అస్లీ తస్వీర్ | Asli tasveer to impress the natural photography | Sakshi
Sakshi News home page

అస్లీ తస్వీర్

Published Thu, Jan 29 2015 11:50 PM | Last Updated on Fri, Sep 7 2018 4:33 PM

అస్లీ తస్వీర్ - Sakshi

అస్లీ తస్వీర్

అచ్చమైన హైదరాబాద్ కనిపించాలంటే అద్దాల మేడలు.. ఐటీ సెక్టార్స్ చూస్తే సరిపోదు. గల్లీల్లో చక్కర్లు కొట్టాలి. చార్మినార్ నాలుగు మినార్‌లను.. ఆ మినార్ ల వెంట సాగిపోయే కిక్కిరిసిన వీధుల్లో తచ్చాడాలి. ఇక్కడి గర్‌మా గరమ్ చాయ్ కొట్టాలి. ఇంతెత్తు కమాన్‌ల దర్వాజాలను తట్టాలి. మక్కా మసీద్ ముందు గాలిలో కబూతర్లు చెప్పే కహానీలు వినాలి.. ఆ కపోతాలను అలా గాల్లోకి ఎగురవేయాలి. ఇక్కడి చుడీలు, వాటికి మ్యాచ్ అయ్యే కంగన్‌లు.. బేరమాడి కొనుక్కోవాలి.. అప్పుడే భాగ్యనగరిలో భాగస్వామి కాగలం. అలాంటి హైదరాబాదీ నస్‌నస్‌ని తన కెమెరాలో బంధించారు లక్ష్మీ ప్రభల. తన లెన్స్‌లో అందంగా ఇమిడిపోయిన హైదరాబాద్‌ను ‘హైడ్ అండ్ సీక్’ (Hyd and Seek) పుస్తకంగా మలిచి  హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిటీప్లస్ ఆమెను పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
 - ఓ మధు
 
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నా కెరీర్ మొదలైంది. ఈ కెరీర్‌లో ఉదయం నుంచి రాత్రి వరకూ రొటీన్ లైఫ్. పొద్దస్తమానం మెయిల్స్ చెకింగ్, ఎక్సెల్ షీట్స్, పవర్ పాయింట్స్.. పసలేని బోరింగ్ మీటింగ్స్.. క్రియేటివిటీకి చాన్సే లేదు. నాకంటూ ఒక క్రియేటివ్ స్పేస్ కోసమని ఫొటోగ్రఫీ అలవాటు చేసుకున్నాను. వీలున్నప్పుడల్లా బయటకు వెళ్లి నా కెమెరాకు పని చెప్పేదాన్ని.  ఫొటోగ్రఫీలో శిక్షణ తీసుకున్నది లేదు. మొదట్లో కాంపొనెంట్స్, కలర్స్ చిన్న చిన్న కాంపోజిషన్స్‌తో ఫొటోలు తీసేదాన్ని. అలా అలా ఫొటోలు తీస్తూనే ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను.
 
 కెమెరా వచ్చాకే..
 మేం 1994లో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాం. నాకు కెమెరా గిఫ్ట్‌గా వచ్చింది. కెమెరా వచ్చిన తర్వాత నుంచి ఫొటోలు తీయడానికి సిటీలో పలు చోట్లకు వెళ్లేదాన్ని.  ఈ సిటీ ఎంత అందంగా ఉంటుందో.. అప్పుడే నాకు అర్థమైంది. నిజంగా సిటీని కెమెరాలో బంధించడం మొదలుపెట్టాకే ఇక్కడి కల్చర్, లైఫ్‌స్టైల్ గురించి తెలుసుకోగలిగాను. 2010లో సాఫ్ట్‌వేర్ జాబ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశాను. అప్పటి నుంచి ఫొటోగ్రఫీపై మరింత దృష్టి సారించాను.
 
 ఎంతో ఇంప్రెస్ చేశాయి..
 హైదరాబాద్ స్ట్రీట్ లైఫ్ మీద ఎక్కువగా ఫొటోలు తీస్తుంటాను. నగరంలోని వీధులను ఒకసారి పరికిస్తే ఎంతో తెలుసుకోవచ్చు. చేతిలో డిజిటల్ కెమెరా ఉంటే  ఎన్ని ఫొటోలైనా తీసేయొచ్చు అనుకుంటారు. కాని, మనం క్లిక్ చేసిన ఫొటో బాగుండాలంటే ఏం చేయాలో, ఎలా తీయాలో..  మాత్రం అనుభవం ద్వారానే తెలుస్తుంది. ‘ప్రతి ఫొటోలో హైదరాబాద్‌ను అందంగా ఎలా చూపించగలిగారు’ అని అడిగితే ‘హైదరాబాద్‌ను మించిన ఆకర్షణీయమైన నగరం మరొకటి లేదు. అందుకే ఈ నగరాన్ని అందంగా చూపించగలిగాను’ అని చెబుతాను. హైదరాబాద్ గురించి చదివిన, విన్న విషయాల కంటే.. ఇక్కడ నేను చూసిన  దృశ్యాలే నన్ను ఇంప్రెస్ చేశాయి. సిటీని మరింత అందంగా చూపించాలన్నదే నా తాపత్రయం.
 
 అవేర్‌నెస్‌దిశగా..
 అరుగు మీద కూర్చొని శూన్యంలోకి చూస్తున్న తాత.. అతని పక్కన చొరవగా మనకేసి చూస్తున్న నాలుగేళ్ల బుడతడు, సైకిల్ పయ్యతో వీధుల్లో పరిగెడుతున్న బాలుడు, హైదరాబాద్ బోనాలు, రంజాన్ పండుగల్లో పట్నం వీధుల్లో సందడి, విద్యుత్ దీపాలను అద్దుకున్న గోల్కొండ, జిలుగు వెలుగుల్లో చార్మినార్, సందర్శకులను రిప్రెజెంట్ చేసే పక్షులు.. ఇలా ప్రతి ఫొటో ద్వారా హైదరాబాదీలను, వాళ్ల అలవాట్లను అందంగా చూపించే ప్రయత్నం చేశాను. ఇలా తీసిన ఫొటోలతోనే హైడ్ అండ్‌సీక్ పుస్తకం తీసుకొచ్చాను. ఈ ఫొటోలు తీసేటప్పుడు పుస్తకం తేవాలనే ఆలోచన లేదు. కాని, ఈ ఛాయాచిత్రాలకు డాక్యుమెంటేషన్‌తో పుస్తక రూపం ఇస్తే బాగుంటుంది అనిపించి హైడ్ అండ్ సీక్ తీసుకొచ్చాను. ఇకపై నారేటివ్ ఫొటోగ్రఫీ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఒక ఇష్యూ మీద లేదా అవేర్‌నెస్ కల్పించే దిశగా నా ఫొటోలు వస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement