పారా మోటారింగ్
సాక్షి, విశాఖపట్నం: పర్యాటకుల స్వర్గధామంగా వెలుగొందుతున్న విశాఖకు టూరిస్టుల తాకిడిని మరింతగా పెంచడానికి పర్యాటకశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం విశాఖకు వస్తున్న పర్యాటకుల సంఖ్యను మూడేళ్లలో రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పథకాలు సిద్ధం చేస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2.5 కోట్ల మంది పర్యాటకులు విశాఖ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ సంఖ్యను 2022 నాటికి 4.95 కోట్లకు పెంచడానికి పర్యాటక శాఖ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం మౌలిక సదుపాయాలను పెంచనుంది. ఇందులో భాగంగా దేశ, విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు అదనంగా 5 వేల గదులను పర్యాటక శాఖ సమకూర్చనుంది.
మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఆయా ప్రాంతా లకు వెళ్లేందుకు వీలుగా రోడ్లను పర్యాటక శాఖ ఇతర శాఖల చేయూతతో అభివృద్ధి చేయనుంది. కొత్త పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తేనుంది. ముఖ్యంగా సాహస క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా పారామోటార్ రైడింగ్, స్కూబా డైవింగ్, ట్రెక్కింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటి వాటిపై ఆసక్తి పెరిగేలా ఏర్పాట్లను విస్తృతం చేస్తున్నారు. పలు పర్యాటక ప్రదేశాల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు, స్నానపు గదులు, మంచినీటి సదుపాయాలు లేవు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి పర్యాటకులు అంతగా ఆసక్తి చూపడం లేదు.
వీటిని దృష్టిలో ఉంచుకుని అక్కడ కనీస సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీటితో పాటు విశాఖను ఆకర్షించడానికి ఈవెంట్లను కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నట్టు ఊదరగొట్టింది. విశాఖ ఉత్సవ్, భీమిలి ఉత్సవ్, యాటింగ్ ఫెస్టివల్, సౌండ్స్ ఆన్ సాండ్స్ వంటి వాటి కార్యక్రమాలు మొదలు కావడానికి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించడం మినహా ఆ కార్యక్రమాలు ఆశించిన ప్రయోజనం నెరవేద వెచ్చించి నిర్వహించినా నిధుల దుర్వినియోగమే తప్ప ఆశించినంతగా పర్యాటకులను ఆకట్టుకోలేకపోయింది.
బొర్రా గుహలు
గత ఏడాది విశాఖ ఉత్సవ్‌కు రూ.3.5 కోట్లు, అరకు బెలూన్ ఫెస్టివల్‌కు రూ.4 కోట్లు, యాటింగ్ ఫెస్టివల్‌కు రూ.4 కోట్లు, విశాఖ–అరకు మధ్య ట్రయిన్ స్టోరీకి రూ.5 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. అయితే వీటిలో విశాఖ ఉత్సవ్, అరకు బెలూన్ ఫెస్టివల్‌ను మాత్రమే నిర్వహిం చారు. మిగిలిన యాటింగ్ ఫెస్టివల్, ట్రయిన్ స్టోరీలు రద్దయ్యాయి. రూ.4 కోట్లు వెచ్చించిన అరకు బెలూన్ ఫెస్టివల్ ఆదరణ లేక అభాసు పాలయింది. ఇలా జనాదరణ లేని ఈవెంట్లకు కోట్లాది రూపాయలు చెల్లించి మంచినీళ్లలా ఖర్చు చేసింది. కోట్లు వెచ్చించి నిర్వహించే ఫెస్టివల్స్, ఈవెంట్లను సద్వినియోగం చేసి ఉంటే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగి ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నిర్దేశించుకున్న పర్యాటకుల సంఖ్య లక్ష్యం ఇలా..
2020 | 2021 | 2022 |
3,73,95,337 | 4,30,04,639 | 4,94,55,334 |
గత మూడేళ్లలో విశాఖకు వచ్చిన పర్యాటకుల సంఖ్య ఇలా...
2017 | 2018 | 2019 |
2,13,92,728 | 2,50,13,607 | 1,22,14,292 |
విశాఖ తీరంలో (మే వరకు) విదేశీ పర్యాటకులు
2017 | 2018 | 2019 |
92,958 | 95,759 | 41,753 |
Comments
Please login to add a commentAdd a comment