అన్వేషణ మనిషిని ఎటువైపు తీసుకెళుతుందో చెప్పలేం. జీవితపరమార్థాన్ని వెతుక్కుంటూ నెల్లూరు నుంచి బయల్దేరిన సుందరరాముడు హిమాలయాల చెంతకు చేరితే, గంగోత్రిని దర్శించుకునేందుకు వెళ్లిన ఒక హైదరాబాద్ యాత్రికుడికి సుందర రాముడు సాక్షాత్కరించారు!
సముద్రమట్టానికి 10,200 అడుగుల ఎత్తున ఉంటుంది గంగోత్రి. అటువంటి దేవభూమిలో అడుగిడి గంగామాతను సందర్శించిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలను చూద్దామని నేనూ నా మిత్రుడు బయలుదేరాం. గంగానదికి కుడి పక్కనున్న మాతాదీ ఆలయాన్ని చూసిన తర్వాత ఎడమ వైపుకు వెళ్లాం. సెలయేళ్లు, రకరకాల పుష్పాలు.. అవి దాటి కొంచెం ముందుకు పోతే ప్రకృతి రమణీయతకు మారుపేరా అన్నట్టున్న తపోవనం. విశాలమైన ఆ ఆవరణలో ఓ మూల నీరెండ పడుతోంది. అక్కడ ఓ రుషి పుంగవుడు మంచంపై విశ్రమించి ఉన్నారు. లోపలికి వెళ్లి స్వామి వారికి నమస్కరించాం. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం అని అనగానే ఏ ఊరి నుంచి అన్నారు స్వామి. ఆశ్చర్యపోతూ ఉబ్బితబ్బిబ్బయ్యాం. ముందు తపోవనం ఆర్ట్ గ్యాలరీని చూసి రండి తర్వాత మాట్లాడదామన్నారు. అలా తెలిసింది ఆయన తెలుగువారని, గత ఆరేడు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నారని!
తపోవనమే ఆశ్రమం
ఈ తపోవనమే మన తెలుగువారైన స్వామీ సుందరానంద ఆవాసం. ఎక్కడో నెల్లూరు జిల్లాలో పుట్టి గురుపరంపరను వెతుక్కుంటూ భారతీయ ఆధ్యాత్మిక ఆత్మను పట్టి బంధించే (తన కెమెరాతో) దిశగా బయలుదేరి ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రిని అంతిమ గమ్యంగా ఎంచుకున్నారాయన. హిమాలయాలను ఔపాశన పట్టి ఎక్కడెక్కడి రహస్యాలను ఒడిసిపట్టి సుమారు 35 ఏళ్ల పాటు గంగోత్రిలోనే నివసించిన మహాపండితులు, సన్యాసీ, కీర్తిశేషులు స్వామీ తపోవన్ మహారాజ్ శిష్యుడు స్వామి సుందరానంద. 47 ఏళ్ల కిందట గురువు నుంచి సన్యాసం స్వీకరించిన సుందరానంద ప్రస్తుతం గంగోత్రిలో తపోవన్ (హిరణ్యగర్భ ఆర్ట్ గ్యాలరీ) ని నిర్వహిస్తున్నారు.
కట్టుబట్టలతో వచ్చేశారు
సుందరానంద స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అనంతపురం. మద్దు పెంచమ్మ, వెంకటసుబ్బయ్య దంపతుల ఐదుగురి సంతానంలో నడిపివారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సుందర రాముడు. సంతానం తప్ప సంపద లేని కుటుంబం. ఏదో సాధించాలన్న తపన. చుట్టూ ప్రపంచాన్ని చూస్తే ఏదో తెలియని వెలితి. «ఇంట్లో ఎవరికీ చెప్పాపెట్టకుండా కట్టుబట్టలతో ఊరి నుంచి వచ్చేసి బెజవాడ చేరాడు. ఏమి చేయాలో తెలియలేదు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న న్యూ వెల్‌కమ్ హోటల్‌లో సర్వరుగా చేరారు. కడుపు నింపుకోవడానికి ఆ పని సరిపోయినా తన తృష్ణను తీర్చలేకపోయింది.
నేతాజీని కలుద్దామని..
సుందర రాముడు బెజవాడ హోటల్‌లో పని చేస్తున్నప్పుడే రెండో ప్రపంచ యుద్ధ వార్తలు తెలుస్తుండేవి. హోరాహోరా యుద్ధం నడుస్తున్నప్పుడు ఈ హోటల్లో పనేమిటంటూ– విప్లవ వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్‌లో చేరేందుకు కోల్‌కతాకు బయలుదేరాడు. సుందరరాముడు కోల్‌కతాకు వెళ్లేటప్పటికే రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. బోస్ విమాన ప్రమాదంలో చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఉసూరుమన్న సుందరరాముడు సన్యాసం స్వీకరించి తపస్సు చేసుకుందామని నిర్ణయించుకుని గురువును వెతుక్కుంటూ హిమాలయాలకు బయలుదేరారు. ‘‘1948–49లలో హిమాలయపర్వత సానువులకు వచ్చా. 1950–54 మధ్య కాలంలో ఐదారు సార్లు హిమాలయాలను ఎక్కిదిగా.చీలిక పీలికలయిన దుస్తులే ఈ భౌతికకాయాన్నీ, పవిత్ర ఆత్మను కప్పి ఉంచేవి’’ అని చెప్పారు స్వామీజీ. ఆయన పక్కనే పాతకాలం నాటి ఓ కెమెరా కనిపిస్తుంది.
దాని గురించి అడిగినప్పుడు స్వామీజీ మందస్మితులయ్యారు. ‘‘అదో పెద్ద కథలే.. ఓసారి హిమాలయ పర్వతారోహణ సమయంలో కెమెరా ఉంటే బాగుండేదనిపించింది. దేవమార్గాన్ని బంధించాలనిపించింది. అప్పుడు డెహ్రడూన్‌లోని శివానంద ఆర్ట్ స్టూడియో వారిని అడిగి రూ.25లకు ఆస్ట్రేలియాకు చెందిన బాక్స్ కెమెరాను కొనుక్కున్నా. అలా నా భుజం మీదకు చేరిన కెమెరాను ఇప్పటివరకు ఎన్నడూ వీడలేదు. ఇప్పుడు నా వయస్సు 92 ఏళ్లు. 60 ఏళ్లకు పైబడి నా చేతిలో ఈ కెమెరా ఉంది’’ అన్నారు సుందరానంద. తాను తీసిన చిత్రాలతో– హిమాలయన్ త్రూ ద లెస్సెన్స్ ఆఫ్ సాధు – అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ పుస్తకం ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది.
1962లో ఓసారి ఊరికెళ్లా..
‘‘అప్పటికే సన్యాసం స్వీకరించా. తపోవన్ స్వాముల వారిది కేరళ. ఆయన అనుమతి మేరకు దేశపర్యటనలో భాగంగా 1962లో ఓసారి మా స్వగ్రామం అనంతపురం వెళ్లా. హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చానని ఊరు ఊరంతా వచ్చి ఊరేగింపు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ వెళ్లలేదు. ఇప్పుడు నాకు తన, మన అనేదే తెలియదు. అందరూ నా వాళ్లే. మా అప్పచెల్లెళ్లు ఎక్కడున్నారో కూడా తెలియదు’’ అంటారు స్వామీ సుందరానంద.
– సీవీఎస్ రఘునాథరావు
ప్రధానులు సందర్శించారు
గంగోత్రి నదికి కుడి వైపున ఆలయం ఉంటే ఎడమ వైపున తపోవన్ హిరణ్య గర్భ ఆర్ట్ గ్యాలరీ ఉంటుం ది. పూర్తిగా చెక్కతో నిర్మాణం. ఐదంతస్తులు. ఒక్కో అంతస్తులో ఒక్కో విభాగానికి చెందిన ఫొటోలను ఏర్పాటు చేశారు. ఎవరెస్ట్ పర్వతారోహకుడు టెన్సింగ్ నార్కే మొదలు మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, వాజపేయి వరకు ఎందరెందరో ఈ తపోవన్‌ను సందర్శించారు. పై అంతస్తులో ధ్యానమందిరం ఉంటుంది. యోగాభ్యాసంలో 360కి పైగా విన్యాసాలు ఉంటాయని, తన జన్మభూమి విశ్వంలో కీర్తిప్రతిష్టలు పొందాలన్నదే తెలుగు ప్రజలకు తానిచ్చే సందేశమన్నారు స్వామీజీ.
Comments
Please login to add a commentAdd a comment