‘జాబ్ కన్నా యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నట్టుంది. షారూఖ్ ఖాన్‌తో కలసి స్క్రీన్ మీద కనిపిస్తావన్నమాట’ అంటూ బాస్ ఎగతాళి చేశాడు. ‘గుండ్రటి మొహం.. అక్క, వదిన, పిన్ని పాత్రలకైతే పనికొస్తావ్. మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే!’ అని బాలీవుడ్ రిజెక్ట్ చేసింది. ఆమె ఇప్పుడు వండర్‌ఫుల్ యాక్ట్రెస్, రైటర్ అండ్ డైరెక్టర్‌గా సినిమా ప్రేక్షకుల, వెబ్ వీక్షకుల మన్ననలందుకుంటోంది. అన్నట్టు షారూఖ్ ఖాన్‌తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ బహుముఖ ప్రజ్ఞ పేరు.. నిధి బిష్ట్!
► ఢిల్లీలో పుట్టి, పెరిగింది. అమ్మ.. టీచర్. నాన్న.. ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఇద్దరూ తమ కూతురు డాక్టర్ కావాలని కలలు కన్నారు. వాళ్ల కోరిక మేరకు ఇంటర్‌లో బైపీసీలో జాయిన్ అయింది నిధి. కానీ రెండు రోజులకే అది తన నోట్స్ ఆఫ్ స్టడీ కాదనుకుంది. దాంతో కామర్స్ గ్రూప్‌కి మారింది. అదీ తనకు సరిపడదని గ్రహించి ఆ వెంటనే హ్యుమానిటీస్‌లోకి వెళ్లి సెట్ అయింది.
► ఇంటర్ తర్వాత .. జామియా మిలియా యూనివర్సిటీలో లా చేసింది. అక్కడ థియేటర్ వింగ్ ఇప్టా (ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్) చాలా యాక్టివ్. చిన్నప్పటి నుంచీ నిధికి నటనంటే ప్రాణం. అందుకే ‘లా’ కోసం ఆ యూనివర్సిటీని ఎంచుకుంది. తన అయిదేళ్ల లా కోర్స్‌లో ఇప్టాతోనే ఎక్కువ గడపింది నాటకాలు రాస్తూ.. వేస్తూ! ఆ ఆసక్తి, ఉత్సాహంతోనే లా అయిపోగానే పుణె వెళ్లింది అక్కడి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవడానికి. కానీ అందులో సీట్ రాలేదు. నిరాశతో మళ్లీ ఢిల్లీకి వచ్చేసి ఒక లా ఫర్మ్‌లో చేరింది.
► ఉద్యోగం చేస్తున్నప్పుడే ఒక నాటకంలో నటించే అవకాశం వచ్చింది నిధికి. ఉదయం 9 కల్లా ఆఫీస్‌కి చేరి.. అక్కడి నుంచి కోర్ట్.. మళ్లీ ఆఫీస్ అలా రాత్రి 9 వరకు పని చూసుకుని.. అక్కడి నుంచి నేరుగా థియేటర్ రిహార్సల్స్‌కి వెళ్లేదట. ఉదయం మూడు గంటల వరకు రిహార్సల్స్ చూసుకుని ఇల్లు చేరేది. అలా కొన్ని నెలల శ్రమానంతరం స్టేజ్ మీద నాటకం ప్రదర్శించే రోజు రానేవచ్చింది. నిధి తన బాస్‌నూ ఆహ్వానించింది. అతను ఆ రోజు చప్పట్లతో ఆమె ప్రతిభను ప్రశంసించాడు. కానీ మరుసటి రోజు ఆఫీస్‌లో పది పనులు చెప్పి .. సాయంకాలానికి డెడ్‌లైన్ ఇచ్చాడు. చేయలేకపోయింది నిధి. అప్పుడే ‘షారూఖ్ ఖాన్‌తో కలసి కనిపిస్తావన్నమాట’ అంటూ ఆ బాస్ కామెంట్ చేశాడు. ‘తప్పకుండా కనిపిస్తాను చూడండీ..’ అంటూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చింది నిధి.
► యాక్టింగ్ మీదే పూర్తి దృష్టి పెట్టాలని ముంబై చేరింది. కనీస అవసరాల కోసం p్చnజ్ఛ్చ3 అనే లీగల్ ఔట్‌సోర్సింగ్ సంస్థలో చేరింది. జాబ్.. ఆడిషన్సే లోకమయ్యాయి ఆమెకు. అయితే ఎక్కడికి వెళ్లినా రిజెక్షనే ఎదురైంది. అయినా అధైర్యపడలేదు. తన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ని బ్రేక్ చేసి ‘న్యూ బ్రెయిన్ థియేటర్ వోక్స్’ అనే బ్యానర్‌ని స్థాపించి ‘హూ లెట్ ద డాగ్స్ అవుట్’ అనే నాటకాన్ని డైరెక్ట్ చేసింది. అది చూసి యూట్యూబ్ చానెల్ ‘టీవీఎఫ్ (ద వైరల్ ఫీవర్ ) వీడియోస్’ ఫౌండర్ అరునాబ్ కుమార్ టీవీఎఫ్‌లో అవకాశం ఇచ్చాడు. అందులో ఆమె స్క్రిప్ట్ రైటర్‌గా, యాక్టర్‌గా, కాస్టింగ్ డైరెక్టర్‌గా మల్టిపుల్ రోల్స్‌ని పోషించింది. ఆ టాలెంట్ ఆమెకు ఇటు ఓటీటీ.. అటు సినిమాల్లో ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది. దేశమంతటా అభిమానాన్ని సంపాదించిపెట్టింది.
► క్రియెటివిటీకి బెంచ్ మార్క్ ఉండదనే కాన్ఫిడెన్స్ నాది. కాబట్టే ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా లైట్ తీసుకున్నా. వచ్చిన అవకాశంతో నేనేంటో నిరూపించుకున్నా! అందుకే ఆ రోజు రిజెక్ట్ చేసినవాళ్లే ఈ రోజు నాతో పనిచేయడానికి డేట్స్ అడుగుతున్నారు!
‘తుప్పాకీ’, ‘చాయ్ సుట్టా క్రానికల్స్’, ‘పర్మినెంట్ రూమ్మేట్స్’, ‘టీవీఎఫ్ పిచర్స్’, ‘ఉమ్రీకా’, ‘టీవీఎఫ్ ట్రిప్లింగ్’, ‘ఫిల్లోరి’, ‘బిష్ట్.. ప్లీజ్’, ‘పిఏ గాళ్స్’, ‘డ్రీమ్ గర్ల్’, ‘క్యూబికల్స్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’, ç‘ßోమ్ శాంతి’, ‘ఫోన్ బూత్’. ‘మామ్లా లీగల్ హై’ వంటి షోస్, సినిమాస్, సిరీస్‌కి కాస్టింగ్ డైరెక్టర్, రైటర్, డెరెక్టర్, యాక్టర్‌గా పనిచేసింది. టీవీఎఫ్‌లోనే.. షారూఖ్ ఖాన్ పాల్గొన్న ‘బేర్లీ స్పీకింగ్ విత్ అర్నబ్’ అనే షోకి నిధి మోడరేటర్‌గా వ్యవహరించి.. తన బాస్‌కి చెప్పినట్టు షారూఖ్ ఖాన్‌తో స్క్రీన్ కూడా షేర్ చేసుకుంది. – నిధి బిష్ట్.
ఇవి చదవండి: Cover Story: 'స్వేదవేదం'! చెమటచుక్కకు దక్కుతున్నదెంత?
Comments
Please login to add a commentAdd a comment