సంగమేశ్వరాన్ని పర్యాటకేంద్రంగా తీర్చిదిద్దుతాం
– త్వరలో గెస్టుహౌస్‌నిర్మాణం
– శ్రీశైలానికి టూరిజం బోటు ఏర్పాటు
శ్రీశైలం(జూపాడుబంగ్లా): సంగమేశ్వర క్షేత్రాన్ని పర్యాటకేంద్రంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. ఆదివారం ఆయన లింగాలగట్టు దిగువఘాటులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కృష్ణాపుష్కరాల నిర్వహణలో కర్నూలు జిల్లాప్రథమస్థానంలో నిలవటం హర్షించదగిన విషయమన్నారు. సంగమేశ్వరం పుష్కరఘాటు, లింగాల ఘాట్‌కు అత్యధిక భక్తుల రద్దీ ఉన్నా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ఇబ్బందులు పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడంతో జిల్లాకు ప్రథమ స్థానం లభించిందన్నారు. సంగమేశ్వరం క్షేత్రంలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఏపీ టూరిజం హోటల్‌ను అలాగే కొనసాగిస్తామన్నారు. త్వరలో ఓ గెస్టుహౌస్‌ను నిర్మించటంతోపాటు సంగమేశ్వరం నుంచి శ్రీశైలానికి టూరిజం బోటు ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మార్గమధ్యంలో అనువైన ప్రాంతాన్ని చూసుకొని భక్తులు సేదతీరేందుకు ఓ హోటల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పుష్కరాల విజయవంతానికి కషిచేయటంతో జిల్లాకు మంచి పేరొంచిదన్నారు. పుష్కరాల చివరి రోజున లింగాలగట్టులో ఆడపడచులకు సారె ఇవ్వనున్నట్లు తెలిపారు.