జర్నీ 2 హిమాలయాలు
ఆకాశాన్ని తాకే శిఖరాలు. పాపాయి కాళ్ల మువ్వల పట్టీల చప్పుడులా... ఆ శిఖరాలను ఒరుసుకుని గలగల పారే సెలయేర్లు. వాటిని తాకుతూ దూదిపింజల్లా తేలిపోయే వెండి మేఘాలు. మేఘాల మధ్యలోంచి నేలను పలకరించే సూర్యుడు. ఒక్కసారి ఊహించుకోండి! ఊహే ఇంత అద్భుతంగా ఉంటే... ఇంతటి అందాన్ని తన అణువణువునా నింపుకొన్న హిమాలయాలు ఇంకెంత అద్భుతమో కదా! అలా అబ్బురం చెందే... ఫొటోగ్రాఫర్ సత్యప్రసాద్ ఆ సమోన్నత శిఖరాలను తన కెమెరాలో పొదివి పట్టాడు. ‘షంగ్రి లా ది మిస్టిక్ ల్యాండ్‌స్కేప్’ పేరుతో హైదరాబాదీల కోసం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేవాడు. గోథెజంత్రమ్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 19 వరకు కొనసాగుతుంది.
స్వర్గసీమ...
‘2004లో మొదటిసారి హిమాలయాలకు వెళ్లాను. మొదటిసారి హిమాలయాలను చూసినపుడు నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. అక్కడున్న మైదానాలు, స్వచ్ఛమైన గాలి, చె ట్లు, వాతావరణం, తొలిసంధ్య ఇలా ప్రతీది అణువణువు పులకించిపోయేలా ఉంటుంది. అది మొదలు ఈ పదేళ్లలో ఎన్నిసార్లు హిమాలయాలకు వెళ్లానో నాకే తెలియదు. వె ళ్లిన ప్రతిసారి అదే ఆనందం, ఏదో తెలియని ఉద్వేగం. మానస సరోవరం, లడఖ్, స్పితి, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగాను. వెళ్లిన ప్రతి చోటా నా కెమెరాకు పని దొరికేది. ఎన్ని ప్రాంతాలు చూసినా నాకు అత్యంత ఇష్టమైనది లడఖ్. అదొక స్వర్గసీమ’ అంటున్నాడు ఫొటోగ్రాఫర్ సత్యప్రసాద్.
ఎస్.శ్రావణ్‌జయ / ఫొటోలు: దయాకర్