హిమాలయాల్లో సహజంగా పెరిగే మొక్క?
కాంపిటీటివ్ గెడైన్స్ : ఇండియన్ జాగ్రఫీ
ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి వివిధ పోటీ పరీక్షల్లో వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రశ్నలు, వివరణాత్మక సమాధానాలు..
కిందివాటిని పరిశీలించండి.
1) పత్తి 2) వేరుశెనగ
3) వరి 4) గోధుమ
పైవాటిలో ఖరీఫ్ పంటలు ఏవి?
ఎ) 1, 4 బి) 2, 3 సి) 1, 2, 3 డి) 2, 3, 4
సరైన సమాధానం: సి
వివరణ
భారతదేశంలో సంవత్సరాన్ని మూడు వ్యవసాయ రుతువులుగా విభజిస్తారు. అవి 1) ఖరీఫ్ 2) రబీ 3) జైద్. గోధుమ ప్రధానమైన రబీ పంట. దీనికి తక్కువ ఉష్ణోగ్రత, వర్షపాతం సరిపోతుంది.
తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు-శ్రీలంక, ఇండో-బర్మన్ ప్రాంతాలను ‘ఎకలాజికల్ హాట్‌స్పాట్స్’గా ప్రకటించడానికి కింద తెలిపిన వాటిలో మూడు ప్రామాణికతలేవి?
1) జాతుల సంపన్నత్వం
(స్పిసీస్ రిచ్‌నెస్)
2) ఉద్భిజ్జ సంపద సాంద్రత (వెజిటేషన్ డెన్సిటీ)
3) స్థానీయత (ఎండెమిజం)
4) ప్రమాదస్థితి (థ్రెట్ పర్సెప్షన్)
5) వెచ్చటి, తడి వాతావరణాలకు అనుకూలత పొందే వృక్ష, జంతు జాతులు
పై అంశాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4 సి) 2, 3, 4 డి) 3, 4, 5
సమాధానం: బి
వివరణ
జాతుల సంపన్నత్వం అంటే ఏదైనా జీవసమాజంలో మిగతా జాతులకన్నా ఓ ప్రత్యేక జాతి సంఖ్యాపరంగా, ఆ ప్రాంత వనరులను వినియోగించుకోవడంలో మిగతా జాతుల కంటే ఆధిపత్యాన్ని కలిగి ఉండటం. స్థానీయత అంటే ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితమై జీవిస్తూ, ఇతర ప్రాంతాల్లో పెరుగుదల తక్కువగా ఉన్న జాతులు. తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమల ప్రాంతాలు, ఇండో-బర్మన్ ప్రాంతాల్లోని జాతుల్లో ఎక్కువగా స్థానీయమైనవి. ఇవి ప్రస్తుతం మానవ చర్యల వల్ల ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటున్నాయి.
కింది వాక్యాలను పరిశీలించండి
(1) టెక్సాస్ అనే మొక్క హిమాలయాల్లో సహజంగా పెరుగుతుంది.
(2) దీన్ని ఇటీవల ‘రెడ్ డేటా బుక్’ లిస్ట్‌లో చేర్చారు
(3) దీని నుంచి ‘టాక్సోల్’ అనే డ్రగ్‌ను తయారు చేస్తారు. దీన్ని ‘పార్కిన్ సాన్స్’ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు.
పై వాటి నుంచి సరైన దాన్ని గుర్తించండి
(ఎ) 1 (బి) 2, 3
(సి) 1, 2, 3 (డి) పైవన్నీ
సరైన సమాధానం: డి
వివరణ
ఈ మొక్క నుంచి తయారు చేసే టాక్సోల్ డ్రగ్‌లో గుండె క్యాన్సర్, పార్కిన్‌సాన్స్, రొమ్ము క్యాన్సర్‌లను నివారించే గుణాలు ఎక్కువగా ఉన్నందువల్ల దీన్ని ఎక్కువ స్థాయిలో టాక్సోల్ డ్రగ్‌ను తయారు చేసేందుకు నిర్మూలించారు. అందువల్ల దీన్ని రెడ్ డేటా లిస్ట్‌లో చేర్చారు.
హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే కింది వాటిలో భారతదేశ భూభాగంపై కలిగే ప్రభావాలు ఎలా ఉంటాయి?
(1) దేశంలో ఎక్కువ భాగం ఆసియా భూభాగం నుంచి వీచే శీతల గాలుల ప్రభావానికి లోనై ఉండేది.
(2) గంగా-సింధు మైదాన ప్రాంతంలో ఇప్పుడున్నంత విస్తీర్ణంలో సారవంతమైన ఒండ్రుమట్టి నేలలు, జీవనదులు ఉండేవి కాదు. వర్షపాత పరిమాణం తక్కువై దుర్భిక్ష ప్రాంతంగా ఉండేది.
(3) రుతుపవన విధానం ఇప్పుడున్నట్లు కాకుండా భిన్నమైన రీతిలో ఉండేది.
పైవాటి నుంచి సరైనదాన్ని గుర్తించండి.
(ఎ) 1 (బి) 1, 3
(సి) 2, 3 (డి) పైవ న్నీ
సరైన సమాధానం: డి
కింది వాటిలో భారత్-చైనాల మధ్య 2006లో రెండు దేశాల మధ్య వర్తక, వాణిజ్యాలను పెంపొందించేందుకు ఏ కనుమను తెరిచారు?
(ఎ) నిథిలా (బి) జెలెప్‌లా
(సి) నాథులా (డి) షిప్‌కిలా
సరైన సమాధానం: సి
పశ్చిమ దిశలో ప్రవహించే నర్మద, తపతి లాంటి ద్వీపకల్ప నదులు వాటి నదీ ముఖద్వారాల వద్ద డెల్టాలకు బదులు ఎస్టురీస్ ఏర్పరిచేందుకు కారణం?
(1) అతి తక్కువ కాలంతో పాటు, వేగంగా ప్రవహించడంవల్ల
(2) పశ్చిమతీర రేఖ తరచూ టైడల్ బోర్స్ తో మునిగిపోవడం వల్ల
(3) అవి రవాణా చేసే నిక్షేపాల పరిమాణం తక్కువగా ఉండటం, పగులు లోయ గుండా ప్రవహిండం వల్ల.
(4) వాటి ద్వారా రవాణా అయ్యే నిక్షేపాలను వాటి ముఖ ద్వారాల వద్ద నిక్షేపితం చేయకుండా సముద్రంలోకి నెట్టివేయడం వల్ల
పైవాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి
(ఎ) 1, 3, 4 (బి) 2, 3, 4 (సి) 2, 3 (డి) పైవన్నీ
సరైన సమాధానం: ఎ
వివరణ
పై ప్రశ్నకు సరైన జవాబు గుర్తించాలంటే పగులులోయలు, పశ్చిమ కనుమల భౌమ నిర్మాణంపై సరైన అవగాహన ఉండాలి
- ఎ.డి.వి. రమణ రాజు
సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్