
ఉత్తరాఖండ్ బాధితుల భయానక అనుభవాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగి పడటం సాధారణమే. కానీ శుక్రవారం జరిగిన ఉత్పా తం మాత్రం విషాదాన్ని మిగిల్చింది. ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వాళ్లు జ్యోతిర్మఠ్‌లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ భయానక అనుభవాలను వారు మీడియాతో పంచుకున్నారు.
తిండికీ, దాహానికీ మంచే!
‘‘నేను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్‌ఓ)లో యా క్సిలరేటర్ యంత్రాన్ని నడుపుతున్నా. రోడ్డు పక్కన కంటైనర్లలో నివసిస్తున్నాం. శుక్రవారం ఉదయం నిద్రలేచి బయటికొచ్చి చూశాను. ప్రశాంతంగా కనిపించే మంచు ఉన్నట్టుండి ఉగ్రరూపం దాల్చింది. విపరీతమైన ఉరుముల శబ్దం వినిపించింది. పైకి చూస్తే మంచు మా వైపు వేగంగా దూసుకొస్తోంది. నా సహచరులను అప్రమత్తం చేయడానికి కేకలు వేసి పరుగెత్తాను. కానీ అప్పటికే అడుగుల మేర మంచు కురవడంతో వేగంగా పరుగెత్తలేకపోయాం. అందులోనే కూరుకుపోయాం.
రెండు గంటల తర్వాత పోలీసులు మమ్మల్ని కాపాడారు’’ అని చమోలికి చెందిన – గోపాల్ జోషి చెప్పాడు. ‘‘మేం నిద్రిస్తుండగానే మంచు దెబ్బకు మా కంటైనర్ బోల్తా పడింది. ఏం జరిగిందో తెలుసుకునే సరికి మంచులో కూరుకుపోయి ఉన్నాం. నా పక్కనున్న సహో ద్యోగి మరణించాడు. నా కాలు విరిగింది. తలకు గాయమైంది. కంటైనర్‌లో ఉన్న వాళ్లమంతా గాయాలపాలయ్యాం. దూరంగా హోటల్ కనిపిస్తే అక్కడికెళ్లి తలదాచుకున్నాం. ఎటు చూసినా తెల్లని మంచు! ఆకలేసినా, దాహమేసినా మంచే దిక్కయింది.
12 మందిమి 25 గంటలు గడ్డ కట్టించే చలిలో ఒక్కటే బ్లాంకెట్ సాయంతో తలతాచుకున్నాం’’ అని అమృత్‌సర్‌కు చెందిన జగ్బీర్‌సింగ్ చెప్పాడు. ‘‘ప్రమాదం తరువాత 12 గంటల పాటు మంచు కింద గాయాలతో పడున్నాం. ముక్కులు మూసుకుపోయి శ్వాస తీసుకోవడమే కష్టమైంది’’ అని బిహార్‌లోని వైశాలికి చెందిన మున్నా ప్రసాద్ వాపోయాడు. ‘‘చాలా రోజులుగా మంచు కురుస్తోంది. మంచు చరియలు విరిగి పడటంతో చూస్తుండగానే వంద మీటర్ల లోతుకు పడిపోయాం. 200 మీటర్ల దూరంలో ఖాళీగా ఉన్న ఆర్మీ బ్యారక్ మాకు జీవితాన్నిచ్చింది. 24 గంటలు దాంట్లోనే తలదాచుకున్నాం’’ అని మొరాదాబాద్‌కు చెందిన విజయ్‌పాల్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment