Reena Roy
-
నువ్వు నా గుండెచప్పుడు: సింగర్ మృతిపై ప్రేయసి భావోద్వేగం
ఆ ప్రేమ జంటను చూసి విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో సింగర్, యాక్టర్ దీప్ సిద్ధును బలి తీసుకుని వారిని విడదీసింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు తిరిగి రాడన్న వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది అతడి ప్రియురాలు, నటి రీనా రాయ్. అనుక్షణం అతడి జ్ఞాపకాల్లోనే తడిసి ముద్దవుతూ ఎంతో వేదన అనుభవిస్తోంది. ఆమె సిద్ధుతో కలిసి దిగిన ఫొటోలను గురువారం నాడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఎమోషనల్ అయింది. 'నా గుండె పగిలింది. లోలోపల చచ్చిపోతున్నాను. జీవితాంతం నా చేయి పట్టుకుని ఉంటానని మాటిచ్చావు జాన్, దయచేసి నాకోసం తిరిగొచ్చేయ్వా.. నేను ఆస్పత్రి బెడ్‌పై ఉన్నప్పుడు కూడా నువ్వు నా చెవిలో ఏదో చెప్తున్నట్లు అనిపించింది. నాకు తెలుసు, నువ్వెప్పుడూ నాతోనే ఉంటావని! మనం కలిసి బతుకుదామనుకున్నాం, కానీ అర్ధాంతరంగా నన్ను వదిలి వెళ్లిపోయావు. సోల్‌మేట్స్ ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. నిన్ను మరో ప్రపంచంలో తప్పకుండా కలుసుకుంటాను జాన్.. నువ్వు నా గుండెచప్పుడు, లవ్ యూ' అని రాసుకొచ్చింది. ఆ తర్వాత కాసేపటికే ఆ పోస్ట్ డిలీట్ చేసింది. కాగా మంగళవారం నాడు దీప్ సిద్ధూ, రీనా ప్రయాణిస్తున్న కారు రోడ్డుప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సింగర్ దీప్ మరణించగా రీనా స్వల్ప గాయాలతో బయటపడింది. -
పాకిస్తానీ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ వివాహ బంధం.. అలా.. ముగిసింది!
ఒకరి కోసం ఒకరు పుట్టరు.. ఒకరి కోసం ఒకరు అని జతకడతారు! హిందీ హీరోయిన్ రీనా రాయ్.. పాకిస్తానీ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ కూడా అలాగే ప్రేమించుకొని నిఖాతో జతకట్టారు! పెళ్లిళ్లు నిజంగానే స్వర్గంలో నిర్ణయం అయితే విడాకుల ప్రస్తావన ఉండేది కాదేమో! ఆకర్షణలు, అభిప్రాయాలు, జీవన శైలులు, సంస్కృతి, సంప్రదాయాలు, కులం, మతం వేదికగా జరుగుతాయి కాబట్టే వీటిల్లో ఏ ఒక్కటి సర్దుబాటు కాకపోయినా విడాకుల ప్రస్తావన.. పరిష్కారంగా ఉంటుంది. రీనా, మొహిసిన్ల ప్రేమ.. పెళ్లి కూడా అలాగే ముగిసిపోయింది. ఆ కథే ఈ వారం.. శత్రుఘ్న సిన్హాతో ప్రేమ వైఫల్యం రీనా రాయ్‌ను చాలా కలచివేసింది. సరిగ్గా ఆ సమయంలోనే పరిచయం అయ్యాడు.. మొహిసిన్ ఖాన్. అతని చెలిమి ఆమెకు గొప్ప ఊరటైంది. ఆ ఆదరణ ఆమె మనసుకు అయిన గాయాన్ని మాన్చేసింది. ఆ సాన్నిహిత్యం ప్రేమగా మారింది. ఈ జంట తరచూ కలసుకోవడం.. కలసి బయటకు వెళ్లడం.. సహజంగానే సినిమా పత్రికలకు ఆసక్తిరేపాయి. రీనా, మొహిసిన్ డేటింగ్ అంటూ కథనాలనూ ప్రచురించాయి. అవి అటు క్రికెట్‌ను.. ఇటు బాలీవుడ్‌నూ ఆకర్షించాయి. కరాచీలో.. ఇరు రంగాల్లోని ఈ ఇరువురి అభిమానులు వీళ్ల ప్రేమకథనాలను ఆస్వాదిస్తూండగా.. ఆ జంట పెళ్లి వార్త బయటకు వచ్చింది. అందరినీ ఆశ్చర్యపరచింది. ఆ ఇద్దరూ కరాచీలో రహస్యంగా నిఖా చేసుకుని ముంబై వచ్చారు. ఆ టైమ్‌లో రీనా, మొహిసిన్ వాళ్ల వాళ్ల కెరీర్లో ఉచ్ఛస్థాయిలో ఉన్నారు. ‘మొహిసిన్ సంగతేమో కానీ ఈ పెళ్లితో రీనా తన కెరీర్‌కు తానే ఎండ్ కార్డ్ వేసుకుంది’ అని అభిప్రాయపడ్డారు ఆమె శ్రేయోభిలాషులంతా! వాళ్ల అంచనాలకు విరుద్ధంగా పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించింది రీనా. సర్దుకుపోవాల్సిందే.. బ్రిటిష్ పౌరసత్వంతో లండన్‌లో స్థిరపడాలనేది మొహిసిన్ ఖాన్ నిర్ణయం. అది రీనాకు నచ్చకపోయినా భర్త కోసం సరేననుకుంది. షూటింగ్స్ ఉన్నప్పుడు ముంబై రావడం.. అయిపోగానే లండన్ వెళ్లిపోవడం ఆమె షెడ్యూల్లో భాగమయ్యాయి. ఈలోపు ఆ జంటకు బిడ్డ పుట్టింది. పాపను పెంచడం కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంది రీనా. మొహిసిన్ నటించాలనుకున్నాడు. అతని ఉత్సాహానికి అడ్డు చెప్పలేదు రీనా. క్రికెటర్ మొహిసిన్ ఖాన్ బాలీవుడ్ స్క్రీన్ మీద హీరోగా లాంచ్ అయ్యాడు. కానీ సినీ ప్రేక్షకులు అతణ్ణి పెద్దగా ఆదరించలేదు. దాంతో ఆ కుటుంబం లండన్, ముంబైల రాకపోకలు ఆగిపోయి లండన్‌లోనే ఉండడం మొదలైంది. అది రీనాకు చాలా కష్టమైపోయింది. అంతేకాదు మొహిసిన్ ఖాన్ విలాసవంతమైన జీవన శైలికీ ఆమె ఇబ్బంది పడింది. అప్పుడు తన తల్లికి ఫోన్ చేసింది ‘పెళ్లంటే ఏంటీ.. ఇలాగే ఉంటుందా?’ అని. ‘తప్పదు. సర్దుకుపోవాల్సిందే. అసలు పెళ్లంటేనే సర్దుబాటు’ అంటూ నచ్చచెప్పింది రీనా వాళ్లమ్మ. ప్రయత్నించింది రీనా. కానీ సఖ్యత కుదరలేదు. ఆ బంధం నిలవలేదు. కూతురి కస్టడీ మొహిసిన్ ఖాన్‌కే దక్కింది. రీనా తర్వాత మొహిసిన్ ఖాన్ మళ్లీ రెండుసార్లు వివాహబంధంలో ఇమిడే ప్రయత్నం చేశాడు. అప్పుడుగానీ బిడ్డ కస్టడీని రీనాకు అప్పగించలేదు కోర్టు. ఇప్పుడు ఆ కూతురు(సనమ్)తోనే కలసి ముంబైలో ఓ యాక్టింగ్ స్కూల్ నిర్వహిస్తోంది రీనా. జీవితం పట్ల రిగ్రెట్స్గానీ లేవు, శత్రుఘ్న సిన్హా, మొహిసిన్ మీద కంప్లయింట్స్గానీ ఏమాత్రం లేవని చెప్తుంది రీనా రాయ్. - ఎస్సార్ -
శత్రుఘ్న్ వెడ్స్ పూనమ్
శత్రుఘ్న్ సిన్హా... భిన్నమైన డైలాగ్ డెలివరీతో డెబ్బై, ఎనభైలనాటి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో! రీనా రాయ్.. అందం, అభినయంతో అలరించిన అభినేత్రి! పోషించిన పాత్రలతో ఎంత ఫేమస్ అయ్యారో తమ ప్రేమ కథతో అంతే పాపులర్ అయ్యారిద్దరూ! ఈ లవ్‌స్టోరీ ట్రయాంగిల్‌గా మారింది పూనమ్ సిన్హాతో. ఆమే నటే. కాని శత్రుఘ్న్ సిన్హా భార్యగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఒక ముక్కోణపు ప్రేమ కథను తలపించే రియల్ లైఫ్ ఇది.. రీనా రాయ్‌కు తొలి హిట్‌ను ఇచ్చిన సినిమా ‘కాలీచరణ్’. అందులో హీరో శత్రుఘ్న్ సిన్హా. ఈ జోడీతోనే వచ్చిన తదుపరి చిత్రం ‘విశ్వనాథ్’. అదీ హిట్టే. దాంతో బాలీవుడ్లో ఈ జంటకు హిట్ పెయిర్ అనే ముద్ర పడిపోయింది. ఈ ఇద్దరి జీవితాల్లో కూడా కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. ‘కాలీచరణ్’ సెట్స్‌లో రీనా రాయ్‌తో మొదలైన శత్రుఘ్న్ సిన్హా స్నేహం ‘విశ్వనాథ్’ సెట్స్ మీదకు వచ్చేసరికి ప్రేమగా మారిపోయింది. ఎంతలా అంటే వాళ్ల సినిమాలతో సమంగా వాళ్ల మధ్య ఉన్న ప్రేమ గురించి చర్చించుకునేంతగా. ఈ వ్యవహారం రీనా తల్లి వరకూ చేరింది. సినిమాల పట్ల శ్రద్ధ పెట్టమని సున్నితంగా మందలించింది. సరేనని తలూపి.. తలపుల్లో శత్రుఘ్న్ను మరింతగా పదిలపరచుకుంది రీనా. శత్రుఘ్న్ కూడా రీనా తోడిదే లోకమన్నట్టున్నాడు. ఎప్పుడోకప్పుడు వీళ్ల పెండ్లి పిలుపును అందుకోకపోమని బాలీవుడ్డూ ఎదురుచూడసాగింది. అయిదేళ్లు గడిచాయి. శత్రుఘ్న్ వెడ్స్ పూనమ్ శత్రుఘ్న్ పెళ్లి నిశ్చయమైంది. వెడ్డింగ్ కార్డ్‌లో పూనమ్ పేరు అచ్చయింది. ఆమె ఒకప్పటి మిస్ ఇండియా. నటి కూడా. ‘కోమల్’ ఆమె స్క్రీన్ నేమ్. ‘సబక్’ అనే మూవీలో శత్రుఘ్న్ పక్కనా నటించింది. రైలు ప్రయాణంలో ఆమెను చూసి మనసు పారేసుకున్నాడు శత్రుఘ్న్. అప్పటికే రీనా ప్రేమలో తలమునకలై కూడా. పూనమ్‌తో శత్రుఘ్న్ పెళ్లికి ఒక్క రీనానే కాదు, బాలీవుడ్డూ షాక్ అయింది. ఆ సమయానికి రీనా లండన్‌లో ఉంది. ఈ వార్త తెలిసి హుటాహుటిన ముంబై చేరుకొని సరాసరి శత్రుఘ్న్ ఇంటికే వెళ్లింది. ‘ఇలా చేశావేంటి?’ అని నిలదీసింది. ఆ క్షణంలో అతను ఆమెకు ఏం సమాధానం చెప్పాడో కాని తన ఆత్మకథ ‘నథింగ్ బట్ ఖామోష్’ లో వివరణ ఇచ్చుకున్నాడు శత్రుఘ్న్.. ‘ఆ టైమ్‌లో చాలా భయపడ్డాను. బాచిలర్‌గా ఉండటానికే ఇష్టపడ్డా. కాని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ పెళ్లి నుంచి తప్పుకుందామనే అనుకున్నా. పూనమ్ కూడా నేను పెళ్లి తప్పించుకుంటున్నాననే డిసైడ్ అయింది. ఎందుకంటే పెళ్లి ముందు రోజు వరక్కూడా నేను ఇండియాలో లేను. సరిగ్గా ముహూర్తానికి వచ్చా. మా వైవాహిక జీవితంలో ఏవైనా పొరపాట్లు జరిగాయంటే అవి నావల్లే. నా భార్యది ఇసుమంతైనా తప్పు లేదు’ అని. వదల్లేదు పెళ్లయినా రీనా చేయివదల్లేదు శత్రుఘ్న్. ఇదీ టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది. మళ్లీ రీనాను మందలించింది ఆమె తల్లి. ‘అతణ్ణి నీకు దూరంగానైనా ఉండమను. లేదంటే నిన్ను పెళ్లయినా చేసుకొమ్మను’ అని. నిజానికి రీనా కుటుంబానికి శత్రుఘ్న్ సిన్హా అంటే వల్లమాలిన అభిమానం, గౌరవం. అతణ్ణి వదులకోవాలనీ వాళ్లూ అనుకోలేదు. అతను వేరే పెళ్లి చేసుకొని తమ ఇంటికి వస్తున్నా ఆదరించారు. అతని సలహా సంప్రదింపులు లేనిదే ఏ పనీ చేసేవారు కాదు. తల్లి చెప్పినట్టుగా శత్రుఘ్న్ను కోరింది రీనా.. తనను పెళ్లి చేసుకొమ్మని. ఖామోష్గా విన్నాడతను. అప్పుడే శత్రుఘ్న్, రీనా రాయ్, సంజీవ్ కుమార్‌లతో పహలాజ్ నిహలానీ తీసిన ‘హథ్కడీ’ హిట్ అయింది. దాంతో తిరిగి ఈ ముగ్గురితోనే ‘ఆంధీ తూఫాన్’ను ప్లాన్ చేసుకున్నాడతను. అగ్రిమెంట్ కోసం రీనా దగ్గరకి వెళ్లాడు. ‘శత్రుజీ నన్ను పెళ్లి చేసుకుంటేనే ఈ సినిమా చేస్తాను. మీ ఫ్రెండ్‌కి పది రోజులు టైమ్ ఇస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకున్నాడా ఓకే. లేదంటే నేను మరొకరి జీవిత భాగస్వామి అవడం ఖాయమని మీ ఫ్రెండ్‌కి చెప్పండి’ అని అల్టిమేటం జారీ చేసింది రీనా. పొగిలి పొగిలి.. ఆ విషయాన్ని శత్రుఘ్న్కు చేరవేశాడు పహలాజ్. వెంటనే రీనాకు ఫోన్ చేసి అడిగాడు శత్రుఘ్న్. తనతో పెళ్లి గురించి రెట్టించింది రీనా. శత్రుఘ్న్ దగ్గర సమాధానం లేదు. ఫోన్లోనే పొగిలి పొగిలి ఏడ్చాడు. ‘అంత నిస్సహాయంగా శత్రును చూడలేదెప్పుడు. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు’ అన్నాడు పహలాజ్. శత్రుఘ్న్ ఫోన్ పెట్టేశాక చెప్పాడట పహలాజ్ ‘రీనాను వదిలెయ్. ఆమె బతుకు ఆమె బతకనియ్’ అని. అలా ఏడేళ్ల ఆ ప్రేమ కథ విషాదాంతమైంది. పాకిస్తానీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్‌ను పెళ్లి చేసుకొని, తన కెరీర్ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్‌బై చెప్పి భర్తతో లండన్‌కు వెళ్లిపోయింది రీనా. పట్టించుకోలేదు రీనా రాయ్‌తో శత్రుఘ్న్ సిన్హా ప్రేమ సంగతి తెలిసే అతని పెళ్లి ప్రతిపాదనను ఒప్పుకుంది పూనమ్. ‘రీనాకు నేనెప్పుడూ అడ్డుగాలేను. శత్రుఘ్నే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. నాకు తెలుసు నాతో పెళ్లి తర్వాతా ఆ వ్యవహారం కంటిన్యూ అవుతుందని’ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది పూనమ్. అందుకే ఆమె తన భర్త వివాహేతర ప్రేమను పట్టించుకోలేదు. అతని మీద నమ్మకమూ పెట్టుకోలేదు. -
'నాన్న జీవితకథ చదివేందుకు భయపడ్డా'
తన తండ్రి శత్రుఘ్న సిన్హా జీవితకథను చదివేందుకు తాను చాలా భయపడ్డానని బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలిపింది. బీజేపీ ఎంపీ, అలనాటి కథనాయకుడు అయిన శత్రుఘ్న జీవితకథను 'ఎనిథింగ్ బట్ ఖమోష్: ద శత్రుఘ్న సిన్హా బయోగ్రఫీ' పేరిట భారతీ ఎస్ ప్రధాన్ రచించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాన్ని శుక్రవారం లాంఛనంగా ముంబైలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోనాక్షి మాట్లాడుతూ 'నేను ఈ పుస్తకం చదివేందుకు చాలా భయపడ్డాను. తల్లిదండ్రుల జీవితాల్లో కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఎప్పుడూ పిల్లలకు తెలియకపోవడమే మంచిది' అని ఆమె అన్నారు. నిజజీవితంలో రీనా రాయ్‌తో శత్రుఘ్న సాగించిన ప్రేమాయణం, పూనంను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొన్నాళ్లు ఆమెతో సంబంధం కొనసాగించిన అంశం గురించి ఈ పుస్తకంలోని ఓ అధ్యాయంలో చర్చించినట్టు తెలుస్తోంది. నటుడు కాకముందు వరకు శత్రుఘ్న జీవితకథను తాను ఆసాంతం చదివానని, ఆ తర్వాత ముందుకు వెళ్లలేకపోయానని తెలిపింది. బాల్యం, యవ్వన ప్రారంభం రోజులు, కాలేజీ రోజుల వరకు ఆయన జీవితకథను చదివానని, నటుడైన తర్వాతి అధ్యాయాలను మాత్రం చూడలేదని చెప్పింది.