జీకే - కరెంట్ అఫైర్స్
కాంపిటీటివ్ గెడైన్స్ : కరెంట్ అఫైర్స్
ప్రిపరేషన్ ప్లాన్ ఫర్..
పోటీ పరీక్షల్లో రాణించాలంటే జనరల్ నాలెడ్‌జ, కరెంట్ అఫైర్‌స కీలకం. దాదాపు ప్రతి పోటీ పరీక్షలోనూ ఈ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)తో మొదలుకొని ఎస్.ఎస్.సి., ఆర్‌ఆర్‌బీ, ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, ఆర్‌బీఐ, బ్యాంకింగ్, ఇన్సూరెన్‌స సంస్థలు, సబ్ ఇన్‌స్పెక్టర్‌స, పోలీస్ కానిస్టేబుల్స్, డీఎస్సీ.. ఇలా ప్రతి నియామక పరీక్షలో జీకే, కరెంట్ అఫైర్‌స నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంత ప్రాధాన్యమున్న ఈ విభాగాల్లో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి? ఎలా ప్రిపేరవ్వాలి? ఏయే అంశాలు చదవాలో చూద్దాం.
ఏ సబ్జెక్ట్‌కు అయినా నిర్దేశిత సిలబస్ ఉంటుంది. కానీ జీకే, కరెంట్ అఫైర్‌సకు మాత్రం ఎలాంటి సిలబస్ ఉండదు. ఏ అంశం నుంచైనా ప్రశ్నలు రావచ్చు. కరెంట్ అఫైర్‌సపై పట్టు సాధించాలంటే నిత్యం వార్తాపత్రికలను చదవాలి. ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవాలి. తెలుగుతోపాటు ఒక ఆంగ్ల దినపత్రికను కూడా చదివితే కరెంట్ అఫైర్‌సతోపాటు ఆంగ్లంపై కూడా పట్టు సాధించవచ్చు. పత్రికలను ప్రధానంగా పరీక్షల దృష్టితో చదవాలి. బ్యాంకు పరీక్షలకైతే ఆర్నెళ్లు, యూపీఎస్సీ, రాష్ర్ట పోటీ పరీక్షలకైతే ఏడాది పాటు జరిగిన వర్తమాన అంశాలను క్షుణ్నంగా చదవాలి. గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళి, క్లిష్టతను పరిశీలించాలి. గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.
పూర్వాపరాలు తెలుసుకోండి
కరెంట్ అఫైర్‌సను బిట్ల రూపంలో చదవద్దు. అలా చదివితే త్వరగా మరిచిపోయే ఆస్కారం ఉంది. ఒక అంశం గురించి చదివినప్పుడు దాని పూర్వాపరాలను కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు 2015కుగాను బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఈ అంశాన్ని ఎలా ప్రిపేరవ్వాలో చూద్దాం..
‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశంలోని అత్యుత్తమ చలనచిత్ర రంగ అవార్డు. భారత చలనచిత్ర పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే పేరిట 1969లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మనదేశంలో మొదటి మూకీ చిత్రమైన ‘రాజా హరిశ్చంద్ర’ను 1913లో నిర్మించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, స్వర్ణకమలం, శాలువా బహూకరిస్తారు. ఈ అవార్డును తొలిసారిగా 1969లో దేవికారాణి రోరిచ్‌కు ప్రదానం చేశారు.
ఇప్పటివరకు అయిదుగురు తెలుగు సినీ ప్రముఖులకు కూడా ఈ అవార్డును అందజేశారు. వారు.. బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి (1974), ఎల్.వి.ప్రసాద్ (1982), బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986), అక్కినేని నాగేశ్వరరావు (1990), రామానాయుడు (2009). మనోజ్ కుమార్.. ఉప్‌కార్, క్రాంతి, పూరబ్ ఔర్ పశ్చిమ్ వంటి దేశభక్తి చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి.’ ఇలా.. ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించినట్లయితే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం రాయవచ్చు. ఈ విధంగా కరెంట్ అఫైర్‌సను స్టాక్ జీకేతో అనుసంధానం చేస్తూ చదివితే సులభంగా గుర్తుండి పోతుంది.
బ్యాంక్ పరీక్షల కోసం..
బ్యాంక్ పీవో, క్లర్‌క, ఆర్‌బీఐ, నాబార్‌డ, ఇన్సూరెన్‌స సంస్థల పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలతోపాటు బ్యాంకింగ్ రంగం నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఈ ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే వారు బ్యాంకింగ్ అవేర్‌నెస్ విభాగాన్ని కూడా చదవాలి. రిజర్‌వ బ్యాంక్ తాజా పరపతి విధానం, ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు, కమిటీలు-చైర్మన్లు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలు, నూతన ప్రైవేట్ బ్యాంకులు (బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్), స్మాల్ ఫైనాన్‌స బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జన్‌ధన్ యోజన, పాలసీరేట్లు, ఏటీఎంలు, వైట్ లేబుల్ ఏటీఎంలు, బ్యాంకింగ్ పదజాలం, నో యువర్ కస్టమర్ విధానాలు, మనీ లాండరింగ్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, కరెన్సీ, నాణేలు, ప్లాస్టిక్ కరెన్సీ, నాబార్‌డ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి.
జాతీయ అంశాలు
దేశంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలపై దృష్టి సారించాలి. రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ పథకాలు, కమిటీలు, కమిషన్లు, ఎన్నికలు, రాష్ట్రాల్లో జరిగిన ముఖ్య సంఘటనల్ని చదవాలి. తెలుగు రాష్ట్రాలు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యేవారు ప్రాంతీయ అంశాలను కూడా తెలుసుకోవాలి.
అంతర్జాతీయ అంశాలు
వివిధ దేశాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన నేతలు, అంతర్జాతీయ సదస్సులు, భారత ప్రధాని విదేశీ పర్యటనలు వంటి అంశాలను చదవాలి.
శాస్త్ర, సాంకేతిక అంశాలు
ఇటీవల జరిగిన అంతరిక్ష, రక్షణ, పర్యావరణ, ఆరోగ్య, ఇంధన, సమాచార, సాంకేతిక రంగాల సంఘటనలను తెలుసుకోవాలి. ఉపగ్రహాలు, వాహక నౌకలు, ఇటీవల పరీక్షించిన క్షిపణులు, ఆవిష్కరణలు, వివిధ తుపాన్లకు పెట్టిన పేర్లు, సంప్రదాయేతర ఇంధన వనరులు, సోలార్ మిషన్ తదితర అంశాలను చదవాలి.
ఆర్థిక అంశాలు
కేంద్ర బడ్జెట్, ఎకనామిక్ సర్వే, రైల్వే బడ్జెట్, బడ్జెట్ కేటాయింపులు, ప్రకటించిన పథకాల గురించి చదవాలి. 2011 జనాభా లెక్కలను క్షుణ్నంగా పరిశీలించాలి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల గురించి తెలుసుకోవాలి.
క్రీడలు
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన క్రీడాంశాలను చదవాలి. ఇటీవల జరిగిన ఆసియాకప్ క్రికెట్, అండర్-19 ప్రపంచకప్, టీ-20 క్రికెట్ ప్రపంచకప్, ఐపీఎల్, దక్షిణాసియా క్రీడలు, కోపా అమెరికా ఫుట్‌బాల్, టెన్నిస్ ట్రోఫీలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. క్రీడాకారులు వారి దేశాలు, ట్రోఫీలు, క్రీడాపదజాలం తెలుసుకోవాలి.
వార్తల్లోని వ్యక్తులు - అవార్డులు
ఇటీవల చేపట్టిన నియామకాలు, ఎన్నిక, ఎంపిక, మరణాలు ముఖ్యమైనవి. జాతీయ అవార్డుల్లో.. పద్మ అవార్డులు, చలనచిత్ర పురస్కారాలు, క్రీడా పురస్కారాలు, సాహిత్య అవార్డులు; అంతర్జాతీయ అవార్డుల్లో.. నోబెల్ బహుమతులు, రామన్ మెగసెసే పురస్కారాలు, ఆస్కార్ అవార్డులు, ప్రపంచ ఆహార బహుమతి, బుక్ ప్రైజ్ తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
స్టాక్ జీకే కోసం..
భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి రాజధానులు, జాతీయ చిహ్నాలు, కేలండర్, జనాభా, భాషలు, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, సమాచార వ్యవస్థ, దేశ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థ, భారత అంతరిక్ష విజయాలు, అణుశక్తి రంగం, అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు అవి ఉన్న ప్రదేశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, జాతీయ పార్కులు, శాంక్చ్యురీలు, బయోస్పియర్ రిజర్‌వలు, వ్యవసాయ విప్లవాలు, ప్రముఖ ఆవిష్కరణలు, అధ్యయన శాస్త్రాలు, ప్రముఖ దినోత్సవాలు, ప్రముఖ వ్యక్తుల బిరుదులు, నినాదాలు, విటమిన్లు, వ్యాధులు, సౌరకుటుంబం, నదీతీరాన వెలసిన పట్టణాలు, ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు, ఐరాస ప్రకటించిన సంవత్సరాలు, దశాబ్దాలు, అంతర్జాతీయ సంస్థలు, వాటి ప్రధాన కార్యాలయాలు, అధిపతులు, దేశాలు-రాజధానులు-కరెన్సీలు, పార్లమెంట్లు వంటి వాటిని చదవాల్సి ఉంటుంది.
- ఎన్. విజయేందర్‌రెడ్డి
కరెంట్ అఫైర్‌స నిపుణులు,హైదరాబాద్