Avalanches
-
జమ్మూ కశ్మీర్లో మంచు తుపాన్.. 30మందిని రక్షించిన ఆర్మీ సైనికులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో హిమపాతం బీభత్సం సృష్టించింది. చౌకీబాల్-తంగ్ధర్ రహదారిలో హిమపాతం పరిస్థితి తీవ్రంగా ఉంది. దట్టమైన మంచుదిబ్బల్లో సోమవారం 30 మంది పౌరులు చిక్కుకున్నారు. అక్కడే ఉన్న ఆర్మీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి.. 30మంది పౌరులను సురక్షితంగా కాపాడారు. వీరంతా ఖూని నాలా, ఎస్ఏం హిల్ వద్ద కురుస్తున్న భారీ మంచుచరియల్లో చిక్కుకున్నారని తెలిపారు. భారీగా కురుస్తున్న మంచు కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ 14 మంది పౌరులను నీలం పాస్ వద్దకు 16 మందిని సాధన పాస్ వద్దకు సురక్షితంగా తీసుకువచ్చామని తెలిపారు. పౌరులందరికీ రాత్రిపూట ఆహారం, వైద్యం, ఆశ్రయం కల్పించామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ దాదాపు ఆరు గంటలు కొనసాగిందని తెలిపారు. చదవండి: డాక్టర్‌కు 5 డోసుల వ్యాక్సిన్! దర్యాప్తు చేయాలన్న బిహార్ ప్రభుత్వం -
విలయం మిగిల్చిన విషాదం
డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ జల విలయానికి సంబంధించి ఇప్పటివరకు 26 మృతదేహాలు లభించాయి. గల్లంతైన మరో 171 మంది ఆచూకీ కోసం సహాయ దళాలు కృషి చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన 30 మందిని సహాయ బృందాలు రక్షించాయి. మరోవైపు, ఈ విలయానికి కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. చమోలీ జిల్లా, జోషిమఠ్ దగ్గర్లోని నందాదేవి హిమనీనదం వద్ద అనూహ్యంగా భారీ ఎత్తున మంచు చరియలు విరిగిపడడంతో గంగానది ఉపనదులైన అలకనంద, రిషి గంగ, ధౌలీ గంగ నదులకు వరద పోటెత్తిందని, దాంతో ఈ జల ప్రళయం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నదీమార్గంలోని పర్వతం పై నుంచి లక్షలాది మెట్రిక్ టన్నుల మంచు ఒక్కసారిగా, వేగంగా కిందకు విరుచుకుపడడంతో ఈ జల ప్రళయం సంభవించి ఉంటుందని భావిస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సోమవారం తెలిపారు. అంతకుముందు, ఆయన ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. ఇస్రో శాస్త్రవేత్తలు తనకు చూపించిన చిత్రాల్లో.. వరద ఉధృతి ప్రారంభమైన చోట హిమనీనదం ఏదీ కనిపించలేదని, మంచు అంతా కిందకు జారిపడిపోయిన ఒక పర్వతం మాత్రం ఉందని తెలిపారు. ఆ పర్వత శిఖరంపై నుంచే పెద్ద ఎత్తున మంచు కిందకు జారిపడి ఉంటుందని, దాంతో ధౌలి గంగ, రిషి గంగ నదులకు మెరుపు వరదలు వచ్చాయని భావిస్తున్నామని వివరించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష, పరోక్ష కారణాలను గుర్తించిన తరువాత, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తామని వివరించారు. అభివృద్ధి నిరోధక కధనాలకు అవకాశంగా ఈ దుర్ఘటనను తీసుకోవద్దని సూచించారు. వరద ప్రభావ ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించేలా రాష్ట్రంలో మౌలిక వసతులను బలోపేతం చేస్తామని సోమవారం తనను కలిసిన ఉత్తరాఖండ్ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. చదవండి: (తెలిసే వచ్చిన జలవిలయం ఇది) ముమ్మరంగా సహాయ చర్యలు వరదల్లో చిక్కుకుపోయి, ఇంకా ఆచూకీ లభించని సుమారు 170 మందిలో జల విద్యుత్కేంద్రంలో పనిచేస్తున్నవారు, నదీ తీరం వెంట ఇళ్లు కొట్టుకుపోవడంతో గల్లంతైన వారు ఉన్నారని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. 480 మెగావాట్ సామర్ధ్యమున్న, ఎన్టీపీసీకి చెందిన తపోవన్–విష్ణుగఢ్ విద్యుత్ కేంద్రం, 13.2 మెగావాట్ల సామర్ధ్యమున్న రిషి గంగ జల విద్యుత్ కేంద్రం తాజా వరదలతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. కచ్చితమైన సంఖ్య తెలియనప్పటికీ.. పదుల సంఖ్యలో కార్మికులు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సొరంగాల్లో చిక్కుకుపోయారు. దాదాపు 13 గ్రామాలకు చుట్టుపక్కల ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరద ప్రభావ ప్రాంతాల్లో ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టాయి. ఆర్మీ మెడికల్ కార్ప్స్, వైమానిక దళ బృందాలు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. చదవండి: (స్వయంకృతం) తపోవన్– విష్ణుగఢ్ విద్యుత్ కేంద్రం టన్నెల్లో చిక్కుకుపోయిన సుమారు 35 మందిని రక్షించేందుకు సహాయ బృందాలు కృషి చేస్తున్నాయి. పెద్ద ఎత్తున బుల్డోజర్లు, జేసీబీలు ఇతర యంత్ర సామగ్రిని అక్కడికి తరలించారు. 250 మీటర్ల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉన్న ఈ సొరంగ మార్గం కొద్దిగా వంపు తిరిగి ఉన్న కారణంగా సహాయ చర్యలకు సమయం పడుతోందని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. సొరంగంలోపల పెద్ద ఎత్తున బురద పేరుకుపోయిందని, ఇప్పటివరకు సుమారు 100 మీటర్ల మేర బురదను తొలగించగలిగామని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్‌కుమార్ పాండే వెల్లడించారు. సుమారు 300 మంది ఐటీబీపీ సిబ్బంది ఈ విధుల్లోనే ఉన్నారన్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన అందరినీ రక్షించగలమనే ఆశిస్తున్నామన్నారు. అధికారులు అందజేసిన వివరాల ప్రకారం.. ఈ వరదల్లో విద్యుత్ కేంద్రాల సిబ్బందిలో 202 మంది గల్లంతయ్యారని, వారు ప్రధానంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల వారని పాండే వివరించారు. ఈ విద్యుత్ ప్రాజెక్టుల సూపర్వైజర్లు కూడా గల్లంతు కావడంతో ఉద్యోగులు/కార్మికులకు సంబంధించిన పూర్తి సమాచారం లభించడం లేదన్నారు. మరో చిన్న సొరంగంలో.. తపోవన్– విష్ణుగఢ్ కేంద్రానికి సంబంధించిన మరో చిన్న సొరంగంలో చిక్కుకుపోయిన 12 మందిని, రిషిగంగ కేంద్రం వద్ద వరదల్లో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించగలిగామని తెలిపారు. ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లకు చెందిన స్నిఫర్ డాగ్స్‌ను కూడా సహాయ చర్యల్లో పాలు పంచుకునేందుకు రంగంలోకి దింపారు. ఈ సొరంగానికి ఒకవైపే మార్గం ఉందని విద్యుత్ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. సోమవారం మరిన్ని బలగాలను జోషిమఠ్‌కు పంపించామని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. వరద ఉధృతికి మేటవేసిన బురదతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. పలు నిర్మాణాలు కొట్టుకుపోయి, బురదలో కూరుకుపోయాయి. కచ్చితమైన కారణమేంటి? ఈ దుర్ఘటనకు కచ్చితమైన కారణాన్ని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఇందుకోసం పలు బృందాలు ఇప్పటికే చమోలీ చేరుకున్నాయి. డీఆర్డీవోలోని ‘ద స్నో అండ్ అవలాంచీ స్టడీ ఎస్టాబ్లిష్మెంట్’సభ్యులు రంగంలోకి దిగారు. వాతావరణ మార్పు, లేదా ఆకస్మిక శీతాకాల వర్షాలు ఈ విలయానికి కారణం కావచ్చని నిపుణులంటున్నారు. హిమనీనద సరస్సు ఒక్కసారిగా ఉప్పొంగడం వల్ల కానీ, మంచు చరియలు విరిగి నదీ మార్గాన్ని అడ్డుకుని, ఆ తరువాత ఒక్కసారిగా ఆ మార్గం తెరుచుకోవడంతో కింది ప్రాంతాలకు విరుచుకుపడిన వరద వల్ల కానీ ఈ జల ప్రళయం చోటు చేసుకుని ఉండవచ్చని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. -
ఉత్తరాఖండ్‌లో జల విలయం
డెహ్రాడూన్: హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకొని విలవిలలాడుతోంది. గంగా పరివాహక ప్రాంతాలు వరద ముప్పులో బిక్కుబిక్కుమంటున్నాయి. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో నందాదేవి పర్వతం నుంచి హఠాత్తుగా మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది పోటెత్తింది. ఒక్కసారిగా రాళ్లు, మంచు ముక్కలతో కూడిన నీటి ప్రవాహం కిందకి విరుచుకుపడడంతో ధౌలిగంగ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. దీంతో తపోవన్–రేణిలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. తపోవన్–విష్ణుగఢ్ ప్రాజెక్టు కూడా దెబ్బతిందని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. తపోవన్ వద్ద పనిచేస్తున్న 148 మంది, రిషిగంగ వద్ద 22 మంది మొత్తం 170 మంది కనిపించకుండా పోయినట్లు ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే చెప్పారు. కొన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగి సహాయ చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. నీళ్లలో మునిగిపోయిన ప్రాజెక్టు సొరంగ మార్గంలోకి ప్రాణాలకు తెగించి వెళ్లిన ఐటీబీపీ సిబ్బంది 16 మందిని కాపాడారు. మరో ఏడు మృతదేహాలను వెలికితీసినట్టుగా ఐటీబీపీ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోనికి వస్తున్నాయని సహాయ బృందాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య భారీగా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పొంగిపొరలుతున్న గంగా ఉపనదులు గంగా నదికి ఉపనదులైన ధౌలిగంగ, రిషి గంగ, అలకనందా పోటెత్తడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆందోళన నెలకొంది. పౌరి, తెహ్రి, రుద్రప్రయాగ, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాల్లోని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నింటినీ అధికారులు ఖాళీ చేయించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.‘‘చెవులు చిల్లులు పడేలా శబ్దం వినబడడంతో బయటకి వచ్చి చూశాం. ఎగువ నుంచి రాళ్లతో కూడిన నీటి ప్రవాహం అంతెత్తున ఎగిసిపడుతూ వస్తోంది. ధౌలిగంగా ఉగ్రరూపం, ఆ వేగం చూస్తే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. హెచ్చరించడానికి కూడా సమయం లేదు. నీటి ప్రవాహం పూర్తిగా ముంచేసింది. మేము కూడా కొట్టుకుపోతామనే భయపడ్డాం. దేవుడి దయ వల్ల బయట పడ్డాం’’అని సంజయ్ సింగ్ రాణా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఉత్తరాఖండ్ కోసం దేశం ప్రార్థిస్తోంది: ప్రధాని ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తో మాట్లాడుతున్నానని తెలిపారు. దేశం యావత్తూ ఉత్తరాఖండ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. రూ. 4 లక్షల నష్టపరిహారం రిషిగంగ ప్రాజెక్టు టన్నెల్స్లోని నీటి ప్రవాహంలో చిక్కుకొని మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ సీఎం రావత్ రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో గంగా పరివాహక ప్రాంత గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వరద నీరు దిగువకి వస్తే సహాయ చర్యలపై యూపీ సర్కార్ చర్చించింది. రూ.2 లక్షల చొప్పున కేంద్ర పరిహారం ఉత్తరాఖండ్ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్(పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. క్షతగాత్రులకు 50వేల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సహాయక చర్యలు చేపట్టండి: సోనియా ఉత్తరాఖండ్ దుర్ఘటనలో గాయపడిన వారికి తక్షణమే సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, స్వచ్ఛంద సేవలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. మంచు చరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం సంభవించడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిగిలిన వారంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా సంతాపం తెలిపారు. నిలిచిపోయిన 200 మెగావాట్ల విద్యుత్ మంచు చరియలు విరిగిపడడంతో ముందు జాగ్రత్తగా ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, కోటేశ్వర్ హైడ్రో పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో 200 మెగావాట్ల కరెంటు గ్రిడ్‌కు అందలేదు. నేడు ఘటనా స్థలానికి గ్లేసియాలజిస్టులు మంచు చరియలు విరిగిపడడానికి గల కారణాలను అన్వేషించడానికి సోమవారం రెండు గ్లేసియాలజిస్టుల బృందాలు జోషీమఠ్–తపోవన్‌కు చేరుకోనున్నాయని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ తెలిపారు. రెట్టింపు వేగంతో కరుగుతున్న హిమాలయాలు హిమాలయాల్లో నందాదేవి మంచు చరియలు విరిగిపడి ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకోవడానికి కారణాలెన్ని ఉన్నప్పటికీ భారత్ సహా వివిధ దేశాలు మంచు ముప్పులో ఉన్నట్టుగా రెండేళ్ల క్రితమే ఒక అధ్యయనం హెచ్చరించింది. హిమాలయాల్లో మంచు రెట్టింపు వేగంతో కరిగిపోతున్నట్టుగా ఆ అధ్యయనం వెల్లడించింది. 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏడాదికేడాది హిమాలయాల్లోని మంచు కొండలు నిట్టనిలువుగా ఒక అడుగు వరకు కరిగిపోతున్నట్టుగా 2019 జూన్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అ«ధ్యయనాన్ని జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ ప్రచురించింది. 1975 నుంచి 2000 మధ్య కాలంలో కాస్త కాస్త కరిగే మంచు 2000 సంవత్సరం తర్వాత నిలువుగా ఉండే ఒక అడుగు మందం వరకు కరిగిపోతూ ఉండడంతో భవిష్యత్‌లో భారత్ సహా వివిధ దేశాలు జల ప్రళయాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. దాదాపుగా 40 ఏళ్ల పాటు భారత్, చైనా, నేపాల్, భూటాన్ తదితర దేశాల్లోని ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనకారులు పరిశీలించారు. పశ్చిమం నుంచి తూర్పు దిశగా 2వేల కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న 650 మంచుపర్వతాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనం చేసి హిమాలయాల్లో మంచు ఏ స్థాయిలో కరిగిపోతోందో ఒక అంచనాకి వచ్చారు. 1975–2000 సంవత్సరం నాటి కంటే 2000–2016 మధ్య ఉష్ణోగ్రతలు సగటున ఒక్క డిగ్రీ వరకు పెరిగాయి. అయితే మంచు మాత్రం రెట్టింపు వేగంతో కరిగిపోవడం ప్రారంభమైందని అధ్యయన నివేదికను రచించిన జోషా మారర్ వెల్లడించారు. అంతేకాదు 21వ శతాబ్దం ప్రారంభం నాటికి ముందు ఏడాదికి సగటున 0.25 మీటర్ల మంచు కరిగితే అప్పటుంచి 0.5 మీటర్ల మంచు కురుగుతున్నట్టు తేలిందని చెప్పారు. 80 కోట్ల మంది వరకు వ్యవసాయం, హైడ్రోపవర్, తాగు నీరు కోసం హిమాలయాలపై ఆధారపడి జీవిస్తున్నారు. భవిష్యత్‌లో తీవ్రం నీటి కొరత ఉంటుందని హెచ్చరించింది. మంచు చరియలు ఎందుకు విరిగిపడతాయ్ ..? హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడానికి ఎన్నో కారణాలుంటాయి. మంచు కొండలు కోతకు గురి కావడం, అడుగు భాగంలో ఉన్న నీటి ఒత్తిడి పెరగడం, హిమనీ నదాల కింద భూమి కంపించడం వంటి వాటి కారణాలతో ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడతాయి. హిమనీ నదాల్లో నీటి ప్రవాహం భారీ స్థాయిలో అటు ఇటూ మళ్లినప్పుడు కూడా మంచు చరియలు విరిగిపడుతూ ఉంటాయి. నందాదేవి గ్లేసియర్‌లో సరస్సు ఉన్నట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోందని, ఆ సరస్సు పొంగి పొరలడంతో మంచు చరియలు విరిగి పడి ఉండవచ్చునని ఇండోర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫరూక్ అజామ్ చెప్పారు. భారత్‌లోని హిమాలయాల్లో అత్యంత ఎల్తైన పర్వత ప్రాంతం కాంచనగంగలో ఈ నందాదేవి హిమనీనదం ఉంది. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఇది ప్రపంచంలోనే 23వ ఎత్తయిన పర్వత ప్రాంతం. వాతావరణంలో కలిగే విపరీత మార్పుల వల్ల కూడా నందాదేవిలో మంచు చరియలు విరిగిపడవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. చమోలీ వద్ద రక్షణ చర్యల్లో నిమగ్నమైన భద్రతా బలగాలు చమోలీ వద్ద కొట్టుకుపోయిన జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతం తపోవన్ వద్ద క్షతగాత్రులను మోసుకొస్తున్న ఐటీబీపీ జవాన్లు -
టర్కీలో వరుస హిమపాతాలు..
అంకారా: టర్కీలోని వాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న రెండు వరుస హిమపాతాల కారణంగా 38 మంది మంచులో సజీవసమాధి అయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన మొదటి హిమపాతంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వీరిని వెలికితీసేందుకు దాదాపు 300 మంది అత్యవసర విభాగం ఘటనా స్థలికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం మరో హిమపాతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో 8 మంది మిలిటరీ ఆఫీసర్లు, 9 మంది వాలంటీర్లు, మరో ముగ్గురు ప్రభుత్వం నియమించిన గార్డులు ఉన్నట్లు చెప్పారు. గల్లంతైన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. -
కశ్మీర్లో మంచుఖండాల భీబత్సం : నలుగురు సైనికులు మృతి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో గడిచిన 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ముంచుకొచ్చిన మంచుఖండాలతో నలుగురు బీఎస్ఎఫ్ సైనికులు మరణించారు. బండిపార జిల్లా గురెజ్, రాంపురా, కుప్వారా జిల్లాలోని మచిల్ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా ఆవరించి అనూహ్యంగా మంచుఖండాలు ముంచెత్తడంతో విధి నిర్వహణలో నిమగ్నమైన సైనికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మచిల్‌లో విధినిర్వహణలో ఉన్న నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరి ఆచూకీ గల్లంతైంది. గుల్మార్గ్ సెక్టార్లో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో గర్వాల్ రైఫిల్స్ రెజిమెంట్‌కు చెందిన ఓ సైనిక జవాన్ మంచుకొండల్లోకి జారిపడటంతో గల్లంతయ్యాడని ఆర్మీ అధికారులు తెలిపారు. గల్లంతైన జవాన్‌ను హవాల్ధర్ రాజేంద్ర సింగ్ నేగిగా గుర్తించారు. గల్లంతైన జవాన్లను కాపాడేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
ముగ్గురి జవాన్ల మృతి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. శుక్రవారం మచిల్ సెక్టార్, ఉత్తర కశ్మీర్, కుప్వార జిల్లాలోని ఆర్మీక్యాంప్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. బుధవారం అఫ్ఘనిస్తాన్- తజకిస్తాన్ సరిహద్దుల్లో భూమి కంపించడంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కశ్మీర్‌లోని పలు జిల్లాలకు గువారమే ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. -
సాహసికులు ఇష్టపడే కెరీర్.. గ్లేసియాలజిస్ట్
జమ్మూకాశ్మీర్‌లోని ఖేలాన్మార్గ్లో 2010, ఫిబ్రవరి 8న సంభవించిన మంచు ఉత్పాతం దేశాన్ని నివ్వెరపరిచింది. ఇండియన్ ఆర్మీ వార్ఫేర్ స్కూల్‌పై మంచు దిమ్మెలు కుప్పకూలాయి. ఈ దుర్ఘటనలో కెప్టెన్‌తో సహా 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మృత్యురూపంలోని హిమ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేసే నిపుణులు అక్కడ అందుబాటులో ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. హిమాలయాల్లో హిమనీనదాలు(అవలాంచీ), మంచు తుపాన్ల బెడద అధికం. వీటితో ప్రతిఏటా అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగడం పరిపాటిగా మారింది. హిమపాతాలను ముందుగానే గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నడుం కట్టింది. ఈ నేపథ్యంలో గ్లేసియాలజిస్ట్‌లు, అవలాంచీ నిపుణులకు డిమాండ్ పెరిగింది. పర్వతారోహణపై ఆసక్తి, మంచు కొండల అందాలపై అనురక్తి ఉన్నవారికి సరిగ్గా సరిపోయే కెరీర్ ఇది. విదేశాల్లోనూ కొలువులు గ్లేసియాలజిస్ట్‌లకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో, పరిశోధనా సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. రక్షణ శాఖలో వీరిని నియమించుకుంటున్నారు. మంచు తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో సర్వేలు, మ్యాపింగ్, గృహ, రహదారుల నిర్మాణం వంటి వాటిలో గ్లేసియాలజిస్ట్‌లు, అవలాంచీ ఎక్స్పర్ట్స్ భాగస్వామ్యం తప్పనిసరి. మంచు తీవ్రతను తట్టుకొనే నిర్మాణాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. హిమాలయాల్లో మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధి చెందుతుండడంతో గ్లేసియాలజిస్ట్‌లకు అవకాశాలు పెరుగుతున్నాయి. వీరికి విదేశాల్లోనూ కొలువులు ఉన్నాయి. ఈ రంగంలో బాధ్యతలు ఉత్సాహభరితంగా, సవాళ్లతో కూడుకొని ఉంటాయి. సుందరమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పనిచేసుకోవచ్చు. సాహసాలను ఇష్టపడేవారు ఇందులో సులభంగా రాణించొచ్చు. కావాల్సిన నైపుణ్యాలు గ్లేసియాలజిస్ట్‌లకు పరిశోధనా, విశ్లేషణా నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే సామర్థ్యం అవసరం. పర్వతారోహణపై అవగాహన పెంచుకోవాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ఇందుకు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ స్పిరిట్ అవసరం. నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి. అర్హతలు గ్లేసియాలజిస్ట్గా మారాలనుకుంటే సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత మ్యాథమెటిక్స్/ఫిజికల్/బయాలాజికల్/కెమికల్/ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెన్సైస్ సబ్జెక్టులతో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులను అభ్యసించాలి. మన దేశంలో ప్రముఖ విద్యాసంస్థలు ఆయా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వేతనాలు గ్లేసియాలజిస్ట్‌లు, స్నో సైంటిస్ట్లకు సీనియారిటీని బట్టి లెవల్ ఎ, లెవల్ బి... లెవల్ హెచ్ వరకు హోదాలుంటాయి. లెవల్ ఎ నిపుణులకు నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వేతనం ఉంటుంది. నాలుగైదేళ్లలో లెవల్ బి, సిలకు చేరుకోవచ్చు. ఈ దశలో నెలకు రూ.38 వేలు అందుతుంది. మెరుగైన పనితీరు, అనుభవంతో లెవల్ హెచ్‌కు చేరుకుంటే నెలకు రూ.లక్షకు పైగానే పొందొచ్చు. దీంతోపాటు ఉచిత వైద్యం, ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్), వసతి.. వంటి ప్రయోజనాలు ఉంటాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వెబ్సైట్: www.drdo.gov.in టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వెబ్సైట్: www.tifr.res.in వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ-డెహ్రాడూన్ వెబ్సైట్: www.wihg.res.in జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వెబ్సైట్: www.jnu.ac.in