ఏర్పడిన ఈ చిల్లులోంచి తీక్షణమైన అతి నీలలోహిత కిరణాలు నేలను తాకుతున్నాయి. వీటి తాకిడి వల్ల మనుషులు చర్మ కేన్సర్‌ బారిన పడుతున్నారు. సముద్రజీవులు ముప్పు అంచుకు చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టడానికి జాగ్రత్తలు తీసుకోకుంటే, భూమ్మీద ఉన్న సమస్త జీవరాశులకూ ముప్పతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పుడమి చుట్టూ ఆవరించి ఉన్న ఈ సహజ కవచమే ‘ఓజోన్‌ పొర’.

ఒక ఆక్సిజన్‌ అణువులో సాధారణంగా రెండు ఆక్సిజన్‌ పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్‌ అణువుకు మరో ఆక్సిజన్‌ పరమాణువు జతచేరినప్పుడు ‘ఓజోన్‌’ అణువు ఏర్పడుతుంది. మూడు ఆక్సిజన్‌ పరమాణువులతో కలసి ఏర్పడుతుంది గనుక ‘ఓజోన్‌’ను ‘ట్రైయాక్సిజన్‌’ అని కూడా అంటారు. ఓజోన్‌ పొర స్ట్రాటోస్పియర్‌ వద్ద భూమికి 15 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉంటుంది. రుతువుల్లో మార్పుల బట్టి, భౌగోళిక పరిస్థితుల బట్టి ఓజోన్‌ పొర మందం మారుతూ ఉంటుంది. వాతావరణ కాలుష్యం కారణంగా ఓజోన్‌ పొర దెబ్బతింటోంది. నైట్రిక్‌ ఆక్సైడ్, నైట్రస్‌ ఆక్సైడ్, హెడ్రాక్సిల్, క్లోరిన్, బ్రోమిన్‌ వంటి వాటి వల్ల ఓజోన్‌ పొర దారుణంగా తరిగిపోతోంది. ఓజోన్‌ పొర సహజమందాన్ని పోగొట్టుకున్నా, పూర్తిగా నాశనమైనా ఓజోన్‌ పొరకు చిల్లు పడిందని అంటాం. ధ్రువప్రాంతాల్లో ఓజోన్‌ పొర పలచబడటం వల్ల సూర్యుని అతి నీలలోహిత కిరణాలు ఆ ప్రాంతానికి మరింత తీక్షణంగా తాకుతాయి. ఫలితంగా, అక్కడి మంచు శరవేగంగా కరిగిపోయి, సముద్రాల్లో నీటిమట్టం అమాంతం పెరిగి తీరాలు మునిగిపోతాయి. విపరీతమైన ఇంధన వినియోగం, ఎయిర్‌కండిషనర్లు, రిఫ్రిజరేటర్లలో వాడే వాయువులు విపరీత పరిమాణంలో వెలువడుతుండటం వల్ల ఓజోన్‌ పొరకు చిల్లుపడి, అది నానాటికీ విస్తరిస్తోంది. భూమ్మీద అక్కడక్కడా చెలరేగే కార్చిచ్చులు కూడా ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల అమెజాన్‌ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ఓజోన్‌ పొరను దారుణంగా దెబ్బతీయడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపగలదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇవీ అనర్థాలు
ఓజోన్‌ పొర దెబ్బతింటే భూమ్మీద అతి నీలలోహిత కిరణాల రేడియేషన్‌ ప్రభావం పెరుగుతుంది. దీనివల్ల మనుషులకు చర్మ క్యాన్సర్‌ సహా వివిధ క్యాన్సర్లు, క్యాటరాక్ట్‌ వంటి కంటిజబ్బులు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి నశిస్తుంది. అకాల వార్ధక్యం ముంచుకొస్తుంది. వివిధ పంటలు దెబ్బతింటాయి. వృక్షజాతుల్లో కిరణజన్య సంయోగ క్రియకు విఘాతం ఏర్పడుతుంది. గోధుమలు, వరి, బార్లీ వంటి తిండిగింజల పంటలకు, కూరగాయల పంటలకు తీరని నష్టం కలుగుతుంది. ఫలితంగా ఆహార లభ్యతకు విఘాతం ఏర్పడుతుంది. అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్ల సముద్రాల్లో జలచరాలకు ప్రధాన ఆహారమైన సముద్రపు నాచు కూడా నశించి, జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. పెంపుడు జంతువులు క్యాన్సర్లకు గురవుతాయి. మొత్తంగా చూసుకుంటే ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. అతి నీలలోహిత కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటే కలప, దుస్తులు, రబ్బరు వంటి పదార్థాలు త్వరగా నశిస్తాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల మనుషుల జీవితం దుర్భరంగా మారుతుంది.

ప్రపంచానికి ఊపిరితిత్తుల్లో మంటలు 
దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ అడవులను ప్రపంచానికి ఊపిరితిత్తులుగా అభివర్ణిస్తారు. ప్రపంచ జనాభాకు అవసరమైన ఆక్సిజన్‌లో దాదాపు ఇరవై శాతం ఆక్సిజన్‌ అమెజాన్‌ అడవుల నుంచే అందుతోంది. ప్రపంచంలోనే అత్యంత దట్టమైన సువిశాలమైన వర్షారణ్యాలు అమెజాన్‌ అడవులు. ఇవి బ్రెజిల్‌ సహా తొమ్మిది దేశాల్లో వ్యాపించి ఉన్నాయి. గత ఆగస్టులో బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. ఒక వ్యక్తి దమ్ముకొట్టి, ఆర్పకుండా నిర్లక్ష్యంగా పడేసిన సిగరెట్‌ పీక కారణంగానే దావానలం వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. వారాల తరబడి రగులుతున్న ఈ కార్చిచ్చును ఆర్పడానికి బ్రెజిల్‌ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించినా, ఇప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు బ్రెజిల్‌లో 77 వేల కార్చిచ్చు సంఘటనలు జరిగాయి. వాటిని రోజుల వ్యవ«ధిలోనే ఆర్పేశారు. అయితే, ఆగస్టులో చెలరేగిన కార్చిచ్చు మాత్రం ఇప్పటికీ అదుపులోకి రాకపోవడం యావత్‌ ప్రపంచాన్నే ఆందోళనలో ముంచెత్తుతోంది. అమెజాన్‌ అడవుల్లో వేలాది ఎకరాల మేరకు వృక్షసంపద మంటలకు ఆహుతవుతోంది. మంటలను చల్లార్చేందుకు బ్రెజిల్‌ సైనిక విమానాలు గగనతలం నుంచి భారీస్థాయిలో నీటిని గుమ్మరిస్తున్నాయి. అమెజాన్‌ కార్చిచ్చుపై ఐక్యరాజ్య సమితి సహా వివిధ అంతర్జాతీయ కూటములు, వివిధ దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ చల్లారని మంటల కారణంగా అమెజాన్‌ అడవుల్లో ఏ మేరకు విస్తీర్ణంలో చెట్లు నాశనమయ్యాయో కచ్చితంగా తెలియడం లేదు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ అమెజాన్‌ కార్చిచ్చును ‘అంతర్జాతీయ సంక్షోభం’గా అభివర్ణించారు. ఈ సమస్య పరిష్కారానికి పారిశ్రామిక దేశాలన్నీ ముందకు రావాలని ఆయన జీ–7 సమావేశాల్లో పిలుపునిచ్చారు. అమెజాన్‌ కార్చిచ్చును చల్లార్చే ప్రక్రియకు సాయం చేయడానికి జీ–7 దేశాలు సంసిద్ధత వ్యక్తం చేసినా, బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో మాత్రం వాటి సాయాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. అమెజాన్‌ కార్చిచ్చును అడ్డుపెట్టుకుని పారిశ్రామిక దేశాలన్నీ బ్రెజిల్‌ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయాలని భావిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను పర్యావరణాన్ని నాశనం చేయాలనుకోవడం లేదని, బ్రెజిల్‌ను కాపాడుకోవాలనుకుంటున్నానని అన్నారు. అమెజాన్‌ కార్చిచ్చుపై అంతర్జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నా, ఈ కార్చిచ్చు వల్ల చెలరేగే పొగలు వాతావరణంలోని ఎగువభాగానికి– అంటే స్ట్రాటోస్పియర్‌ వరకు చేరుకుంటాయని, దీనివల్ల ఓజోన్‌ పొరకు మరింత ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఓజోన్‌ ఉపయోగాలూ అనర్థాలూ
ఓజోన్‌ పొర సాధారణంగా వాతావరణానికి ఎగువ భాగమైన స్ట్రాటోస్పియర్‌ వద్ద ఉంటుంది. అది అక్కడ ఉండటమే క్షేమం. అక్కడి నుంచి ఓజోన్‌ పొర భూమ్మీదకు అతి నీలలోహిత కిరణాలు చేరుకోకుండా అడ్డు పడుతుంది. వాతావరణంలోని దిగువభాగమైన స్ట్రాటోస్పియర్‌లో ఓజోన్‌ అతి స్వల్పంగా ఉంటుంది. భూమ్మీద పరిసరాల్లో ఆక్సిజన్‌ 21 శాతం ఉంటుంది. మనం పీల్చేది ఆక్సిజన్‌ (ఓ2) మాత్రమే. మనుషులతో పాటు సమస్త జీవరాశుల శ్వాసక్రియకు ఓ2 రూపంలో ఉన్న ఆక్సిజన్‌ మాత్రమే అవసరం. భూమ్మీద పరిసరాల్లో ఓజోన్‌ అత్యంత స్వల్పస్థాయిలో– అంటే, పది లక్షల భాగాలకు ఒక వంతు (0.0001 శాతం) మాత్రమే ఉంటుంది. శ్వాసక్రియకు ఉపయోగపడే ఆక్సిజన్‌కు ఎలాంటి వాసనా ఉండదుగాని, ఓజోన్‌కు వాసన ఉంటుంది. ఈ వాసన దాదాపు క్లోరిన్‌ వాసననుపోలి ఉంటుంది. భూమి పరిసరాల్లోని వాతావరణం దిగువ పొరలో ఓజోన్‌ పరిమాణం ఎక్కువైతే, దానివల్ల జీవరాశికి మేలు బదులు కీడే ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల భూతాపం పెరుగుతుంది. మనుషులకు, జంతువులకు శ్వాసకోశ వ్యాధులు ఎక్కువవుతాయి. ఓజోన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంటలు సజావుగా పండని పరిస్థితులు తలెత్తుతాయి. స్ట్రాటోస్పియర్‌ వద్ద షార్ట్‌వేవ్‌ అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్ల ఆక్సిజన్‌ ఓజోన్‌గా పరిణామం చెందుతుంది. భూమికి చేరువలో ఆవరించి ఉన్న వాతావరణ పొర అయిన ట్రాపోస్పియర్‌పై అతి నీలలోహిత కిరణాల ప్రభావం ఏర్పడితే, భూవాతావరణానికి చేరువలోనే ఓజోన్‌ సాంద్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇదే జరిగితే పర్యావరణానికి చాలా అనర్థాలు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

ఓజోన్‌ పొర ఎందుకు అవసరం?
అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్లనే ఏర్పడే ఓజోన్‌ పొర స్ట్రాటోస్పియర్‌లో భూమి చుట్టూ ఆవరించి ఉండటం భూమ్మీద మనుగడ సాగించే జీవరాశికి అత్యంత అవసరం. ఓజోన్‌ పొర సూర్యుడి నుంచి 290 నానోమీటర్ల కంటే తక్కువ తరంగ దైర్ఘ్యంతో (వేవ్‌లెంగ్త్‌) వెలువడే అతి నీలలోహిత కిరణాలను సమర్థంగా అడ్డుకోగలదు. ఫలితంగా అతి నీలలోహిత కిరణాల ప్రమాదకర రేడియేషన్‌ ప్రభావం నుంచి జీవరాశికి రక్షణ ఏర్పడుతుంది. సహజమైన ఈ రక్షణ కొరవడితే మానవాళితో పాటు సమస్త జీవరాశి మనుగడకే ముప్పు తప్పదు. ఎయిర్‌ కండిషనర్లు, రిఫ్రిజరేటర్లు వంటి యంత్ర పరికరాల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్స్‌ వంటి ప్రమాదకర రసాయనాలు స్ట్రాటోస్పియర్‌ వరకు వ్యాపించడం వల్ల ఓజోన్‌ పొర ఇప్పటికే దెబ్బతింది. ముఖ్యంగా దక్షిణార్ధగోళంలో ఓజోన్‌ పొరకు చిల్లుపడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్ట్రాటోస్పియర్‌ వరకు వ్యాపించే ప్రమాదకర రసాయనాల వల్ల ఓజోన్‌ పొరకు నష్టం కలుగుతుందని శాస్త్రవేత్తలు దశాబ్దాల కిందటే తమ పరిశోధనల్లో గుర్తించారు. ఫలితంగా ఓజోన్‌ పొరకు నష్టం కలిగించే రసాయనాల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యంతో 1987లో ప్రపంచంలోని ప్రధాన దేశాలు మాంట్‌రియల్‌ ఒడంబడికపై సంతకాలు చేశాయి. ఓజోన్‌ పొరకు 1 శాతం విఘాతం ఏర్పడితే, భూమ్మీద నివసించే మనుషుల్లో వ్యాపించే క్యాన్సర్లు 2–5 శాతం మేరకు పెరుగుతాయి. క్యాటరాక్ట్‌ వంటి కంటి సమస్యలు గణనీయంగా పెరగడమే కాకుండా, మనుషుల్లోను, జంతువుల్లోను రోగనిరోధక శక్తి దారుణంగా దెబ్బతింటుంది. భూమ్మీద నివసించే మనుషులకు, పశుపక్ష్యాదులకు, సముద్రాల్లోను, నదుల్లోను జీవించే జలచరాలకు ఆహారాన్ని ఇచ్చే వృక్షజాతుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ఫలితంగా జీవజాతులు క్రమంగా అంతరించిపోయే ప్రమాదం తలెత్తుతుంది. 

ఓజోన్‌ పొర ఎందుకు దెబ్బతింటోంది?
పారిశ్రామిక విప్లవం తర్వాత ఆధునిక యంత్రపరికరాలు అందుబాటులోకి వచ్చాయి. యంత్రపరికరాలు పనిచేయడానికి రసాయనాలు, ఇంధనం వాడుక కూడా పెరిగింది. అధునాతన యంత్రపరికాలలో వాడే కొన్ని రసాయనాలు ఓజోన్‌ పొరకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. దాదాపు ఐదుదశాబ్దాల కిందటే ఈ సంగతిని కనుగొన్న శాస్త్రవేత్తలు ఈ రసాయనాలన్నింటినీ స్థూలంగా ‘ఓజోన్‌ డెప్లీటింగ్‌ సబ్‌స్టన్సెస్‌’ (ఓడీఎస్‌) అని పేరు పెట్టారు. ఈ ఓడీఎస్‌ రసాయనాలలో చాలావరకు రసాయనాలు పర్యావరణానికి నేరుగా ముప్పు కలిగించవు. భూమికి చేరువగా ఉన్న వాతావరణంలో ఇవి ఉన్నంత సేపూ వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. ఇవి భూమిని ఆవరించి ఉన్న తొలి వాతావరణ పొర అయిన ట్రాపోస్పియర్‌ను దాటుకుని, స్ట్రాటోస్పియర్‌ను చేరుకున్నప్పుడే, అక్కడ ఓజోన్‌ పొరపై ప్రభావం చూపుతాయి. ఇవి ఓజోన్‌తో జరిపే రసాయనిక చర్యల వల్లనే సమస్య తలెత్తుతోంది. ఇవి ఓజోన్‌ అణువు నుంచి ఒక్కో ఆక్సిజన్‌ పరమాణువును కాజేస్తాయి. ఫలితంగా ఓజోన్‌ తన సహజమైన ట్రైయాక్సైడ్‌ రూపాన్ని కోల్పోయి మామూలు ఆక్సిజన్‌ (డయాక్సైడ్‌–ఓ2) రూపంలో మిగులుతుంది. స్ట్రాటోస్పియర్‌కు చేరిన రసాయనాలు ఓజోన్‌ నుంచి కాజేసిన ఆక్సిజన్‌ పరమాణువును కలుపుకొని కొత్తగా రూపాంతరం చెందుతాయి. వీటి ప్రభావంతో ఓజోన్‌ తన సహజ స్వరూపాన్ని కోల్పోయిన ప్రదేశంలో ఖాళీ ఏర్పడి, సూర్యుడి అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమ్మీదకు దూసుకొస్తాయి. క్లోరోఫ్లోరో కార్బన్లు, హైడ్రో ఫ్లోరోక్లోరో కార్బన్లు, కార్బన్‌ టెట్రా క్లోరైడ్, బ్రోమినేటెడ్‌ ఫ్లోరోకార్బన్లు వంటి రసాయనాలను ఓజోన్‌ పొరను దెబ్బతీసే ‘ఓడీఎస్‌’ రసాయనాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల ఓజోన్‌ పొరకు ఏర్పడే ముప్పును గుర్తించిన తర్వాత వీటిలో ‘హాలోన్స్‌’గా పిలిచే బ్రోమినేటెడ్‌ ఫ్లోరోకార్బన్ల వాడకాన్ని కేవలం అగ్నిమాపక యంత్రాలకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. ఓజోన్‌ను దెబ్బతీసే ఇతర రసాయనాలతో పోల్చుకుంటే, హాలోన్స్‌ పదిరెట్లు ఎక్కువగా ఓజోన్‌ను దెబ్బతీస్తాయి. భారీ ఎత్తున అగ్నిప్రమాదాలు, కార్చిచ్చులు చెలరేగిన ప్రాంతాల్లో అనివార్యంగా హాలోన్స్‌ను ఉపయోగించాల్సి వస్తుంది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఓజోన్‌ పొర దెబ్బతినక తప్పని పరిస్థితులు ఉంటాయి. 

రెండు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఓజోన్‌ పొర
ఓజోన్‌ పొర ఇప్పటికే రెండు ప్రాంతాల్లో బాగా దెబ్బతింది. ఆస్ట్రేలియా భూభాగానికి ఎగువన వాతావరణ పరిధిలో ఓజోన్‌ పొర మందం దాదాపు 5–9 శాతం మేరకు తగ్గింది. దీనివల్ల అక్కడ భూమ్మీదకు అతి నీలలోహిత కిరణాలు తగినంత వడబోత లేకుండానే, నేరుగా ప్రసరించే ప్రమాదం ఏర్పడింది. ఇక్కడ ఆరుబయట ఎక్కువసేపు గడిపేవారు అతి నీలలోహిత కిరణాల రేడియేషన్‌కు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక దక్షిణ ధ్రువ ప్రాంతమైన అంటార్కిటికా వద్ద కూడా ఓజోన్‌పొర తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా సెప్టెంబర్‌–నవంబర్‌ నెలల మధ్య కాలంలో ఓజోన్‌ పొరకు రంధ్రం మరింతగా విస్తరిస్తోంది. దక్షిణార్ధగోళంలో అక్కడక్కడా సంభవించిన భారీస్థాయి అగ్నిపర్వతాల పేలుళ్లు కూడా ఈ ప్రాంతంలో ఓజోన్‌ పొరకు విఘాతం కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

మనుషుల వల్ల ఏర్పడుతున్న ముప్పు
క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్‌ వంటి ‘ఓడీఎస్‌’ రసాయనాల వినియోగం ఓజోన్‌ పొరకు మనుషుల వల్ల ఏర్పడుతున్న ముప్పు కిందకే వస్తాయి. ఇవి వర్షాలు కురిసినప్పుడు భూమ్మీదకు తిరిగి చేరుకునే పరిస్థితి ఉండదు. భూమ్మీద నుంచి పైకెగసిన ఈ రసాయనాలు స్ట్రాటోస్పియర్‌ వద్ద దీర్ఘకాలం అలాగే ఉంటాయి. ఓజోన్‌ పొరకు ఇవి కలిగించే అనర్థం అంతా ఇంతా కాదు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఒక క్లోరిన్‌ పరమాణువు ఏకంగా లక్ష ‘ఓజోన్‌’ అణువులను దెబ్బతీయగలదు. ఇక బ్రోమిన్‌ అయితే క్లోరిన్‌ కంటే 40 రెట్లు ఎక్కువగా హాని చెయ్యగలదు. ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్న ‘ఓడీఎస్‌’ రసాయనాలలో క్లోరోఫ్లోరో కార్బన్స్‌ రసాయనాలదే సింహభాగం. ఓజోన్‌ను దెబ్బతీసే రసాయనాల్లో వీటి వాటా 80 శాతానికి పైగానే ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా 1995 సంవత్సరానికి ముందుగా తయారైన రిఫ్రిజిరేటర్లు, ఇళ్లల్లోను, వాహనాల్లోను ఉపయోగించే ఎయిర్‌ కండిషనర్ల లోను వీటి వాడుక విపరీతంగా ఉండేది. వీటితో పాటు ఆస్పత్రులలో ఉపయోగించే క్లీనింగ్‌ ఏజెంట్లు, స్టెరిలంట్స్, పరుపులు, కుషన్ల తయారీకి వాడే ఫోమ్, హోమ్‌ ఇన్సులేషన్‌ పదార్థాలను తయారు చేసే పరిశ్రమల్లోను క్లోరోఫ్లోరో కార్బన్స్‌ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్‌ తెచ్చిపెడుతున్న ముప్పును గుర్తించిన తర్వాత వీటి స్థానంలో హైడ్రోఫ్లోరో కార్బన్లు వాడటం మొదలైంది. ఇవి క్లోర్లోఫ్లోరో కార్బన్స్‌తో పోల్చు కుంటే కొంత తక్కువ హానికరమైనవి. ఇవే కాకుండా, భారీ అగ్నిమాపక యంత్రాలలో వాడే హాలోన్స్, కార్బన్‌ టెట్రాక్లోరైడ్, కోల్డ్‌ క్లీనింగ్, వేపర్‌ డీగ్రీజింగ్, కెమికల్‌ ప్రాసెసింగ్, పరిశ్రమల్లో వాడే జిగురు వంటి పదార్థాల తయారీలో ఉపయోగించే మీథైల్‌ క్లోరోఫామ్‌ వంటివి కూడా ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్నాయి.

ఎలా నివారించగలం?

  • ఓజోన్‌ పొర మరింతగా దెబ్బతినకుండా చూడాలంటే అదంతా మనుషుల చేతుల్లోనే ఉంది. మనుషులు కాస్త మెలకువ తెచ్చుకుని, ఓజోన్‌ పొరను దెబ్బతీసే పదార్థాల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. ఓజోన్‌ పొరను కాపాడుకోవడానికి మనుషులు ముఖ్యంగా తగ్గించుకోవాల్సినవేవంటే...
  • రసాయనిక ఎరువుల వాడకాన్ని, పురుగు మందుల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. రసాయన పురుగు మందులకు బదులు సేంద్రియ పురుగు మందులను వాడాలి.
  • పెట్రోలియం ఉత్పత్తుల వాడుకను తగ్గించుకోవాలి. ప్రయాణాల కోసం ప్రైవేటు వాహనాలను విచ్చలవిడిగా వాడే బదులు వీలైనంతగా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలి. పెట్రోల్, డీజిల్‌ వంటి ఇంధనాలతో నడిచే వాహనాల నుంచి వెలువడే పొగ ఓజోన్‌ పొరను దెబ్బతీస్తుంది.
  • ఇళ్లల్లో, కార్యాలయాల్లో, పరిశ్రమల్లో రసాయనాలతో తయారైన క్లీనింగ్‌ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలి. వీటిలో వినియోగించే రసాయనాలు ఓజోన్‌ పొరకు తీవ్రంగా దెబ్బతీస్తాయి. వీటి బదులు పర్యావరణానికి చేటు చెయ్యని క్లీనింగ్‌ ఉత్పత్తులను వాడుకోవాలి. 
  • మాంట్‌రియల్‌ ఒడంబడిక తర్వాత దానిపై సంతకాలు చేసిన దేశాలు క్లోరోఫ్లోరో కార్బన్‌ రసాయనాల వాడుకను గణనీయంగా తగ్గించుకున్నాయి. అయితే, ఈ ఒడంబడికలో ఓజోన్‌ పొరకు ప్రమాదకరమైన నైట్రస్‌ ఆక్సైడ్‌ను చేర్చలేదు. నైట్రస్‌ ఆక్సైడ్‌ వాడుకను కూడా కట్టడి చేస్తేనే ఓజోన్‌ పొరను కాపాడుకోగలుగుతాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement