శత్రుఘ్న్‌ వెడ్స్‌ పూనమ్‌ | Shatrughan Sinha And Reena Roy And Poonam Sinha Love Story | Sakshi
Sakshi News home page

ప్రియమైన శత్రు

Published Sun, Sep 13 2020 7:51 AM | Last Updated on Sun, Sep 13 2020 7:55 AM

Shatrughan Sinha And Reena Roy And Poonam Sinha Love Story - Sakshi

శత్రుఘ్న్‌ సిన్హా... భిన్నమైన డైలాగ్‌ డెలివరీతో డెబ్బై, ఎనభైలనాటి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో! రీనా రాయ్‌.. అందం, అభినయంతో అలరించిన అభినేత్రి! పోషించిన పాత్రలతో ఎంత ఫేమస్‌ అయ్యారో తమ ప్రేమ కథతో అంతే పాపులర్‌ అయ్యారిద్దరూ! ఈ లవ్‌స్టోరీ ట్రయాంగిల్‌గా మారింది పూనమ్‌ సిన్హాతో. ఆమే నటే. కాని శత్రుఘ్న్‌ సిన్హా భార్యగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఒక ముక్కోణపు ప్రేమ కథను తలపించే రియల్‌ లైఫ్‌ ఇది.. 

రీనా రాయ్‌కు తొలి హిట్‌ను ఇచ్చిన సినిమా  ‘కాలీచరణ్‌’. అందులో హీరో శత్రుఘ్న్‌ సిన్హా. ఈ  జోడీతోనే వచ్చిన తదుపరి చిత్రం ‘విశ్వనాథ్‌’. అదీ హిట్టే. దాంతో బాలీవుడ్‌లో ఈ జంటకు హిట్‌ పెయిర్‌ అనే ముద్ర పడిపోయింది. ఈ ఇద్దరి జీవితాల్లో కూడా కెమిస్ట్రీ వర్కవుట్‌ అయింది. ‘కాలీచరణ్‌’ సెట్స్‌లో రీనా రాయ్‌తో మొదలైన శత్రుఘ్న్‌ సిన్హా స్నేహం ‘విశ్వనాథ్‌’ సెట్స్‌ మీదకు వచ్చేసరికి ప్రేమగా మారిపోయింది. ఎంతలా అంటే వాళ్ల సినిమాలతో సమంగా వాళ్ల మధ్య ఉన్న ప్రేమ గురించి చర్చించుకునేంతగా.

ఈ వ్యవహారం రీనా తల్లి వరకూ చేరింది. సినిమాల పట్ల శ్రద్ధ పెట్టమని సున్నితంగా మందలించింది. సరేనని తలూపి.. తలపుల్లో శత్రుఘ్న్‌ను మరింతగా పదిలపరచుకుంది రీనా. శత్రుఘ్న్‌ కూడా రీనా తోడిదే లోకమన్నట్టున్నాడు. ఎప్పుడోకప్పుడు వీళ్ల పెండ్లి పిలుపును అందుకోకపోమని బాలీవుడ్డూ ఎదురుచూడసాగింది. అయిదేళ్లు గడిచాయి.

శత్రుఘ్న్‌ వెడ్స్‌ పూనమ్‌
శత్రుఘ్న్‌ పెళ్లి నిశ్చయమైంది. వెడ్డింగ్‌ కార్డ్‌లో  పూనమ్‌ పేరు అచ్చయింది. ఆమె ఒకప్పటి మిస్‌ ఇండియా. నటి కూడా. ‘కోమల్‌’ ఆమె స్క్రీన్‌ నేమ్‌. ‘సబక్‌’ అనే మూవీలో శత్రుఘ్న్‌ పక్కనా నటించింది. రైలు ప్రయాణంలో ఆమెను చూసి మనసు పారేసుకున్నాడు శత్రుఘ్న్‌. అప్పటికే రీనా ప్రేమలో తలమునకలై కూడా. పూనమ్‌తో శత్రుఘ్న్‌ పెళ్లికి ఒక్క రీనానే కాదు, బాలీవుడ్డూ షాక్‌ అయింది. ఆ సమయానికి రీనా లండన్‌లో ఉంది. ఈ వార్త తెలిసి హుటాహుటిన ముంబై చేరుకొని సరాసరి శత్రుఘ్న్‌ ఇంటికే వెళ్లింది. ‘ఇలా చేశావేంటి?’ అని నిలదీసింది.

ఆ క్షణంలో అతను ఆమెకు ఏం సమాధానం చెప్పాడో కాని తన ఆత్మకథ ‘నథింగ్‌ బట్‌ ఖామోష్‌’ లో వివరణ ఇచ్చుకున్నాడు శత్రుఘ్న్‌.. ‘ఆ టైమ్‌లో చాలా భయపడ్డాను. బాచిలర్‌గా ఉండటానికే ఇష్టపడ్డా. కాని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ పెళ్లి నుంచి తప్పుకుందామనే అనుకున్నా. పూనమ్‌ కూడా నేను పెళ్లి తప్పించుకుంటున్నాననే డిసైడ్‌ అయింది. ఎందుకంటే పెళ్లి ముందు రోజు వరక్కూడా నేను ఇండియాలో లేను. సరిగ్గా ముహూర్తానికి వచ్చా. మా వైవాహిక జీవితంలో ఏవైనా పొరపాట్లు జరిగాయంటే అవి నావల్లే. నా భార్యది ఇసుమంతైనా తప్పు లేదు’ అని. 

వదల్లేదు
పెళ్లయినా రీనా చేయివదల్లేదు  శత్రుఘ్న్‌. ఇదీ టాక్‌ ఆఫ్‌ ది బాలీవుడ్‌ అయింది. మళ్లీ రీనాను మందలించింది ఆమె తల్లి. ‘అతణ్ణి నీకు దూరంగానైనా ఉండమను. లేదంటే నిన్ను పెళ్లయినా చేసుకొమ్మను’ అని. నిజానికి రీనా కుటుంబానికి శత్రుఘ్న్‌ సిన్హా అంటే వల్లమాలిన అభిమానం, గౌరవం. అతణ్ణి వదులకోవాలనీ వాళ్లూ అనుకోలేదు. అతను వేరే పెళ్లి చేసుకొని తమ ఇంటికి వస్తున్నా ఆదరించారు. అతని సలహా సంప్రదింపులు లేనిదే ఏ పనీ చేసేవారు కాదు. తల్లి చెప్పినట్టుగా శత్రుఘ్న్‌ను కోరింది రీనా.. తనను పెళ్లి చేసుకొమ్మని.

ఖామోష్‌గా విన్నాడతను. అప్పుడే శత్రుఘ్న్, రీనా రాయ్, సంజీవ్‌ కుమార్‌లతో పహలాజ్‌ నిహలానీ తీసిన ‘హథ్‌కడీ’ హిట్‌ అయింది. దాంతో తిరిగి ఈ ముగ్గురితోనే ‘ఆంధీ తూఫాన్‌’ను ప్లాన్‌ చేసుకున్నాడతను. అగ్రిమెంట్‌ కోసం రీనా దగ్గరకి వెళ్లాడు. ‘శత్రుజీ నన్ను పెళ్లి చేసుకుంటేనే ఈ సినిమా చేస్తాను. మీ ఫ్రెండ్‌కి పది రోజులు టైమ్‌ ఇస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకున్నాడా ఓకే. లేదంటే నేను మరొకరి జీవిత భాగస్వామి అవడం ఖాయమని మీ ఫ్రెండ్‌కి చెప్పండి’ అని అల్టిమేటం జారీ చేసింది రీనా. 

పొగిలి పొగిలి..
ఆ విషయాన్ని శత్రుఘ్న్‌కు చేరవేశాడు పహలాజ్‌. వెంటనే రీనాకు ఫోన్‌ చేసి అడిగాడు శత్రుఘ్న్‌. తనతో పెళ్లి గురించి రెట్టించింది రీనా. శత్రుఘ్న్‌ దగ్గర సమాధానం లేదు. ఫోన్‌లోనే పొగిలి పొగిలి ఏడ్చాడు. ‘అంత నిస్సహాయంగా శత్రును చూడలేదెప్పుడు. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు’ అన్నాడు పహలాజ్‌. శత్రుఘ్న్‌ ఫోన్‌ పెట్టేశాక చెప్పాడట పహలాజ్‌ ‘రీనాను వదిలెయ్‌. ఆమె బతుకు ఆమె బతకనియ్‌’ అని. అలా ఏడేళ్ల ఆ ప్రేమ కథ విషాదాంతమైంది. పాకిస్తానీ క్రికెటర్‌ మొహ్‌సిన్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకొని, తన కెరీర్‌ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్‌బై చెప్పి భర్తతో లండన్‌కు వెళ్లిపోయింది రీనా. 

పట్టించుకోలేదు 
రీనా రాయ్‌తో శత్రుఘ్న్‌ సిన్హా ప్రేమ సంగతి తెలిసే అతని పెళ్లి ప్రతిపాదనను ఒప్పుకుంది పూనమ్‌. ‘రీనాకు నేనెప్పుడూ అడ్డుగాలేను. శత్రుఘ్నే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. నాకు తెలుసు నాతో పెళ్లి తర్వాతా ఆ వ్యవహారం కంటిన్యూ అవుతుందని’ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది పూనమ్‌. అందుకే ఆమె తన భర్త వివాహేతర ప్రేమను పట్టించుకోలేదు. అతని మీద నమ్మకమూ పెట్టుకోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement