దేవుడు శాసించాడు | Special story about rajanikanth | Sakshi
Sakshi News home page

దేవుడు శాసించాడు

Published Sat, Mar 17 2018 1:15 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Special story about rajanikanth - Sakshi

ఇప్పుడు కొత్త ప్రిజ్‌లు వస్తున్నాయి. లోపల ఉంచినవి.. ఎన్నిరోజులైనా ఫ్రెష్‌గానే ఉంటాయట. అలాంటి ఒక ఫ్రిజ్‌.. హిమాలయాలు! అక్కడి నుంచి ఫ్రెష్‌గా రాబోతున్నాడు తలైవర్‌... ర.. జ.. నీ.. కాం.. త్‌!! దేశమంతా వెయిటింగ్‌. తమిళనాడంతా స్వెట్టింగ్‌! టెన్షన్‌ పీక్‌లో ఉంది. హిమాలయాలంత.. పీక్‌లో!

రజనీకాంత్‌ లైఫ్‌లో కష్టాలు పడి పైకొచ్చారు. సూపర్‌ స్టార్‌ అయ్యారు. ప్రతి కష్టంలోనూ ఆయనకు దేవుడో, దేవుడిలాంటి మనిషో తోడుగా ఉన్నారు. అవమానాలు ఎదురైనప్పుడు దేవుడు, ఆర్థికంగా నష్టపోయినప్పుడు దేవుడు. ఆరోగ్యం బాగోలేనప్పుడు దేవుడు. రాఘవేంద్రస్వామి అంటే ఆయనకు భక్తి. హిమాలయ ప్రాంతపు గురూజీలంటే గురి. అందుకే ఏటా హిమాలయాలకు వెళ్లి వస్తుంటారు. ఇప్పుడు అక్కడే గురు యోగిరాజ్‌ అమర్‌ జ్యోతీజీ మహారాజ్‌ సన్నిధిలో గడుపుతున్నారు.


ఎన్నికల వేడి ఉన్నా, లేకున్నా తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ మరుగుతూనే ఉంటాయి. ఆ రాజకీయాలు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ని కూడా.. ఆయన ప్రమేయం లేకుండానే ఎప్పుడూ మరిగించే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే మరిగిస్తే మరిగిపోయే మనిషి కాదు రజనీ! చుట్టూ ఎంత వేడైనా ఉండనివ్వండి, ఆయనెప్పుడూ కూల్‌ గానే ఉంటారు. ఇప్పుడు మరింత కూల్‌గా ఉండే హిమాలయాలలోకి రజనీ వెళ్లిపోయారు! కూల్‌! ‘శివాజీ’ సినిమాలో రజనీ పంచ్‌ డైలాగ్‌. కూలింగ్‌ గ్లాసెస్‌ని స్టెయిల్‌గా రెండు చేతుల్తో తీసి కళ్లకు పెట్టుకుంటూ అంటాడు.. ‘కూల్‌’ అని, అద్దాల్లోంచి చూస్తూ. ఎవర్ని చూసి అంటాడు కూల్‌ అని! తనని చూసి ఎవరైతే టెన్షన్‌ పడుతున్నారో వాళ్లను చూసి! ‘శివాజీ’ పదేళ్ల క్రితమే వచ్చింది. రజనీ మాత్రం ఇరవై ఏళ్లుగా ప్రత్యర్థుల వైపు చూసి ‘కూల్‌’ అని అంటూనే ఉన్నారు.

సినిమాల్లో ఆయనకెవరూ పోటీ కంటెస్టెంట్‌లు లేరు. ఉన్నది రాజకీయాల్లోనే. పాలిటిక్స్‌లో కూడా లీడర్లు రజనీని పోటీ అనుకున్నారు కానీ లీడర్లను రజనీ ఎప్పుడూ పోటీ అనుకోలేదు. వచ్చేస్తాడా! కొంప ముంచేస్తాడా! డీఎంకే, అన్నాడీఎంకేల డౌట్‌. అపోజిషన్‌తో చేతులు కలిపితే? అదీ ఆ పార్టీల డౌట్‌. అప్పుడు నవ్వేవాడు రజనీ. సేమ్‌ సినిమాలో నవ్వినట్టే.. ‘హహాహాహహా’ అని! నవ్వి, ‘కూల్‌’ అనే డైలాగ్‌ కొట్టేవాడు. అయినా రాజకీయాలు కూల్‌గా ఎందుకుంటాయి? ఉంటే అవి హిమాలయాలు అయి ఉండేవి. అప్పుడు రజనీ తమిళ హిమాలయాల్లోనే ఉండిపోయేవారు. అంత దూరం వెళ్లకుండా. చెన్నై నుంచి హిమాలయాలకు రెండువేల కిలోమీటర్ల దూరం. ఫ్లయిట్‌లో ఆరు గంటల ప్రయాణం. రజనీ అక్కడికి వెళ్లి వారం అయింది. ఇంకోవారం అక్కడే ఉంటారు.

అక్కడి మహావతార్‌ బాబాజీ గుహల్లో! ఆ గుహలు పలంపూర్‌లో ఉన్నాయి. పలంపూర్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది. ఏం చేస్తున్నారు రజనీ ఆ గుహల్లో?! ధ్యానంలోకి వెళ్లి దారులను శోధిస్తున్నారు. ఎక్కడికి వెళ్లే దారులవి? రాజకీయాల్లోకి! రాజకీయాల్లోకా!! తమిళనాడులో ఉన్నవేమిటి? రాజకీయాలు కాదా?! తమిళనాడులో మూడురోజుల క్రితం కూడా ఒక కొత్త పార్టీ  ఆవిర్భవించింది. ఆ పార్టీని పెట్టింది దినకరన్‌. దినకరన్‌ అనే పేరు పక్కన ఆవిర్భావం అనే మాట పెద్దది. ‘పుట్టుకొచ్చింది’ అనాలి. కానీ చాలా శ్రద్ధగా, భక్తిగా మదురైలో తన పార్టీ పేరును ప్రకటించాడు దినకరన్‌. ఆ భక్తి ‘అమ్మ’ జయలలిత మీద. ఆ శ్రద్ధ.. రాజకీయాల మీద. ఎంతో భక్తిశ్రద్ధలతో పార్టీకి ఆయన పెట్టుకున్న పేరు ‘అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం’.

అన్నాడీయెంకే నుంచి అలా గెంటేయగానే, ఇలా బయటికొచ్చి పార్టీ పెట్టేశాడు. అమ్మ క్యాండిడేట్‌గా, అమ్మలేని నియోజకవర్గం నుండి ఆర్కేనగర్‌ ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచాడు! తమిళనాడు ముఖ్యమంత్రికి గానీ, ఉపముఖ్యమంత్రికి గానీ రాజకీయాల్లోకి వచ్చేసిన కమలహాసన్‌ అంటే భయం లేదు. రాజకీయ పార్టీ పెట్టబోతున్న రజనీ అన్నా భయం లేదు. దినకరన్‌ అంటే ఉంది. తమిళనాడులో ఎప్పటికైనా సీఎం కాగలిగిన శక్తి.. శశికళకూ ఉంది, దినకరన్‌కూ ఉంది. వాళ్లిద్దరి వెనుకా ‘అమ్మ’ శక్తి ఉంది. దినకరన్‌ పార్టీ ప్రకటించిన మర్నాడే రజనీ అల్లుడు ధనుష్, రజనీ ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య.. రజనీ పెట్టబోయే పార్టీలో చేరతారని వార్త వచ్చింది. అయితే ఆ విషయానికి ఎవరూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

రాజకీయాల్లోకి రాకుండానే రజనీ ఇరవై ఏళ్ల పాటు రాజకీయాల్లో నలిగారు! వస్తారా? లేదా? అనే ప్రశ్నతో. ‘వస్తున్నాను’ అని ఇరవై ఏళ్ల తర్వాత, డిసెంబర్‌ 31న రజనీ ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు ఇంకొక ప్రశ్నతో ఆయన నలిగిపోతున్నారు. పార్టీ పెడతారా? లేదా? అని! హిమాలయాల నుంచి వచ్చీ రాగానే రజనీ, ఇంట్లోకి కూడా వెళ్లకుండా పార్టీ పేరు ప్రకటిస్తారని అంతా ఎదురుచూస్తున్నారు! అయితే ఆయన మాత్రం ఆ మాట చెప్పలేదు! అసలు ఏమాటా చెప్పలేదు. ‘తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తాం’ అని మాత్రం అన్నారు ఈ హిమాలయన్‌ ట్రిప్‌లో. 2021లో ఎలక్షన్స్‌. ఇంకా రెండేళ్ల సమయం ఉంది.

అయితే ఇంకా పేరే ఖరారు కాని పార్టీకి అది పెద్ద సమయమేం కాదు. దినకరన్‌ తన పార్టీ ప్రారంభించిన మదురైలోనే ఫిబ్రవరి నెలలో కమలహాసన్‌ తన ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీని స్థాపించారు. రజనీతో పోల్చి చూస్తే, కమల్‌ చాలా త్వరగా రాజకీయాల్లోకి వచ్చినట్లు! చాలా త్వరగా పార్టీ పెట్టినట్లు. ‘రాష్ట్రంలో పేదరికం లేకుండా చెయ్యడమే నా ధ్యేయం’ అంటున్నాడు కమల్‌. ఓ పేదవాడొచ్చి ఈ వ్యవస్థను కుప్పకూలుస్తా అని చాలెంజ్‌ చెయ్యడం అది! కమల్‌ దగ్గర క్యాష్‌ లేదు. తలా ఇంత వేసుకుని పార్టీ కార్యాలయాన్ని నడిపించుకునే పరిస్థితి. అయినా వచ్చాడు. ‘వస్తారా?’ అని రజనీని అడిగాడు. రజనీ నవ్వారు. ‘వస్తాను’ అన్నారు కానీ ‘నీతో వస్తాను’ అనలేదు.

అంటే.. రజనీ పార్టీ రాబోతోంది! రజనీ ఏదీ నేరుగా చెప్పరు. నవ్వుతూ చెప్తారు. నర్మగర్భంగా చెప్తారు. అలా కూడా చెప్పలేనప్పుడు ‘ఆ దేవుడు శాసిస్తాడు. ఈ అరుణాచలం పాటిస్తాడు’ అన్నట్లు చూపుడు వేలికీ, చిటికెన వేలికీ ఉన్న మధ్యవేళ్లు మడిచి సంకేతమిస్తారు! అయితే సంకేతాలను అర్థం చేసుకుని స్పందించే రాజకీయ పరిస్థితులు ఇప్పుడు తమిళనాడులో లేవు. ‘‘అవినీతి ఉంది. దాన్ని అంతమొందించడానికే వచ్చాను’’ అని క్లియర్‌ కట్‌గా అంటున్నాడు కమల్‌. ఎలాగైనాసరే ఈసారి అన్నాడీఎంకే పవర్‌ను కట్‌ చెయ్యాలని కరుణానిధి అండ్‌ సన్స్‌ క్యాడర్‌కు ఆల్రెడీ స్కెచ్‌ గీసి ఇచ్చారు.   ఇక సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం అయితే, బీజేపీ జాతీయభక్తికి దీటుగా ‘రాష్ట్రభక్తి’ని ప్రదర్శిస్తున్నారు.

గురువారం బడ్జెట్‌ ప్రసంగంలో పన్నీర్‌సెల్వం బీజేపీని నేరుగానే ఎటాక్‌ చేశారు. తమిళనాడులో ద్రవిడుల శకం అంతరించింది అని బీజేపీ నాయకులు అన్నమాటకు అది గట్టి జవాబు. ఎందుకు గట్టి జవాబు అయిందంటే.. ఎంజీ రామచంద్రన్, జయలలితలతో పాటు, తమ రాజకీయ ప్రత్యర్థి డీయంకేను కూడా కలుపుకుని.. ‘ద్రవిడుల పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది’ అని అన్నారు సెల్వం. నాయకులనేవాళ్లు ఇంత స్ట్రాంగ్‌గా ఉండాలి. దినకరన్‌లా స్ట్రెంగ్త్‌ లేకున్నా స్ట్రాంగ్‌గానే మాట్లాడాలి. అయితే రజనీ స్ట్రెంగ్త్‌ ఏపాటిదో ఇప్పటికీ బయటపడలేదు. అంతకన్నా ప్రమాదకరమైన సంగతి.. తమిళనాడు ప్రజలు గానీ, దేశంలోని రజనీ అభిమానులు గానీ ఆయన పెట్టపోయే పార్టీ కంటే కూడా.. ఏప్రిల్లో, ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోయే ఆయన సినిమాలు.. ‘కాలా’, ‘2 పాయింట్‌ ఓ’ కోసమే ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూడడం!

హిమాలయ ధ్యానంలో రజనీ కోరుకుంటున్న సాక్షాత్కారం ‘ఆధ్యాత్మిక రాజకీయం’. ఈమాట వింతగా ఉంటుంది. కానీ ఆయనే చెబుతున్నారు. ‘స్పిరుచువల్‌ పాలిటిక్స్‌’ని సాధనచెయ్యడానికి వచ్చానని! గత శనివారం ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్‌) ఎయిర్‌పోర్ట్‌లో దిగడంతో రజనీ హిమాలయ యాత్ర ఆరంభమయింది. ఈ వారం రోజుల యాత్రలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడినవి రెండే మాటలు. స్పిరుచువల్‌ పాలిటిక్స్, స్పిరుచువల్‌ గవర్నెన్స్‌. ఆ రెండు మాటలకూ కలిపి ఆయన ఒకే అర్థం చెప్పారు. శుభ్రమైన, ధర్మబద్ధమైన, వివక్షారహితమైన పాలన అని. మరికొంచెం వివరంగా చెప్పమని అడిగినప్పుడు.. ఆయన ఒకటే మాట చెప్పారు. ఎం.జి.రామచంద్రన్‌లా తమిళులను పరిపాలిస్తాను అని చెప్పారు.

కష్టాల్లో ఉన్నవాళ్లను దగ్గరకు తీసుకోవడం, నష్టాల్లో ఉన్నవాళ్లను పైకి లేపడం; పేదలకు, అనాధలను ఆదరించే సంస్థలకు ఆర్థిక సహాయం చెయ్యడం; విలయాలు, విపత్తు బాధితులకు అవసరమైన విరాళాల కోసం ‘సూపర్‌స్టార్‌’ ఇమేజ్‌ను ఉదారంగా వినియోగించడం.. ఇవన్నీ కూడా రాజకీయాలలో భాగమే అయితే.. రజనీ రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నట్లే.అయితే ఆయన ఇంకా చెయ్యొచ్చు! ‘బాషా’లా వేలెత్తి రాష్ట్రాన్ని శాసించవచ్చు. ‘బాబా’లా వేళ్లు మడిచి రాష్ట్రప్రజల్ని మెస్మరైజ్‌ చెయ్యొచ్చు. అలా చెయ్యాలంటే మాత్రం పార్టీ పెట్టాల్సిందే. ఎన్నికల్లో నిలబడాల్సిందే. హిమాలయ గుహల్లో రజనీ ధ్యాన యాత్ర ఇంకో వారం పాటు సాగుతుంది. ‘ధ్యానం’ సంతృప్తికరంగా పూర్తయితే ముందనుకున్న ప్రకారమే  ఈ నెల 24న చెన్నై తిరిగి వచ్చిన వెంటనే పార్టీ పేరును ప్రకటిస్తారు రజనీ.

               (గురువు అమర్‌ జ్యోతీజీ మహారాజ్‌తో హిమాలయ గుహల్లో రజనీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement