కాంపిటీటివ్ గెడైన్స్ : సివిల్స్, గ్రూప్స్ ఎస్సే
సామాజిక రక్షణ-ఆహార భద్రత-ప్రభుత్వ పాత్ర
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఆకలి, పోషకాహార లోపం. ప్రభుత్వ విధానాలు సామాజిక రక్షణ కల్పించేవిగా ఉన్నట్లయితే ఆకలి, పోషకాహారలోప సమస్యలను తగ్గించవచ్చని ఇటీవల జరిపిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు (ప్రపంచ ఆరోగ్య సంస్థ; ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ కార్మిక సంస్థ, తదితర) 64 పేద దేశాల నుంచి సేకరించిన సమాచార విశ్లేషణ ఈ వాదనకు బలం చేకూర్చింది. తక్కువ తలసరి ఆదాయం ఉన్న పేద దేశాలు కూడా సగటు మానవుని ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయా దేశాలు తమకు లభ్యమవుతున్న పరిమిత వనరులను సామాజిక రక్షణకు కేటాయించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ఆకలి, పోషకాహార లోపం ముఖచిత్రం
పేదరికం, నిరపేక్ష ఆకలి, పోషకాహారలోపం, మానవ సమాజాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలు. 201214 మధ్యకాలంలో 805 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలికంగా పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నట్లు తేలింది.
1990వ దశాబ్దం నుంచి పేదరికం కొంత మేరకు తగ్గినప్పటికీ 2014 ప్రాపంచిక ఆకలి సూచిక (Global Hunger Index) దాదాపు 39 దేశాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. లాటిన్ అమెరికా, తూర్పు ఆగ్నేయాసియా, కరేబియన్ దేశాల్లో పేదరికం కొంత తగ్గినప్పటికీ దక్షిణాసియా, సహారా దిగువ ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా ఉంది.
ప్రాంతీయ ప్రాతిపదికన
ప్రాపంచిక ఆకలి సూచిక విలువలు1996లో జరిగిన ప్రపంచ ఆహార శిఖరాగ్ర సమావేశంలో ఆహార భద్రతను.. ‘ప్రజలందరికీ, ఎల్లప్పుడు పోషకాహారం అందుబాటులో ఉంటూ, వారు ఆరోగ్యంగా, చురుకుగా జీవించగలగడం, భౌతికంగా, ఆర్థికంగా దీన్ని పొందగలగడం’గా నిర్వచించారు. దీంట్లో పారిశుధ్యం, మంచినీరు, వైద్య సదుపాయం అంతర్లీనంగా ఉంటాయి.
ఇటీవల కాలంలో అహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఇది జనాభా పెరుగుదలను అధిగమించింది. కానీ, బహుళజాతి సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఆయా దేశ ప్రభుత్వాల లోపభూయిష్ట విధానాలు కృత్రిమ కొరతను సృష్టించి, పేద ప్రజలకు ఆహారధాన్యాలు అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కూడా ఆహార ధాన్యాల మీద ప్రభావం చూపుతోంది. ఇండియా లాంటి దేశాల్లో పర్యావరణ మార్పుల వల్ల సకాలంలో వర్షాలుపడటం లేదు. దీంతో పంట దిగుబడి తగ్గి, సాగుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఫలితంగా సన్నకారు రైతులు అప్పులపాలై, కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పేద ప్రజలు వీధులపాలవుతున్నారు.
మహిళలే అధిక బాధితులు
ఆకలి, పోషకాహార లోపాన్ని స్త్రీ, పురుష కోణంలో పరిశీలించినట్లయితే ఆకలితో అలమటించే వారిలో 60% మంది మహిళలే ఉన్నారు. 50% గర్భిణీస్త్రీలకు సరైన పోషకాహారం లభించడం లేదు. ఈ కారణంగా (2,40,000 మంది) తల్లులు, పిల్లల మరణాలు సంభవిస్తున్నాయి. పోషకాహారం లభించక ప్రతి ఆరుగురిలో ఒకరు తక్కువ బరువుతో పుడుతున్నారు. ఐదు సంవత్సరాల లోపు బాలబాలికల్లో 45% మంది మరణిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రతి 10 సెకండ్లకు ఒక శిశుమరణం సంభవిస్తుంది. భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలు/తెగల్లో ఆకలి, పోషకాహారలోపంతో బాధపడే వారి సంఖ్య సహారా దిగువ ఆఫ్రికాలోని వారికంటే ఎక్కువ.
దీనికి పరిష్కారమేంటి?
ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయాలి. జీవనోపాధి పథకాల అమలు, బీమా పథకం వర్తింపు, పారిశుధ్యం, రక్షితనీటి పథకం, తిండి, బట్ట, వసతి వంటి కనీస సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి తేవాలి. దీన్నే సామాజిక రక్షణ అంటారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ఈ భావనను ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఈ పథకం కింద వైద్య సదుపాయం, అనారోగ్య భృతి, నిరుద్యోగ భృతి, వయోవృద్ధులకు ఆర్థికసహాయం, కుటుంబభృతి, ప్రసూతి భృతి, క్షతగాత్రుల భృతి మొదలైనవి అందించాలి.
యూరోపియన్ కమిషన్, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు ప్రాంతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించి స్థూలంగా సామాజిక భద్రతకు పలు సూచనలు చేశాయి. 1995లో కోపెన్‌హాగన్‌లో జరిగిన ప్రపంచ శిఖరాగ్ర సమావేశం ‘సామాజిక అభివృద్ధి’ ఆవశ్యకతను పునరుద్ఘాటించింది. 2010లో ఐక్యరాజ్యసమితి అధ్యక్షతన జరిగిన శిఖరాగ్ర సమావేశం శతాబ్ది అభివృద్థి లక్ష్యాలను (Millenium Development goals) గుర్తించింది. ఈ లక్ష్యాల్లో దారిద్య్ర నిర్మూలన ప్రధానమైందిగా ఉంది. ఇందులో భాగంగా 2015లో (Sustainable development goals) ‘పేదరిక నిర్మూలన, ధరిత్రీ పరిరక్షణ, అందరికీ సంపద’ నినాదాన్ని ప్రారంభించారు.
పేద దేశాల్లో వనరుల కేటాయింపు అత్యల్పం
అభివృద్ధి చెందిన, చెందుతున్న అనేక దేశాల్లో సామాజిక రక్షణలో భాగంగా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, బీమా, ప్రజోపయోగార్థ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే పేద దేశాలు తమ స్థూల దేశీయ ఉత్పత్తి (ఎఈ్క)లో ఈ రంగానికి ఆశించిన మేర వనరులను కేటాయించడం లేదు. వాస్తవానికి పేద దేశాల్లో ఈ రంగంపై ఎక్కువ వనరులను వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఈ రంగంపై ఆఫ్రికా ఖండంలో (201011) కేవలం 5.1 శాతం వనరులను మాత్రమే ఖర్చుచేయగా, అదే ఏడాది పశ్చిమ యూరప్ 26.7% వనరులను కేటాయించింది.
ప్రపంచ దేశాల సగటు కేటాయింపు 8.6% ఉండగా, ఆసియా, పసిఫిక్ దేశాలు 5.3 శాతం కేటాయించాయి. సామాజిక భద్రత రంగంలో వృద్ధులకు అందించే పింఛను చాలా తక్కువగా ఉంది. భారతదేశంలో ఇది నెలకు కేవలం రూ.250 మాత్రమే. కొన్నిసార్లు ఈ చిన్న మొత్తాన్ని కూడా నెలల తరబడి చెల్లించడం లేదు. విద్య, ఆరోగ్యం, దారిద్య్ర నిర్మూలన, పారిశుధ్యం, బీమా రంగాలపై ప్రాంతాలవారీగా ప్రభుత్వం కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. పైన పేర్కొన్న గణాంకాలను బట్టి సంపన్న దేశాలు సామాజిక రక్షణకు తమ ఎఈ్కలో ఎక్కువ శాతం ఖర్చుపెడితే, పేద దేశాలు తక్కువ కేటాయిస్తున్నాయి.
భారతదేశంలో
భారతదేశం ప్రారంభించిన ప్రజా పంపిణీ వ్యవస్థ (1997) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాహిత కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. నాలుగు లక్షల తొంభై ఎనిమిదివేల (4,98,000) చౌకధర దుకాణాలు దేశవ్యాప్తంగా 16 కోట్ల కుటుంబాలకు ఆహార భద్రత కల్పిస్తున్నాయి. వీటి ద్వారా ప్రతి కుటుంబానికి 25 నుంచి 35కిలోల వరకు చౌకధరలో ఆహారధాన్యాలను ప్రతినెలా అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు 1990 తొలినాళ్లలో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ క్రమేణా బలహీనపడుతూ వచ్చింది. కానీ, మొత్తంగా చూస్తే ఈ వ్యవస్థ ద్వారా పేదరిక నిర్మూలన కొంత వరకు విజయవంతమైందని చెప్పవచ్చు. 2013నాటికి జాతీయస్థాయిలో పేదరిక తేడా సూచిక (Poverty Gap Index) గ్రామీణ స్థాయి పేదరికాన్ని 18% నుంచి 22% కి తగ్గించింది. తమిళనాడులో 61% నుంచి 83%కి, ఛత్తీస్‌గఢ్‌లో 39% నుంచి 57%కి గ్రామీణ స్థాయి పేదరికాన్ని తగ్గించడంలో ప్రజాపంపిణీ వ్యవస్థ విజయం సాధించింది.
ఈ మధ్య కాలంలో పేదవారికి ధనసహాయం అందించడం మంచిదా? వస్తు సహాయాన్ని అందించడం మంచిదా? అనే వివాదం తలెత్తింది. లబ్ధిదారుల మీద జరిపిన సర్వే వివరాల ప్రకారం ముఖ్యంగా మహిళలు వస్తురూప సహాయాన్నే కోరుకుంటున్నారని తేలింది. బ్రెజిల్‌లో ప్రజలు ధనసహాయాన్ని కోరుకుంటున్నారు. వివిధ దేశాలు ఆయా పరిస్థితులను బట్టి విభిన్న విధానాలను అవలంబిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, సేవల విస్తరణ, పారదర్శకత, అందిస్తున్న సహాయం, అనుసరిస్తున్న పద్ధతులపై సామాజిక రక్షణ కార్యక్రమాల విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది. భారతదేశం విషయంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న లొసుగుల మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఉపయోగిస్తున్న సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐఇఖీ) ఈ లొసుగులను తగ్గించటంలో ప్రముఖపాత్ర పోషిస్తోంది. ఇది 200405 నుంచి 2011-12 మధ్యకాలంలో ఈ రంగంలో అవినీతిని 35%55%కి తగ్గించడంలో కీలకంగా వ్యవహరించింది. అంతేకాకుండా ప్రజాపంపిణీ వ్యవస్థ పరిధిలోకి 23% 44.5% కుటుంబాలు వచ్చాయి.
సమగ్ర శిశు అభివృద్ధి పథకం, ఇతర సామాజిక పథకాలు
సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐఇఈ), మధ్యాహ్న భోజన పథకం బాలబాలికల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ప్రముఖపాత్ర పోషించాయి. వీటి వల్ల గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం మెరుగుపడింది. శైశవ బాల్యదశలో శారీరక, మానసిక ఎదుగుదల లేని పిల్లలు పెద్దవారైన తర్వాత అన్ని రంగాల్లో విఫలం చెందడం వైద్యపరంగా నిరూపితమైంది. అందువల్ల పోషకాహారలోపాన్ని నివారించేందుకు అందరూ కృషి చేయాలి.
పేదప్రజల ఆదాయాన్ని పెంపొందించడంలో 2005లో ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి పథకం.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (కూఖఉఎ్క) చక్కగా ఉపయోగపడింది. దీని కింద ఏటా 5 కోట్ల మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం దీనివల్ల లబ్ధి పొందుతుంది. 201314 సంవత్సరాలలో 1.21 బిలియన్ పని దినాలను కల్పించారు. అందులో 40% పనిదినాలు బలహీన వర్గాలైన షెడ్యూల్డు కులాలు, తెగల వారికి, 55% పనిదినాలు మహిళలకు లబ్ధి చేకూర్చాయి. సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్దపీట వేయడం వల్ల వారి కుటుంబాలకు ఆహార భద్రత లభిస్తుంది. ఎందుకంటే పురుషులతో పోల్చితే మహిళలే కుటుంబ ఆహార అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
దక్షిణాఫ్రికాలో సత్ఫలితాలు
దక్షిణ ఆఫ్రికాలో వృద్ధులకు పింఛన్ పథకం, బాలబాలికలకు ధనసహాయం మొదలైన కార్యక్రమాల ద్వారా సామాజిక రక్షణ అందుతోంది. తాజా అంచనాల ప్రకారం కోటి మంది బాలబాలికలు లబ్ధి పొందుతున్నారు. దీని ఫలితంగా బడి హాజరు శాతంలో గణనీయమైన పెరుగుదల, పౌష్టికాహార లభ్యత మెరుగైంది. బాల కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. బాలబాలికలకు అందించే ధన సహాయం కుటుంబ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి బిడ్డల చదువుకు, పోషకాహారానికి మరింత ఉదారంగా వెచ్చించటానికి వీలు కల్పించింది.
బ్రెజిల్ దేశంలో ‘శూన్య ఆకలి’ అనే పథకం బాలబాలికల్లో పౌష్టికాహార లోపాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడింది. ఆౌట్చ జ్చఝజీజ్చీ అనే ప్రత్యక్ష నగదు పథకం కింద గత 9 ఏళ్లలో బాలబాలికల్లో పౌష్టికాహార లోపాన్ని 61%, గ్రామీణ పేదరికాన్ని 15% మేర తగ్గించారు. దీని కారణంగా మూడు కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. వర్ధమాన దేశాలన్నిటికంటే సామాజిక పరిరక్షణకు బ్రెజిల్ అత్యధికంగా తలసరి ఆదాయంలో 17.9% వెచ్చిస్తుంది.
ఆహార అభద్రతను ఎదుర్కోవాలంటే?
ఈ పై అంశాలను పరిశీలించినప్పుడు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ధన సహాయం అందించడానికి.. పేదరికం, ఆహార అభద్రత తగ్గుదలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో తగినన్ని వనరులు, సరైన విధాన రూపకల్పన, సుపరిపాలన, రాజకీయ ఉద్యోగిస్వామ్య చిత్తశుద్ధి, సామాజిక రక్షణలు ప్రముఖపాత్ర వహిస్తాయి. బంగ్లాదేశ్ అమలుచేస్తున్న "Challenging the frontiers of poverty reduction",రువాండాలో "Vision 2020 umurenge", భారతదేశంలో MGNREGA పథకాలు వీటికి చక్కని ఉదాహరణలు.
పేద దేశాలు సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ వనరులు కేటాయించలేవనే భావన బహుళ ప్రచారాన్ని పొందింది. ముఖ్యంగా పైన ప్రస్తావించిన దేశాలన్నీ పేద దేశాలనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అభ్యుదయ భావాలు కలిగిన రాజకీయ నాయకత్వం, అంకితభావం కలిగిన ఉద్యోగిస్వామ్యం, చురుకైన పౌరసమాజాలు ఎన్ని పరిమితులనైనా అధిగమించి సామాజిక సంరక్షణకు దోహదం చేస్తాయి. వర్ధమాన దేశాల సమస్య వనరుల లేమి కాదు. వాటిని వెలికితీయడంలో విఫలం కావడమే. తృతీయ ప్రపంచదేశాల్లో ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. పరోక్ష పన్నులు పేదలను మరింత కుంగదీసి, ధనికులకు పన్ను మినహాయింపునకు దారితీస్తాయి.
దీనికి సరైన పరిష్కార మార్గం ప్రత్యక్ష పన్నుల పరిధిని విస్తృత పరచడమే. ఇండియా లాంటి దేశంలో ఆదాయం, సంపద విషయంలో ఖచ్చితమైన గణాంకాలు లేవు. దేశంలో 38% సంపద కేవలం 5% ఉన్న అత్యంత ధనికుల చేతిలో ఉంది. అట్టడుగున ఉన్న 60% కుటుంబాల చేతిలో 13% సంపద మాత్రమే ఉంది. సేవాపన్నుల విషయంలో కూడా ఇదే వైపరీత్యం కనపడుతుంది. ప్రోత్సాహకాలు అనే నెపంతో సంపన్న వర్గాలకు ఇచ్చే పన్ను మినహాయింపులు దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రభుత్వం 201314 సంవత్సరంలో పన్ను ప్రోత్సాహకాల రూపంలో రూ. 5 లక్షల 49 వేల 984 కోట్లను నష్టపోయింది. ఈ మొత్తం.. పన్ను ఆదాయంలో 40 శాతానికి పైగా ఉంటుంది. గనులు, నిర్మాణం, స్థిరాస్థిరంగం, నగలు, రత్నాలు వంటివాటిపై పన్నులు విధించి వాటిని సక్రమంగా ఉపయోగించినట్లయితే సామాజిక రక్షణ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి.
- డా॥బి.జె.బి. కృపాదానం
సబ్జెక్ట్ నిపుణులు, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్
సామాజిక రక్షణ చర్యలతోనే నిజమైన ఆహార భద్రత
Published Thu, May 26 2016 1:09 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement
Advertisement