దేశం కోసం 15 వేల కిలోమీటర్లు! | they travel 15 thousand kilo meters, to tell the value of vote | Sakshi
Sakshi News home page

దేశం కోసం 15 వేల కిలోమీటర్లు!

Published Sun, Jul 13 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

దేశం కోసం 15 వేల కిలోమీటర్లు!

దేశం కోసం 15 వేల కిలోమీటర్లు!

మనదేశ బలం ప్రజాస్వామ్యం.ఆ ప్రజాస్వామ్యం బలం ఓటు.

ఈ దేశం ఎవరి ఏలికలో ఉండాలో చెప్పాల్సింది ఓటరు. చిత్రమైన విషయం ఏంటంటే... ఓటు విలువ ఓటరుకు తెలియడం లేదు. ఒకవేళ తెలిసినా తన ఓటును వినియోగించుకునేటంత గొప్ప వ్యక్తులు ఎవరూ లేరన్న భావన కావచ్చు. అందుకే నోటాకైనా వేయండి గానీ ఓటు మాత్రం తప్పనిసరిగా వేయండని చెప్పడానికి ఓ యువ సమూహం పెద్ద ప్రయత్నమే చేసింది.
 
ఎపుడూ లేనట్లు ఈసారి ఎన్నికలు ఓ యజ్ఞంలా జరిగాయి. ప్రజలు ఒక వేడుకలో పాల్గొన్నట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిసారి ఎన్నికలు వేరు, ఈసారి ఎన్నికలు వేరు. ఎన్నో మార్పులు, ఎన్నో విశేషాలు, కొత్త ఓటర్ల ఉత్తేజం అన్నీ కలసి దేశ తలరాతను నిర్దేశించాయి. స్వాతంత్య్రం తర్వాత మొదటి సారి కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలు అత్యధికంగా ఓటు వేశారు. మొదటి సారి యువత ఏకమొత్తంగా కదలివచ్చి ఓటువేసింది. అలాగే తొలిసారి ‘నోటా’ ఆప్షన్ చేరింది. మరి ఇదంతా ఉత్తినే సాధ్యమయ్యిందా?! అంటే కాదు. ఈ ఫలితం వెనుక ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలాంటి ప్రయత్నాల్లో ఒక విజయవంతమైన ప్రయత్నమే ‘వందేమాతరం బైక్  రైడర్స్’ సుదూర ప్రయాణం.

ఇంతకాలం ఓటు వేసే పనిని తప్పించుకోవడానికి చాలా మంది ఒక సాకు చెప్పేవారు. పళ్లు ఊడగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏం అనేవారు. ఎందుకంటే అభ్యర్థుల్లో ఎవరూ మంచివాళ్లు లేనపుడు ఎవరో ఒక రౌడీనో/అవినీతి పరుడినో/వ్యాపారినో ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్న చాలామంది విద్యావంతులైన ఓటర్ల నుంచి వచ్చేది.
 
కానీ ఈసారి వారందరి నోళ్లు మూత పడ్డాయి. ఎందుకంటే నీకు ఎవరూ ఇష్టం లేదు అని చెప్పడానికి కూడా ఓటువేయొచ్చు. అంటే నాకు ఈ దేశం కోసం ఓటువేయాలని ఉంది.. కానీ సరైన అభ్యర్థులు లేరు అని ఓటర్లు ఫీలైనప్పుడు వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేయడానికి ‘నోటా’ అనే బలమైన ఆయుధం దొరికింది. ఈసారి దీనికి 60 లక్షల ఓట్లు పడ్డాయి. అంటే దేశం మొత్తం మీద పోలైన ఓట్లలో 1.1 శాతం ఓట్లు. వందే మాతరం బైక్ రైడర్స్ ‘ఓటు వేయండి... నోటాకైనా పర్లేదు’ అన్న నినాదంతో దేశంలోని నలుమూలలను సందర్శించడం కూడా ఇందుకొక కారణం. ‘ఓటు వేయడానికి కదలండి’ అంటూ ఆ యువ గుంపు అందరినీ కదిలించింది. అనేక నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాలు తిరుగుతూ ప్రతిచోటా ఆగుతూ ఓటర్లను అప్రమత్తం చేసింది. ఓటేయాలనే ఉత్సాహం నింపింది.
 
చాలామంది వ్యక్తులు, సంస్థలు ఎన్నో క్యాంపెయిన్లు నడిపినా వందేమాతరం రైడ్ మాత్రం చాలా శక్తివంతమైన క్యాంపెయిన్ అయింది. ఎందుకంటే వీరు నేరుగా విషయాన్ని ఓటరుకే చెప్పారు. ఓటరును ప్రత్యక్షంగా కలిసి ఓటు గురించి తెలిపారు. ఈ టీమ్‌కు మరో ప్రత్యేకత ఉంది. దేశంలో ప్రతి రాష్ర్ట రాజధానిని కలుపుతూ పర్యటించి ఒక సంపూర్ణమైన ప్రచారం నిర్వహించిన ఏకైక గ్రూపు వందేమాతరం రైడర్స్. ఇప్పటి వరకు జరిగిన యూత్ క్యాంపెయిన్లలో ఇదే అతిపెద్దది. విశాఖపట్నం నగరానికి చెందిన భరద్వాజ్ దాయల్‌కు వచ్చిన ఆలోచన నుంచి ఈ గ్రూపు ఆవిర్భవించింది. ఇందులో ముంబైకి చెందిన క్రిస్టోఫర్, నాడార్ నవీన్ నాయర్, బీదర్‌కు చెందిన జస్ప్రీత్ సింగ్ మోంటీ, గుర్గావ్‌కు చెందిన రమన్ బాల్యన్ సభ్యులు.
 
మార్చి 15న ప్రారంభమై ఏప్రిల్ 27న ముగిసిన వీరి క్యాంపెయిన్ ఎన్నో ర్యాలీలు, ప్రచార సభలు, శిబిరాలు నిర్వహిస్తూ 15 వేల కిలోమీటర్లు సాగింది. అన్నివేల కిలోమీటర్లు తిరగాలంటే ఎంతో ఖర్చవుతుంది. అదంతా వీరు సొంతంగా పెట్టుకున్న డబ్బే. ఒక్కొక్కరికి లక్షకు పైగా ఖర్చయ్యింది. కానీ దానికి వచ్చిన స్పందన, అది సాధించిన ఫలితాల ముందు ఖర్చు చాలా తక్కువ. దేశంలోని ప్రతి రాష్ర్టంలో ప్రజలను కలిసి, వారిలో ఉత్తేజాన్ని నింపే అవకాశం అందరికీ వస్తుందా? ‘‘ముఖ్యంగా మేము భిన్న రాష్ట్ర్రాల విద్యార్థులకు పోలింగ్ బూత్‌కు వెళ్లే ఉత్సాహాన్నిచ్చాం. ఇంతకుమించిన  సామాజిక సేవ, ప్రయత్నం ఏముంటుందిక’’ అంటారు రైడర్స్ సభ్యులు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement