లోపలి దర్శకుడు | Ingmar Bergman's greatest film artist | Sakshi
Sakshi News home page

లోపలి దర్శకుడు

Published Sun, Jul 13 2014 1:06 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

లోపలి దర్శకుడు - Sakshi

లోపలి దర్శకుడు

మూవీ కెమెరా కనుక్కున్నాక,భూమ్మీద జన్మించినఅతిగొప్ప సినిమా కళాకారుడు ఇన్మార్ బెర్గ్‌మన్ !
 
 ప్రపంచంలోని మేటి దర్శకులెందరో తమకు స్ఫూర్తిగా పేర్కొనే మహాదర్శకుడు ఇన్మార్ బెర్గ్‌మన్! ‘మూవీ కెమెరా కనుక్కున్నాక, భూమ్మీద జన్మించిన అతిగొప్ప సినిమా కళాకారుడు బెర్గ్‌మన్,’ అంటాడు దర్శకుడు వూడీ అలెన్.
 మృత్యువు, అస్తిత్వం, నైతిక చింతన, దైవం, నిరాశ, ఒంటరితనం, కలలు, గతించిన యౌవనం, పశ్చాత్తాపం, వాంఛ లాంటి బలమైన భావనల్ని అజరామరంగా తెరకెక్కించాడు బెర్గ్‌మన్. తత్వోద్వేగాల సంక్లిష్ట సమ్మేళనంలాంటి ఆయన చిత్రాలకు సినిమా ప్రేమికులు పాఠ్యగ్రంథాల స్థాయినిస్తారు.

 మనిషి అంతరంగపు అరాచకత్వాన్ని తక్కువ బడ్జెట్‌తో, పద్ధతిగా, ఏడాదికొక సినిమాగా మలుస్తూపోయాడు బెర్గ్‌మన్. సుమారు 45 సినిమాలు! హాలీవుడ్‌ని పట్టించుకోకుండా, తన మాతృదేశం స్వీడన్‌కే పరిమితమవడానికి కారణం, లాభనష్టాలు బేరీజు వేయనక్కర్లేని సృజనాత్మక స్వేచ్ఛ! తొలుత రంగస్థలంలో పనిచేసి, స్వయంప్రకాశంతో సినిమాల్లోకి వచ్చాడు. వింటర్ లైట్, సెవెన్త్ సీల్, వైల్డ్ స్ట్రాబెర్రీస్, పర్సోనా, క్రైస్ అండ్ విస్పర్స్, మెజీషియన్, సెలైన్స్, ఫ్యానీ అండ్ అలెగ్జాండర్, త్రూ ఎ గ్లాస్ డార్కీ... తమ జీవితకాలంలో అలాంటి ఒక్క సినిమానైనా తీయాలని సృజనశీలురు కలలుగనే క్లాసిక్స్!

‘మా ఇంటి పెద్ద కిటికీలోంచి వచ్చే సూర్యోదయాన్ని నేను ‘వినేవాణ్ని’. దూరంగా మోగుతున్న చర్చి గంటల నేపథ్యంలో నాకు వెలుతురు వినిపించేది,’ అంటాడు తన బాల్యంలో దృశ్యానికి ఆకర్షితుడైన తీరును గురించి  బెర్గ్‌మన్. పూర్తి సానుకూలంగా లేని చిన్నతనంలో ఆయన్ని భయం, సోమరితనం, నిరాశ, కోపం లాంటి దయ్యాలే ఎక్కువగా పలకరించేవి. ‘ఎప్పుడైతే దయ్యం వాస్తవమో, దానికొక మానవస్పృహ అద్దడం అత్యవసరమైపోతుంది!’ ఒక చిన్న దృశ్యం, ఒక పలకరింపు, ఒక మనిషిపట్ల కలిగే ఉద్వేగం, ఒకరు చెప్పే సంఘటన, ఒక మనిషి ముఖం... అదేదైనా కావొచ్చు, అందులోంచి గుర్తింపునకు రాగలిగే బీజాన్ని ఆయన వృక్షంగా పెంపుచేసేవాడు. మళ్లీ దాన్ని పదాలుగా, వాక్యాలుగా కాగితంలోకి రూపాంతరం చెందించి, తిరిగి ఆ అక్షరాల్ని దృశ్యాలుగా ఆవిష్కరించేవాడు. అయితే, టెక్నికల్ వివరాలు, లాంగ్ షాట్, క్లోజప్ లాంటి మాటలు స్క్రిప్టులో రాయడం ‘బోర్’ అనేవాడు. రాయకుండానే అందులోని రిథమ్  అర్థం చేసుకోవడం సరైందనేవాడు.

 పరిమితమైన అవసరాలతో, పరిమితమైన స్థలంలో జీవించిన బెర్గ్‌మన్... షూటింగుకు కూడా పూర్తి పరిచిత, పరిమిత వాతావరణం సృష్టించుకునేవాడు. నటీనటులుగానీ, సాంకేతిక నిపుణులుగానీ ఆయనకు దాదాపుగా అందరూ ‘రెగ్యులర్సే’. గున్నార్ జోర్న్‌స్ట్రాండ్, మాక్స్ వాన్ సిడో, గన్నెల్ లిండ్‌బ్లోమ్, ఇంగ్రిడ్ తులిన్, లివ్ ఉల్‌మాన్, బీబీ ఆండర్సన్, హారియెట్ ఆండర్సన్, స్వెన్ నైక్విస్ట్(కెమెరామన్)... ఆయన సినిమాలన్నింటా దాదాపుగా ఈ పేర్లే పునరావృతం అవుతాయి. బృందానికి తల్లిలాంటి ఆదరణతో టీ, లంచ్ సర్వ్ చేయడానికి ఒకామెను నియమించుకుని, ఆమె పేరు కూడా టైటిల్స్‌లో వేసేవాడు. అందుకే, ఒక సందర్భంలో, ‘నేను పద్దెనిమిది మంది స్నేహితులతో పనిచేస్తాను,’ అన్నాడాయన. దానివల్ల, మళ్లీ కొత్తగా ప్రారంభించాల్సిన పనిలేదు! ఇలాగైతే ఒక ఆర్టిస్టిక్ కంట్రోల్ ఉంటుందని ఆయన ఉద్దేశం!

 సినిమాను సాహిత్యపు స్థాయికి తెచ్చిన బెర్గ్‌మన్ చిత్రంగా సాహిత్యాన్ని సినిమాగా తీయడాన్ని ఇష్టపడలేదు. అవి రెండూ భిన్నమాధ్యమాలనేవాడు. కానీ తను రాసే స్క్రిప్టును మాత్రం పూర్తిస్థాయి రచనలాగే చేసేవాడు. ఎదుటివారికి అర్థంకావడానికి అంతకంటే మార్గంలేదనేవాడు. చెప్పలేనివి కూడా అర్థం చేయించగలిగే ప్రత్యేక కోడ్ ఉంటే బాగుండేదని కూడా తలపోశాడు. అయినా భాషా పరిమితిని దాటి ఆయన ప్రపంచానికి చేరువయ్యాడు. అయితే, విజయానికి ప్రత్యేక విలువ లేకపోయినా, విజయం గొప్పతనం ఏమిటంటే, అది మనల్ని మనలా ఉండనిస్తుందన్నాడు.

 దేవుడివల్ల కాదు, మనిషికి ప్రేమవల్లే విముక్తి దొరుకుతుందని విశ్వసించిన బెర్గ్‌మన్ సినిమాలు ఎవరికి వారు తమ దేహాన్ని నగ్నంగా చూసుకున్నంత ఆశ్చర్యంగా, గొప్పగా, చిత్రంగా, మురికిగా ఉంటాయి. అందుకే ఆయన్ని ఇష్టపడుతున్నానని ఎవరైనా ప్రత్యేకంగా చెప్పడంలో అర్థంలేదు; అది తమను తాము ఇష్టపడుతున్నామని చెప్పుకోవడమే!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement