సౌది అరేబియా కథ: హాస్యగాడు అబునువాస్‌ | Saudi Arabia Hasyagadu Abu Nuwas Story In Telugu | Sakshi
Sakshi News home page

సౌది అరేబియా కథ: హాస్యగాడు అబునువాస్‌

Published Sun, Nov 14 2021 4:22 PM | Last Updated on Sun, Nov 14 2021 4:31 PM

Saudi Arabia Hasyagadu Abu Nuwas Story In Telugu - Sakshi

పూర్వపు వాళ్లలోను, ఇప్పటి వాళ్లలోను మనం జ్ఞాపకం ఉంచుకో తగిన ఉపాయశాలులందరిలో గొప్పవాడెవడో చెప్పగలరా? కొందరు ఒకడు గొప్పవాడు అంటే మరికొందరు ఇంకొకడు మరీ గొప్పవాడంటారు. కానీ నిజం తెలిసినవాళ్లంతా అబునువాస్‌ పేరే చెబుతారు. అబునువాస్‌ జీవితమంతా హాస్యకథలుగా, తమాషాపనులతో, మంచి మంచి ఉపాయాలతో నవ్వుల మాటలతో గడచిపోయింది. అంతేకాదు ఎన్నోసార్లు తన యుక్తితో హాస్యంతో ఎన్నో చిక్కుల్లోంచి బయటపడ్డాడు. ఆయన ఎవ్వరినైనా సరే నవ్వించాలనుకున్నాడా.. తమాషా మాటల్తో కడుపుబ్బేట్టు నవ్వించేవాడు. ఎంత తెలివిగలవాడినైనా చాదస్తుడనిపించాలంటే ఏదో యుక్తిపన్ని బోల్తా కొట్టించేసేవాడు. మామూలు మనుషుల్నే కాదు మహారాజుల్నీ లెక్కలేకుండా హాస్యమాడేవాడు. ఈ అబునువాస్‌కు ఒక గాడిద ఉండేది.

ఆ గాడిదకి నీళ్లు పెట్టటానికి ఒక పెద్దపళ్లెం కావలసివచ్చింది. పొరుగింటి వాళ్లను అడిగాడు. వాళ్లు అబునువాస్‌కు రాగిపళ్లెం ఇచ్చారు. దాన్ని మూడురోజులు తన వద్దే ఉంచుకున్నాడు. నాలుగోరోజున ఆ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం పెట్టి ఆ రెండిటినీ తీసుకెళ్లి పొరుగింటివాళ్లకు ఇచ్చాడు. పక్కింటి పెద్ద మనిషి తమ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం కూడా ఉడడం చూసి ‘అయ్యో ఈ చిన్నపళ్లెం మాది కాదే!’ అన్నాడు. దానికి అబునువాస్‌ ‘మీరిచ్చిందేదో మీకు తిరిగి ఇచ్చేశాను. మీ రాగిపళ్లెం నా దగ్గర ఉన్నప్పుడు దానికి ఈ చిన్నపళ్లెం పుట్టింది. ఇది రాగిపళ్లెం బిడ్డ కాబట్టి ఈ రెండూ మీవే’ అని చెప్పాడు. అబునువాస్‌ తెలివి తక్కువతనానికి నవ్వుకుని ఇంకో పళ్లెం కూడా వస్తూంటే పోనివ్వటమెందుకని ‘మీరు చెప్పింది నిజమే! మా పళ్లానికి పుట్టిన బిడ్డ కాబట్టి ఇదీ మాదే. పళ్లాలకు కూడా బిడ్డలు పుట్టే చల్లని ఇల్లు మీది’అన్నాడు పొరుగింటాయన. 

మూడురోజులు పోయాక అబునువాస్‌ మళ్లీ వాళ్లింటికి వెళ్లి ఆ పళ్లమే ఇంకోసారి అరువడిగాడు. ఈసారి ఇంకో మంచి బిడ్డను తీసుకొస్తుందనే సంతోషంతో వెంటనే ఆ ఇంటి యజమాని ఆ పళ్లాన్ని తెచ్చిచ్చాడు. అబునువాస్‌ నవ్వుకుంటూ ఆయనకు నమస్కారం పెట్టి రాగిపళ్లెం చంకనబెట్టుకొని ఇంటికి పోయాడు. ఈసారి పళ్లెం తీసుకుపోయి ఎన్నాళ్లయినా తిరిగి ఇవ్వలేదు. పొరిగింటాయన వచ్చి పళ్లెం కావాలని అడిగాడు. అబునువాస్‌ ఎంతో విచారంగా‘ఏం చేయమంటారు బాబూ.. మీకు పుట్టెడు దుఃఖవార్త చెప్పాల్సి వచ్చింది. మీ పళ్లెం చచ్చిపోయింది బాబూ’ అని చెప్పాడు. ‘ పళ్లెం చచ్చిపోవడమేమిటి?’ విస్తుపోయాడు పొరుగింటి మనిషి.

‘ఈ విషయం మీకు చాలా దుఃఖం కలుగజేస్తుందనే నేను మీకు ఇన్నాళ్లూ చెప్పలేదు. ఏం చెయ్యను? చివరికి చెప్పక తప్పలేదు’ అన్నాడు అబునువాస్‌. ఆ మాటకు పొరుగింటి పెద్దమనిషికి తగని కోపం వచ్చింది. ‘తమాషాగా ఉందా? రాగిపళ్లెం చావటమేమిటి?నన్ను పిచ్చివాణ్ణనుకుంటున్నావా?’ అంటూ మండిపడ్డాడు. ‘ఆ రాగిపళ్లమే కదండీ ఇంతకుముంద బిడ్డను కనిందీ..’ గుర్తుచేశాడు అబునువాస్‌.‘అవును’ చెప్పాడు పొరుగింటాయన. ‘ఈ సృష్టిలో బిడ్డల్ని కనేవన్నీ ఏనాడో ఒకనాడు చచ్చిపోకమానవు బాబూ? ఎటొచ్చీ మీ రాగిపళ్లెం పాపం పరాయింట్లో చచ్చిపోవటమే చాలా విచారకరం. ఏం చేస్తాం.. దానికి అలా రాసిపెట్టి ఉంది’ అని ఓదార్చాడు అబునువాస్‌. అలా ఆ రాగిపళ్లాన్ని తన దగ్గరే ఉంచేసుకున్నాడు.

ఇంకోసారి ఒకడు అబునువాస్‌ దగ్గరకు వచ్చి అతని గాడిదను అరువు అడిగాడు.  పని మీద తన గాడిద ఊరికి వెళ్లిందని అబునువాస్‌ చెప్తూండగానే పెరట్లోంచి గాడిద ఓండ్రపెట్టింది. ‘దొడ్లో గాడిద అరుస్తూంటే  ఊరెళ్లిందని చెప్తున్నావ్‌.. నువ్వేం పెద్దమనిషవయ్యా?’ అంటూ నిలదీశాడతను. ‘నీకు కావలసింది మా గాడిదా? దాని అరుపా? గాడిదైతే ఇక్కడలేదు. దాని అరుపు కావాలంటే తీసుకుపో’ అంటూ గాడిదలాగా ‘ఈ.. ఓర్‌.. ఈ ..ఓర్‌’ అంటూ ఓండ్రపెట్టి ‘ఇదిగోనయ్యా.. గాడిద అరుపు. దానిమీద ఎక్కి నీ దారిన నువ్వు పో త్వరగా’ అని చెప్పాడు. తెల్లబోయాడు ఆ పెద్దమనిషి. 

ఇంకోసారి ఇంకా మంచి తమాషా జరిగింది. అబునువాస్‌ రెండంతస్తుల మేడ కట్టాడు. అంతా కట్టిన తరువాత ఆ మేడ అమ్మాలని బేరం పెట్టాడు. అంత పెద్దమేడ ఎవరికీ అవసరం లేకపోయింది. అడిగినవాళ్లే లేకపోయారు. చివరికెట్లాగో అబునువాస్‌ తన మేడ మీది అంతస్తు మాత్రం ఒక వ్యాపారస్తుడికి అమ్మగలిగాడు. వర్తకుడు మేడ మీద ప్రవేశించాక కిందిభాగం కూడా కొనమని అతణ్ణి అడగసాగాడు అబునువాస్‌. వ్యాపారస్తుడు మాత్రం తనకు అక్కర్లేదని చెప్పేశాడు. 

ఒకనాటి ఉదయం అబునువాస్‌ చాలామంది కూలీలను పిలిపించి తన ఇంటి గోడలు పగలగొట్టమన్నాడు. ఈ గడబిడ ఏమిటా అని పైనున్న వర్తకుడు కిటికీలోంచి కిందికి తొంగి చూశాడు. అంతమంది కూలీలు అబునువాస్‌ చెప్పినట్టే మేడ గోడలను కూలగొట్టసాగారు. కంగారుపడుతూ ఆ వర్తకుడు ‘ఏం చేస్తున్నారు?’ అంటూ అరిచాడు. ‘కింది అంతస్తు అమ్ముతానంటే ఎవరూ కొనలేదు. అందుచేత పగలగొట్టించేస్తున్నాను. నీ పై అంతస్తును జాగ్రత్తగా చూసుకో. నీ మేడ విరిగి నా కూలీల మీద పడి వాళ్లకు దెబ్బలు తగిలితే మాత్రం నేనూరుకోను’ అన్నాడు అబునువాస్‌. ‘పగలగొట్టించకండి.. కింది అంతస్తు కూడా నేనే కొంటాను’ అంటూ ఆ వర్తకుడు కింది అంతస్తు కూడా కొన్నాడు విధిలేక. 

ఆఖరికి ఆ ఊరి రాజుకూడా అబునువాస్‌ హాస్యపుదెబ్బ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఒకనాటి రాత్రి రాజుకి ఒక కల వచ్చింది. అబునువాస్‌ ఇంటి కింద.. భూమిలో వెండినాణాలతో నిండిన బిందెలు ఉన్నట్టు రాజుకి కలలో కనబడింది. తెల్లవారే ఆ బిందెలను తవ్వుకురమ్మని పదిమంది పనివాళ్లను అబునువాస్‌ ఇంటికి పంపాడు రాజు. అప్పుడు అబునువాస్‌ ఇంట్లోలేడు. పనివాళ్లు ఇంటి కింది నేలను తవ్వేస్తూంటే ఏమీ చేయలేక ఏడుస్తూ దూరంగా నిలబడింది అబునువాస్‌ భార్య. ఎంత పెళ్లగించినా వెండిబిందెలు కనబడలేదు. రాజుగారి కూలీలు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అబునువాస్‌ ఇంటికి రాగానే అతని భార్య ఏడుస్తూ సంగతంతా చెప్పింది. ‘మరేమీ పరవాలేదులే. రాజుగారికి తగిన శాస్తి నే చేస్తాగా! నువ్వు దిగులు పడకు’ అంటూ భార్యను ఓదార్చాడు అబునువాస్‌.  

వండిన అన్నాన్ని కొంత  తీసి ఒక పళ్లెంలో వేసుకుని దాని మీద ఒక తువాలు కప్పాడు. తువాలు మీద చాలా ఈగలు వాలాయి. అందులో కొన్ని లోపలికి దూరి అన్నం తినటానికి ప్రయత్నించాయి. మరునాడు తెల్లవారగానే తువాలు కప్పిన అన్నపు పళ్లాన్ని రాజుగారి కోటకు తీసుకెళ్లాడు.

 ‘ప్రభూ.. నాదొక ఫిర్యాదు. కొందరు నా ఇంటికి పిలవకుండానే వచ్చి నా ఆహారాన్ని తినేస్తున్నారు. వాళ్లను దండించ కుండా ఎట్లా ఊరుకోమంటారో మీరే చెప్పండి’ అని రాజుగారిని అడిగాడు. అబున్‌వాస్‌ ఏదో కట్టుకథలాంటిది చెబుతున్నాడేమో అనుకున్నాడు రాజు. తన పనివాళ్లు అతని ఇంట్లో నేలను పెళ్లగించిన విషయం చెబుతున్నాడేమోనని కూడా రాజుకి అనుమానం కలిగింది. ‘ఇంతకీ నువ్వు ఫిర్యాదు చేస్తున్నది ఎవరి మీద?’ అని అడిగాడు రాజు.  

తను తెచ్చిన అన్నపు పళ్లెం మీద కప్పిన తువాలు తీశాడు అబునువాస్‌. వెంటనే మూడు ఈగలు ఎగిరిపోయాయి. ‘వీటి మీదే నా ఫిర్యాదు’ అన్నాడు అబునువాస్‌ ఆ ఈగలను చూపిస్తూ. రాజుకి నవ్వు వచ్చింది. ‘ఈగల మీదా నీ ఫిర్యాదు? సరే. నన్ను ఏం చేయమంటావో చెప్పు’ అన్నాడు.  ‘చట్టంప్రకారం నాకు న్యాయం చెయ్యమంటున్నాను. ఈగల్ని దండించడానికి మీరు నాకు అనుమతి ఇవ్వాలి. అంతే ప్రభూ’ అన్నాడు అబునువాస్‌. ‘భేష్‌.. ఈగలను దండించటానికి నీకు అనుమతి ఇచ్చాను. ఈగలు ఎక్కడ కనిపించినా నీ ఇష్టం వచ్చినట్టు దండించు’ అన్నాడు రాజు నవ్వుతూ. రాజుగారు ఈ తీర్పుని ఒక కాగితం మీద కూడా రాసి సంతకం చేసి అబునువాస్‌కి ఇచ్చాడు.      

అబునువాస్‌ ఈగలను దండించటానికి పెద్ద దుడ్డుకర్ర చేయించాడు. ఆ కర్ర చివర గట్టి ఇనుప పొన్ను వేయించాడు. ఎక్కడ ఈగ కంటబడితే అక్కడ కర్రతో కొట్టేసేవాడు. బజారుకు వెళ్లినప్పుడు  ఖర్జూరపు పళ్ల బుట్టల మీద ఈగలు వాలటం చూసి దుడ్డుకర్ర విసిరేవాడు. పళ్లన్నీ చితికిపోయేటట్టు కర్రతో బాదేవాడు. అంగడివాళ్లు ‘ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు?’ అని గదమాయించి అడిగితే ‘నేనేమీ మీ పళ్లను కొట్టటం లేదయ్యా! వాటి మీద వాలిన ఈగల్నే దండిస్తున్నాను’ అని జవాబు చెప్పి రాజుగారు ముద్రవేసి ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూపించేవాడు. వాళ్లు ‘ఇదేం మేళంరా!’ అనుకుంటూ ఊరుకునేవాళ్లు. ఇట్లా కొన్ని రోజులు గడిచాయి. అబునువాస్‌ వెర్రి చేష్టలకు విసుక్కునేవాళ్లు విసుక్కుంటున్నారు. నవ్వుకునేవాళ్లు నవ్వుకుంటున్నారు. రాజుగారు కూడా ఈ వింత చేష్టలన్నీ విని విరగబడి నవ్వాడు. 

చివరకు ఒకనాడు రాజుగారు రాజసభలో తీర్పులు చెబుతున్నాడు. అబునువాస్‌ కూడా వెళ్లి రాజుగారికి దగ్గరగా కూర్చున్నాడు. రాజుగారు ఏదో నేరాన్ని విచారణచేశాడు. గంభీరంగా తీర్పు చెబుతుండగా రాజుగారి వీపు మీద ఈగ వాలింది. చటుక్కున తన దుడ్డుకర్రతో రాజుగారి వీపు మీద గట్టిగా బాదాడు అబునువాస్‌. అతని ఆ చర్యకు సభంతా ఘొల్లుమంది. అబునువాస్‌ను చుట్టుముట్టి గట్టిగా పట్టుకున్నారు. రాజుగారిని కొట్టినందుకు అతనిని శిక్షించాలని పట్టుబట్టారు. 

‘అబునువాస్‌.. ఏమిటీ పిచ్చి? రాజుగారిని కొడతావా?’ అని అధికార్లు అబునువాస్‌ మీద మండిపడ్డారు.  జంకుగొంకు లేకుండా అబునువాస్‌ ‘నేను తప్పేం చేయలేదే? నన్ను శిక్షించడం న్యాయంకాదు. నేను రాజుగారి వీపు మీద వాలిన ఈగను కొట్టానుగాని, రాజుగారిని కొట్టలేదు. రాజుగానే ఈగల్ని చంపటానికి నాకు అనుమతి ఇచ్చారు’ అని చెప్పాడు. రాజుగారు స్వయంగా సంతకం చేసి ఇచ్చిన అనుమతి పత్రం జేబులోంచి తీసి అందరికీ చూపించాడు. ఇంకేం మాట్లాడతారు? అతను చెప్పిందంతా నిజమే. అతనిని నిర్దోషిగా వదలక తప్పిందికాదు. ‘వెధవ ఈగలకి తగిన శాస్తి జరిగింది. అవి నా ఇంట్లో ప్రవేశించి దౌర్జన్యంగా నా సొమ్మును తీసుకోటానికి ఎందుకు ప్రయత్నించాలి?’ అన్నాడు అబునువాస్‌.

మరోసారి ఇంకో విచిత్రమైన సంగతి జరిగింది. పట్నంలో ఒక భాగ్యవంతుడైన వర్తకుడు మేకమాంసం వండించి మంచి విందు తయారు చేస్తున్నాడు. విందు భోజనం వండేటప్పుడు ఒక బిచ్చగాడు అక్కడ ఏమి జరుగుతూందో చూద్దామని వచ్చాడు. పాపం.. వాడు కాస్త దూరంగా వంటలు తయారుచేసే చోటు నుంచి వచ్చే ఘుమఘుమలాడే ఆ గాలిని పీల్చుకుంటూ  కూచున్నాడు. వాసనే ఇంత కమ్మగా ఉంటే ఆ భోజనం ఇంకెంత రుచిగా ఉంటుందోనని విందు గురించి ఊహించుకోసాగాడు. అయితే ఆ ధనవంతుడు, ఆ బిచ్చగాడికి పిడికెడు అన్నం కూడా పెట్టించలేదు. మరునాడు ఆ వర్తకుడు కనిపించినప్పుడు  ‘అయ్యా.. మీరెంత మంచివారో.. మీ వంట పందిరి దగ్గరైనా నన్ను కూచోనిచ్చారు! మీ విందులోని పసందైన మేకమాంసం కూరల కమ్మని వాసన పీల్చేటప్పటికే నాకు సంతృప్తిగా భోజనం చేసినట్టయింది’ అన్నాడు. 

‘సరి..సరి.. అందుకేనేమో నిన్న మా మేకమాంసం రుచీపచీ లేకుండా పోయింది. ఆ కమ్మని వాసనంతా నువ్వే పీల్చేసి ఉండాలి సందేహం లేదు’ అన్నాడు వర్తకుడు. అంతటితో ఊరుకోక రాజు వద్దకు వెళ్లి తన మేకమాంసం కూరల కమ్మని వాసనంతా అపహరించుకుపోయాడని బిచ్చగాడి మీద అన్యాయంగా ఫిర్యాదు చేశాడు. రాజు.. వర్తకుల  పక్షపాతి కాబట్టి అతడు చెప్పిన ఫిర్యాదు నమ్మి ఆ నేరం చేసినందుకు బిచ్చగాడు పన్నెండు వెండి నాణాలు ఆ వర్తకుడికి ఇచ్చి తీరాలని తీర్పు చెప్పాడు. బిచ్చగాడి చేతిలో పైసా లేదు. పాపం ఏడుస్తూ వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తు వాడికి అబునువాస్‌ ఎదురుపడ్డాడు. రాజుగారి అన్యాయపు తీర్పు సంగతి చెప్పాడు.

అబునువాస్‌ జాలిపడి ‘నేను నీకు సాయం చేస్తాను దిగులుపడకు. నీ అప్పు తీర్చిపారెయ్యటానికి రేపు ఉదయం కలుసుకుందాంలే’ అని ధైర్యం చెప్పాడు. మరుసటి దినం అబునువాస్‌ బిచ్చగాడితో సహా రాజసభకు వెళ్లాడు. వర్తకుడు కూడా తన పైకాన్ని తీసుకోటానికి వచ్చాడు. అబునువాస్‌ వర్తకుణ్ణి చూసి ‘నీ డబ్బు చెల్లిస్తే పుచ్చుకోటానికి సిద్ధంగా ఉన్నావయ్యా?’ అని అడిగాడు. ‘ఆ సిద్ధంగానే ఉన్నాను. ఇవ్వండి’ అన్నాడు వర్తకుడు. అబునువాస్‌ పన్నెండు వెండి నాణాలు తీసి బిచ్చగాడి చేతికిచ్చాడు.

‘ఇదిగో.. వీటిని భూమి మీద పడెయ్యి’ అన్నాడు అబునువాస్‌. అట్లాగే బిచ్చగాడు ఆ నాణాల్ని నేల మీద పడేశాడు. అవి రాతి నేల మీద పడగానే గణగణమని మోగాయి. ‘విన్నావా? ఆ నాణాల టింగు టింగు మోత!’ అన్నాడు అబునువాస్‌. ‘ఆ విన్నాను..’ చెప్పాడు వర్తకుడు. ‘ఆ వెండినాణాల్లో నీకు రావలసిన భాగం ఆ టింగ్‌ టింగే. తీసుకో’ అన్నాడు అబునువాస్‌. ‘నీ భోజనం కమ్మదనం వాసన చూసినంత మాత్రాన నువ్వు నష్టపోతే ఆ బిచ్చగాడి డబ్బు గణగణ ధ్వని నువ్వు విన్నావు గనుక అది నీకు ముట్టినట్టే. ఇక వెళ్లు’ అన్నాడు అబునువాస్‌. అతను చెప్పిన న్యాయం ప్రకారం బిచ్చగాడు వర్తకుడికి పన్నెండు కాసులూ చెల్లించినట్టే అని రాజుగారు కూడా ఒప్పుకున్నారు. తగాదా తీరిపోయింది. 

(‘వేటగాడి కొడుకు ఇతర విదేశ కథలు’ సంకలనం నుంచి)

చదవండి: బాలల దినోత్సవం 2021: బొమ్మలతో ఆటలాడుకునే వయసులో.. ఎన్నెన్ని ఘనతలో..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement