బ్లాక్ హోల్ దశ అంటే..?
కాంపిటీటివ్ గెడైన్స్ : జీఎస్ - ఫిజిక్స్
కాస్మిక్ కిరణాలను 1912లో విక్టర్ హెజ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆయనకు 1936లో నోబెల్ బహుమతి లభించింది. వీటికి కాస్మిక్ కిరణాలు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త మిల్లికాన్.
ధర్మాలు
♦ కాస్మిక్ కిరణాల్లోని ముఖ్య కణాలు:
1. ఎలక్ట్రాన్ 2. పాసిట్రాన్ 3. ప్రోటాన్ 4. న్యూట్రాన్ 5. అయాన్లు
♦ వీటిలో సుమారు 80 శాతం వరకు ప్రోటాన్లు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు, నక్షత్రాల్లో ప్రోటాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
♦ వీటి ఉనికిని, దిశను తెలుసుకునేందుకు ఉపయోగించేది కాస్మిక్ రే టెలిస్కోప్.
♦ ఈ కిరణాల తీవ్రత ధృవాల వద్ద ఎక్కువగా, భూమధ్యరేఖ వద్ద తక్కువగా ఉంటుంది.
♦ ఈ కిరణాల శక్తి 109ev నుంచి 1020ev వరకు ఉంటుంది. అందువల్ల క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఈ కిరణాల తరంగదైర్ఘ్యం తక్కువ. విశ్వంలోని అన్ని కిరణాల కంటే గరిష్ట శక్తిని కాస్మిక్ కిరణాలు కలిగి ఉన్నాయి.
♦ కాస్మిక్ కిరణాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు.
1. కఠిన 2. మృదు
1. కఠిన కాస్మిక్ కిరణాలు: 10 సెం.మీ.ల మందం గల సీసపు దిమ్మెద్వారా చొచ్చుకొని వెళ్లేవి. ఇవి సూపర్ నోవా నుంచి వెలువడి ఉండవచ్చని భావన.
2. మృదు కాస్మిక్ కిరణాలు: 10 సెం.మీ. మందం గల సీసపు దిమ్మెద్వారా చొచ్చుకొని వెళ్లలేవు. ఇవి నోవా నుంచి లేదా సూర్యుని ఉపరితలం నుంచి వెలువడుతుండొచ్చని భావన.
♦ మనదేశంలో కాస్మిక్ కిరణాల గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.
1. విక్రం సారాభాయ్ 2. హెచ్.జె. బాబా
3. మేఘనాథ్ సాహా మొదలైనవారు.
♦ 1985లో భారత్, అమెరికా శాస్త్రవేత్తలు సంయుక్తంగా ‘అనురాధ’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించి కాస్మిక్ కిరణాలను అధ్యయనం చేశారు.
నక్షత్రాలు
ఇవి స్వయం ప్రకాశాలు. పరిమాణాన్ని బట్టి వీటిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు.
1. భారీ నక్షత్రాలు: వీటి ద్రవ్యరాశి చాలా ఎక్కువ. పెద్ద పరిమాణంలో ఉంటాయి.
ఉదా: ఎప్సిలాన్ అరిగా
2. మధ్యతరహా: వీటి ద్రవ్యరాశి భారీ నక్షత్రాల కంటే తక్కువ. ఉదా: సూర్యుడు
3. మరుగుజ్జు నక్షత్రాలు: వీటి ద్రవ్యరాశి పైన పేర్కొన్న నక్షత్రాల ద్రవ్యరాశి కంటే చాలా తక్కువగా ఉంటుంది. విశ్వంలో అధిక నక్షత్రాలు ఈ రకానికి చెందినవే.
బ్లాక్‌హోల్
♦ ఒక నక్షత్రం గురుత్వాకర్షణ బలం అనేక రెట్లు పెరిగి తనవైపు వస్తున్న ప్రతి వస్తువును ఆకర్షించుకోవడమే కాకుండా, తనలో నుంచి వెలువడే కాంతిని కూడా బయటకు వెళ్లనీయకుండా నిరోధిస్తుంటే ఆ దశను బ్లాక్ హోల్ దశ అంటారు.
♦ ఈ పేరు పెట్టిన శాస్త్రవేత్త జాన్ వీలర్ (అమెరికా)
♦ ఈ విశ్వంలో జనించిన ఒక నక్షత్రం బ్లాక్‌హోల్ దశను పొందాలంటే దాని ద్రవ్యరాశి కనీసం ఒక చంద్రశేఖర్ లిమిట్ (CSL)కు సమానంగా ఉండాలి.
1 CSL = 1.4ప2ప1030 kg (సూర్యుని ద్రవ్యరాశి)
= 2.8ప1030kg
♦ ద్రవ్యరాశిని కొలవడానికి ఉపయోగించే అతి పెద్ద ప్రమాణం ఇఔ. అతి చిన్న ప్రమాణం amu.
♦ నక్షత్ర ద్రవ్యరాశి.. చంద్రశేఖర్ లిమిట్ కంటే తక్కువగా ఉంటే అది మరుగుజ్జు నక్షత్రంగా మారి నశిస్తుంది. కాబట్టి సూర్యుడు ఏ పరిస్థితిలో కూడా బ్లాక్‌హోల్ దశను పొందడు.
నోట్: అంతరిక్షంలో వ్యోమగాములు ధరించే స్పేస్ సూట్‌ను Extra Terrestrial Mobile Unit అని అంటారు. దీన్ని ఫైబర్, నైలాన్ అనే పదార్థంతో తయారు చేస్తారు. ప్రతి స్పేస్ సూట్‌లో 7 పొరలు ఉంటాయి.
♦ ఇవి విశ్వాంతరాళం నుంచి వస్తున్న కాస్మిక్, X, రేడియోధార్మిక కిరణాలతోపాటు ఇతర కిరణాలన్నింటినీ శోషించుకుని రక్షణ కల్పిస్తాయి. అదేవిధంగా తగినంత పీడనాన్ని శరీరంపై కలగజేస్తాయి.
♦ వ్యోమగాములు చేసే స్పేస్ వాక్‌ను Extra Vehicular Activity అంటారు.
సహజ రేడియో ధార్మికత
♦ ఈ ధర్మాన్ని 1896లో హెన్రీ బెకరల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. అందువల్ల ఆయనకు 1903లో నోబెల్ బహుమతి లభించింది.
♦ ప్రతి పరమాణు కేంద్రకం పరిమాణం 1 fermi గా (10–15m) ఉంటుంది. ఈ పరమాణు కేంద్రకంలో గల ప్రోటాన్లు, న్యూట్రాన్లను కేంద్రక బలాలు బంధిస్తాయి. ఈ విశ్వంలో ఇతర బలాలతో పోల్చినప్పుడు (అయస్కాంత, విద్యుత్, గురుత్వాకర్షణ మొదలైనవి) కేంద్రక బలాలు అత్యంత బలమైనవి.
♦ కేంద్రక బలాల గురించి కూలుంబ్ అనే శాస్త్రవేత్త అధ్యయనం చేసి వాటిని కూలుంబ్ ఆకర్షణ బలాలు, వికర్షణ బలాలు అని రెండు రకాలుగా వర్గీకరించారు.
♦ పరమాణు సంఖ్య 1 నుంచి 30 వరకు గల పరమాణు కేంద్రకాల్లో కూలుంబ్ ఆకర్షణ బలాలు ఎక్కువగా, వికర్షణ బలాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి పరమాణు కేంద్రకాల్లో స్థిరత్వం ఎక్కువగా ఉండి అవి సహజ రేడియో ధార్మికతను ప్రదర్శించవు.
♦ పరమాణు సంఖ్య 31 నుంచి 82 వరకు [Pb82] గల పరమాణు కేంద్రకాల్లో కూలుంబ్ ఆకర్షణ బలాలు క్రమంగా తగ్గి వికర్షణ బలాలు పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి పరమాణు కేంద్రకాల్లో అస్థిరత్వం క్రమంగా పెరుగుతుంది.
- సీహెచ్.మోహన్
సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్