ఆ ప్రేమ జంటను చూసి విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో సింగర్, యాక్టర్ దీప్ సిద్ధును బలి తీసుకుని వారిని విడదీసింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు తిరిగి రాడన్న వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది అతడి ప్రియురాలు, నటి రీనా రాయ్. అనుక్షణం అతడి జ్ఞాపకాల్లోనే తడిసి ముద్దవుతూ ఎంతో వేదన అనుభవిస్తోంది. ఆమె సిద్ధుతో కలిసి దిగిన ఫొటోలను గురువారం నాడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఎమోషనల్ అయింది.
'నా గుండె పగిలింది. లోలోపల చచ్చిపోతున్నాను. జీవితాంతం నా చేయి పట్టుకుని ఉంటానని మాటిచ్చావు జాన్, దయచేసి నాకోసం తిరిగొచ్చేయ్‌వా.. నేను ఆస్పత్రి బెడ్‌పై ఉన్నప్పుడు కూడా నువ్వు నా చెవిలో ఏదో చెప్తున్నట్లు అనిపించింది. నాకు తెలుసు, నువ్వెప్పుడూ నాతోనే ఉంటావని! మనం కలిసి బతుకుదామనుకున్నాం, కానీ అర్ధాంతరంగా నన్ను వదిలి వెళ్లిపోయావు. సోల్‌మేట్స్ ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. నిన్ను మరో ప్రపంచంలో తప్పకుండా కలుసుకుంటాను జాన్.. నువ్వు నా గుండెచప్పుడు, లవ్ యూ' అని రాసుకొచ్చింది. ఆ తర్వాత కాసేపటికే ఆ పోస్ట్ డిలీట్ చేసింది. కాగా మంగళవారం నాడు దీప్ సిద్ధూ, రీనా ప్రయాణిస్తున్న కారు రోడ్డుప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సింగర్ దీప్ మరణించగా రీనా స్వల్ప గాయాలతో బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment