రాజధానుల తీరం! | Soliloquy rivers article | Sakshi
Sakshi News home page

రాజధానుల తీరం!

Published Mon, Mar 2 2015 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

రాజధానుల తీరం!

రాజధానుల తీరం!

గమనం
నదుల స్వగత కథనం

 
నా పుట్టింటి నుంచి చూస్తే నేలంతా ఎక్కడో పాతాళంలో ఉన్నట్లుంటుంది. నేను ఆకాశమంత ఎత్తులో పుట్టాను. అందుకే అలా అనిపిస్తోందేమో. హిమాలయాల్లోని బందర్‌పూర్ శిఖరం మీద పుట్టి కొండ వాలులో చుక్కలుగా జారిపోతూ యమునోత్రి దగ్గర మడుగు కట్టాను. అక్కడి నుంచి కూడా నా గమనం మంచుకి గడ్డకడుతూ ఎండకు కరుగుతూ వేగంగా జారిపోతూ డూన్ లోయ వరకు అలాగే పరుగుతీస్తాను. డూన్ లోయలో దాక్ పత్తర్ దగ్గర ఆగి ఊపిరి పీల్చుకుని పరుగుని నడకగా మార్చుకుంటాను. నిజానికి నేను ఉపనదినే కానీ ప్రధాన నదికి ఉన్నంత ప్రాధాన్యమిచ్చి గౌరవించింది దేశం. పదివేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో పుట్టిన నేను ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వరకు పదమూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాను. ఎప్పుడో ప్రాచీనకాలంలో ఒకసారి భూమి కదలికలతో నా ప్రవాహం ఒక్కసారిగా అలహాబాద్ వైపుగా దిశమారింది. గంగానదితో సంగమించడంతో నా ప్రయాణం ముగుస్తుంది. ఆ కదలికలే సరస్వతి నది భూమి లోపలి పొరల్లోకి ఇంకిపోవడానికీ కారణమయ్యాయి. నీటి ప్రవాహం నేలను కోసేసినప్పుడు నేలకంటే బలమైనది నీరే అనుకుంటాం. నీటికంటే నేల బలమైనదని అప్పుడప్పుడూ నేల కూడా నిరూపిస్తుంటుంది.
 
నేను లేక కృష్ణుడు లేడు!

శ్రీకృష్ణుడు నా ఒడ్డునే పెరిగాడు. పెరగడం ఏంటి, కృష్ణుణ్ని దాచడానికి రేపల్లె దారి పట్టిన వసుదేవుడికి రెండుగా చీలిపోయి మరీ దారిచ్చాను. నా ఒడ్డున భరతుడు, అంబరీషుడు, శంతనుడు వంటి చక్రవర్తులు పుణ్యకార్యాలు చేశారు. నా ఒడ్డున దేశ రాజధాని ఉంది, ఇప్పటి రాజధానిని మాత్రమే కాదు. మహాభారత కాలంలో కౌరవులు, పాండవుల కేంద్రాన్ని. గుప్తులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు కూడా నా తీరాన్నే రాజ్యాలను విస్తరించారు. వారి రాజముద్రికల మీద నన్ను చిత్రించారు. రాష్ట్రకూటులు ఇంకా ఉత్సాహంగా నా గురించి దక్షిణాదికి కూడా తెలియచేయాలనుకున్నారో ఏమో! ఎల్లోరా గుహల్లో ‘నదీమతల్లుల ఆలయా’న్ని నిర్మించారు. అందులో గంగ, సరస్వతితోపాటు నేను కూడా అందమైన యువతి రూపంలో కనిపిస్తాను. ఈ సారి ఎల్లోరా గుహలకు వెళ్తే తప్పక చూడండి. అయినా దక్షిణాదిలో నా ప్రవాహం లేదనే కానీ నేను దేశమంతటికీ పరిచయమైన దాన్నే. దేశరాజధానికి ప్రధాన నీటి వనరు నేనే. ఢిల్లీకి వచ్చిన పార్లమెంటుసభ్యులందరి దాహాన్ని తీర్చేది నేనే.

ప్రపంచ వింత!

ఢిల్లీ నుంచి ఆగ్రా వైపు కదిలితే ప్రపంచవింతల్లో ఒకటైన తాజ్‌మహల్ పలకరిస్తుంది. మొఘల్ పాలకుడు షాజహాన్ తాజ్ మహల్ నిర్మాణానికి నా తీరాన్ని ఎంచుకోవడం, రాజపుత్ర రాజు ‘మహారాజా జయ్‌సింగ్’తో సంప్రదింపులు, ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన తాజ్‌మహల్ నిర్మాణం మరుపురాని దృశ్యాలు. ఆగ్రా కోట నుంచి చూస్తే తాజ్‌మహల్ మరింత అందంగా, తెల్లవారు జామున మంచులో తడిసిన మల్లెపువ్వులా కనిపిస్తుంది. అక్బర్ నా తీరాన ఉన్న ఎర్రకోటను పునర్నిర్మించి అక్కడి నుంచే పాలించాడు. తర్వాతి పాలకులు ఢిల్లీ దారిపట్టి షాజహానాపూర్ (ఓల్డ్ ఢిల్లీ) పేరుతో రాజధానిని మార్చుకున్నారు. కానీ అదీ నా తీరాననే కదా!
 
లోధీలనూ... లోభూలనూ!

ఒక్కొక్క రాజవంశం అధికారంలోకి వస్తూ తమ పేరుతో రాజ్యాలను స్థాపించడం, ఉన్న వాటినే పేరు మార్చుకుని తమ ముద్ర వేసుకోవడం, పాత పునాదుల మీదనే కోటలకు కొత్త రూపు తీసుకురావడం... అన్నీ చూస్తూనే ఉన్నాను. ఆ యుద్ధాలు, రక్తపాతాలూ స్మృతిపథం నుంచి చెరిగిపోవడం లేదు. ఢిల్లీని పాలించిన లోధీల ప్రాభవాన్ని చూశాను. రాజపుత్రుల వీరత్వాన్ని, మొఘలుల పోరాటపటిమనూ ఆస్వాదించాను. బ్రిటిష్ పాలకుల లౌక్యాన్నీ గమనించాను. ఇప్పటి పాలకుల అవకాశవాద వ్యూహప్రతివ్యూహాలనూ వీక్షిస్తున్నాను. లెక్క చూసుకోకుండా పరిశ్రమలకు అనుమతులివ్వడం, గాలి నీరు కలుషితమయ్యాయంటూ తీసేయడం, రంగుమారిన తాజ్‌మహల్ పాలరాతి గోడల్ని చూసి పెదవి విరిచిన పర్యాటకుడి సాక్షిగా భరిస్తున్నాను. ‘తాజ్‌మహల్... ఫొటోలో ఉన్నంత అందంగా లేదేంటమ్మా’ అనే పదేళ్ల పిల్లాడి సందేహం తీర్చడానికి ఆ తల్లి దగ్గర ఒక్కమాటలో సమాధానం ఉంటుందా? నా పరిస్థితీ అంతే.
 
ప్రయాణంలో మజిలీలు...

పురాతన కాలంలో గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ మనదేశానికి వచ్చినప్పుడు నా తీరాన పర్యటించాడు. ‘ఇండికా’ రాస్తూ నా తీరాన్ని శూరసేనుడి రాజ్యంలో ప్రవహించే ప్రధానమైన నదిగా అభివర్ణించాడు. అలెగ్జాండర్ ప్రతినిధి సెల్యూకస్ నాకు ‘లూమాన్స్’ అంటూ కొత్త పేరు తగిలించాడు. ఎవరెలా పిలిచినా కాదనేదెలా? నా నీరు మేలిమి నీలిరంగులో ఉంటాయి. కానీ అంత చిక్కదనంలో నీలం బదులు నలుపు కనిపించిందో ఏమో ‘కాళింది’ అని కూడా పిలిచారు. నాతోపాటు నా ప్రవాహంలో చేరే ‘టాన్స్, చంబల్, సింధ్, బేత్వా, కెన్, రిషిగంగ, గిరి, కుంత, హనుమాన్‌గంగ, బాతా నదుల నీరు అంత చిక్కగా ఉండదు. కానీ నాలో కలిసి ఓ ఫర్లాంగు ప్రయాణిస్తాయో లేదో నీలంగా మారిపోతాయి. అన్నట్లు మీకు మరో సంగతి తెలుసా? నేను, గంగమ్మ ఇద్దరం హిమాలయాల్లోనే పుట్టాం, అలహాబాద్ దగ్గర కలుస్తున్నాం, మా ప్రవాహాన్ని ఆకాశం నుంచి చూస్తే రైలుపట్టాల్లా సమాంతరంగా ప్రయాణిస్తున్నట్లే ఉంటుంది. రెండు విభిన్నమైన రంగుల్లో కనిపిస్తాం. ఆ తేడా మేము కలిసిన తరవాత దాదాపు పదిమైళ్ల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత నేను, నా ఉనికి ఏమీ ఉండవు.
 
పచ్చదనాల నేల!

రాజధాని దాహార్తి తీర్చిన నేను హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్‌ల సాగుకు సాయమందిస్తున్నాను. నా నీటితో బాసుమతి బియ్యం పండడం, ఆ బియ్యంతో బిరియానీ ఘుమఘుమల కోసం దేశం అంతా ముక్కుపుటాలు విచ్చుకుని ఆస్వాదించడం చూస్తే నా జన్మ ధన్యమైందనిపిస్తుంది. హరియాణ (హర్యానా) నేలకు ఆ పేరు రావడానికి కారణం నా నీరే. ఆ కృతజ్ఞతతోనే కాబోలు వాళ్లు ఒక జిల్లాకు యమునానగర్ అని పేరు పెట్టుకున్నారు. అక్కడ కట్టిన ఆనకట్ట నుంచి రాజస్థాన్‌కు నీరందుతోంది. సట్లెజ్‌ను - నన్ను కలపాలనే గొప్ప ఆలోచన మన పాలకులకు వచ్చినప్పుడు సంతోషంతో ఉప్పొంగిపోయాను. ఆ అనుసంధానమే కనుక జరిగితే తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి ప్రధాన రవాణా మార్గాన్నవుతాను. ఇప్పుడు హిందూమహాసముద్రం మీదుగా చుట్టుతిరిగి వెళ్తున్న నౌకల ప్రయాణదూరం తగ్గిపోతుంది. కానీ నేను సంతోషించినంత వేగంగా హర్యానా స్పందించింది కానీ పంజాబ్‌కు పట్టడం లేదు. ఆ అనుసంధానం జరిగి ఈ తీరాన్ని- ఆ తీరాన్ని కలిపే ఇరుసు నేనయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ...

 - యమునా నది
 ప్రెజెంటేషన్: వాకా మంజులారెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement