కాంపిటీటివ్ గెడైన్స్
కరెంట్ అఫైర్స్
జాతీయం
అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ రఘనీ భారత పర్యటన
అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ రఘనీ భారత పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 14న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నేరస్తుల పరస్పర మార్పిడి, పౌర, వాణిజ్య అంశాలకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరాయి.
కాంగ్రెస్‌ను వీడిన అరుణాచల్‌ప్రదేశ్ సీఎం
అరుణాచల్‌ప్రదేశ్‌లో సీఎం పెమా ఖండూ నేతృత్వంలో 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 16న ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ)లో విలీనమయ్యారు. మొత్తం 60 మంది సభ్యులున్న అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు.
బలూచ్ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ఏఐఆర్
పాకిస్తాన్‌తోపాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న బలూచ్ ప్రజల కోసం ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) సెప్టెంబర్ 16న మల్టీ మీడియా, మొబైల్ అప్లికేషన్ సేవలను ప్రారంభించింది. సరిహద్దు ప్రజల మధ్య మెరుగైన సంబంధాల కోసం ఈ సేవలను ప్రారంభించినట్లు ప్రసార భారతి చైర్మన్ ఎ.సూర్యప్రకాష్ తెలిపారు.
యూరి ఉగ్ర దాడిలో 20 మంది సైనికులు మృతి
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో యూరి సైనిక స్థావరంపై సెప్టెంబర్ 18న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. ఫెన్సింగ్ వైర్లు కత్తిరించి, సైనిక స్థావరంలోకి ప్రవేశించిన ముష్కరులు.. జవాన్లపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడి చేయడంతో సైనిక గుడారాలకు మంటలంటుకున్నాయి. మంటల వల్ల 13 మంది సైనికులు మరణించారు. సైనికులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
అరుదైన కళాకృతులను అప్పగించిన ఆస్ట్రేలియా
స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న అతి పురాతనమైన మూడు విగ్రహాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబర్ 19న భారత్‌కు అందించింది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ విగ్రహాలను కాన్‌బెర్రాలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా (ఎన్‌జీఏ) వద్ద జరిగిన కార్యక్రమంలో ఆ దేశ కళల శాఖమంత్రి మిచ్ ఫైఫీల్డ్డ్.. భారత పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌శర్మకు అందించారు. వీటిలో మూడో శతాబ్దానికి చెందిన రాతితో చేసిన విగ్రహం, బుద్ధుని విగ్రహం, 900 ఏళ్ల కిందటి ప్రత్యంగిరాదేవి విగ్రహం ఉన్నాయి.
కశ్మీర్‌లో ఆపరేషన్ కామ్ డౌన్ చేపట్టిన సైన్యం
కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు భారత సైన్యం సెప్టెంబర్ 14న ఆపరేషన్ కామ్ డౌన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను ఏరివేసేందుకు 4,000 మంది అదనపు బలగాలను దక్షిణ కశ్మీర్‌లో మోహరించారు.