
లక్నో : లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను దీటుగా ఎదుర్కొంటానని లక్నోలో ఎస్పీ అభ్యర్ధిగా ఆయనతో తలపడుతున్న పూనం సిన్హా స్పష్టం చేశారు. లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి శత్రుఘ్న సిన్హా భార్య, నటి పూనం సిన్హా గురువారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాజ్‌నాధ్ సింగ్‌తో పోటీకి తాను భయపడటం లేదని, ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుకు వచ్చిన తర్వాత ప్రత్యర్ధి చిన్నా, పెద్దా అని చూడబోమని పేర్కొన్నారు. మనం ఏస్ధాయి నేతలమనేది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
ప్రజలు వారి సమస్యలను అధిగమించేలా తోడ్పాటు అందించడమే తన ప్రధమ కర్తవ్యమని లక్నో గురించి త్వరలోనే పూర్తిగా తెలుసుకుంటానని, ప్రజలతో మమేకమవుతానని చెప్పుకొచ్చారు. లక్నో నుంచి ఎస్పీ అభ్యర్థిగా తన పేరు ఖరారైన వెంటనే పూనం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌ను లక్నోలోని ఆమె నివాసంలో కలుసుకున్నారు. దేశంలో మార్పు కోరుతూ యువనేత అఖిలేష్ పనితీరును మెచ్చే తాను ఎస్పీలో చేరానని ఆమె స్పష్టం చేశారు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమిని ఆదరించడం ద్వారా యూపీ ప్రజలు మార్పును స్వాగతిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.