టైటిల్‌ని లైట్‌గా తీసుకుంటున్నారేం?!
టీవీక్షణం
సినిమాకైనా, సీరియల్‌కైనా టైటిల్ ప్రాణమనే చెప్పాలి. ప్రేక్షకుడిని మొదట కట్టిపడేసేది, ఆకర్షించేది, తన దగ్గరకు రప్పించుకునేది, చూసేందుకు ప్రోత్సహించేది అదే. అందుకే దానికంత ప్రాధాన్యత! అయితే ఈ మధ్య సీరియళ్లకి సినిమా పేర్లు తెచ్చి పెట్టేస్తున్నారు. మంచుపల్లకి, చక్రవాకం, చిన్నకోడలు, రాధాకళ్యాణం, పెళ్లినాటి ప్రమాణాలు, బృందావనం, అమ్మ, అన్నాచెల్లెళ్లు, అష్టాచెమ్మా, కలసివుంటే కలదు సుఖం, నువ్వేకావాలి, మూగ మనసులు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, బొమ్మరిల్లు, గోరింటాకు, సుందరకాండ... ఒక్కటి కాదు, దాదాపు అన్నీ సినిమా పేర్లే.
విచిత్రం ఏమిటంటే... కొన్నింటికి అసలు ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థమై చావదు. దేవత టైటిల్ చూసి హీరోయిన్‌ది దేవతలాంటి వ్యక్తిత్వమేమో అనుకుంటారంతా. కానీ ఆ హీరోయిన్‌లో కోపం, ఆవేశం, అపార్థం చేసుకోవడం లాంటి బోలెడు మైనస్‌లుంటాయి. ‘బానీ’ అనే డబ్బింగ్ సీరియల్‌కి ‘పవిత్రప్రేమ’ అని పేరు పెట్టారు. అదసలు ప్రేమకథే కాదు. ఓ అబ్బాయి హీరోయిన్‌ని ప్రేమిస్తాడు. అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్ అనుకుని ఆమె చెల్లెలిని పెళ్లాడతాడు. మోసం చేసి తనని అంటగట్టారంటూ ఆమెని ద్వేషిస్తాడు. హీరోయిన్‌ని భర్త మోసగించి వదిలేస్తాడు. ఆమె అతడికి బుద్ధి చెబుతుంది. ఎప్పటికో మారతాడు. ప్రేమ అనేది ఉన్నా... ఎవరూ ఎవరి కోసమూ త్యాగాలు చేసేంత పవిత్ర ప్రేమ లేదందులో.
అలాగే మమతల కోవెల. అనుకోని పరిస్థితుల్లో తన స్నేహితుడి చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు హీరో. అది అతడి తల్లికి నచ్చదు. కోడల్ని ద్వేషిస్తుంది. ఆమె అన్నయ్యేమో తన కూతురు ఉండాల్సిన స్థానాన్ని కాజేసిందన్న కోపంతో హీరోయిన్‌ని ముప్పుతిప్పలు పెడతాడు. ఆ తర్వాత కుట్రలు, కుతంత్రాలు, కన్నీళ్లతో బాగా సా...గు... తుం...ది. మమతలు, మమకారాలతో ఇల్లు నిండిపోయిన సన్నివేశమే కనిపించదు. మరి మమతల కోవెల అని ఎందుకన్నారో తెలియదు. అయితే అన్నీ అలానే ఉన్నాయని కాదు. కొన్ని కథకు తగ్గట్టుగానే ఉంటాయి. కానీ చాలావరకూ మాత్రం పేరు బాగుందని పెట్టేశారేమో అనిపిస్తోంది.
దానికి తోడు సినిమా పేర్లు తెచ్చి పెట్టడం వల్ల కొత్తదనాన్ని ఫీలయ్యే పరిస్థితి లేదు. ఒకప్పుడు మనిషి, ఎండమావులు, ప్రియసఖి, అన్వేషిత, కళంకిత, విధి, రుతురాగాలు, కలలతీరం, ఆగమనం అంటూ క్యాచీగా, కాస్త ఆసక్తికరంగా అనిపించే పేర్లు ఆలోచించి పెట్టేవారు. ఇప్పుడు కనీసం అలాంటివైనా పెట్టడం లేదు. వెండితెర మీదా అవే, బుల్లితెర మీదా అవే! మొదటి ఇంప్రెషన్ టైటిల్ వల్లే పడుతుందని తెలిసి కూడా ఎందుకు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారో... కాస్త కొత్తగా ఎందుకు ఆలోచించడం లేదో... వైవిధ్యభరితమైన పేర్లు ఎందుకు పెట్టడం లేదో ఏమో మరి!!