మహిమా మక్వానా.. తెలుగు సినీ అభిమానులకు కొత్తేం కాదు. ‘వెంకటాపురం’, ‘మోసగాళ్లు’ చిత్రాలతో ఆమె తెలుగు తెరకు ఎప్పుడో పరిచయమైంది! ఇప్పుడు వెబ్ సిరీస్‌లతో మరింత చేరువైంది.
మహిమా పుట్టిపెరిగిందంతా ముంబైలోనే! మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ చేసింది. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తండ్రి చనిపోవడంతో.. మహిమా చిన్నప్పుడే ఆర్థిక బాధ్యతలను మోయాల్సి వచ్చింది.
పదేళ్ల వయసులోనే నటిగా మారింది.. టీవీ సీరియల్స్, కమర్షియల్స్‌లో నటిస్తూ! ‘బాలికా వధు’, ‘మిలే జబ్ హమ్ తుమ్’ వంటి సీరియల్స్ బాలనటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
మహిమా .. టీవీ సీరియల్స్ సెట్స్ మీదే చదువుకుంది. ఆమె తల్లి మాటల్లో చెప్పాలంటే మహిమాకు ఇల్లు, బడి, గుడి అన్నీ అవే! ఇంకా చెప్పాలంటే ఆమె సీరియల్స్ సెట్స్ మీదే పెరిగింది.
కథానాయికగా మహిమా కనిపించిన తొలి సీరియల్ ‘సప్నే సుహానే లడక్‌పన్ కే’. దీంతో ఆమె దేశమంతా పాపులర్ అయింది. ఎన్నో అవార్డులు అందుకుంది. తర్వాత ‘సీఐడీ’, ‘ఆహత్’, ‘కోడ్ రెడ్’, ‘ప్యార్ తూనే క్యా కియా’, అధూరీ కహానీ హమారీ’, ‘శుభారంభ్’ వంటి సీరియల్స్‌లోనూ నటించింది. తన పాపులారిటీని వెండితెర కూడా గమనించేలా చేసుకుంది.
మొదటి అవకాశంలోనే సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అదే ‘అంతిమ్’ మూవీ. ఆమె ‘ధడ్కనే మేరీ’, ‘తేరా బాత్ ఔర్ హై’ వంటి మ్యూజిక్ వీడియోస్‌లోనూ అభినయించింది.
‘ఫ్లెష్’ అనే సిరీస్‌తో వెబ్ దునియాలోకీ అడుగుపెట్టింది. ప్రస్తుతం ‘షో టైమ్’ అనే సిరీస్‌తో అలరిస్తోంది. నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మీ నటించిన ఈ సిరీస్‌లో మహిమా కూడా ప్రధాన భూమిక పోషించింది. ఇది డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.
'టీవీ, సినిమా.. ఇప్పుడు ఓటీటీ.. ఇవే నా లోకం! గ్లామర్.. పర్‌ఫార్మెన్స్.. రెండూ ఇష్టమే. రెండిటికీ స్కోప్ ఉన్న రోల్స్ చేయాలి.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి.. ఇదే నా గోల్!’ – మహిమా మక్వానా
Comments
Please login to add a commentAdd a comment