ఉత్తరాఖండ్‌పై వరద పడగ
దేశం కనీవినీ ఎరుగని వరద బీభత్సం ఈ ఏడాది హిమాలయ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. జూన్ 14 నుంచి వారానికిపైగా చెలరేగిన వరదల్లో దాదాపు ఆరువేల మంది మృత్యువాత పడ్డారు. వీరిలో అత్యధికులు ‘చార్‌ధామ్’ యాత్రికులు. వేలాది మంది కొండకోనల్లో, గడ్డకట్టే చలిలో చిక్కుకుపోయి ఆకలితో అల్లాడిపోయారు. కుండపోత వానల్లో ఉత్తరాఖండ్ చివురుటాకులా వణికిపోయింది. వర్షపాతం సాధారణస్థాయి కంటే 375 శాతం ఎక్కువగా నమోదైంది. గంగ, దాని ఉపనదులైన అలకనంద, మందాకినిలు వెల్లువెత్తి విరుచుకుపడ్డాయి. కేదార్‌నాథ్, బద్రీనాథ్, రుద్రప్రయాగ్, గౌరీకుండ్, సోన్‌ప్రయాగ్ తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తులు, పర్యాటకులు విలవిల్లాడారు. కేదార్‌నాథ్ ఆలయం చుట్టుపక్కల వందలాది శవాలు తేలాయి.