నాన్న తర్వాత నాన్న! | ofter father has to been every thing | Sakshi
Sakshi News home page

నాన్న తర్వాత నాన్న!

Published Sat, May 31 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

నాన్న తర్వాత నాన్న!

నాన్న తర్వాత నాన్న!

  రిలేషణం
 
సైఫ్ అలీఖాన్ చెల్లెలు అనగానే అందరికీ సోహా అలీఖాన్ గుర్తొస్తుంది. కానీ నిజానికి సైఫ్‌కి మరో చెల్లెలు కూడా ఉంది. సోహా కంటే ముందు పుట్టింది. సైఫ్‌తో చెల్లెమ్మా అని తొలిసారి పిలిపించుకుంది. ఆమె పేరు... సబా అలీఖాన్. సినీ ప్రపంచానికి దూరంగా ఉండటం వల్ల ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే... సైఫ్ గురించి ఆమెకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు!
 
 సఫ్ నాకంటే ఎనిమిదేళ్లు పెద్దవాడు. సోహా నాకంటే రెండేళ్లు చిన్నది. అంటే వాళ్లిద్దరికీ దాదాపు పదేళ్లు గ్యాప్. మొదట నేను పుట్టాను కాబట్టి అన్నయ్యకు నేనే మొదటి ఫ్రెండ్‌ని అని నేనంటాను. చిట్టి చెల్లెల్ని కాబట్టి అన్నయ్యకు తనంటేనే ఎక్కువ ప్రేమ అని సోహా మారాం చేస్తూంటుంది. నిజానికి అన్నయ్య ఇద్దరినీ సమానంగానే చూస్తాడు. ఇద్దరికీ ఒకేలా ప్రేమను పంచుతాడు.

 అన్నయ్యని ఒక్క మాటలో నిర్వచించమంటే... అన్నయ్య = ఎనర్జీ అంటాను నేను. చిన్నప్పట్నుంచీ తను ఎంత హుషారుగా ఉండేవాడంటే... ఒక్కక్షణం కుదురుగా ఉండేవాడు కాదు. మహా తుంటరివాడు. తనని కంట్రోల్ చేయలేక అమ్మ చాలా తంటాలు పడేది. పరుగులు తీస్తూ ఉంటే పట్టుకోలేక అవస్థ పడుతుండేది. ఎప్పుడు ఏ అల్లరి పని చేస్తాడో, దెబ్బలేమైనా తగిలించుకుంటాడేమో అని అమ్మానాన్నలు చాలా కంగారుపడేవారు. తనని చిన్నతనంలోనే యూకేలోని బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించేశారు. ఇక్కడ మా స్కూలుకి సెలవులు రాగానే అందరం యూకే వెళ్లిపోయేవాళ్లం. అన్నయ్యతో ఆనందంగా గడిపేవాళ్లం. తను స్కూల్లో క్రికెట్ ఆడుతుంటే చూసేవాళ్లం. సైట్ సీయింగ్‌కి వెళ్లేవాళ్లం. ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేను.

 అన్నయ్యలో నేను మొదట్నుంచీ ఒకటి గమనించాను. తనలో కలివిడితనం ఎక్కువ. కొత్త-పాత, తక్కువ-ఎక్కువ అని తేడాలుండవు. ఎవరైనా, ఎలాంటివారైనా సరే... వెంటనే కలిసిపోతాడు. స్నేహం చేస్తాడు. చాలామంది అన్నయ్యది దుందుడుకు స్వభావం అనుకుంటారు. మీడియావాళ్లు కూడా తన గురించి అలాగే రాస్తుంటారు. కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే... తనని ఎంతో విసిగిస్తే తప్ప అంత ఎక్కువగా రియాక్ట్ అవ్వడు తను. ఊరికే అవతలివారి మీద విరుచుకుపడే తత్వం కానే కాదు తనది. కాకపోతే రియాక్ట్ అయితే కాస్త ఎక్కువగా అవుతాడు కాబట్టి అలా అనిపిస్తాడంతే.

ఇండస్ట్రీలో అడుగు పెట్టాక చాన్నాళ్లు కష్టపడ్డాడు. అమ్మ ఒకప్పుడు టాప్ హీరోయిన్ అయినా, తన పేరు వాడుకోవాలని అనుకోలేదు. నిజానికి ఇండస్ట్రీలో అలాంటివి సాగవు కూడా. ఎవరి టాలెంట్ వారిదే. ఎవరి కెరీర్ వారిదే. బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన తేలికగా అవకాశాలు వచ్చేయవు. ఆ నిజం అన్నయ్యకు బాగా తెలుసు. అందుకే చాలా కష్టపడేవాడు. ఆ కష్టాన్ని కూడా ఎంజాయ్ చేసేవాడు. నాతో చాలా విషయాలు షేర్ చేసుకునేవాడు. కానీ సమస్యల గురించి ఎప్పుడూ చెప్పేవాడు కాదు. తనెప్పుడూ అంతే. ఎదుటివాళ్లు హ్యాపీగా ఫీలయ్యే విషయాలు మాత్రమే చెబుతాడు. అది తనలో నాకు బాగా నచ్చే మరో విషయం. తన ప్రతి సినిమా నేను చూస్తాను. తనకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడైతే గంతులు వేసేశాను.

 అన్నయ్య కూడా నాకు సంబంధించిన విషయాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తాడు. నేనేం చేస్తానన్నా ప్రోత్సహిస్తాడు. సోహాకి నటన మీద ఆసక్తి ఏర్పడి అటు వెళ్లింది కానీ... నాకెందుకో మొదట్నుంచీ ఇండస్ట్రీమీద ఆసక్తి లేదు. అసలు నటిని కావాలన్న ఆలోచనే ఎప్పుడూ నా మనసులోకి రాలేదు. వారసత్వంగా వచ్చిన కొన్ని కోట్ల ఆస్తుల్ని కాపాడే బాధ్యతను చిన్న వయసులోనే తీసుకున్నాను. ఆపైన నాకెంతో ఇష్టమైన ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టాను. ఫ్యాషన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నాను. ఏం చేసినా దాని వెనుక అన్నయ్య ఉన్నాడు.

ఇప్పుడు అన్నయ్యను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు నాతో పోట్లాడిన వ్యక్తేనా అనిపిస్తుంది. చాలా పరిణతితో ఆలోచిస్తున్నాడు. మాలో ఎవరికి ఏ అవసరం వచ్చినా పరిగెత్తుకు వస్తాడు. సమస్య వచ్చిందని చెబితే దాన్ని పరిష్కరించే వరకూ నిద్రపోడు. చాలా బాధ్యతగా వ్యవహరిస్తాడు. నాన్న తర్వాత నాన్నలా అనిపిస్తాడు. అలాంటి అన్న ఉంటే నేనేంటి... ఏ చెల్లెలయినా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement