వరద కొనసాగుతుండగా చమోలీ వద్ద సహాయక చర్యలు
డెహ్రాడూన్: హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకొని విలవిలలాడుతోంది. గంగా పరివాహక ప్రాంతాలు వరద ముప్పులో బిక్కుబిక్కుమంటున్నాయి. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో నందాదేవి పర్వతం నుంచి హఠాత్తుగా మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది పోటెత్తింది. ఒక్కసారిగా రాళ్లు, మంచు ముక్కలతో కూడిన నీటి ప్రవాహం కిందకి విరుచుకుపడడంతో ధౌలిగంగ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. దీంతో తపోవన్–రేణిలో ఎన్‌టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. తపోవన్–విష్ణుగఢ్ ప్రాజెక్టు కూడా దెబ్బతిందని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. తపోవన్ వద్ద పనిచేస్తున్న 148 మంది, రిషిగంగ వద్ద 22 మంది మొత్తం 170 మంది కనిపించకుండా పోయినట్లు ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే చెప్పారు.
కొన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) రంగంలోకి దిగి సహాయ చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. నీళ్లలో మునిగిపోయిన ప్రాజెక్టు సొరంగ మార్గంలోకి ప్రాణాలకు తెగించి వెళ్లిన ఐటీబీపీ సిబ్బంది 16 మందిని కాపాడారు. మరో ఏడు మృతదేహాలను వెలికితీసినట్టుగా ఐటీబీపీ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోనికి వస్తున్నాయని సహాయ బృందాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య భారీగా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పొంగిపొరలుతున్న గంగా ఉపనదులు
గంగా నదికి ఉపనదులైన ధౌలిగంగ, రిషి గంగ, అలకనందా పోటెత్తడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆందోళన నెలకొంది. పౌరి, తెహ్రి, రుద్రప్రయాగ, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాల్లోని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నింటినీ అధికారులు ఖాళీ చేయించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.‘‘చెవులు చిల్లులు పడేలా శబ్దం వినబడడంతో బయటకి వచ్చి చూశాం. ఎగువ నుంచి రాళ్లతో కూడిన నీటి ప్రవాహం అంతెత్తున ఎగిసిపడుతూ వస్తోంది. ధౌలిగంగా ఉగ్రరూపం, ఆ వేగం చూస్తే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. హెచ్చరించడానికి కూడా సమయం లేదు. నీటి ప్రవాహం పూర్తిగా ముంచేసింది. మేము కూడా కొట్టుకుపోతామనే భయపడ్డాం. దేవుడి దయ వల్ల బయట పడ్డాం’’అని సంజయ్ సింగ్ రాణా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
ఉత్తరాఖండ్ కోసం దేశం ప్రార్థిస్తోంది: ప్రధాని
ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తో మాట్లాడుతున్నానని తెలిపారు. దేశం యావత్తూ ఉత్తరాఖండ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు.
రూ. 4 లక్షల నష్టపరిహారం
రిషిగంగ ప్రాజెక్టు టన్నెల్స్‌లోని నీటి ప్రవాహంలో చిక్కుకొని మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ సీఎం రావత్ రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో గంగా పరివాహక ప్రాంత గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వరద నీరు దిగువకి వస్తే సహాయ చర్యలపై యూపీ సర్కార్ చర్చించింది.
రూ.2 లక్షల చొప్పున కేంద్ర పరిహారం
ఉత్తరాఖండ్ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్(పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. క్షతగాత్రులకు 50వేల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
సహాయక చర్యలు చేపట్టండి: సోనియా
ఉత్తరాఖండ్ దుర్ఘటనలో గాయపడిన వారికి తక్షణమే సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, స్వచ్ఛంద సేవలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. మంచు చరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం సంభవించడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిగిలిన వారంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా సంతాపం తెలిపారు.
నిలిచిపోయిన 200 మెగావాట్ల విద్యుత్
మంచు చరియలు విరిగిపడడంతో ముందు జాగ్రత్తగా ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, కోటేశ్వర్ హైడ్రో పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో 200 మెగావాట్ల కరెంటు గ్రిడ్‌కు అందలేదు.
నేడు ఘటనా స్థలానికి గ్లేసియాలజిస్టులు
మంచు చరియలు విరిగిపడడానికి గల కారణాలను అన్వేషించడానికి సోమవారం రెండు గ్లేసియాలజిస్టుల బృందాలు జోషీమఠ్–తపోవన్‌కు చేరుకోనున్నాయని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ తెలిపారు.
రెట్టింపు వేగంతో కరుగుతున్న హిమాలయాలు
హిమాలయాల్లో నందాదేవి మంచు చరియలు విరిగిపడి ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకోవడానికి కారణాలెన్ని ఉన్నప్పటికీ భారత్ సహా వివిధ దేశాలు మంచు ముప్పులో ఉన్నట్టుగా రెండేళ్ల క్రితమే ఒక అధ్యయనం హెచ్చరించింది. హిమాలయాల్లో మంచు రెట్టింపు వేగంతో కరిగిపోతున్నట్టుగా ఆ అధ్యయనం వెల్లడించింది. 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏడాదికేడాది హిమాలయాల్లోని మంచు కొండలు నిట్టనిలువుగా ఒక అడుగు వరకు కరిగిపోతున్నట్టుగా 2019 జూన్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
ఈ అ«ధ్యయనాన్ని జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ ప్రచురించింది. 1975 నుంచి 2000 మధ్య కాలంలో కాస్త కాస్త కరిగే మంచు 2000 సంవత్సరం తర్వాత నిలువుగా ఉండే ఒక అడుగు మందం వరకు కరిగిపోతూ ఉండడంతో భవిష్యత్‌లో భారత్ సహా వివిధ దేశాలు జల ప్రళయాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. దాదాపుగా 40 ఏళ్ల పాటు భారత్, చైనా, నేపాల్, భూటాన్ తదితర దేశాల్లోని ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనకారులు పరిశీలించారు.
పశ్చిమం నుంచి తూర్పు దిశగా 2వేల కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న 650 మంచుపర్వతాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనం చేసి హిమాలయాల్లో మంచు ఏ స్థాయిలో కరిగిపోతోందో ఒక అంచనాకి వచ్చారు. 1975–2000 సంవత్సరం నాటి కంటే 2000–2016 మధ్య ఉష్ణోగ్రతలు సగటున ఒక్క డిగ్రీ వరకు పెరిగాయి. అయితే మంచు మాత్రం రెట్టింపు వేగంతో కరిగిపోవడం ప్రారంభమైందని అధ్యయన నివేదికను రచించిన జోషా మారర్ వెల్లడించారు. అంతేకాదు 21వ శతాబ్దం ప్రారంభం నాటికి ముందు ఏడాదికి సగటున 0.25 మీటర్ల మంచు కరిగితే అప్పటుంచి 0.5 మీటర్ల మంచు కురుగుతున్నట్టు తేలిందని చెప్పారు. 80 కోట్ల మంది వరకు వ్యవసాయం, హైడ్రోపవర్, తాగు నీరు కోసం హిమాలయాలపై ఆధారపడి జీవిస్తున్నారు. భవిష్యత్‌లో తీవ్రం నీటి కొరత ఉంటుందని హెచ్చరించింది.
మంచు చరియలు ఎందుకు విరిగిపడతాయ్ ..?
హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడానికి ఎన్నో కారణాలుంటాయి. మంచు కొండలు కోతకు గురి కావడం, అడుగు భాగంలో ఉన్న నీటి ఒత్తిడి పెరగడం, హిమనీ నదాల కింద భూమి కంపించడం వంటి వాటి కారణాలతో ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడతాయి. హిమనీ నదాల్లో నీటి ప్రవాహం భారీ స్థాయిలో అటు ఇటూ మళ్లినప్పుడు కూడా మంచు చరియలు విరిగిపడుతూ ఉంటాయి. నందాదేవి గ్లేసియర్‌లో సరస్సు ఉన్నట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోందని, ఆ సరస్సు పొంగి పొరలడంతో మంచు చరియలు విరిగి పడి ఉండవచ్చునని ఇండోర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫరూక్ అజామ్ చెప్పారు. భారత్‌లోని హిమాలయాల్లో అత్యంత ఎల్తైన పర్వత ప్రాంతం కాంచనగంగలో ఈ నందాదేవి హిమనీనదం ఉంది. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఇది ప్రపంచంలోనే 23వ ఎత్తయిన పర్వత ప్రాంతం. వాతావరణంలో కలిగే విపరీత మార్పుల వల్ల కూడా నందాదేవిలో మంచు చరియలు విరిగిపడవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.
చమోలీ వద్ద రక్షణ చర్యల్లో నిమగ్నమైన భద్రతా బలగాలు
చమోలీ వద్ద కొట్టుకుపోయిన జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతం
తపోవన్ వద్ద క్షతగాత్రులను మోసుకొస్తున్న ఐటీబీపీ జవాన్లు
Comments
Please login to add a commentAdd a comment