Yamunotri
-
రేపటి నుంచి కేదార్నాథ్ ఆలయం మూసివేత
చార్‌ధామ్‌గా ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యుమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయానున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది.కాగా ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. చార్‌ధామ్‌లో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్ ధామ్‌ను నవంబర్ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు. -
నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత
డెహ్రాడూన్: భక్తిశ్రద్ధలతో కొనసాగున్న చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. శీతాకాలం రాకతో నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేయనున్నారు. అనంతరం ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనం కొనసాగుతుంది. ఇదేవిధంగా ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేయనున్నారు.దీపోత్సవంతో గంగోత్రి ధామం తలుపులు మూసివేసే ప్రక్రియను ప్రారంభించినట్లు పంచ గంగోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ తెలిపారు. అనంతరం గంగామాత ఉత్సవ విగ్రహంతో డోలి యాత్ర నిర్వహిస్తూ శీతాకాలపు విడిదికి తీసుకువస్తామని చెప్పారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించారు. ఆదివారం యమునోత్రి ధామ్ మూసివేసిన తర్వాత, యమునా తల్లి ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీలోని ఆలయానికి తీసుకువస్తారు. ఈ యాత్రా కాలంలో శుక్రవారం సాయంత్రం వరకు 15 లక్షల 21 వేల 752 మంది యాత్రికులు ఈ రెండు ధామాలను సందర్శించుకున్నారు.ఇది కూడా చదవండి: మొబైల్ డేటా ట్రాఫిక్.. అగ్రగామిగా జియో -
‘చార్ధామ్’ మార్గంలో విషాదం.. ఇప్పటివరకూ 14 మంది మృతి
చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లలో భక్తుల రద్దీ నెలకొంది. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. అయితే ఈ యాత్రలో పలు విషాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.చార్ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి గంగోత్రి-యమునోత్రి ధామ్‌లో ఇప్పటివరకు మొత్తం 14 మంది భక్తులు మృతి చెందారు. తాజాగా యమునోత్రి యాత్రలో గుజరాత్, మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ మరణాలన్నీ గుండె పోటు కారణంగానే సంభవించాయనే సమాచారం అందుతోంది.మరోవైపు చార్ ధామ్ యాత్రకు సంబంధించిన ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం పలువురు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో వారు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదారు రోజులుగా వేచి చూస్తున్నా తమ యాత్రకు రిజిస్ట్రేషన్ జరగడం లేదని వారు వాపోతున్నారు. -
కేదార్నాథ్ ఆలయం మూసివేత
కశ్మీర్: హిమాలయాల్లోని కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలు బుధవారం మూతపడ్డాయి. కేదార్నాథ్ ఆలయ తలుపులు ఉదయం 8:30 గంటలకు, యమునోత్రి తలుపులు 11:57 గంటలకు మూసివేయబడ్డాయి. విపరీతమైన చలిలో కూడా కేదార్‌నాథ్‌లో జరిగిన ముగింపు కార్యక్రమానికి 2,500 మందికి పైగా యాత్రికులు హాజరయ్యారని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. ఈ ఆలయం శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. కేదార్నాథ్ సమీప ప్రాంతాలు ఇప్పటికే మంచుతో కప్పబడ్డాయి. కేదార్నాథ్ శివున్ని'పంచముఖి డోలీ' ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి పూజారులు తీసుకువెళ్లారు. శీతాకాలం ముగిసేవరకు అక్కడే పూజలు నిర్వహించనున్నారు. శీతాకాలంలో 19.5 లక్షల మంది యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించారని అధికారులు తెలిపారు. ఛార్‌దామ్ యాత్రలో భాగమైన యమునోత్రి ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు. శీతాకాలం ముగిసేవరకు ఉత్తరకాశీ జిల్లాలోని ఖర్సాలీ గ్రామంలోని ఖుషిమత్‌లో ఆరు నెలల పాటు పూజిస్తారు. భద్రినాథ్ దామ్‌ను కూడా నవంబర్ 18న మూసివేయనున్నారు. శీతాకాలంలో హిమాలయాల్లో తీవ్ర మంచు కారణంగా ఛార్‌దామ్ యాత్రను ప్రతి ఏడాది అక్టోబర్-నవంబర్‌లో నిలిపివేసి మళ్లీ ఏప్రిల్-మే నెలల్లో ప్రారంభిస్తారు. ఇదీ చదవండి: అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించండి -
డబుల్ సెంచరీ కొట్టిన టమాట.. కిలో ఏకంగా రూ. 250.. ఎక్కడంటే
ఎన్నడూ లేనంతగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఏదీ కొందామన్న అగ్గిలాగ మండుతున్నాయి. ప్రధానంగా టమాటా ధర దడపుట్టిస్తోంది. సాధారణంగా రూ. 20, 30 కిలో ఉండే టమాట ఇప్పుడు సామన్యుడికి అందని ద్రాక్షగా మారింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే సెంచరీ దాటి టామాట మరింత పరుగులు పెడుతోంది. మరి కొన్ని చోట్ల ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది. పెరిగిన ధరలతో ప్రజలు లబోదిబోమంటుంటో.. పలు చోట్ల ప్రభుత్వాలే సబ్సిడీ రేట్లలో టమాటాలను సరఫరా చేస్తున్నాయి. ఇక ఉత్తర భారతదేశంలో టమాట ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఉత్తరఖాండ్ రాష్ట్రం గంగోత్రి ధామ్‌లో కిలో టమాట రూ. 250 పలుకుతోంది. ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ. 180 నుండి 200 వరకు ఉంది. యమునోత్రిలో కిలో టమాట రూ. 200 నుంచి 250 వరకు చేరింది. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టమాటా రేట్లు పెరిగిపోయాయని.. కూరగాయల విక్రయదారుడు తెలిపారు. ఇటీవల తీవ్రల ఎండలు, అకాల వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు. చదవండి: కొండెక్కిన ధరలు.. తోట నుంచి రూ. 2.5 లక్షల టమాట చోరీ అదే విధంగా కోల్కతాలోరూ.152, ఢిల్లీలో రూ.120, బెంగుళూరులో రూ. 120గా ఉంది. చెన్నైలో రూ.100 నుంచి 130 పలుకుతుండటంతో స్థానిక రేషన్ షాపుల ద్వారా టమాట రూ. 60కే కిలో చొప్పున అందిస్తున్నారు. ఇక అత్యల్పంగా రాజస్థాన్‌లోని చురులో రూ.31గా ఉన్నది. ఇతర కూరగాయలు కూడా ధరల విషయంలో తామేమీ తీసిపోలేదని అల్లం, వంకాయటమాటాతో పోటీపడుతున్నాయి. కూరగాయల ఉత్పత్తిదారుల కమిటీ ప్రకారం కిలో అల్లం ధరం రూ.250 దాటగా, వంకాయ రూ.100 చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా గత పది రోజుల్లో 20 నుంచి 60 శాతం మధ్య పెరిగాయని అధికారులు తెలిపారు. దీంతో కూరగాయలు కొనలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
మితి మీరితే... మరో ప్రమాదం!
పవిత్ర చార్ధామ్ యాత్ర ఎప్పటి లానే ఈ ఏడూ మొదలైంది. అక్షయ తృతీయ వేళ గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. ఏప్రిల్ 25న కేదార్నాథ్, 27న బదరీనాథ్ తెరిచేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. మొదలవుతూనే ఈ యాత్ర అనేక ప్రశ్నలనూ మెదిలేలా చేసింది. హిమాలయ పర్వతాల్లో కఠోర వాతావరణ పరిస్థితుల మధ్య సాగే ఈ యాత్రలో కొండచరియలు విరిగిపడి బదరీనాథ్ హైవే తాజాగా మూసుకుపోవడం పొంచివున్న ప్రమాదాలకు ముందస్తు హెచ్చరిక. యమునోత్రి ప్రయాణంలో తొలిరోజే ఇద్దరు గుండె ఆగి మరణించడం యాత్రికుల శారీరక దృఢత్వానికి సంబంధించి అధికారుల ముందస్తు తనిఖీ ప్రక్రియపై అనుమానాలు రేపుతోంది. ఇప్పటికే 16 లక్షల మందికి పైగా యాత్రకు పేర్లు నమోదు చేసుకున్న వేళ... రానున్న కొద్ది వారాల్లో ఈ పర్వత ప్రాంత గ్రామాలు, పట్నాల మీదుగా ప్రయాణంపై భయాందోళనలు రేగుతున్నాయి. ‘దేవభూమి’ ఉత్తరాఖండ్ అనేక హిందూ దేవాలయాలకు ఆలవాలం. చార్‌ధామ్‌గా ప్రసిద్ధమైన యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బదరీనాథ్‌లు ఇక్కడివే. ఇన్ని ఆలయాలు, ప్రకృతి అందాలకు నెలవైన ఉత్తరాఖండ్‌కు ఆర్థిక పురోభివృద్ధి మంత్రాల్లో ఒకటి – పర్యాటకం. అయితే, అదే సమయంలో హిమాలయాల ఒడిలోని ఈ ప్రాంతం పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతం. ఈ సంగతి తెలిసినా, పర్యావరణ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నా పాలకులు పెడచెవిన పెడుతూనే ఉన్నారు. ఉత్పాతాలనూ లెక్క చేయకుండా, చార్ధామ్ ప్రాంతాలను వ్యాపారమయం చేసి, భరించలేనంతగా యాత్రికుల్ని అనుమతిస్తున్నారు. హిమాలయాల్లో పద్ధతీ పాడూ లేక ఇష్టారాజ్యంగా చేపడుతున్న సోకాల్డ్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, అనియంత్రిత పర్యాటకం కలగలసి మానవ తప్పిదంగా మారాయి. ఈ స్వయంకృతాపరాధాలతో వాతావరణ మార్పులకు మంచుదిబ్బలు విరిగిపడుతున్నాయి. జోషీ మఠ్ లాంటి చోట్ల జనవరిలో భూమి కుంగి, ఇళ్ళన్నీ బీటలు వారి మొదటికే మోసం రావడం తెలిసిందే! నియంత్రణ లేని విపరీత స్థాయి పర్యాటకం ఎప్పుడైనా, ఎక్కడైనా మోయలేని భారం. విషాదమేమంటే, ప్రాకృతిక సంపదైన హిమాలయాలను మన పాలకులు, ప్రభుత్వాలు ప్రధాన ఆర్థిక వనరుగా చూస్తుండడం, వాటిని యథేచ్ఛగా కొల్లగొట్టడం! అభివృద్ధి, పర్యాటక అనుభవం పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండడం! కనీసం ఆ ప్రాంతాలు ఏ మేరకు సందర్శకుల తాకిడిని తట్టుకోగలవనే మదింపు కూడా ఎన్నడూ మనవాళ్ళు చేయనేలేదు. బదరీనాథ్, కేదార్‌నాథ్‌లు తట్టుకోగలవని పర్యావరణ నిపుణులు అంచనా వేసిన రద్దీ కన్నా రెండు, మూడింతలు ఎక్కువగా, దాదాపు 15 వేల మందికి పైగా జనాన్ని నిరుడు ప్రభుత్వం అనుమతించడం విచిత్రం. ఒక్క గడచిన 2022లోనే ఏకంగా కోటి మంది పర్యాటకులు ఉత్తరాఖండ్‌ను సందర్శించినట్టు లెక్క. కేవలం చార్ధామ్ యాత్రాకాలంలోనే రికార్డు స్థాయిలో 46 లక్షల మంది వచ్చారు. ఈ ఏడాది ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో రోజుకు అనుమతించాల్సిన యాత్రికుల సంఖ్యపై పరిమితిని ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం ఏ రకంగా సమర్థనీయం! నిజానికి ‘జాతీయ విపత్తు నివారణ సంస్థ’ (ఎన్డీఎంఏ) 2020 నాటి నివేదికలోనే భారత హిమా లయ ప్రాంతం ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్ళను ఏకరవు పెట్టింది. పర్యాటకం, పట్టణ ప్రాంతాలకు వలసల వల్ల పట్నాల మొదలు గ్రామాల వరకు తమ శక్తికి మించి రద్దీని మోయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్పింది. బఫర్ జోన్‌ను సృష్టించడం సహా అనేక నియంత్రణ చర్యలను సిఫార్సు చేసింది. మంచుదిబ్బలు విరిగిపడి, వరదలకు కారణమయ్యే ప్రాంతాల్లో పర్యాటకాన్ని నియంత్రించాలనీ, తద్వారా కాలుష్యస్థాయిని తగ్గించాలనీ సూచించింది. పాలకులు వాటిని వినకపోగా, ఏటేటా ఇంకా ఇంకా ఎక్కువ మందిని యాత్రకు అనుమతిస్తూ ఉండడం విడ్డూరం. జోషీమఠ్‌లో విషాదం ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. బీటలు వారిన అనేక ఇళ్ళు కూల్చివేయక తప్పలేదు. గూడు చెదిరి, ఉపాధి పోయి వీధినపడ్డ వారికి ఇంకా పరిహారం అందనే లేదు. తాత్కాలిక శిబిరాల్లోనే తలదాచుకుంటున్న దుఃస్థితి. ఈ పరిస్థితుల్లో గత వారం కూడా కొత్తగా కొన్ని ఇళ్ళు బీటలు వారాయన్న వార్త ప్రకృతి ప్రకోపాన్ని చెబుతోంది. సిక్కు పర్యాటక కేంద్రం హేమ్‌కుండ్ సాహిబ్కూ, చార్ధామ్ యాత్రలో బదరీనాథ్కూ సింహద్వారం ఈ జోషీమఠే. పరిస్థితి తెలిసీ ఈసారి పర్యాటకుల సంఖ్య రికార్డులన్నీ తిరగరాసేలా ఉంటుందని రాష్ట్ర సీఎం ప్రకటిస్తున్నారు. జోషీమఠ్, ఔలీ ప్రాంతాలు అన్ని రకాలుగా సురక్షిత ప్రాంతాలని ప్రచారం చేసేందుకు తపిస్తున్నారు. ప్రమాదభరితంగా మారిన ఆ కొండవాలు ప్రాంతాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేసి, విపరీతంగా వాహనాలను అనుమతించడం చెలగాటమే. కనుక తొందరపాటు వదిలి, తగిన జాగ్రత్తలు చేపట్టాలి. హిందువులకు జీవితకాల వాంఛల్లో ఒకటైన ఈ యాత్ర ప్రభుత్వానికీ, స్థానిక ఆర్థిక వ్యవస్థకూ బోలెడంత డబ్బు తెచ్చిపెట్టవచ్చు గాక. ధర్మవ్యాప్తిలో ముందున్నామని పాలక పార్టీలు జబ్బలు చరుచుకొనేందుకూ ఇది భలేఛాన్స్ కావచ్చు గాక. జలవిద్యుత్కేంద్రాలు సహా విధ్వంసకర అభివృద్ధితో ఇప్పటికే కుప్పకూలేలా ఉన్న పర్యావరణ వ్యవస్థపై అతిగా ఒత్తిడి తెస్తే మాత్రం ఉత్పాతాలు తప్పవు. మొన్నటికి మొన్న 2013లో 5 వేల మరణాలకు కారణమైన కేదారనాథ్ వరదల్ని విస్మరిస్తే ఎలా? పర్యావరణం పట్ల మనం చేస్తున్న ఈ పాపం పెను శాపంగా మారక ముందే కళ్ళు తెరిస్తే మంచిది. హిమాలయ పర్వత సానువులు అనేకులకు అతి పవిత్రమైనవీ, అమూల్యమైనవీ గనక వాటిని పరిరక్షించడం మరింత ఎక్కువ అవసరం. అందుకు దీర్ఘకాలిక ప్రణాళికా రచన తక్షణ కర్తవ్యం. -
చార్ధామ్ యాత్ర ప్రారంభం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఆరు నెలల అనంతరం తిరిగి తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర మొదలైంది. గంగోత్రి ఆలయ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు, యమునోత్రి గుడిని 12.41 గంటలకు ఆలయ కమిటీ సభ్యులు తెరిచారు. ఈ సందర్భంగా గంగోత్రి ఆలయంలో, యమునా దేవత శీతాకాల నివాసమైన ఖర్సాలీలో కూడా ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి పూజలు చేశారు. అనంతరం యమునా దేవిని అందంగా అలంకరించిన పల్లకీలో ఊరేగింపుగా యమునోత్రికి తీసుకువచ్చారు. చార్ధామ్ యాత్రకు ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు పేర్లను నమోదు చేసుకున్నారు. ఈనెల 25న కేదార్నాథ్, 27న బదరీనాథ్ ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. హిమాలయాల్లోని ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో రోజువారీ భక్తుల సందర్శనపై పరిమితం విధించాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్లు సీఎం ధామి ప్రకటించారు. -
లోయలో పడ్డ బస్సు, 22 మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఆదివారం సాయంత్రం ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. గంగోత్రి-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న చార్ధామ్ యాత్రికుల బస్సు దమ్టా వద్ద లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 22 యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టుగా తెలిసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చార్ధామ్ యాత్రికులు యమునోత్రి వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. చదవండి👉🏻 వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్ శర్మను సస్పెండ్ చేసిన బీజేపీ ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives in the accident in Uttarakhand. The injured would be given Rs. 50,000 each. — PMO India (@PMOIndia) June 5, 2022 -
యమునోత్రిలో కూలిన రహదారి భద్రత గోడ.. 10 వేల మంది యాత్రికులు..
ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ఆలయానికి వెళ్లే రహదారి భద్రతా గోడ శుక్రవారం ఒక్కసారిగా కూలిపోయిది. దీంతో రిషికేశ్-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న 10 వేల మందికి పైగా యాత్రికులు చిక్కుకున్నారు. జంకిచట్టి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ రహదారులను పునరుద్ధరించడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే చిన్న చిన్న వాహనాలను పంపడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద వాహనాల్లో ఉన్న యాత్రికులకు మాత్రం ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. కాగా బుధవారం భారీ వర్షాలు కురవడంతో సయనచట్టి, రణచట్టి మద్య ఉన్న రహదారి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో 24 గంటలు మూసేసి తిరిగి గురువారం సాయంత్రం హైవే తెరిచారు. అయితే ఇంతలోనే మరోసారి రోడ్డు కూలిపోవడంతో ప్రస్తుత ఇబ్బంది పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. చదవండి: విపరీతమైన ట్రాఫిక్‌తో కొట్టుమిట్టాడే నగరాల్లో ముంబై, బెంగళూరు.. -
కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలు మూసివేత
డెహ్రాడూన్: హిమాలయాల్లో ఉన్న ప్రఖ్యాత కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలను శనివారం మూసివేశారు. ఈ ఆలయాలను భారీగా మంచుపడే శీతాకాలంలో ఏటా మూసివేస్తుంటారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం కేదార్నాథ్ ఆలయ ద్వారాలను శనివారం ఉదయం 8 గంటలకు, యమునోత్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసినట్లు చార్‌థామ్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని పేర్కొంది. శీతాకాల బసకోసం ఆయా ఆలయాల్లోని బాబా కేదార్, మాత యమున విగ్రహాలను అందంగా అలంకరించిన పల్లకిలో ఉఖిమఠ్, ఖర్సాలీ ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు తెలిపింది. గంగోత్రి ఆలయం శుక్రవారం మూతపడగా, బద్రీనాథ్ ఆలయ ద్వారాలను ఈ నెల 20వ తేదీన మూసివేస్తారు. -
2017 చూడాలని ఉంది
ఎన్ని చూసినా ఇంకా చూడవలసినవి, ఎంత చెప్పినా ఇంకా తెలియాల్సినవి మన దేశంలో ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో నాటి రాజులు కట్టించినవి కొన్నయితే, ఆధ్యాత్మికతకు దారులు చూపేవి మరికొన్ని. ప్రకృతి ప్రేమికుల దాహార్తిని తీర్చేవి ఇంకొన్ని. 2017లో ఈ అద్భుతమైన 17 ప్రదేశాల గురించి తెలుసుకుంటే ‘చూడాలని ఉంది’ అనకుండా ఉండలేరు. 1 ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రముఖమైనది వెయ్యేళ్లనాటి కేదార్నాథ్ మందిరం. పాండవులు నిర్మించిన ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించిడినట్టు కథనాలున్నాయి. కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులు శివుని కోపం తపస్సు చేసి, ఇక్కడ కొలువుదీరమని కోరినట్టు కథనాలున్నాయి. కేదార్‌నాథ్‌ను దర్శిస్తే జన్మచక్రంలో బంధీలుకారని, మోక్షప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. మందిరంతో పాటు హిమాలయా ల్లోని గర్హాల్ వద్ద మందాకిని నది సోయగాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఈ ప్రాంతాన్ని పరమేశ్వరుడు రక్షిస్తున్నట్టు చెబుతారు. మంచు కొండలలో కొలువుదీరిన కేదార్నాథ్ చార్ధామ్ యాత్రలలో రారాజు. సత్యయుగానికి చెందిన ఈ దేవాలయం గురించే కాదు, ఈ ప్రాంతం గురించి ఎన్నో కథనాలున్నాయి. కేదార్నాథ్ చేరుకోవాలంటే.. విమానమార్గంలో డెహ్రడూన్ (ఉత్తరాఖండ్) ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి. అక్కడనుంచి బదరినా«ద్∙315, కేదార్నాథ్ 240, గంగోత్రి 298, యమునోత్రి 177 కిలోమీటర్లు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు విమాన సదుపాయాలున్నాయి. రైల్వేస్టేషన్ రిషీకేష్‌లో ఉంది. ఇక్కడ నుంచే బదరినాథ్, కేదార్నాథ్, గంగోంత్రి, యమునోత్రిలకు హరిద్వార్ మీదుగా చేరుకోవాలి. హరిద్వార్‌కు అన్ని నగరాల నుంచి రైలుమార్గాలున్నాయి. రిషికేష్ నుంచి కేదార్నాథ్ మీదుగా రుద్రప్రయాగ చేరుకోవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు: బదరినాథ్‌తో పాటు సూర్యకుండ్, నీల్‌కం, సతోపంత్ సరస్సు సందర్శనీయ స్థలాలు. మరిన్ని వివరాలకు: http://uttarakhandtourism.gov.in// లాగిన్ అయి తెలుసుకోవచ్చు. 2 మనోహరమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలకు ఆలవాలం అల్వార్. రాజస్థాన్‌లో గల ఈ ప్రాంతానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 163 కిలోమీటర్లు. అల్వార్‌కు సమీప పట్టణాల నుంచి బస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రైలుమార్గం గుండా అల్వార్ వెళ్ళే పర్యటన జీవితాంతం మరిచిపోలేనిదిగా ఉంటుంది. సరిస్కా టైగర్ రిజర్వ్‌లో హోటల్ సదుపాయాలున్నాయి. ఇక్కడి అడవిలో బస ఓ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. రాజస్థాన్ ప్రాంతీయ వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు. ఢిల్లీ వాసులకు ఇది వీకెండ్ స్పాట్ అని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిపి వినోద విహారానికి ‘సరిస్కా’ ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పవచ్చు. ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్లు, జైపూర్ నుంచి 107 కిలోమీటర్లు. 1955లో అభయారణ్యంగా ప్రకటించిన ప్రభుత్వం 1979లో నేషనల్ పార్క్‌గా ప్రకటించింది. http://rtdc.tourism.rajasthan.gov.in 3 ఏడవ మనువు ఈ ప్రాంతాన్ని సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అతని పేరు మీదుగానే మనాలీ వచ్చిందని ప్రతీతి. ఎల్తైన పర్వత ప్రాంతాలు వాటి మీదుగా పచ్చని వనాలు, చల్లటి మలయమారుతం, పువ్వుల సోయగాలు ఎంతసేపయినా అలసటేరాని ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది మనాలీ అని చెప్పుకోవచ్చు. భుంటార్లో విమానాశ్రయం నుంచి మనాలి 50 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ– షిమ్లా నుంచి మనాలీ చేరుకోవచ్చు. చలికాలంలో గడ్డకట్టపోయేట్టుగా ఉండే ఇక్కడి వాతావరణం వేసవికి అనుకూలంగా ఉంటుంది. ఆకర్షణీయ ప్రదేశాలు: అత్యంత నిర్మాణ కౌశలంతో ఆకట్టుకునే హిడింబా, మనై దేవాలయాలు. అలాగే వశిష్ట మహర్షి ప్రాచీన ఆలయం. టిబెటన్ల ఆశ్రమాలు, శివ, గాయత్రి, అర్జున ప్రాచీన మందిరాలను సందర్శించవచ్చు. సైట్ సీయింగ్ టూర్స్‌కి హిమాచల్ ప్రదేశ్ టూరిజమ్ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. వివరాలకు ఉఝ్చజీ Email: manali@hptdc.in 4 ఆరావళి పర్వతప్రాంతంలో ఉన్న ఉదయపూర్ (రాజస్థాన్)కు దేశంలో అత్యంత రొమాంటిక్ పట్టణాలలో ఒకటిగా పేరుంది. చుట్టూ నాలుగు సరస్సులతో అలరారుతున్న ఈ పట్టణం ఎన్నో విశేషాలకు నెలవు. ‘జెవెల్ ఆఫ్ మేవార్’, ‘వెనీస్ ఆఫ్ ద ఈస్ట్’ అనే పేర్లు దీనికి సొంతం. అద్భుతమైన సరస్సులు ఉండటం ఒక విశేషమైన అత్యద్భుతమైన చారిత్రక సౌరభాలు ఉండటం మరో విశేషం. మొఘలుల కోటలు, ప్యాలెస్‌లు, దేవాలయాలు, హిల్స్ ఈప్రాంత సొంతం. ఉదయపూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది నధ్వారా దేవాలయం. పిచోలా సరస్సు చుట్టూ స్నాన ఘట్టాలు, దేవాలయాలు, ప్యాలెస్‌లు ఉండటంతో ఇది కమలంలా భాసిల్లుతుంది. ఫతేసాగర్ లేక్, ఉదయ్‌సాగర్ లేక్, జైస్మండ్ లేక్‌లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ప్రాచీన ఉద్యానవనం సహేలియో కి బరి ఫతేసాగర్ సరస్సు ప్రాంతంలో ఉంది. ఇక్కడ శిల్ప్‌గ్రామ్ కళాకృతులకు నెలవు. ఇక్కడ ఉన్న 26 ఇండ్లు అత్యంత సంప్రదాయ నిర్మాణ కౌశలంతో భాసిల్లుతాయి. ఇది ఈ ప్రాంతానికే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. http://rtdc.tourism.rajasthan.gov.in/ 5 ప్రకృతిప్రేమికులను అయస్కాంతంలా ఆకర్షించే శక్తి నుబ్రావ్యాలీ సొంతం. మాటల్లో చెప్పలేని ప్రకృతి అందాలను ఇక్కడ వీక్షించవచ్చు. సమీప ఎయిర్పోర్ట్ లేహ్‌లో ఉంది. ఇక్కడి ‘కౌశక్ బకులా రిన్పోచే’ ఎయిర్పోర్ట్ నుంచి నుబ్రావ్యాలీకి 120 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి జీప్‌లో వ్యాలీకి వెళ్లేమార్గం అత్యద్భుతంగా ఉంటుంది. రైలుమార్గంలో వెళ్లాలంటే జమ్మూలోని ‘టవి’కి వెళ్లాలి. ఇక్కడ నుంచి నుబ్రా 620 కిలోమీటర్లు. నుబ్రావ్యాలీ మంచు ప్రదేశం. బస్సు సదుపాయాలు తక్కువ. జీపుల్లోనే ఈ వ్యాలీలో ప్రయాణించాల్సి ఉంటుంది. ట్రక్స్, మిలటరీ వాహనాల వల్ల బస్సులు చాలా చోట్ల ఆగిపోయే అవకాశం ఉంది.నుబ్రావ్యాలీ చేరుకున్న పర్యాటకులు ఖర్దుంగా వద్ద మిలిటరీ పాసులు తీసుకొని, ఫొటోల కోసం అనుమతి పొందాలి. ఈ ప్రాంతంలో కాశ్మీర్ శాలువాలు, బాదంపప్పులు, ఆప్రికాట్లను కొనుగోలు చేయవచ్చు. కుంకుమపువ్వు తోటల పెంపకాన్ని దగ్గరగా పరిశీలించవచ్చు. 32 మీటర్ల పొడవున్న మైత్రేయ బుద్ధను ఇక్కడ వీక్షించవచ్చు. దలైలామా ఈ ప్రాంతాన్ని సందర్శించడంతో ప్రపంచశాంతి ప్రదేశంగా పేరొచ్చింది. ఒంటెల మీద సవారీ ఈ ప్రాంత ప్రత్యేకత. ఒంటెలు ఎడారులలో కదా నడిచేది అనే అనుమానం కలగవచ్చు. కానీ, ఇక్కడ దానికి విరుద్ధంగా సిల్క్ రూట్లో ఒంటెల మీద ప్రయాణం అత్యద్భుతంగా ఉంటుంది. లేహ్‌కి 140 కిలోమీటర్ల దూరంలో పనామిక్ గ్రామం ఓవర్వ్యూ అత్యద్భుతంగా ఉంటుంది. 6 గుజరాత్లో సోలంకియుల కాలాన్ని స్వర్ణయుగంగా చెప్ప వచ్చు. వీరి కాలంలో రూపుదిద్దుకున్న అనేక కట్టడాలు గుజరాత్ లోని మొధెరాలో సందర్శించవచ్చు. పుష్పవతి నది బ్యాక్‌డ్రాప్‌లో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల టెర్రా–ఫార్మడ్ గార్డెన్లో నింగిని తాకుతున్నట్టుగా ఉండే వృక్షాలను వీక్షించవచ్చు. ఇక్కడి సన్ టెంపుల్ తప్పక సందర్శించదగినది. మొ««ధెరాలో చక్రవర్తుల కథనాలెన్నింటినో తెలుసుకోవచ్చు. విశాలమైదానాలు, స్వాగతం పలికే దేవాలయ కాంప్లెక్స్ చెప్పుకో దగినవి. పురాణాలలో ఈ ప్రాంతం పేరు ‘మొధెరక్’ అని ఉంది. అంటే మర ణించిన పుట్టలు అని అర్థం. జైనుల అచ్చుప్రతులు, బ్రహ్మపురాణం, స్కందపురాణాలు ఈ ప్రాంతంలోనే పుట్టాయి. ధర్మవన్యక్షేత్ర అనే పేరు కూడా ఈ ప్రాంతానికి ఉంది. మొధెరా సన్ టెంపుల్ నాటి నిర్మాణ చాతుర్యాన్ని కళ్లకు కడుతుంది. కమలంలా ఉండే ఈ టెంపుల్ శిఖరభాగం ఇక్కడి నీటిలో అద్దంలో చూసినట్టు దర్శించవచ్చు. ద్వారం గుండా బయల్దేరితే సభామండపం, అంతరల్, గర్భగృహాలను చేరుకుంటాం. ఈ ప్రాంతానికి అన్ని ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు మార్గం గుండా చేరుకోవచ్చు. అహ్మదాబాద్‌లో ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అహ్మదాబాద్ నుంచి మొధెరాకు 101 కిలోమీటర్లు. సమీప రైల్వేస్టేషన్ మెహసనాలో ఉంది. Mail: info@gujarattourism.com 7 ఇది దేశంలోనే అతి పెద్ద జైన్ టెంపుల్. భావనగర్‌కు (గుజరాత్) 51 కిలోమీటర్ల దూరంలో ఉంది పలిటన. ఇది 863 దేవాలయాల సముదాయం. శత్రుంజయ హిల్‌పైన పలిటన దేవాలయం కొలువుదీరి ఉంది. మొత్తం 3950 మెట్లు 3.5 కిలోమీటర్లు అధిరోహిస్తే ఈ మందిరాలను చేరుకోవచ్చు. క్రీ.శ. 900 ఏళ్ల కాలంలో రెండుదశలుగా నిర్మించారు. 16వ శతాబ్దిలో ఈ దేవాలయ నిర్మాణ పునరుద్ధరణ చేపట్టారు. రోడ్డుమార్గం గుండా భావనగర్‌కి చేరుకోవాలంటే ముంబై వయా అహ్మదాబాద్ వెళ్లే జాతీయరహదారి మీదుగా 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అహ్మదాబాద్‌లో రైల్వేస్టేషన్ ఉంది. ముంబై, అహ్మదాబాద్‌ల నుంచి భావనగర్‌కు డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు: టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు 9493350099 ఫోన్ చేసి కనుక్కోవచ్చు. E-mail: tibhyderabad@gujarattourism.com 8 స్నేహబృందంతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లాలంటే మధేఘాట్ సరైన ప్లేస్. పశ్చిమlపూణె (మహారాష్ట్ర) రాయగడ్ జిల్లా సరిహద్దు నుంచి 62 కిలోమీటర్ల దూరంలో ఉంది మధేఘాట్. భటఘర్ డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలో టోర్నా కోట, రాజ్‌గడ్, రాయ్‌గడ్ కోటలు ఉన్నాయి. సముద్రమట్టం నుంచి 850 మీటర్ల ఎత్తున టోర్నఫోర్ట్ ఉంటుంది. రాయగడ్ ఫోర్ట్, లింగాన, వరంధా ఘాట్, శివథార్ ఘాట్ ఉన్నాయి. అత్యంత చల్లగా ఉండే హిల్ స్టేషన్ ఇది. ఇక్కడ గల లింగన ఫోర్ట్‌ను ఛత్రపతి శివాజీ ఉపయోగించారు. నాటి గుర్తులను ఇక్కడ వీక్షించవచ్చు. బిర్వాడి నుంచి మధేఘాట్‌కు నడకదారి గుండా చేరుకోవచ్చు. మధేఘాట్ కింద చిన్న శివ మందిరం ఉంటుంది. ఈ స్వామిని‘దేవ్ టేక్’ అంటారు. ట్రెక్కర్స్‌కి ఇది మంచి ట్రెక్కింగ్ స్పాట్. వీటితోపాటు కెంజాల్‌గడ్, రాయిరేశ్వర్, రాయ్‌గడ్, లింగన ఫోర్ట్, శివతార్ ఘల్ కి మహాబలేశ్వర్ రోడ్ మీదుగా వెళితే ముంబయ్–గోవా హైవే మీదుగా బిర్వాడి చేరుకోవచ్చు. 9 పశ్చిమ బెంగాల్లో టెర్రకోట టెంపుల్స్ సముదాయాలు ఎక్కువ. వీటిలో బిష్ణుపూర్ ఆలయంలో ప్రఖ్యాతిగాంచినది. గుప్తుల కాలంలో నిర్మించిన ఈ టెర్రకోట మందిరాలు అలనాటి సాంస్కృతిక కళావైభవంతో అలరారు తున్నాయి. బిష్ణుపూర్ టెంపుల్ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరింది. ఈ ప్రాంతం కళల కాణాచి, విశ్వవిద్యాలయాలకు, ప్రాచీన సాంస్కృతిక విద్యాలయాలకు పెట్టింది పేరు. బిష్ణుపూర్ నుంచి అరమ్‌బాగ్, దుర్గాపూర్, అసన్సోల్, కోల్‌కత్తాకు రోడ్డుమార్గాలున్నాయి. బిష్ణుపూర్‌కు కలకత్తా నుంచి రైలు సదుపాయాలున్నాయి. బిష్ణుపూర్ మందిరానికి చేరుకోవాలంటే పట్నం నుంచి ఆటో–రిక్షాలలో బయల్దేరవచ్చు. కాలుష్యరహితంగా ఉంచాలనే ధ్యేయంతో ఇక్కడకు మోటార్‌వాహనాలను అనుమతించడం లేదు. సమీప ఎయిర్పోర్ట్ కోల్‌కతా. ఇక్కడ నుంచి బిష్ణుపుర్ 140 కిలోమీటర్లు. ఆకర్షణీయప్రదేశాలు: రస్‌మంచా, పంచరత్న టెంపుల్, పతార్ దర్వాజ, గడ్ దర్వాజ, దాల్‌మండల్ కమాన్, స్టోన్ చారియట్, నూతన్ మహల్, చిన్నమస్త టెంపుల్. 10 మధ్యప్రదేశ్‌లోని ఓర్చా కట్టడాన్ని బుందేల్ ఛీఫ్తాన్ రుద్రప్రతాప్ నిర్మించారు. గుప్తుల కాలానికి చెందిన ఈ కట్టడం పురాతత్వ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అక్టోబర్, మార్చిలలో సందర్శించదగినదిగా పేరొందిన ఈ ప్రాంతానికి సమీప ఎయిర్పోర్ట్ ఖజురహో. రైల్వేస్టేషన్ ఝాన్సీలో ఉంది. ఓర్చాకు ఇది 19 కిలోమీటర్లు. ఝాన్సీ–ఖజరహోకు రోడ్డు మార్గం ఉంది. గ్వాలియర్‌కు 120 కిలోమీటర్లు, ఖజరహోకు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. జహంగీర్ మహల్, రాయ్‌ప్రవీణ్‌మహల్, రాజ్‌మహల్, చతుర్భుజి టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్, జానకి, హనుమాన్ మందిర్, షాహిద్‌స్మారక్ ప్రదేశాలు