శర్మిన్ సహగల్.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘హీరామండీ’ సిరీస్ చూసినవాళ్లు ఇట్టే గుర్తుపట్టేస్తారు.. ‘ఆలమ్‌జేబ్’ అని! అవును.. ఆ పాత్రలో మెప్పించడానికి చాలానే కష్టపడింది శర్మిన్. అయినా నెపోటిజమ్ కామెంట్స్, విమర్శలను ఎదుర్కోక తప్పలేదు. నెపోటిజమ్ ఏంటీ? అని కనుబొమలు ముడిపడ్డాయా? అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే!
శర్మిన్ పుట్టిపెరిగింది ముంబైలో. అమ్మ .. బేలా సహగల్.. ఫిల్మ్ ఎడిటర్ అండ్ డైరెక్టర్. నాన్న.. దీపక్ సహగల్.. ఫిల్మ్ ప్రొడ్యూసర్. శర్మిన్ సినిమా నేపథ్యం తల్లిదండ్రులతో కాదు తాత మోహన్ సహగల్ (దీపక్ వాళ్ల నాన్న. రేఖను బాలీవుడ్‌కి పరిచయం చేసింది ఈయనే!), మేనమామ.. సంజయ్‌లీలా భన్సాలీతో మొదలైంది. భన్సాలీ చెల్లెలే శర్మిన్ వాళ్లమ్మ బేలా. ఇప్పుడర్థమైంది కదా శర్మిన్ విషయంలో నెపోటిజమ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో!
తను ట్వల్త్ క్లాస్ వచ్చేవరకు డాక్టర్ కావాలనే కలలు కన్నది. ట్వల్త్ క్లాస్ సెలవుల్లో తన మేనమామ తీసిన ‘దేవ్‌దాస్’ సినిమాను చూసి షారూఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్‌ల నటనకు, తన మేనమామ స్టయిల్ ఆఫ్ మూవీ మేకింగ్‌కి ఫిదా అయిపోయి యాక్టర్ కావాలని నిశ్చయించుకుంది.
అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడే శర్మిన్‌లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్‌ని గుర్తించాడు భన్సాలీ. అందుకే మంగేశ్ హదావ్లే దర్శకత్వంలో జావేద్ జాఫ్రీ కొడుకు మీజాన్ జాఫ్రీ, శర్మిన్‌లను హీరోహీరోయిన్‌లుగా పరిచయం చేస్తూ ‘మలాల్’ అనే సినిమాను నిర్మించాడు. అందులో శర్మిన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ‘అతిథి భూతో భవ’లోనూ నటించింది. పలువురి ప్రశంసలు అందుకుంది.
న్యూయార్క్ వెళ్లి థియేటర్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో డిగ్రీ చదివింది. తిరిగొచ్చి సంజయ్‌లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరింది. అలా గోలియోంకీ రాస్‌లీలా రామ్‌లీలా, మేరీ కోమ్, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కాఠియావాడీ సినిమాలకు పనిచేసింది.
‘హీరామండీ’తో వెబ్ ప్రయాణం మొదలుపెట్టింది. మనీషా కోయిరాలా, సొనాక్షీ సిన్హా, రిచా చడ్డా, అదితీ రావ్ హైదరీ, ఫరీదా జలాల్ వంటి ఉద్దండులతో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అందుకే ‘ఆలమ్‌జేబ్’గా ఆమె నుంచి మరింత పెర్ఫార్మెన్స్‌ని ఆశించారు ప్రేక్షకులు. సీనియర్స్ ముందు శర్మిన్ తేలిపోయిందని నిరాశచెందారు. అయితే ఆ విమర్శలను పాజిటివ్‌గానే తీసుకుని తన ప్రతిభను మరింత మెరుగుపరచుకుంటుందని ఆమె అభిమానుల అభిప్రాయం.
సంజయ్‌లీలా భన్సాలీని నేను మామయ్య అని పిలవను. సర్ అనే పిలుస్తాను. దేవ్‌దాస్ సినిమా చూస్తే కానీ ఆయన టాలెంట్ ఏంటో తెలీలేదు. ఆ టాలెంటే నేను ఆయన్ని‘ సర్’ అని పిలిచేలా చేస్తోంది. ఆ లెజెండ్ నాకు మామయ్య అవడం నా అదృష్టం! – శర్మిన్ సహగల్
Comments
Please login to add a commentAdd a comment