Film artist
-
Maya Nelluri: కళల్లో రాణించాలన్నదే నా కల!
మాయా నెల్లూరి ఫిల్మ్ ఆర్టిస్ట్. రణరంగం, తిమ్మరుసు చిత్రాలలోనూ అనగనగా (వెబ్‌సీరీస్), కృష్ణ ఘట్టంలో కథానాయికగానూ నటించింది. చిత్రకారిణి.. పురాణేతిహాసాల మూలాంశాలతో ఆకట్టుకునే పెయింటింగ్స్ వేస్తుంది. రైటర్.. ‘స్టార్ స్టైల్ ’ పేరుతో 80 ఏళ్ల సినిమా తారల ఫ్యాషన్స్‌ని పుస్తకం రూపంలో తీసుకువచ్చింది. సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకున్న మాయా నెల్లూరి హైదరాబాద్ అమ్మాయి. మల్టీటాలెంటెడ్ గర్ల్‌గా పేరుతెచ్చుకున్న ఈ హార్టిస్ట్ను కలిసినప్పుడు గలగలా నవ్వుతూ సినిమాయే తన ప్రపంచమని, సాధించాలనుకుంటున్న కలల గురించి ఎన్నో విశేషాలను ఇలా మన ముందుంచింది...‘మా అమ్మానాన్నలు నేను జాబ్ చేయాలనుకున్నారు. నా ఇష్టం మాత్రం సినిమా రంగం వైపే ఉంది. అమ్మ న్యూజిలాండ్‌లో ఆప్తమాలజిస్ట్. దీంతో చిన్నప్పుడే మా కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిరపడి΄ోయింది. న్యూజిలాండ్‌లోనే సైకాలజీలో డిగ్రీ చేశాను. సినిమా అంటే ఉన్న ఇష్టంతో అమ్మ వాళ్లను ఒప్పించి తిరిగి హైదరాబాద్ వచ్చేశాను. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. సౌత్ స్కోప్ మ్యాగజైన్‌కు ఆర్టికల్స్ రాసేదాన్ని. అక్కణ్ణుంచే నాకు సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా, సినిమాలోనూ నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. స్టార్స్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ‘ఐడియల్ బ్రెయిన్’కి రైటర్‌గానూ ఉన్నాను.80 ఏళ్ల ‘స్టార్ స్టైల్’బామ్మల కాలం నుంచి వింటున్న కథానాయికల ఫ్యాషన్‌ని ఒక చోట కూర్చితే బాగుంటుందనుకున్నాను. తెలుగు సినిమా ఆన్‌స్క్రీన్ ఫ్యాషన్ గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే ‘స్టార్ స్టైల్’ బుక్ బాగా ఉపయోగపడుతుంది. సినీతారల ఫ్యాషన్, వారి స్టైల్స్ గురించి తెలుసుకోవడం, సేకరణకు నాలుగైదేళ్ల సమయం పట్టింది. ఈ రీసెర్చ్కోసం 1930ల కాలం నుంచి వచ్చిన తెలుగు సినిమాలు, హీరోయిన్ల ఇంటర్వ్యూలు చూశాను, చదివాను. ఫొటోగ్రాఫర్స్, డైరెక్టర్స్‌తో మాట్లాడాను. అలా 2012 వరకు తారల స్టైల్స్ తీసుకున్నాను. నాటి తారల్లో వాణిశ్రీ ఫ్యాషన్ అల్టిమేట్ అనిపించింది. ఆన్‌స్క్రీన్ లుక్ కోసం ఆవిడ చాలా ఎఫర్ట్ పెట్టేది అనిపించింది.‘పురాణేతిహాసాల’ పెయింటింగ్స్నా పెయింటింగ్స్‌లో స్పిరిచ్యువాలిటీ ఎక్కువ. అమ్మ సబిత ఆధ్యాత్మికత నాలో అలాంటి పెయింటింగ్స్ వేయడానికి ప్రేరణ కలిగిస్తుంది అనుకుంటాను. కాలేజీ రోజుల నుంచి సోలో, గ్రూప్ ఎగ్జిబిషన్స్‌లో నా చిత్రాలు ప్రదర్శిస్తున్నాను. కాస్మిక్ పవర్, శివ– శక్తికి సంబంధించిన పెయింటింగ్స్ ఎక్కువ వేస్తుంటాను. బ్యాక్‌గ్రౌండ్‌లో సంస్కృత మంత్రాలతో నాదైన మార్క్ కనిపిస్తుంటుంది. యాక్టర్ సాయిధరమ్ తేజ్‌కు, డైరెక్టర్ సుధీర్ వర్మ, ఈషారెబ్బా, మేఘా ఆకాష్, హరీష్ శంకర్.. మొదలైన వారికి పెయింటింగ్ వర్క్స్ చేసిచ్చాను. హైదరాబాద్‌లో సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘ఓమ్’, గ్రూప్ ఎగ్జిబిషన్ ‘జస్ట్ ఆర్ట్ షో’, ‘ది ఆర్ట్ ఎడిషన్’, ‘ఒర్కా’ వంటివి పేరు తెస్తే, ఆస్ట్రేలియా, చెన్నై, బెంగళూరులోనూ సోలో, గ్రూప్ ఎగ్జిబిషన్స్‌లో నా పెయింటింగ్స్ చాలా మందిని ఆకట్టుకున్నాయి. మైథా యాప్‌లో రెండు పురాణేతిహాస కథలకు డిజిటల్ డిజైన్ చేశాను.నటిగా నిరూపణకోవిడ్కు ముందు 2019లో ‘రణరంగం’ సినిమాలో నటించాను. ఆ తర్వాత వచ్చిన ‘తిమ్మరుసు’ కూడా మంచి పేరు తెచ్చింది. కోవిడ్ టైమ్‌లో రైటింగ్, పెయింటింగ్ మీద ఎక్కువ వర్క్ చేశాను. ఇప్పుడు ‘బచ్చన్’ సినిమాలో నటిస్తున్నాను. నా ఫోకస్ మొత్తం యాక్టింగ్, రైటింగ్ మీద ఉంది. ఒక మూవీ నుంచి మరో మూవీకి వెళ్లడం అంటే ఒక జాబ్ నుంచి మరో జాబ్‌కు వెళ్లడం లాంటిదే. అలా నన్ను నేను ట్యూన్ చేసుకుంటాను. ఆన్‌స్క్రీన్‌కు నా ఇతర వర్క్స్‌కి చాలా తేడా ఉంటుంది. కానీ, బెస్ట్ యాక్ట్రెస్‌గా నిరూపించుకోవాలన్నదే నా కల. అలాగే మంచి స్క్రిప్ట్ రైటర్ని అవ్వాలి. పెయింటింగ్స్‌లోనూ బెస్ట్ మార్క్ తెచ్చుకోవాలి. నాకు బాగా నచ్చితే మిగతా అందరికీ నచ్చుతుందని నమ్ముతాను. నేను పెట్టే ఎఫర్ట్ పెడుతుంటాను. ఆ రిజల్ట్ ఎలా వచ్చినా అంగీకరిస్తాను’’ అంటూ నవ్వుతూ తన మల్టీ వర్క్స్ గురించి వివరించింది ఈ హార్టిస్ట్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఫిల్మ్మేకర్లుగా మారిన హీరోయిన్లు ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
సక్సెస్ కోసం ఎన్నో అవమానాలు పడ్డాను..
-
గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన.. గోధూళి ఎర్రన.. ఆ పాటలో నటుడు ఎవరో తెలుసా?
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)\తూర్పుగోదావరి: ‘నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి..అవి కొత్తవి.. మెత్తవి.. కాలికి హత్తుకు పోయేవి’ అంటూ నాలుగు దశాబ్దాల క్రితం నాటి ఈ పాట నేటికీ సజీవంగానే ఉంటుంది. ఉర్రూతలూగిస్తుంది.. 1981లో విడుదలైన ముద్దమందారం సినిమాలోని ఈ పాట నాడు కుర్రకారు నోట జోరుగా వినిపించేది. రాజమహేంద్రవరానికి చెందిన జిత్‌మోహన్ మిత్ర పాడిన ఈ పాట ఆయనకు ఓ బ్రాండ్ ఇమేజి తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఈ నటగాయకునిలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. 52 ఏళ్ల క్రితం ఈయన సారథ్యంలో ప్రారంభమైన ఆర్కెస్ట్రా నేటికీ పాటల పల్లకీలో అభిమానులను ఊరేగిస్తూనే ఉంది. వచ్చే నెల 30వ తేదీకి 80 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ పాటల మాంత్రికుడిని రాజమహేంద్రవరం కిషోర్‌కుమార్‌గా పిలిచేవారు.. అలీతో.. వారసత్వ నేపథ్యం.. జిత్‌మోహన్ తండ్రి శ్రీపాద కృష్ణమూర్తి ప్లీడర్ గుమాస్తాగా పని చేస్తూ నాటకాల్లో నటించేవారు. ఆయనకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. పెద్ద కుమారుడు పట్టాభి ఆ రోజుల్లోనే సినిమా రంగమంటే చెవికోసుకునే వారు. ఆదుర్తి నిర్మించిన ‘మూగమనసులు’ నుంచి తెరపై గోదావరి కనిపించడం వెనుక పట్టాభి ముద్ర ఎంతో ఉండేది. ఆయన ప్రభావమే జిత్‌మోహన్‌లోనూ కనిపించేది. జిల్లాలో ఏ సినిమా నిర్మించినా తెర వెనుక కీలక పాత్ర పోషించేవారు. ముఖ్యంగా లొకేషన్ల ఎంపికలో దర్శకునికి సహకరించేవారు. దర్శకుడు కె.విశ్వనాథ్ మొదలుకొని అందరూ రాజమహేంహేంద్రవరం రాగానే ఈయన్ను సంప్రదించేవారంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నగరంలో సినిమాలకు కేరాఫ్‌గా గుర్తింపు పొందారు. కె.విశ్వనాథ్‌తో.. ఆయన నోట.. కిషోర్‌కుమార్ పాట జిత్‌మోహన్ మిత్రకు పాటలంటే విపరీతమైన ఇష్టం. హిందీలో పాడే కిషోర్‌కుమార్ అంటే ప్రాణం. అందుకే చిన్నప్పటి నుంచీ ఆయన పాటలే ఎక్కువగా పాడేవారు. ఈ ఉత్సాహమే ఆయనను 1970లో ఓ ఆర్కెస్ట్రా పెట్టేలా చేసింది. నాటి నుంచి ఇప్పటి వరకూ ఆయన నేతృత్వంలోని ఆర్కెస్ట్రా రాష్ట్రంలోని అన్నిచోట్లా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆర్కెస్ట్రాలో ఈయన పాటల జోష్ చూసిన దర్శకుడు జంధ్యాల తన ముద్దమందారం సినిమాలో అవకాశమిచ్చారు. అందులో ఈయన పాడిన ‘షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి’ పాట సూపర్ హిట్ అయింది. ఎక్కడ పెళ్లిళ్లయినా ఆర్కెస్ట్రాలో ఈ పాట తప్పనిసరిగా వినిపించేది. సూత్రధారులు సినిమాలో.. తాను ప్రాణం కన్నా మిన్నగా భావించే కిషోర్‌కుమార్‌ను కలవా లని 1979లో ముంబయి వెళ్లారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డీ బర్మన్ ఆధ్వర్యంలో సినిమా పాటల రికార్డింగ్ చేస్తున్న సమయంలో దీర్ఘ నిరీక్షణ తర్వాత కిషోర్‌ను కలిశారు. తాను రాజమహేంద్రవరం నుంచి వచ్చానని చెప్పారు. ఆ ఊరెక్కడుందని కిషోర్ అడిగారు. వహీదా రహమాన్, జరీనా వహాబ్, జయప్రదల ఊరు అదేనని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. కిషోర్‌కుమార్ పాడిన పంటూస్ సినిమా లోని ఓ పాట పాడి వినిపించడంతో అచ్చం తనలాగే పాడుతున్నావంటూ ఆయన అభినందించడం నేటికీ తనకు సంతోషం కలిగిస్తుందంటారు జిత్. అభిరుచి.. ఉత్సాహం వయసు పెరిగినా ఆయనలో పాట ఉత్సాహం ఏమాత్రం సన్నగిల్లలేదు. ఆ గొంతులోనూ తేడా కనిపించదంటారు అభిమానులు. ఇప్పటికీ ఆర్కెస్ట్రా ద్వారా వేదికలపై గళం వినిపించడంలోనే ఆనందపడుతుంటారు. సంపాదన యావ ఏమాత్రం లేదు. కేవలం అభిరుచి మాత్రమే. అదే ముందుకు నడిపిస్తోంది. ‘2005లో జరిగిన మా ఆర్కెస్ట్రా స్వర్ణోత్స వాల వేడుకకు విశ్వనాథ్‌లాంటి రావడం ఎప్పటికీ మరువను. ఇప్పటి వరకూ 6 వేల ఆర్కెస్ట్రాలు ప్రదర్శించాం’ అని జిత్‌మోహన్‌మిత్ర చెప్పారు. తెర మీద.. న్యాయవాదిగా ఉంటూ, ఓపక్క ఆర్కెస్ట్రా నడుపుతూ, మరోపక్క సినిమాల నిర్మాణానికి తెరవెనుక పాత్ర పోషించే జిత్‌మోహన్ తెరముందుకు కూడా వచ్చారు. చిన్న పాత్రలే అయినా తనకు గుర్తింపు తెచ్చాయంటారాయన. విశ్వనాథ్ దర్శకత్వంలోని సప్తపదిలో ‘గోవుల్లు తెల్లన.. గోప య్య నల్లన.. గోధూళి ఎర్రన’ పాటలో ఓ పాప ను (ఆయన కుమార్తె సుబ్బలక్ష్మి) భుజాన ఎత్తు కుని సాగే సన్నివేశంలో కనిపించింది ఈయనే. మిత్ర తన కుమార్తెతో కలిసి ఆ పాటకు అభినయించారు. బాపు, కె.విశ్వనాథ్, బాలచందర్, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో నటించారు. శంకరాభరణం, సప్తపది, ఆనందబైరవి, చంటి, స్వాతికిరణం, సిరివెన్నెల, బొబ్బిలి బ్రహ్మన్న, మేఘసందేశం, సీతారత్నం గారి అబ్బాయి, సర్గమ్, సర్ సంగమ్ వంటి సుమారు 210 సినిమాల్లో నటించారు. రాజమహేంద్రవరం నేపథ్యంలోని 400 సినిమాలకు షూటింగ్ స్పాట్ల సహాయకుడిగా ఉన్నారు. ప్రముఖ సినీ నటుడు అలీ తెరంగేట్రం వెనుక కీలక భూమిక మిత్రాదే. జిత్ కుమార్తె సుబ్బలక్ష్మి తరువాత కూడా పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. -
కత్తి మహేష్ : ఎన్నో వివాదాస్పద అంశాలు..అయినా బెదరలేదు
‘‘శోధన, సాధన చేసిన జ్ఞానం మాత్రమే శాశ్వతమని నమ్ముతాను. నిరంతరం ప్రశ్నించుకుంటూ నిజాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.’’ అప్పటికి మూడు పదులు కూడా నిండని కత్తి మహేష్– బ్లాగ్ పరిచయంలో తన చూపుని అట్లా ప్రకటించుకున్నాడు. ఎలాంటి కాలమది!. పత్రికలు, టీవీలని దాటి కొత్త మాధ్యమాలు అవతరిస్తున్నాయి. ఆర్కుట్ మూత పడుతూ బ్లాగులు కళకళ లాడుతున్నాయి. అప్పటివరకూ సాహిత్యం, సమాజం పట్ల నిబద్ధత కలిగిన మేధా సమూహాల రచనలకి దీటుగా సమస్త భావజాలాల మేలిమి ఆలోచనలతో బ్లాగ్ ప్రపంచం విస్తరించింది. 2007 – 2012 కాలంలో తెలుగు బ్లాగుల్లో కుల మత, ప్రాంత, జెండర్ భావాల సైద్ధాంతికతని ఒంటిచేత్తో ప్రవేశ పెట్టినవాడు మహేష్. అతని ‘పర్ణశాల’ బ్లాగ్ – అర్ధ దశాబ్దపు విస్ఫోటనం. తమ అభిమాన హీరో మీద విమర్శ చేస్తేనో, తాము పూజించే దేవుడిని తార్కికంగా ప్రశ్నిస్తేనో అతను ఎదుర్కొన్న దాడులు ఇటీవలివి. ట్రోలింగ్ అన్నమాట సమాజానికి పూర్తిగా పరిచయం కాకముందే పలు ఆధిపత్య సమూహాల చేత ట్రోల్ చేయబడ్డాడు. వ్యభిచార చట్టబద్ధత, నగ్న దేవతలు, కుల గౌరవ హత్యలు, ప్రత్యేక తెలంగాణ, పశువధ – గొడ్డు మాంసం, భాష – భావం, వివాహానికి పూర్వం సెక్స్, వర్గీకరణ సమస్య, గే చట్టం, కశ్మీర్ అంశం మొదలుకుని అనేక వివాదాస్పద అంశాల్లో పది పద్నాలుగేళ్ళకి ముందే దాదాపు నాలుగైదు వందల పోస్టులు రాసాడు. మేధావులనబడేవారి పరిమిత వలయంలో తిరుగాడుతుండే అటువంటి అంశాలని, వాటిమీద తన ప్రశ్నలని మామూలు ప్రజల మధ్యకి తీసుకు వచ్చాడు. అందుకోసం ఆర్కుట్– బ్లాగ్– ఫేస్బుక్– ట్విట్టర్– ఇన్ స్టాగ్రామ్ మీదుగా విస్తరించుకుంటూ సినిమాలు, పార్లమెంటరీ రాజకీయాలు తన కార్యక్షేత్రాలుగా నిర్ణయించుకున్నాడు. ప్రశ్నని నేర్చుకుంటే దానికి చెల్లించాల్సిన మూల్యం ఎంతటిదో తెలిసాక కూడా ‘నువ్వు రాసింది చదివి, రావలసిన వారికి కోపం రాకపోతే, నీ మీద బెదిరింపులకు దిగకపోతే, నీ మీద హత్యా ప్రయత్నమైనా జరగకపోతే, నువ్వేం రాస్తున్నట్టు?‘ అనగలిగిన తెగువ మహేష్‌కి ఉంది. అవును అతను దళితుడు, కానీ అతనిది మాలిమి చేయడానికి అనువైన బాధిత స్వరం కాదు, అందరినీ దూరం పెట్టే ఒంటరి ధిక్కార స్వరమూ కాదు. మందిని కలుపుకు పోయే, అనేక వర్గాలతో చెలిమి చేయగల ప్రజాస్వామిక స్వరం. ఈ గొంతు దిక్కుల అంచుల వరకూ వినబడగలిగే శక్తి కలిగినది కాబట్టే అంతే తీవ్రతతో వ్యతిరేకత కూడా వచ్చింది. కులం మతం వంటి సున్నితమైన అంశాల మీద మాట్లాడినపుడు, అతడి తర్కానికి జవాబు ఇవ్వడం తెలీని వారు, వ్యక్తిగత దూషణలకు దిగినా సంయమనం కోల్పోకుండా ఓపిగ్గా విషయాన్ని వివరించడానికి ప్రయత్నించేవాడే తప్ప మాట తూలేవాడు కాడు. అసలది అతని నైజమే కాదు. మహేష్ కంటే ముందే పురాణపాత్రలను విమర్శించిన వారెందరో ఉన్నారు. కేవలం అతని దళిత అస్తిత్వాన్ని ఆధారంగా చేసుకుని అతని విమర్శలను అంగీకరించక విషం కక్కిన లోకానికి మహేష్ ఎన్నడూ జడవలేదు. తిరిగి విషమూ కక్కలేదు. తనదైన శైలిలో తన అభిప్రాయాలను చెపుతూనే ఉన్నాడు, మర్యాదగా విభేదించడం మహేష్ వద్ద చాలామంది మిత్రులు నేర్చుకున్న విషయం. బ్లాగుల్లో తనతో హోరాహోరీ వాదనలకు దిగిన వ్యక్తులు బయట కలిస్తే అత్యంత స్నేహపూరితంగా ఉండేవాడు. పరుషమైన మాటలతో వ్యక్తిగత దూషణలు చేసినవారు సైతం, అతని స్నేహస్వభావానికి కరిగి స్నేహితులుగా మారిపోయిన సందర్భాలు అనేకం. రాముడిని విమర్శించి నగర బహిష్కరణకు గురైన అతడు 2007 లోనే తన బ్లాగ్ పేరు ‘పర్ణశాల’గా పెట్టుకున్నాడు. ‘పర్ణశాల అంటే ఆకుల పందిరి. దానికింద కూచుని అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. చాయ్ ఉంటే ఇంకా... రాముడు కూడా అలాంటిది ఒకటి కట్టుకున్నాడన్నమాట‘ అనేవాడు సరదాగా. వేలాది పేజీల తన రాతలు ఒక్క పుస్తకంగా కూడా వేసుకోలేదు మహేష్. అసలు ఆ ఆలోచన ఉన్నట్లు కూడా ఎపుడూ కనపడలేదు. నిలవ ఆలోచనల మీద ఘర్షణ, వ్యక్తుల్లో మానసిక విలువల పెంపుదల జరిగి మానవ సంస్కారంలో అవి ఇంకిపోతే చాలని అనుకునేవాడేమో! మనుషుల పట్ల ఇంత అక్కర ఉన్నవారు అత్యంత అరుదు. సామాజిక మాధ్యమాల్లో ఎవరి పోరాటాలు వారివి, తలదూర్చితే తలనొప్పులని తప్పుకునే వారే ఎక్కువ. కానీ మహేష్‌కి అంతశక్తి ఎలా వచ్చేదో కానీ తిరిగి ఒకమాట అనలేని వారి పక్షాన, చర్చల్లో ఒంటరులైనవారు అలిసిపోయే సమయాన– వారి ప్రాతినిధ్య స్వరంగా నిలబడేవాడు. ఇది చాలామందికి అనుభవమైన విషయం. ఎవరనగలరు అతనికి మనుషుల మీద ద్వేషం ఉందని! ఉన్నదల్లా ప్రేమే. ఆ ప్రేమ వల్లనే నాకెందుకని ఊరుకోక ప్రతిసారీ ఓపిగ్గా చర్చకి దిగేవాడు, చర్చే నచ్చనివారికి అది వితండవాదం కావొచ్చు. కానీ సంభాషిస్తూనే ఉండడం ఒక అంబేడ్కరైట్ గా అతని ఆచరణ. మహేష్‌కీ అంబేడ్కర్‌కీ ఆచరణలో ఒక పోలిక కనపడుతుంది. వారిద్దరూ తాము ప్రాతినిధ్యం వహించిన పీడిత కులాల గురించి ఆలోచనలు చేసి వారి ఎదుగుదలకి పునాదులు సూచించి ఊరుకోలేదు. అక్కడ నిలబడి స్వేచ్ఛా సమానత్వాలతో కూడిన సవ్యమైన జాతి మొత్తం నిర్మాణం కావాలని ఆశించారు. అందుకోసం అంబేడ్కర్ చేసిన కృషి ఆయన్ని జాతి మొత్తానికి నాయకుడిగా నిలిపింది. మహేష్ ఆయన మార్గంలో వడిగా సాగుతుండగా విషాదం సంభవించింది. రచయిత, విమర్శకుడు, సినిమా నటుడు, గాయకుడు, సామాజిక వ్యాఖ్యాత, కార్యకర్త, రాజకీయ నాయకుడుగా ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కత్తి మహేష్. మరి నాలుగైదు దశాబ్దాలు ఉండవలసిన మనిషి, అసమాన త్యాగాలతో నిండిన సామాజిక చైతన్యానికి కొత్త చేర్పుని, కొత్త రూపుని కనిపెట్టగల ఆధునిక ప్రజా కార్యకర్త – పరుగు పందాన్ని అర్ధాంతరంగా ఆపి విశ్రాంతికై తన కలల పర్ణశాలకి మరలిపోయాడు. వేలాది పేజీలలో, వందలాది ఉపన్యాసాలలో అతను పొదిగిన ప్రశ్నలను అంది పుచ్చుకుని ఈ పరుగుని కొనసాగించడమే మనం చేయగలిగింది. కె.ఎన్. మల్లీశ్వరి, సుజాత వేల్పూరి (నటుడు, సినీ, సాహిత్య, సామాజిక విమర్శకుడు కత్తి మహేష్‌కు నివాళిగా) -
ఎంజాయ్ చేయడానికే జీవితం!
‘‘సినిమా ఆర్టిస్ట్ అయితే ఇరవై నాలుగు గంటలూ ఇతరుల దృష్టిలో ఉన్నట్టే లెక్క’’ అంటున్నారు త్రిష. ఇటీవల ఓ సందర్భంలో త్రిష మాట్లాడుతూ -‘‘నేను సినిమాల్లోకొచ్చిన కొత్తలో ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. షూటింగ్ విరామంలో పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేదాన్ని. ఆ తర్వాత నా ధోరణి మార్చుకున్నా. అందరితో స్నేహంగా మెలగడం మొదలుపెట్టాను. అన్ని ఉద్యోగాల్లా సినిమాలు కూడా ఓ ఉద్యోగమే అని అందరూ నాతో అనేవారు. కానీ, ఇతర ఉద్యోగాలకూ, దీనికీ చాలా తేడా ఉంది. మీరెంతైనా కష్టపడండి.. ఇతర ఉద్యోగాల ద్వారా ప్రసిద్ధి కాలేరు. అదే, సినిమా జాబ్ అనుకోండి... బోల్డంత పాపులర్ అవుతారు. నాకు, పాపులార్టీ ఇష్టం. అందుకే సినిమా పరిశ్రమలో ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఏ ఉద్యోగంలో అయినా ప్లస్సులూ, మైనస్సులూ ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నాయి. ఎప్పుడూ కొన్ని వేల కళ్లు మమ్మల్నే గమనిస్తూ ఉంటాయి. ఆ చూపుల్ని తప్పించుకోవడం అంత సులువు కాదు. సరదాగా హోటల్‌కెళితే, ‘త్రిష ఫలానా హోటల్‌కి ఎందుకు వెళ్లింది’ అంటూ కొత్త అర్థాలు తీసేస్తారు. ఒకేచోట కలిసి పని చేసేవాళ్లు... కలిసి సినిమాలకెళ్లినట్లుగానే, ఎవరైనా హీరోతో మేం వెళ్లామనుకోండి ‘వాళ్లిద్దరూ కలిసి సినిమా చూడటం వెనక కారణం ఏంటి’ అని అనుమానిస్తారు. అయినా ఫర్వాలేదు. వాటి ద్వారా కూడా కావల్సినంత పాపులార్టీ వచ్చేస్తుంది. అందుకే, వాటిని కూడా ఎంజాయ్ చేస్తుంటాను. అసలు జీవితం ఉన్నదే ఎంజాయ్ చేయడానికే కదా. అందుకే అప్పుడప్పుడూ ఫ్రెండ్స్‌తో విహార యాత్రలకు చెక్కేస్తాను. మా అమ్మయితే ‘నువ్వు విహార యాత్రలకు వెళ్లడానికి కావల్సిన డబ్బు సంపాదించడం కోసమే సినిమా నటి అయ్యావు’ అని ఆటపట్టిస్తుంటుంది’’ అని చెప్పారు. -
లోపలి దర్శకుడు
మూవీ కెమెరా కనుక్కున్నాక,భూమ్మీద జన్మించినఅతిగొప్ప సినిమా కళాకారుడు ఇన్మార్ బెర్గ్మన్ ! ప్రపంచంలోని మేటి దర్శకులెందరో తమకు స్ఫూర్తిగా పేర్కొనే మహాదర్శకుడు ఇన్మార్ బెర్గ్మన్! ‘మూవీ కెమెరా కనుక్కున్నాక, భూమ్మీద జన్మించిన అతిగొప్ప సినిమా కళాకారుడు బెర్గ్మన్,’ అంటాడు దర్శకుడు వూడీ అలెన్. మృత్యువు, అస్తిత్వం, నైతిక చింతన, దైవం, నిరాశ, ఒంటరితనం, కలలు, గతించిన యౌవనం, పశ్చాత్తాపం, వాంఛ లాంటి బలమైన భావనల్ని అజరామరంగా తెరకెక్కించాడు బెర్గ్మన్. తత్వోద్వేగాల సంక్లిష్ట సమ్మేళనంలాంటి ఆయన చిత్రాలకు సినిమా ప్రేమికులు పాఠ్యగ్రంథాల స్థాయినిస్తారు. మనిషి అంతరంగపు అరాచకత్వాన్ని తక్కువ బడ్జెట్‌తో, పద్ధతిగా, ఏడాదికొక సినిమాగా మలుస్తూపోయాడు బెర్గ్మన్. సుమారు 45 సినిమాలు! హాలీవుడ్‌ని పట్టించుకోకుండా, తన మాతృదేశం స్వీడన్‌కే పరిమితమవడానికి కారణం, లాభనష్టాలు బేరీజు వేయనక్కర్లేని సృజనాత్మక స్వేచ్ఛ! తొలుత రంగస్థలంలో పనిచేసి, స్వయంప్రకాశంతో సినిమాల్లోకి వచ్చాడు. వింటర్ లైట్, సెవెన్త్ సీల్, వైల్డ్ స్ట్రాబెర్రీస్, పర్సోనా, క్రైస్ అండ్ విస్పర్స్, మెజీషియన్, సెలైన్స్, ఫ్యానీ అండ్ అలెగ్జాండర్, త్రూ ఎ గ్లాస్ డార్కీ... తమ జీవితకాలంలో అలాంటి ఒక్క సినిమానైనా తీయాలని సృజనశీలురు కలలుగనే క్లాసిక్స్! ‘మా ఇంటి పెద్ద కిటికీలోంచి వచ్చే సూర్యోదయాన్ని నేను ‘వినేవాణ్ని’. దూరంగా మోగుతున్న చర్చి గంటల నేపథ్యంలో నాకు వెలుతురు వినిపించేది,’ అంటాడు తన బాల్యంలో దృశ్యానికి ఆకర్షితుడైన తీరును గురించి బెర్గ్మన్. పూర్తి సానుకూలంగా లేని చిన్నతనంలో ఆయన్ని భయం, సోమరితనం, నిరాశ, కోపం లాంటి దయ్యాలే ఎక్కువగా పలకరించేవి. ‘ఎప్పుడైతే దయ్యం వాస్తవమో, దానికొక మానవస్పృహ అద్దడం అత్యవసరమైపోతుంది!’ ఒక చిన్న దృశ్యం, ఒక పలకరింపు, ఒక మనిషిపట్ల కలిగే ఉద్వేగం, ఒకరు చెప్పే సంఘటన, ఒక మనిషి ముఖం... అదేదైనా కావొచ్చు, అందులోంచి గుర్తింపునకు రాగలిగే బీజాన్ని ఆయన వృక్షంగా పెంపుచేసేవాడు. మళ్లీ దాన్ని పదాలుగా, వాక్యాలుగా కాగితంలోకి రూపాంతరం చెందించి, తిరిగి ఆ అక్షరాల్ని దృశ్యాలుగా ఆవిష్కరించేవాడు. అయితే, టెక్నికల్ వివరాలు, లాంగ్ షాట్, క్లోజప్ లాంటి మాటలు స్క్రిప్టులో రాయడం ‘బోర్’ అనేవాడు. రాయకుండానే అందులోని రిథమ్ అర్థం చేసుకోవడం సరైందనేవాడు. పరిమితమైన అవసరాలతో, పరిమితమైన స్థలంలో జీవించిన బెర్గ్మన్... షూటింగుకు కూడా పూర్తి పరిచిత, పరిమిత వాతావరణం సృష్టించుకునేవాడు. నటీనటులుగానీ, సాంకేతిక నిపుణులుగానీ ఆయనకు దాదాపుగా అందరూ ‘రెగ్యులర్సే’. గున్నార్ జోర్న్‌స్ట్రాండ్, మాక్స్ వాన్ సిడో, గన్నెల్ లిండ్‌బ్లోమ్, ఇంగ్రిడ్ తులిన్, లివ్ ఉల్మాన్, బీబీ ఆండర్సన్, హారియెట్ ఆండర్సన్, స్వెన్ నైక్విస్ట్(కెమెరామన్)... ఆయన సినిమాలన్నింటా దాదాపుగా ఈ పేర్లే పునరావృతం అవుతాయి. బృందానికి తల్లిలాంటి ఆదరణతో టీ, లంచ్ సర్వ్ చేయడానికి ఒకామెను నియమించుకుని, ఆమె పేరు కూడా టైటిల్స్‌లో వేసేవాడు. అందుకే, ఒక సందర్భంలో, ‘నేను పద్దెనిమిది మంది స్నేహితులతో పనిచేస్తాను,’ అన్నాడాయన. దానివల్ల, మళ్లీ కొత్తగా ప్రారంభించాల్సిన పనిలేదు! ఇలాగైతే ఒక ఆర్టిస్టిక్ కంట్రోల్ ఉంటుందని ఆయన ఉద్దేశం! సినిమాను సాహిత్యపు స్థాయికి తెచ్చిన బెర్గ్మన్ చిత్రంగా సాహిత్యాన్ని సినిమాగా తీయడాన్ని ఇష్టపడలేదు. అవి రెండూ భిన్నమాధ్యమాలనేవాడు. కానీ తను రాసే స్క్రిప్టును మాత్రం పూర్తిస్థాయి రచనలాగే చేసేవాడు. ఎదుటివారికి అర్థంకావడానికి అంతకంటే మార్గంలేదనేవాడు. చెప్పలేనివి కూడా అర్థం చేయించగలిగే ప్రత్యేక కోడ్ ఉంటే బాగుండేదని కూడా తలపోశాడు. అయినా భాషా పరిమితిని దాటి ఆయన ప్రపంచానికి చేరువయ్యాడు. అయితే, విజయానికి ప్రత్యేక విలువ లేకపోయినా, విజయం గొప్పతనం ఏమిటంటే, అది మనల్ని మనలా ఉండనిస్తుందన్నాడు. దేవుడివల్ల కాదు, మనిషికి ప్రేమవల్లే విముక్తి దొరుకుతుందని విశ్వసించిన బెర్గ్మన్ సినిమాలు ఎవరికి వారు తమ దేహాన్ని నగ్నంగా చూసుకున్నంత ఆశ్చర్యంగా, గొప్పగా, చిత్రంగా, మురికిగా ఉంటాయి. అందుకే ఆయన్ని ఇష్టపడుతున్నానని ఎవరైనా ప్రత్యేకంగా చెప్పడంలో అర్థంలేదు; అది తమను తాము ఇష్టపడుతున్నామని చెప్పుకోవడమే!