ట్రావెల్ క్లిక్స్
ఫొటోగ్రఫీ ఓ అభిరుచి. కానీ... మనసుకు హత్తుకునే ఓ దృశ్యం కనిపించినప్పుడు దాన్ని అంతే అపురూపంగా లెన్స్‌లో బంధించాలంటే నైపుణ్యం కావాలి. అంటే... కెమెరాపై పూర్తి అవగాహన... మనం చూసే దృష్టిలో కళాత్మకత ఉండాలి. అప్పుడే ఆ చిత్రం ప్రతి మదినీ చేరుతుంది. చూడగానే మనకు కలిగిన అనుభూతి ఛాయాచిత్రంగా ప్రతిబింబిస్తుంది. ఇక ట్రావెల్ ఫొటోగ్రఫీ అంటే..! అదో పెద్ద సబ్జెక్టు అనుకుని నిట్టూర్చే వారికి... అది అంత కష్టం కాదని భరోసా ఇచ్చారు ప్రముఖ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ సౌరబ్ చటర్జీ. మెదడుపై ఒత్తిడి తగ్గించి... ఎదుటున ఉన్నదానిపై దృష్టి పెడితే చాలంటారు ఆయన. సికింద్రాబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్‌లో ఇటీవల ట్రావెల్ ఫొటోగ్రఫీపై ఆయన వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఔత్సాహికులకు ఆయన కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే సులువుగా ‘క్లిక్’మనిపించడానికి కొన్ని చిట్కాలూ చెప్పారు.
సాధారణ దృశ్యాలను కూడా అద్భుతంగా బంధించాలంటే రెండు అంశాలు కీలకమంటారు చటర్జీ. ఒకటి... కంపోజిషన్. రెండు లైట్. ఈ రెండింటిపై అవగాహన పెంచుకుని, ఆచరణలో పెడితే మెమరబుల్ మూమెంట్స్ ఎన్నో క్లిక్‌మనిపించవచ్చంటారాయన. ‘ఇక నా విషయానికొస్తే... లైఫ్‌లో రెండు ప్రధానమైన మిషన్స్ ఉన్నాయి. దేశంలో కెమెరాలున్న ప్రతి ఒక్కరినీ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌ను చేయాలి. ట్రావెల్ ఫొటోగ్రాఫర్లు ప్రపంచమంతా తిరిగి మంచి చిత్రాలు బంధించి దేశానికి గర్వకారణంగా నిలవాలి’ అంటున్న సౌరబ్ ఫొటో జర్నలిజంలో డిప్లమో చేశారు. ‘గత ఏడాది ఇద్దరు జర్మనీ ఫొటోగ్రాఫర్లతో కలసి పనిచేసే అవకాశం లభించింది. అలాగే... గాబ్రియల్ అండ్ యాన్‌డ్రియాస్ రోస్ట్ డాక్యుమెంటరీ నిర్మాణం కోసం చెన్నై వెళ్లా. అక్కడ రకరకాల చిత్రాలు తీశాను. మంచి ఆదరణ, గుర్తింపు వచ్చాయి. అక్కడ ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారికి నాలుగేళ్లు శిక్షణనిచ్చారు. ఆ తరువాత ఫొటోగ్రఫీపై మంచి అవగాహన వచ్చింది. జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్స్, డైలీస్‌లో నేను తీసిన ఫొటోలెన్నో పబ్లిష్ అయ్యాయి. అలాగే నేషనల్ జాగ్రఫికల్ ట్రావెలర్, లోన్లీ ప్లానెట్, టైమ్ అవుట్ ఎక్స్‌ప్లోరర్ (యూకే)ల్లో కూడా ట్రావెల్ ఫొటోగ్రఫీపై కార్యక్రమాలు చేశాను. రీసెంట్‌గా దిల్లీ బ్రాండ్స్ అకాడమీ ఫొటోగ్రఫీ వర్క్‌షాప్స్ నుంచి ‘టైనర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నా. ఇలా ఫొటోగ్రఫీతో పాటు నా జర్నీ సాగిపోతోంది’ అని తన నేపథ్యం చెప్పుకొచ్చారు సౌరబ్ చటర్జీ.
ప్రవీణ్, అడ్డగుట్ట