Poonam Sinha
-
ఒక్క భార్య చాలు, ఇంకొకరిని పోషించడం నావల్ల కాదు: నటుడు
సినిమాల్లో సత్తా చాటిన శత్రుఘ్న సిన్హ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనేంటో నిరూపించుకున్నాడు. పాలిటిక్స్‌తో బిజీగా మారిన ఆయన ఓ ఇంటర్వ్యూలో వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్క భార్య ముద్దు.. మరో పెళ్లి చేసుకుని రెండో భార్యను తెచ్చుకోవద్దని మాట్లాడాడు. 'నాకు ఒక్కరు చాలు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఆమెను నేను పోషించలేను. కొందరు ఆడవాళ్లు నాదగ్గరకు వచ్చి నాపై ఆసక్తి చూపించేవారు. మన చుట్టూ ఎంత నీళ్లున్నా సరే వాటిలో నుంచి చుక్క నీటిని కూడా మనం తాగలేము అన్న వాక్యం గుర్తొచ్చేది. అయినా పెళ్లనేది ఒక్కరోజు తతంగం కాదు. అది మీరు ఎదగడానికి ఉపయోగపడాలి. వైవాహిక బంధంలో నిజాయితీ ఉండాలి, గౌరవం, ప్రేమ ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకర్నొకరు అర్థం చేసుకుని నమ్మకంగా మెదలాలి. ప్రేమతో పాటు చిన్నచిన్న గొడవలు కూడా ఉంటాయి. అందరూ సింగిల్ లైఫే బాగుంటుందంటారు, కానీ పెళ్లి తర్వాత బాగుందనో, పెళ్లి జీవితం సంతోషంగా ఉందనో చెప్పరు. నా విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా నా భార్య సంతోషంగా ఉంది. మా ఇద్దరిలో నా భార్యే ఎక్కువ నిజాయితీగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఈజీగా పెళ్లి పెటాకులు చేసుకుంటున్నారు. ఈ విడాకుల వల్ల వారి కుటుంబంపై, పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో గ్రహించలేకపోతున్నారు' అని చెప్పుకొచ్చాడు. కాగా శత్రుఘ్న సిన్హ, పూనమ్‌లు 1980లో పెళ్లి చేసుకున్నారు. వీరికి సోనాక్షి సిన్హ, లవ్, కుష్ సిన్హలు సంతానం. చదవండి: పెళ్లిపీటలెక్కిన హీరోయిన్, ఫోటోలు వైరల్ స్టార్ ఇంట్లో అద్దెకు దిగిన యంగ్ హీరో -
శత్రుఘ్న్ వెడ్స్ పూనమ్
శత్రుఘ్న్ సిన్హా... భిన్నమైన డైలాగ్ డెలివరీతో డెబ్బై, ఎనభైలనాటి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో! రీనా రాయ్.. అందం, అభినయంతో అలరించిన అభినేత్రి! పోషించిన పాత్రలతో ఎంత ఫేమస్ అయ్యారో తమ ప్రేమ కథతో అంతే పాపులర్ అయ్యారిద్దరూ! ఈ లవ్‌స్టోరీ ట్రయాంగిల్‌గా మారింది పూనమ్ సిన్హాతో. ఆమే నటే. కాని శత్రుఘ్న్ సిన్హా భార్యగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఒక ముక్కోణపు ప్రేమ కథను తలపించే రియల్ లైఫ్ ఇది.. రీనా రాయ్‌కు తొలి హిట్‌ను ఇచ్చిన సినిమా ‘కాలీచరణ్’. అందులో హీరో శత్రుఘ్న్ సిన్హా. ఈ జోడీతోనే వచ్చిన తదుపరి చిత్రం ‘విశ్వనాథ్’. అదీ హిట్టే. దాంతో బాలీవుడ్లో ఈ జంటకు హిట్ పెయిర్ అనే ముద్ర పడిపోయింది. ఈ ఇద్దరి జీవితాల్లో కూడా కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. ‘కాలీచరణ్’ సెట్స్‌లో రీనా రాయ్‌తో మొదలైన శత్రుఘ్న్ సిన్హా స్నేహం ‘విశ్వనాథ్’ సెట్స్ మీదకు వచ్చేసరికి ప్రేమగా మారిపోయింది. ఎంతలా అంటే వాళ్ల సినిమాలతో సమంగా వాళ్ల మధ్య ఉన్న ప్రేమ గురించి చర్చించుకునేంతగా. ఈ వ్యవహారం రీనా తల్లి వరకూ చేరింది. సినిమాల పట్ల శ్రద్ధ పెట్టమని సున్నితంగా మందలించింది. సరేనని తలూపి.. తలపుల్లో శత్రుఘ్న్ను మరింతగా పదిలపరచుకుంది రీనా. శత్రుఘ్న్ కూడా రీనా తోడిదే లోకమన్నట్టున్నాడు. ఎప్పుడోకప్పుడు వీళ్ల పెండ్లి పిలుపును అందుకోకపోమని బాలీవుడ్డూ ఎదురుచూడసాగింది. అయిదేళ్లు గడిచాయి. శత్రుఘ్న్ వెడ్స్ పూనమ్ శత్రుఘ్న్ పెళ్లి నిశ్చయమైంది. వెడ్డింగ్ కార్డ్‌లో పూనమ్ పేరు అచ్చయింది. ఆమె ఒకప్పటి మిస్ ఇండియా. నటి కూడా. ‘కోమల్’ ఆమె స్క్రీన్ నేమ్. ‘సబక్’ అనే మూవీలో శత్రుఘ్న్ పక్కనా నటించింది. రైలు ప్రయాణంలో ఆమెను చూసి మనసు పారేసుకున్నాడు శత్రుఘ్న్. అప్పటికే రీనా ప్రేమలో తలమునకలై కూడా. పూనమ్‌తో శత్రుఘ్న్ పెళ్లికి ఒక్క రీనానే కాదు, బాలీవుడ్డూ షాక్ అయింది. ఆ సమయానికి రీనా లండన్‌లో ఉంది. ఈ వార్త తెలిసి హుటాహుటిన ముంబై చేరుకొని సరాసరి శత్రుఘ్న్ ఇంటికే వెళ్లింది. ‘ఇలా చేశావేంటి?’ అని నిలదీసింది. ఆ క్షణంలో అతను ఆమెకు ఏం సమాధానం చెప్పాడో కాని తన ఆత్మకథ ‘నథింగ్ బట్ ఖామోష్’ లో వివరణ ఇచ్చుకున్నాడు శత్రుఘ్న్.. ‘ఆ టైమ్‌లో చాలా భయపడ్డాను. బాచిలర్‌గా ఉండటానికే ఇష్టపడ్డా. కాని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ పెళ్లి నుంచి తప్పుకుందామనే అనుకున్నా. పూనమ్ కూడా నేను పెళ్లి తప్పించుకుంటున్నాననే డిసైడ్ అయింది. ఎందుకంటే పెళ్లి ముందు రోజు వరక్కూడా నేను ఇండియాలో లేను. సరిగ్గా ముహూర్తానికి వచ్చా. మా వైవాహిక జీవితంలో ఏవైనా పొరపాట్లు జరిగాయంటే అవి నావల్లే. నా భార్యది ఇసుమంతైనా తప్పు లేదు’ అని. వదల్లేదు పెళ్లయినా రీనా చేయివదల్లేదు శత్రుఘ్న్. ఇదీ టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది. మళ్లీ రీనాను మందలించింది ఆమె తల్లి. ‘అతణ్ణి నీకు దూరంగానైనా ఉండమను. లేదంటే నిన్ను పెళ్లయినా చేసుకొమ్మను’ అని. నిజానికి రీనా కుటుంబానికి శత్రుఘ్న్ సిన్హా అంటే వల్లమాలిన అభిమానం, గౌరవం. అతణ్ణి వదులకోవాలనీ వాళ్లూ అనుకోలేదు. అతను వేరే పెళ్లి చేసుకొని తమ ఇంటికి వస్తున్నా ఆదరించారు. అతని సలహా సంప్రదింపులు లేనిదే ఏ పనీ చేసేవారు కాదు. తల్లి చెప్పినట్టుగా శత్రుఘ్న్ను కోరింది రీనా.. తనను పెళ్లి చేసుకొమ్మని. ఖామోష్గా విన్నాడతను. అప్పుడే శత్రుఘ్న్, రీనా రాయ్, సంజీవ్ కుమార్‌లతో పహలాజ్ నిహలానీ తీసిన ‘హథ్కడీ’ హిట్ అయింది. దాంతో తిరిగి ఈ ముగ్గురితోనే ‘ఆంధీ తూఫాన్’ను ప్లాన్ చేసుకున్నాడతను. అగ్రిమెంట్ కోసం రీనా దగ్గరకి వెళ్లాడు. ‘శత్రుజీ నన్ను పెళ్లి చేసుకుంటేనే ఈ సినిమా చేస్తాను. మీ ఫ్రెండ్‌కి పది రోజులు టైమ్ ఇస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకున్నాడా ఓకే. లేదంటే నేను మరొకరి జీవిత భాగస్వామి అవడం ఖాయమని మీ ఫ్రెండ్‌కి చెప్పండి’ అని అల్టిమేటం జారీ చేసింది రీనా. పొగిలి పొగిలి.. ఆ విషయాన్ని శత్రుఘ్న్కు చేరవేశాడు పహలాజ్. వెంటనే రీనాకు ఫోన్ చేసి అడిగాడు శత్రుఘ్న్. తనతో పెళ్లి గురించి రెట్టించింది రీనా. శత్రుఘ్న్ దగ్గర సమాధానం లేదు. ఫోన్లోనే పొగిలి పొగిలి ఏడ్చాడు. ‘అంత నిస్సహాయంగా శత్రును చూడలేదెప్పుడు. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు’ అన్నాడు పహలాజ్. శత్రుఘ్న్ ఫోన్ పెట్టేశాక చెప్పాడట పహలాజ్ ‘రీనాను వదిలెయ్. ఆమె బతుకు ఆమె బతకనియ్’ అని. అలా ఏడేళ్ల ఆ ప్రేమ కథ విషాదాంతమైంది. పాకిస్తానీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్‌ను పెళ్లి చేసుకొని, తన కెరీర్ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్‌బై చెప్పి భర్తతో లండన్‌కు వెళ్లిపోయింది రీనా. పట్టించుకోలేదు రీనా రాయ్‌తో శత్రుఘ్న్ సిన్హా ప్రేమ సంగతి తెలిసే అతని పెళ్లి ప్రతిపాదనను ఒప్పుకుంది పూనమ్. ‘రీనాకు నేనెప్పుడూ అడ్డుగాలేను. శత్రుఘ్నే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. నాకు తెలుసు నాతో పెళ్లి తర్వాతా ఆ వ్యవహారం కంటిన్యూ అవుతుందని’ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది పూనమ్. అందుకే ఆమె తన భర్త వివాహేతర ప్రేమను పట్టించుకోలేదు. అతని మీద నమ్మకమూ పెట్టుకోలేదు. -
భర్తగా నా ధర్మాన్ని నెరవేర్చాను!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థిగా లక్నో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన భార్య పూనమ్ సిన్హా తరఫున తాను ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రతుఘ్న సిన్హా సమర్థించుకున్నారు. తమ పార్టీలు వేరైనా.. ఆమె తన భార్య అయినందున పతిధర్మాన్ని నెరవేరుస్తున్నానని, భార్య తరఫున ప్రచారం చేయడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన చెప్పుకొచ్చారు. ‘లక్నోలో ప్రచారం చేయడం ద్వారా నేను పతిధర్మాన్ని నెరవేర్చాను. పట్నాలో ప్రచారం చేపట్టడం ద్వారా పూనమ్ కూడా తన పత్ని ధర్మాన్ని నెరవేరబోతుంది’ అని షాట్‌గన్ తనదైన శైలిలో చెప్పారు. బీజేపీ రెబెల్‌గా ప్రధాని మోదీ, అమిత్‌షాలపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన శ్రతుఘ్న ఎన్నికల సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పట్నా నుంచి కాంగ్రెస్ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకుడై ఉండి.. లక్నోలో ఎస్పీ తరఫున ప్రచారం చేయడం ద్వారా.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని లక్నో కాంగ్రెస్ అభ్యర్థి ఆచార్య ప్రమోద్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై శత్రుఘ్న స్పందిస్తూ.. ‘ఈ వివాదం ఎందుకు చెలరేగుతుందో నాకు అర్థం కావడం లేదు. గత నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే నేను నా భార్య తరఫున ప్రచారం చేస్తానని పార్టీ అధినాయకత్వానికి చెప్పాను. అధిష్టానం కూడా ఒప్పుకుంది. లక్నోలో మే 6న పోలింగ్ ముగిసిన తర్వాత పూనం పట్నాలో ప్రచారం నిర్వహించనున్నారని ఎస్పీకి కూడా సమాచారం ఇచ్చాం. ఆ పార్టీ కూడా అభ్యంతరం చెప్పలేదు. నా వరకు కుటుంబానికే మొదటి ప్రాధాన్యం’ అని షాట్ గన్ వివరించారు. -
తల్లి తరఫున ప్రచారంలో బాలీవుడ్ నటి
లక్నో: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఎన్నికల ప్రచారంలో సందడి చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోక్‌సభ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) తరఫున తన తల్లి పూనమ్ సిన్హా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో పూనమ్ సిన్హా విజయాన్ని కోరుతూ.. శుక్రవారం లక్నో వీదుల్లో నిర్వహించిన ర్యాలీలో సోనాక్షి సిన్హా పాల్గొన్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి, కన్నౌజ్ ఎంపీ అభ్యర్థి డింపుల్ యాదవ్‌తో కలిసి సోనాక్షి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజాసేవ కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన తల్లిని గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. పూనమ్‌తో పాటు సోనాక్షి, డింపుల్ రావడంతో వారిని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక లక్నో లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పూనమ్, బీజేపీ నుంచి కేంద్రమంత్రి, సిటింగ్ ఎంపీ రాజ్‌నాథ్ సింగ్ పోటీ పడుతుండగా, కాంగ్రెస్ నుంచి గురు ఆచార్య ప్రమోద్ కిృష్ణణ్‌ను బరిలో నిలిచిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రాతినిథ్యం వహించిన లక్నోలో 1991 నుంచి ఇప్పటి వరకు బీజేపీ మినహా మరేపార్టీ విజయం సాధించలేదు. 1991 నుంచి 2009 వరకు వాజ్‌పేయీ ఇక్కడ విజయం సాధించగా.. 2014లో రాజ్‌నాథ్ సింగ్ గెలుపొందారు. ఎస్పీ, బీఎస్పీ కూటగా పోటీ చేస్తుండడంతో ఈ స్థానం ఎన్నిక ఉత్కంఠంగా మారింది. కాగా సోనాక్షి తండ్రి శత్రుష్ను సిహ్హా బిహార్‌లోని పట్నాసాహెబ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
‘గార్డియనే గడబిడ చేస్తున్నాడు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశాన్ని కాపాడాల్సిన గార్డియనే గడబిడ చేస్తున్నాడని ప్రధాని నరేంద్ర మోదీపై ఎస్పీ నేత, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్నోలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యతాయుత పదవిలో ఉన్న ప్రధాని మోదీ స్వయంగా ఆయనే దేశంలో గందరగోళం సృష్టించేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. లక్నో బరిలో ఎస్పీ అభ్యర్ధిగా నిలిచిన పూనం సిన్హాను ఆదరించాలని ఆమె కోరారు. ఎస్పీలోకి కొత్తగా వచ్చిన వారిని సమాదరించడం మన సంప్రదాయమని, వారు ఎక్కడి వారైనా వారిని గెలిపించుకుని, గౌరవించడం తమ విధానమనని జయాబచ్చన్ చెప్పుకొచ్చారు. మీరంతా ఆమె విజయానికి సహకరిస్తామని తనకు హామీ ఇవ్వాలని లేకుంటే పూనం తనను ముంబైలో అడుగుపెట్టనీయరని చయత్కరించారు. లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌లో భాగంగా మే 6న లక్నోలో పోలింగ్ జరగనుంది. మే 23న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపును చేపట్టి విజేతలను వెల్లడిస్తారు. -
ఐదో దశ పోలింగ్ : సంపన్న అభ్యర్ధి ఆమే..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌కు సంబంధించి రూ 193 కోట్ల ఆస్తులు ప్రకటించిన పూనం సిన్హా అత్యంత సంపన్న అభ్యర్ధిగా నిలిచారు. సినీ నటుడు, కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా భార్య పూనం ఎస్పీ అభ్యర్ధిగా లక్నో నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రూ 177 కోట్ల ఆస్తులతో ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి విజయ్ కుమార్ మిశ్రా తర్వాతి స్ధానంలో ఉన్నారు. మిశ్రా సీతాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అత్యంత సంపన్న అభ్యర్ధుల జాబితాలో హజారిబాగ్ బీజేపీ అభ్యర్ధి జయంత్ సిన్హా రూ 77 కోట్ల ఆస్తులతో మూడో స్ధానంలో ఉన్నారు. ఐదో విడత పోలింగ్‌లో బరిలో నిలిచిన 668 మంది అభ్యర్ధుల్లో 184 మంది అభ్యర్ధుల ఆస్తులు రూ కోటికి మించాయి. వీరిలో అత్యధికులు బీజేపీ అభ్యర్ధులు కావడం గమనార్హం. అభ్యర్ధుల అఫిడవిట్లను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్ధ ఈ వివరాలు వెల్లడించింది. ఇక ఐదో విడత పోలింగ్‌లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల సగటటు ఆస్తి రూ 2.57 కోట్లుగా నమోదైంది. మరోవైపు 264 మంది అభ్యర్ధుల విద్యార్హత ఐదో తరగతి నుంచి ఇంటర్ లోపు ఉండటం గమనార్హం. 348 మంది అభ్యర్ధులు గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్లుగా ప్రకటించుకున్నారు. మరో 43 మంది తాము అక్షరాస్యులమని పేర్కొనగా, ఆరుగురు అభ్యర్ధులు తాము నిరక్షరాస్యులమని స్పష్టం చేశారు. -
రాజ్‌నాధ్‌తో పోటీకి భయపడను
లక్నో : లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను దీటుగా ఎదుర్కొంటానని లక్నోలో ఎస్పీ అభ్యర్ధిగా ఆయనతో తలపడుతున్న పూనం సిన్హా స్పష్టం చేశారు. లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి శత్రుఘ్న సిన్హా భార్య, నటి పూనం సిన్హా గురువారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాజ్‌నాధ్ సింగ్‌తో పోటీకి తాను భయపడటం లేదని, ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుకు వచ్చిన తర్వాత ప్రత్యర్ధి చిన్నా, పెద్దా అని చూడబోమని పేర్కొన్నారు. మనం ఏస్ధాయి నేతలమనేది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ప్రజలు వారి సమస్యలను అధిగమించేలా తోడ్పాటు అందించడమే తన ప్రధమ కర్తవ్యమని లక్నో గురించి త్వరలోనే పూర్తిగా తెలుసుకుంటానని, ప్రజలతో మమేకమవుతానని చెప్పుకొచ్చారు. లక్నో నుంచి ఎస్పీ అభ్యర్థిగా తన పేరు ఖరారైన వెంటనే పూనం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌ను లక్నోలోని ఆమె నివాసంలో కలుసుకున్నారు. దేశంలో మార్పు కోరుతూ యువనేత అఖిలేష్ పనితీరును మెచ్చే తాను ఎస్పీలో చేరానని ఆమె స్పష్టం చేశారు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమిని ఆదరించడం ద్వారా యూపీ ప్రజలు మార్పును స్వాగతిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. -
మా బంగ్లా పేరు సీక్రెట్ అదే! : నటి
ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా గారాల పట్టి, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తమ బంగ్లా పేరు వెనుక ఉన్న సీక్రెట్ చెప్పేశారు. ‘దబంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సరైన హిట్లులేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ సింగింగ్ షోకి గెస్ట్‌గా హాజయ్యారు సోనాక్షి. ఇందిరా దాస్ అనే కంటెస్టెంట్ ప్రతిభకు ముగ్ధురాలైన సోనాక్షి.. ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ఇందిరా దాస్, ఆమె తల్లితో సోనాక్షి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మీ బంగ్లాకు రామాయణ్ అనే పేరు ఎందుకు పెట్టారంటూ’ ఇందిర తల్లి సోనాక్షిని అడిగారు. ‘ఎన్నో ఏళ్లుగా, ఎంతో మంది ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. కానీ ఈ రోజు మీ కోసం ఆ రహస్యాన్ని చెప్పేస్తున్నా. మా నాన్న పేరు మీకందరికీ తెలిసిందే. ఆయన అన్నదమ్ముల పేర్లు... రామ్, లక్ష్మన్, భరత్. ఇక నా అన్నదమ్ములు లవ్, కుశ. కాబట్టి రామాయణ్ అనే పేరు మా బంగ్లాకు సరిగ్గా సరిపోతుందని కుటుంబ సభ్యులు భావించారు. అందుకే ఆ పేరు పెట్టారు. ఈ రకంగా చూస్తే మా ఇంట్లో నేను, మా అమ్మే(పూనం) బయటివాళ్లం అన్పిస్తోంది కదా. కానీ ఒక్కోసారి మహాభారత సంఘటనలు(యుద్ధం) కూడా ‘రామాయణ్’లో సృష్టించగల సత్తా మాకుంది’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. -
మా కుటుంబాన్ని లాగొద్దు! - సోనాక్షి సిన్హా
న్యూఢిల్లీ: ‘మీ ప్రయోజనాల కోసం నా గురించి ఏమైనా రాసుకోండి. కానీ నా కుటుంబాన్ని మాత్రం వివాదాల్లోకి లాగొద్దు. ఒకవేళ అదే జరిగితే నేను కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంద’ని మీడియాకు వార్నింగ్ ఇచ్చింది నటి సోనాక్షి సిన్హా. ‘లుటేరా’ సినిమా షూటింగ్ జరుగుతుండగా సోనాక్షి తల్లి పూనమ్ సిన్హా సెట్స్‌లోకి వచ్చిందని, ఆ సమయంలో రణ్వీర్ సింగ్‌తో చిత్రీకరిస్తున్న పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నానా హంగామా చేసిందనే కథనాలు మీడియాలో ప్రసారం కావడంపై స్పందిస్తూ సోనాక్షి ఇలా వార్నింగ్ ఇచ్చింది. ‘సినిమాల ఎంపికలో మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ జోక్యం చేసుకోరు. ఆ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎందుకంటే వారికి నాపై పూర్తి నమ్మకముంది. షూటింగ్ స్పాట్‌కు మా అమ్మ వచ్చిందని, చిత్రీకరిస్తున్న సన్నివేశాలపట్ల అభ్యంతరం చెప్పిందంటూ మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలే. మా అమ్మ షూటింగ్ స్పాట్‌కు వచ్చేది కేవలం నాకు తినిపించేందుకే. అంతేతప్ప సినిమా విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోదు. చిత్ర దర్శకుడు విక్రమాదిత్య మోత్వానేతో కూడా అమ్మ చాలా సన్నిహితంగా ఉంటుంది. చిత్ర బృందమంతా అమ్మను ఇష్టపడతారు. సినిమా కోసం సంతకాలు చేసేముందే కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంటాను. తుది నిర్ణయం నాదే అయినప్పటికీ వారిని అలా అడగడం నాకు అలవాటు. ఇప్పటిదాకా నా ఇష్టాన్ని వారెప్పుడూ కాదనలేదు. వారికి ఇబ్బంది పెట్టే పనులేవీ నేను చేయలేదు. అయినప్పటికీ సొంత ప్రయోజనాల కోసం ఇలాంటి లేనిపోని కథనాలు రాస్తున్నారు. కావాలంటే నా పేరును వాడుకోండి. అంతేగానీ నా కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగితే అందుకు వ్యతిరేకంగా నేను వ్యవహరించవలసి ఉంటుంద’ని పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పింది సోనమ్.