ఎంజాయ్ చేయడానికే జీవితం!
‘‘సినిమా ఆర్టిస్ట్ అయితే ఇరవై నాలుగు గంటలూ ఇతరుల దృష్టిలో ఉన్నట్టే లెక్క’’ అంటున్నారు త్రిష. ఇటీవల ఓ సందర్భంలో త్రిష మాట్లాడుతూ -‘‘నేను సినిమాల్లోకొచ్చిన కొత్తలో ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. షూటింగ్ విరామంలో పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేదాన్ని. ఆ తర్వాత నా ధోరణి మార్చుకున్నా. అందరితో స్నేహంగా మెలగడం మొదలుపెట్టాను. అన్ని ఉద్యోగాల్లా సినిమాలు కూడా ఓ ఉద్యోగమే అని అందరూ నాతో అనేవారు. కానీ, ఇతర ఉద్యోగాలకూ, దీనికీ చాలా తేడా ఉంది. మీరెంతైనా కష్టపడండి.. ఇతర ఉద్యోగాల ద్వారా ప్రసిద్ధి కాలేరు. అదే, సినిమా జాబ్ అనుకోండి... బోల్డంత పాపులర్ అవుతారు. నాకు, పాపులార్టీ ఇష్టం. అందుకే సినిమా పరిశ్రమలో ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఏ ఉద్యోగంలో అయినా ప్లస్సులూ, మైనస్సులూ ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నాయి.
ఎప్పుడూ కొన్ని వేల కళ్లు మమ్మల్నే గమనిస్తూ ఉంటాయి. ఆ చూపుల్ని తప్పించుకోవడం అంత సులువు కాదు. సరదాగా హోటల్‌కెళితే, ‘త్రిష ఫలానా హోటల్‌కి ఎందుకు వెళ్లింది’ అంటూ కొత్త అర్థాలు తీసేస్తారు. ఒకేచోట కలిసి పని చేసేవాళ్లు... కలిసి సినిమాలకెళ్లినట్లుగానే, ఎవరైనా హీరోతో మేం వెళ్లామనుకోండి ‘వాళ్లిద్దరూ కలిసి సినిమా చూడటం వెనక కారణం ఏంటి’ అని అనుమానిస్తారు. అయినా ఫర్వాలేదు. వాటి ద్వారా కూడా కావల్సినంత పాపులార్టీ వచ్చేస్తుంది. అందుకే, వాటిని కూడా ఎంజాయ్ చేస్తుంటాను. అసలు జీవితం ఉన్నదే ఎంజాయ్ చేయడానికే కదా. అందుకే అప్పుడప్పుడూ ఫ్రెండ్స్‌తో విహార యాత్రలకు చెక్కేస్తాను. మా అమ్మయితే ‘నువ్వు విహార యాత్రలకు వెళ్లడానికి కావల్సిన డబ్బు సంపాదించడం కోసమే సినిమా నటి అయ్యావు’ అని ఆటపట్టిస్తుంటుంది’’ అని చెప్పారు.