ఈ తోడు అవసరమే!
వాయనం
పెంపుడు జంతువుల పేరు చెబితేనే ముఖాలు చిట్లిస్తారు కొందరు. వాటికి చాకిరీ చేయలేం అంటారు. బోలెడంత ఖర్చు అని ఫీలవుతుంటారు. అయితే వీటితో నష్టం కంటే లాభమే ఎక్కువ.
భర్త ఆఫీసుకు వెళ్లిపోయాక, పిల్లలు స్కూలుకెళ్లిపోయాక... ఇంట్లో ఉండే మహిళలకు మంచి తోడు ఎవరైనా ఉంటారు అంటే, అవి పెంపుడు జంతువులే. ఇంట్లో ఓ కుక్కో, పిల్లో ఉంటే ఆ సందడే వేరు. ఇంట్లో ఓ కుక్క ఉంటే అంతకంటే పెద్ద రక్షణ మరొకటి ఉండదు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు, భర్త ఏ క్యాంపుకో వెళ్లి ఒంటరిగా పిల్లలతో ఉండాల్సి వచ్చినప్పుడు అదే పెద్ద సెక్యూరిటీ. నిజానికి పిల్లి కూడా బాగా మచ్చికవుతుంది, యజమాని పట్ల ప్రేమగా ఉంటుంది. కుక్కయితేనేమి, పిల్లి అయితేనేమి... ఏదో ఒక తోడును ఉంచుకోవడం మంచిదే.
పెట్‌ని పెంచమంటే... ఇన్ని పనుల్లో ఇదో పనా అని కొందరు మహిళలు విసుక్కుంటారు. నిజానికది పెద్ద పనేమీ కాదు. నేర్పిస్తే అవి కూడా క్రమశిక్షణ నేర్చుకుంటాయి. ఎక్కడ తినాలి, ఎక్కడ పడుకోవాలి, విసర్జన చేయాలనిపించినప్పుడు తమకు ఎలా తెలియజేయాలి వంటివన్నీ వాటికి నేర్పించవచ్చు. వ్యాక్సిన్లకు తప్ప పెద్ద ఖర్చూ ఉండదు. వాటికి పడనివి ఏమున్నాయో డాక్టర్‌ని అడిగి తెలుసుకుని, అవి తప్ప మిగతావన్నీ తినడం అలవాటు చేయవచ్చు. ఏ ఊరో వెళ్తే, పెట్ కేర్ సెంటర్లు ఉన్నాయి... పిల్లలకు క్రష్‌లు ఉన్నట్టుగా. నిర్ణీత రుసుము చెల్లించి, అక్కడ వదిలి వెళ్లవచ్చు.
ఆ మధ్య కెనడాలో ఓ వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోతే, పెంపుడు పిల్లి నీళ్ల బాటిల్ తెచ్చి ఆమె ముఖమ్మీద ఒంపి లేపింది. ఆస్ట్రేలియాలో ఓ అమ్మాయి వీల్ చెయిర్‌లోంచి జారి కొలనులో పడిపోతే, పెంపుడు కుక్క రోడ్డు మీద పోతున్న వ్యక్తిని తీసుకొచ్చింది. మన దేశంలోనే ఓ చిలుక ఇంటి నుంచి నగలు దోచుకుపోయిన దొంగలను పట్టించింది. ముంబైలో ఓ ఒంటరి మహిళ మీద ఎవరో అఘాయిత్యం చేయబోతే, పెంపుడు కుక్క అతడిని చీల్చి చెండాడింది.
ఇంత ఉపయోగం ఉన్నప్పుడు... కాసింత ఖర్చు, కొద్దిపాటి శ్రద్ధ పెట్టడానికి ఇబ్బంది పడితే ఎలా! ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఓ ‘పెట్’ తోడు ఎంతైనా అవసరం. ఓసారి ఆలోచించండి!