మాయా నెల్లూరి
‘స్టార్ స్టైల్’ బుక్ లాంచింగ్ సందర్భంగా
మాయా నెల్లూరి ఫిల్మ్ ఆర్టిస్ట్. రణరంగం, తిమ్మరుసు చిత్రాలలోనూ అనగనగా (వెబ్‌సీరీస్), కృష్ణ ఘట్టంలో కథానాయికగానూ నటించింది. చిత్రకారిణి.. పురాణేతిహాసాల మూలాంశాలతో ఆకట్టుకునే పెయింటింగ్స్ వేస్తుంది. రైటర్.. ‘స్టార్ స్టైల్ ’ పేరుతో 80 ఏళ్ల సినిమా తారల ఫ్యాషన్స్‌ని పుస్తకం రూపంలో తీసుకువచ్చింది. సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకున్న మాయా నెల్లూరి హైదరాబాద్ అమ్మాయి. మల్టీటాలెంటెడ్ గర్ల్‌గా పేరుతెచ్చుకున్న ఈ హార్టిస్ట్‌ను కలిసినప్పుడు గలగలా నవ్వుతూ సినిమాయే తన ప్రపంచమని, సాధించాలనుకుంటున్న కలల గురించి ఎన్నో విశేషాలను ఇలా మన ముందుంచింది...
‘మా అమ్మానాన్నలు నేను జాబ్ చేయాలనుకున్నారు. నా ఇష్టం మాత్రం సినిమా రంగం వైపే ఉంది. అమ్మ న్యూజిలాండ్‌లో ఆప్తమాలజిస్ట్. దీంతో చిన్నప్పుడే మా కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిరపడి΄ోయింది. న్యూజిలాండ్‌లోనే సైకాలజీలో డిగ్రీ చేశాను. సినిమా అంటే ఉన్న ఇష్టంతో అమ్మ వాళ్లను ఒప్పించి తిరిగి హైదరాబాద్ వచ్చేశాను. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. సౌత్ స్కోప్ మ్యాగజైన్‌కు ఆర్టికల్స్ రాసేదాన్ని. అక్కణ్ణుంచే నాకు సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా, సినిమాలోనూ నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. స్టార్స్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ‘ఐడియల్ బ్రెయిన్’కి రైటర్‌గానూ ఉన్నాను.
80 ఏళ్ల ‘స్టార్ స్టైల్’
బామ్మల కాలం నుంచి వింటున్న కథానాయికల ఫ్యాషన్‌ని ఒక చోట కూర్చితే బాగుంటుందనుకున్నాను. తెలుగు సినిమా ఆన్‌స్క్రీన్ ఫ్యాషన్ గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే ‘స్టార్ స్టైల్’ బుక్ బాగా ఉపయోగపడుతుంది. సినీతారల ఫ్యాషన్, వారి స్టైల్స్ గురించి తెలుసుకోవడం, సేకరణకు నాలుగైదేళ్ల సమయం పట్టింది. ఈ రీసెర్చ్‌కోసం 1930ల కాలం నుంచి వచ్చిన తెలుగు సినిమాలు, హీరోయిన్ల ఇంటర్వ్యూలు చూశాను, చదివాను. ఫొటోగ్రాఫర్స్, డైరెక్టర్స్‌తో మాట్లాడాను. అలా 2012 వరకు తారల స్టైల్స్ తీసుకున్నాను. నాటి తారల్లో వాణిశ్రీ ఫ్యాషన్ అల్టిమేట్ అనిపించింది. ఆన్‌స్క్రీన్ లుక్ కోసం ఆవిడ చాలా ఎఫర్ట్ పెట్టేది అనిపించింది.
‘పురాణేతిహాసాల’ పెయింటింగ్స్
నా పెయింటింగ్స్‌లో స్పిరిచ్యువాలిటీ ఎక్కువ. అమ్మ సబిత ఆధ్యాత్మికత నాలో అలాంటి పెయింటింగ్స్ వేయడానికి ప్రేరణ కలిగిస్తుంది అనుకుంటాను. కాలేజీ రోజుల నుంచి సోలో, గ్రూప్ ఎగ్జిబిషన్స్‌లో నా చిత్రాలు ప్రదర్శిస్తున్నాను. కాస్మిక్ పవర్, శివ– శక్తికి సంబంధించిన పెయింటింగ్స్ ఎక్కువ వేస్తుంటాను. బ్యాక్‌గ్రౌండ్‌లో సంస్కృత మంత్రాలతో నాదైన మార్క్ కనిపిస్తుంటుంది. యాక్టర్ సాయిధరమ్ తేజ్‌కు, డైరెక్టర్ సుధీర్ వర్మ, ఈషారెబ్బా, మేఘా ఆకాష్, హరీష్ శంకర్.. మొదలైన వారికి పెయింటింగ్ వర్క్స్ చేసిచ్చాను. హైదరాబాద్‌లో సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘ఓమ్’, గ్రూప్ ఎగ్జిబిషన్ ‘జస్ట్ ఆర్ట్ షో’, ‘ది ఆర్ట్ ఎడిషన్’, ‘ఒర్కా’ వంటివి పేరు తెస్తే, ఆస్ట్రేలియా, చెన్నై, బెంగళూరులోనూ సోలో, గ్రూప్ ఎగ్జిబిషన్స్‌లో నా పెయింటింగ్స్ చాలా మందిని ఆకట్టుకున్నాయి. మైథా యాప్‌లో రెండు పురాణేతిహాస కథలకు డిజిటల్ డిజైన్ చేశాను.
నటిగా నిరూపణ
కోవిడ్‌కు ముందు 2019లో ‘రణరంగం’ సినిమాలో నటించాను. ఆ తర్వాత వచ్చిన ‘తిమ్మరుసు’ కూడా మంచి పేరు తెచ్చింది. కోవిడ్ టైమ్‌లో రైటింగ్, పెయింటింగ్ మీద ఎక్కువ వర్క్ చేశాను. ఇప్పుడు ‘బచ్చన్’ సినిమాలో నటిస్తున్నాను. నా ఫోకస్ మొత్తం యాక్టింగ్, రైటింగ్ మీద ఉంది. ఒక మూవీ నుంచి మరో మూవీకి వెళ్లడం అంటే ఒక జాబ్ నుంచి మరో జాబ్‌కు వెళ్లడం లాంటిదే. అలా నన్ను నేను ట్యూన్ చేసుకుంటాను. ఆన్‌స్క్రీన్‌కు నా ఇతర వర్క్స్‌కి చాలా తేడా ఉంటుంది. కానీ, బెస్ట్ యాక్ట్రెస్‌గా నిరూపించుకోవాలన్నదే నా కల. అలాగే మంచి స్క్రిప్ట్ రైటర్‌ని అవ్వాలి. పెయింటింగ్స్‌లోనూ బెస్ట్ మార్క్ తెచ్చుకోవాలి. నాకు బాగా నచ్చితే మిగతా అందరికీ నచ్చుతుందని నమ్ముతాను. నేను పెట్టే ఎఫర్ట్ పెడుతుంటాను. ఆ రిజల్ట్ ఎలా వచ్చినా అంగీకరిస్తాను’’ అంటూ నవ్వుతూ తన మల్టీ వర్క్స్ గురించి వివరించింది ఈ హార్టిస్ట్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment