హిమగిరి సొగసులు..
కెమెరా క్లిక్‌మంటే ఒక సన్నివేశం దగ్గరగా కనిపిస్తుంది.. ఒక మనిషిని అందంగా చూపిస్తుంది. అయితే అదే కెమెరా ఫ్లాష్ ప్రకృతి ఒడిలో పడితే.. వచ్చే అవుట్‌పుట్.. ఇదిగో ఇలా అదిరిపోయేలా ఉంటుంది. ల్యాండ్‌స్కేప్ ఫొటోగ్రఫీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వెంకటగిరి రాయల్ ఫ్యామిలీకి చెందిన సత్యప్రసాద్ యాచేంద్ర. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కమిటీలో జోనల్ హెడ్‌గా వ్యవహరిస్తున్న ఆయనకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. తండ్రి మదన్‌గోపాల్ యాచేంద్రకు ఉన్న ఫొటోగ్రఫీ హాబీ సత్యప్రసాద్‌ను ల్యాండ్‌స్కేప్ ఫొటోగ్రఫీలో ల్యాండ్‌మార్క్‌లా నిలబడేలా చేసింది. ఆయన కెమెరా కన్నుగీటిన ఎన్నో ప్రకృతి దృశ్యాల్లో ఇదీ ఒకటి. ఈ ఛాయాచిత్రం గురించి ఆయన మాట ల్లోనే..
చిన్నప్పటి నుంచి సరదాగా ఫొటోలు తీసే అలవాటుంది. హిమాల య టూర్ వెళ్లాక నాలో సిసలైన ఫొటోగ్రాఫర్ బయటకు వచ్చాడు. 2004, 05, 07, 08 సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్‌లోని లడఖ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, టిబెట్‌లో పర్యటించాను. లడఖ్‌లోని ప్రక ృతి సోయగం నన్ను కట్టిపడేసింది. మంచు దుప్పటి కప్పుకున్న గిరులు, తరులను చూడగానే నా మనసు పులకరించింది. ఉషాకిరణాలు పరచుకున్న మంచుకొండలు.. వాటి పాదాల చెంతనే ఉన్న కొలనులో ప్రతిబింబించడం అద్భుతం. ఓ రెండు రోజులు ఆ ఏరియా అంతా చుట్టేశాను. టిబెట్‌లోని మానస సరోవరంలో భానుకిరణాల ఆలింగనంతో హిమన్నగం బంగారు పూత పూసుకున్నట్లు కనిపించింది. అప్పటి నుంచి ల్యాండ్‌స్కేప్ ఫొటోలు తీయాలనే సంకల్పం బలపడింది.
లడఖ్ దారిలో..
లడఖ్‌లోని పంగాంగ్‌సో సరస్సు చాలా ఫేమస్. ఈ సరస్సు 1/3వ వంతు భారత్‌లో, 2/3వ వంతు టిబెట్‌లో ఉంటుంది. దీన్ని మరోసారి చూసేందుకు 2008 జూలై 6న ఇద్దరు స్నేహితులతో కలసి బయల్దేరా. ఈసారి ఆ సరస్సు అందాలను మరింత అందంగా నా కెమెరాలో బంధించాలని నిర్ణయించుకున్నా. అయితే ఈ సరస్సుకు వె ళ్లే దారిలో ఉన్న పగల్ నాలా (మంచు కరగడం వల్ల వచ్చే నీటి కాలువ) ప్రవాహం ఉధృతంగా ఉండటంతో మా ప్రయాణానికి బ్రేక్‌పడింది. సాయంత్రం వరకు చుట్టుపక్కల ఉన్న స్పాట్స్ కవర్ చేశాం. మలి సంధ్య వేళలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. అస్తమిస్తున్న భానుడి కిరణాలు సోకి బంగారు వర్ణంలో మెరిసిపోతున్న గిరుల వరుసను క్షణం ఆలస్యం చేయకుండా నా కెమెరాతో క్లిక్ చేశా. ఆ ఫొటో ప్రింట్ తీసి చూసుకున్న క్షణం ఎప్పటికీ మరచిపోలేను. అంత లవ్లీగా వచ్చింది మరి.
టెక్నికల్‌గా...
అన్ని ఫొటోల్లాగే దీన్ని తీశాను. అయితే అప్పుడే తగ్గుతున్న లైటింగ్.. పల్చటి మబ్బులు పరచుకున్న ఆకాశం.. సూర్యకిరణాల ఫోకస్.. ఫొటోకు జీవాన్నిచ్చాయి. ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ ఈ ఫొటోకి హైలైట్. ఈ ఫొటో చూస్తే మొదట మన చూపు నీటి లో తేలియాడుతున్న గడ్డి మేటల నుంచి మొదలై అల్లంత దూరాన ఉన్న పర్వతాల వరకూ వెళ్తుంది. లైట్ అండ్ షాడో కలర్ కనబడుతుంది. ఈ ఫొటో కోసం నేను వాడిన కెమెరా నికాన్-డి-300. లెన్స్ 18 టు 200. సూపర్ వైడ్ జూమ్ 10 టు 20 మీటర్లు.
వన్ ఆఫ్ ది బెస్ట్స్..
లడఖ్‌లోని పంగాంగ్‌సో సరస్సు ఫొటో మాత్రమే కాదు, దీంతోపాటు లడఖ్, హిమాచల్, సిక్కింలలో క్లిక్ చేసిన మిగిలినవన్నీ నా కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్స్‌గా నిలిచినవే. ఈ ఫొటో చూసినప్పుడల్లా నాటి జ్ఞాపకాలు మళ్లీ కళ్లముందు కదలాడుతుంటాయి. ఈ ఫొటోలు www.sathyaprasad yachendra.com, www.facebook.com/sathyaprasad.yachendra లో చూడవచ్చు.
ప్రజెంటర్: వాంకె శ్రీనివాస్