మొహిసిన్ ఖాన్, రీనా రాయ్
ఒకరి కోసం ఒకరు పుట్టరు.. ఒకరి కోసం ఒకరు అని జతకడతారు! హిందీ హీరోయిన్ రీనా రాయ్.. పాకిస్తానీ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ కూడా అలాగే ప్రేమించుకొని నిఖాతో జతకట్టారు! పెళ్లిళ్లు నిజంగానే స్వర్గంలో నిర్ణయం అయితే విడాకుల ప్రస్తావన ఉండేది కాదేమో! ఆకర్షణలు, అభిప్రాయాలు, జీవన శైలులు, సంస్కృతి, సంప్రదాయాలు, కులం, మతం వేదికగా జరుగుతాయి కాబట్టే వీటిల్లో ఏ ఒక్కటి సర్దుబాటు కాకపోయినా విడాకుల ప్రస్తావన.. పరిష్కారంగా ఉంటుంది. రీనా, మొహిసిన్‌ల ప్రేమ.. పెళ్లి కూడా అలాగే ముగిసిపోయింది. ఆ కథే ఈ వారం..
శత్రుఘ్న సిన్హాతో ప్రేమ వైఫల్యం రీనా రాయ్‌ను చాలా కలచివేసింది. సరిగ్గా ఆ సమయంలోనే పరిచయం అయ్యాడు.. మొహిసిన్ ఖాన్. అతని చెలిమి ఆమెకు గొప్ప ఊరటైంది. ఆ ఆదరణ ఆమె మనసుకు అయిన గాయాన్ని మాన్చేసింది. ఆ సాన్నిహిత్యం ప్రేమగా మారింది. ఈ జంట తరచూ కలసుకోవడం.. కలసి బయటకు వెళ్లడం.. సహజంగానే సినిమా పత్రికలకు ఆసక్తిరేపాయి. రీనా, మొహిసిన్ డేటింగ్ అంటూ కథనాలనూ ప్రచురించాయి. అవి అటు క్రికెట్‌ను.. ఇటు బాలీవుడ్‌నూ ఆకర్షించాయి.
కరాచీలో..
ఇరు రంగాల్లోని ఈ ఇరువురి అభిమానులు వీళ్ల ప్రేమకథనాలను ఆస్వాదిస్తూండగా.. ఆ జంట పెళ్లి వార్త బయటకు వచ్చింది. అందరినీ ఆశ్చర్యపరచింది. ఆ ఇద్దరూ కరాచీలో రహస్యంగా నిఖా చేసుకుని ముంబై వచ్చారు. ఆ టైమ్‌లో రీనా, మొహిసిన్ వాళ్ల వాళ్ల కెరీర్‌లో ఉచ్ఛస్థాయిలో ఉన్నారు. ‘మొహిసిన్ సంగతేమో కానీ ఈ పెళ్లితో రీనా తన కెరీర్‌కు తానే ఎండ్ కార్డ్ వేసుకుంది’ అని అభిప్రాయపడ్డారు ఆమె శ్రేయోభిలాషులంతా! వాళ్ల అంచనాలకు విరుద్ధంగా పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించింది రీనా.
సర్దుకుపోవాల్సిందే..
బ్రిటిష్ పౌరసత్వంతో లండన్‌లో స్థిరపడాలనేది మొహిసిన్ ఖాన్ నిర్ణయం. అది రీనాకు నచ్చకపోయినా భర్త కోసం సరేననుకుంది. షూటింగ్స్ ఉన్నప్పుడు ముంబై రావడం.. అయిపోగానే లండన్ వెళ్లిపోవడం ఆమె షెడ్యూల్‌లో భాగమయ్యాయి. ఈలోపు ఆ జంటకు బిడ్డ పుట్టింది. పాపను పెంచడం కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంది రీనా. మొహిసిన్ నటించాలనుకున్నాడు. అతని ఉత్సాహానికి అడ్డు చెప్పలేదు రీనా. క్రికెటర్ మొహిసిన్ ఖాన్ బాలీవుడ్ స్క్రీన్ మీద హీరోగా లాంచ్ అయ్యాడు. కానీ సినీ ప్రేక్షకులు అతణ్ణి పెద్దగా ఆదరించలేదు. దాంతో ఆ కుటుంబం లండన్, ముంబైల రాకపోకలు ఆగిపోయి లండన్‌లోనే ఉండడం మొదలైంది. అది రీనాకు చాలా కష్టమైపోయింది.
అంతేకాదు మొహిసిన్ ఖాన్ విలాసవంతమైన జీవన శైలికీ ఆమె ఇబ్బంది పడింది. అప్పుడు తన తల్లికి ఫోన్ చేసింది ‘పెళ్లంటే ఏంటీ.. ఇలాగే ఉంటుందా?’ అని. ‘తప్పదు. సర్దుకుపోవాల్సిందే. అసలు పెళ్లంటేనే సర్దుబాటు’ అంటూ నచ్చచెప్పింది రీనా వాళ్లమ్మ. ప్రయత్నించింది రీనా. కానీ సఖ్యత కుదరలేదు. ఆ బంధం నిలవలేదు. కూతురి కస్టడీ మొహిసిన్ ఖాన్‌కే దక్కింది. రీనా తర్వాత మొహిసిన్ ఖాన్ మళ్లీ రెండుసార్లు వివాహబంధంలో ఇమిడే ప్రయత్నం చేశాడు. అప్పుడుగానీ బిడ్డ కస్టడీని రీనాకు అప్పగించలేదు కోర్టు. ఇప్పుడు ఆ కూతురు(సనమ్)తోనే కలసి ముంబైలో ఓ యాక్టింగ్ స్కూల్ నిర్వహిస్తోంది రీనా. జీవితం పట్ల రిగ్రెట్స్‌గానీ లేవు, శత్రుఘ్న సిన్హా, మొహిసిన్ మీద కంప్లయింట్స్‌గానీ ఏమాత్రం లేవని చెప్తుంది రీనా రాయ్.
- ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment