5గురు పర్వతారోహకుల్ని మింగేసిన ఎవరెస్ట్
హిమాలయాల్లో మంచు తుఫాను వల్ల అయిదుగురు పర్వతారోహకులు హిమసమాధి అయ్యారు. ఎవరెస్టు పర్వత శిఖరం నుంచి మంచు చరియలు విరిగిపడటంతో వారు బస చేసిన క్యాంప్ పూర్తిగా కప్పబడిపోయింది.
ఈ క్యాంప్ దాదాపు 21000 అడుగుల ఎత్తుమీద ఉంది. దీన్ని పర్వతారోహకులు పాప్ కార్న్ ఫీల్డ్ అని పిలుస్తారు. హిమసమాధి అయిన వారిని కాపాడేందుకు సిబ్బందిని హుటాహుటిన అక్కడికి తరలిస్తున్నారు. ఒక హెలికాప్టర్ కూడా రంగంలోకి దిగింది.
ప్రతి సంవత్సరం ఈ సమయంలో 29035 అడుగుల ఎత్తైన ఎవరెస్టును ఎక్కేందుకు వందలాది మంది పర్వతారోహకులు ఈ బేస్ క్యాంప్ కి చేరుకుంటారు. 1953 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 4000 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కారు. మొట్టమొదట ఎవరెస్టును 1953 లో న్యూజీలాండ్ కి చెందిన ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గేలు అధిరోహించారు. అప్పట్నుంచీ ఎవరెస్టును అధిరోహించడం పర్వతారోహకులందరికీ ఒక పెను ఛాలెంజ్ గా ఉంటూ వస్తోంది.