సందర్శించదగినవి. ఇక్కడ నుంచి 139 కిలోమీటర్ల దూరంలో డియోగడ్ ఉంది. www.mptourism.com----- 11 తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లాలో ఉంది ఎమరాల్డ్ లేక్. ఊటీ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ సరస్సులో విభిన్నరకాల చేపలు ఆకట్టుకోగా, చుట్టుపక్కల పక్షుల సందడి మనల్ని మరోలోకంలో విహరింపజేసేలా చేస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఉషోదయ, సూర్యస్తమయాలు అందమైన పెయింటింగ్‌లా దర్శనమిస్తాయి. చుట్టుపక్కల తేయాకు తోటలు, వాటిమీదగా పరమళించే తేనీటి ఘుమఘుమలు, టీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి ప్రత్యేకం. కోయంబత్తూర్‌కి హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సదుపాయాలున్నాయి. సమీప రైల్వేస్టేషన్ కోయంబత్తూరులో ఉంది. కోయంబత్తూర్ నుంచి ఎమరాల్డ్ లేక్‌కి ట్యాక్సీ కారులో, బస్సులలో బయల్దేరవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు: బొటానికల్ గార్డెన్, ఊటీ, రోజ్ గార్డెన్, లేక్ పార్ట్, ఊటీ లేక్, డీర్ పార్క్. 12 దేవుడి సృష్టిగా అభివర్ణించే ఈ ప్రాంతంలో అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గ్యాంగ్‌టక్. సిక్కిమ్ వాసులు ఇక్కడ ‘పాంగ్ లహ్‌బ్సోల్’ పండగ ప్రతి యేటా అత్యంత ఘనంగా జరుపుతారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై గడ్డకట్టే చలి ఉంటుంది. మే నుంచి సెప్టెంబర్ వరకు వేసవి. జూన్, జూలై, ఆగస్టు నెలలు వర్షాకాలం. సిక్కిమ్‌లో బాగ్దోగ్రా ఎయిర్పోర్ట్ ఉంది. గ్యాంగ్‌టక్‌కి 124 కిలోమీటర్లు. సిక్కిమ్ టూరిజమ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ హెలీకాప్టర్ సర్వీసులను నడుపుతోంది. ఇక్కడ నుంచి గ్యాంగ్‌టక్‌కి 20 నిమిషాలలో చేరుకోవచ్చు. జల్పైగురి, సిల్‌గురిలలో రెండు రైల్లే స్టేషన్లు ఉన్నాయి. బాగ్దోగ్రా, డార్జిలింగ్, పెమయంగ్‌స్టే, ట్సూంగో, యమ్‌తంగ్‌లకు గ్యాంగ్‌టక్ నుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతాలన్నీ 20 నుంచి 120 కిలోమీటర్ల లోపు పరిధిలో ఉన్నాయి. గ్యాంగ్‌టక్‌లో మార్చ్ నుంచి మే వరకు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు బడ్జెట్ హోటల్స్ సదుపాయాలను పొందవచ్చు. మరిన్ని వివరాలకోసం... http://www.sikkimtourism.gov.in లాగిన్ అవ్వచ్చు. 13 ఇలా తలం పై దేవుడి స్వర్గం ఏదైనా ఉందంటే అది కేరళ. నీలగిరి పర్వత శ్రేణులలో కొలువుదీరిన ఈ పర్యాటక ప్రాతం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన నీళ్లు, ఆకట్టుకునే విశాల అటవీ ప్రాంతాలు... కేరళను ఒక్కసారైనా సందర్శించాల్సిందే అనుకోకుండా ఉండరు పర్యాటకులు. కేరళ ఆయుర్వేద చికిత్సలకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. ఈ పర్వత శ్రేణులలో 19వ శతాబ్దిలో తేయాకుతోటల పెంపకం విరివిగా చేపట్టారు. ఎర్వికులమ్ నేషనల్ పార్క్ లక్కమ్ జలపాతాలు, 2,695 మీటర్ల ఎత్తులో ఉండే అనముడి శిఖరం ఇక్కడ తప్పక దర్శించాల్సినవి. కొచ్చిలో అంతర్జాతీయ విమానాశ్రమం ఉంది. ఇక్కడనుంచి 130 కిలోమీటర్లు మున్నార్. హైదరాబాద్ నుంచి కొచ్చికి విమానాలున్నాయి. కొచ్చిలో రైల్వేస్టేషన్ ఉంది. హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో కొచ్చికి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి క్యాబ్స్, బస్సులలో మున్నార్ చేరుకోవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు: పోతమేడు, దేవికులమ్, పల్లివాసల్, అట్టుకల్, న్యాయమకడ్, చిత్తిరపురం, లోకల్ హార్ట్ గ్యాప్, రాజమల. ఇవన్నీ 15 కిలోమీటర్లలోపు పరిధిలో ఉన్నాయి. -
భారీ వర్షాలతో చార్ ధామ్ యాత్రకు బ్రేక్
లక్నో/డెహ్రాడూన్: భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రలకు బ్రేక్ పడింది. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతుండటంతోపాటు దిగువ ప్రాంతాల్లో వరదలు వస్తున్న నేపథ్యంలో చార్ ధామ్ యాత్రికుల ప్రయాణాలను గురువారం ఎక్కడికక్కడ నిలిపేశారు. బద్రీనాథ్, కేదర్నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్ ధామ్ అంటారనే విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఈ నాలుగు ప్రాంతాల్లోని దైవాలను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇప్పటికే చమోలీ జిల్లాలో భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో బద్రీనాథ్ క్షేత్రానికి బయలు దేరిన దాదాపు పదివేల మంది ఎక్కడికక్కడ నిలిచిపోయారు. గత పన్నెండుగంటలుగా ఏమాత్రం తెరపునివ్వకుండా వర్షం కురుస్తుందని, అది తగ్గిన తర్వాత తిరిగి యాత్రలకు అనుమతిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. అప్పటివరకు యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించింది. -
రాజధానుల తీరం!
గమనం నదుల స్వగత కథనం నా పుట్టింటి నుంచి చూస్తే నేలంతా ఎక్కడో పాతాళంలో ఉన్నట్లుంటుంది. నేను ఆకాశమంత ఎత్తులో పుట్టాను. అందుకే అలా అనిపిస్తోందేమో. హిమాలయాల్లోని బందర్‌పూర్ శిఖరం మీద పుట్టి కొండ వాలులో చుక్కలుగా జారిపోతూ యమునోత్రి దగ్గర మడుగు కట్టాను. అక్కడి నుంచి కూడా నా గమనం మంచుకి గడ్డకడుతూ ఎండకు కరుగుతూ వేగంగా జారిపోతూ డూన్ లోయ వరకు అలాగే పరుగుతీస్తాను. డూన్ లోయలో దాక్ పత్తర్ దగ్గర ఆగి ఊపిరి పీల్చుకుని పరుగుని నడకగా మార్చుకుంటాను. నిజానికి నేను ఉపనదినే కానీ ప్రధాన నదికి ఉన్నంత ప్రాధాన్యమిచ్చి గౌరవించింది దేశం. పదివేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో పుట్టిన నేను ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వరకు పదమూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాను. ఎప్పుడో ప్రాచీనకాలంలో ఒకసారి భూమి కదలికలతో నా ప్రవాహం ఒక్కసారిగా అలహాబాద్ వైపుగా దిశమారింది. గంగానదితో సంగమించడంతో నా ప్రయాణం ముగుస్తుంది. ఆ కదలికలే సరస్వతి నది భూమి లోపలి పొరల్లోకి ఇంకిపోవడానికీ కారణమయ్యాయి. నీటి ప్రవాహం నేలను కోసేసినప్పుడు నేలకంటే బలమైనది నీరే అనుకుంటాం. నీటికంటే నేల బలమైనదని అప్పుడప్పుడూ నేల కూడా నిరూపిస్తుంటుంది. నేను లేక కృష్ణుడు లేడు! శ్రీకృష్ణుడు నా ఒడ్డునే పెరిగాడు. పెరగడం ఏంటి, కృష్ణుణ్ని దాచడానికి రేపల్లె దారి పట్టిన వసుదేవుడికి రెండుగా చీలిపోయి మరీ దారిచ్చాను. నా ఒడ్డున భరతుడు, అంబరీషుడు, శంతనుడు వంటి చక్రవర్తులు పుణ్యకార్యాలు చేశారు. నా ఒడ్డున దేశ రాజధాని ఉంది, ఇప్పటి రాజధానిని మాత్రమే కాదు. మహాభారత కాలంలో కౌరవులు, పాండవుల కేంద్రాన్ని. గుప్తులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు కూడా నా తీరాన్నే రాజ్యాలను విస్తరించారు. వారి రాజముద్రికల మీద నన్ను చిత్రించారు. రాష్ట్రకూటులు ఇంకా ఉత్సాహంగా నా గురించి దక్షిణాదికి కూడా తెలియచేయాలనుకున్నారో ఏమో! ఎల్లోరా గుహల్లో ‘నదీమతల్లుల ఆలయా’న్ని నిర్మించారు. అందులో గంగ, సరస్వతితోపాటు నేను కూడా అందమైన యువతి రూపంలో కనిపిస్తాను. ఈ సారి ఎల్లోరా గుహలకు వెళ్తే తప్పక చూడండి. అయినా దక్షిణాదిలో నా ప్రవాహం లేదనే కానీ నేను దేశమంతటికీ పరిచయమైన దాన్నే. దేశరాజధానికి ప్రధాన నీటి వనరు నేనే. ఢిల్లీకి వచ్చిన పార్లమెంటుసభ్యులందరి దాహాన్ని తీర్చేది నేనే. ప్రపంచ వింత! ఢిల్లీ నుంచి ఆగ్రా వైపు కదిలితే ప్రపంచవింతల్లో ఒకటైన తాజ్‌మహల్ పలకరిస్తుంది. మొఘల్ పాలకుడు షాజహాన్ తాజ్ మహల్ నిర్మాణానికి నా తీరాన్ని ఎంచుకోవడం, రాజపుత్ర రాజు ‘మహారాజా జయ్సింగ్’తో సంప్రదింపులు, ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన తాజ్‌మహల్ నిర్మాణం మరుపురాని దృశ్యాలు. ఆగ్రా కోట నుంచి చూస్తే తాజ్‌మహల్ మరింత అందంగా, తెల్లవారు జామున మంచులో తడిసిన మల్లెపువ్వులా కనిపిస్తుంది. అక్బర్ నా తీరాన ఉన్న ఎర్రకోటను పునర్నిర్మించి అక్కడి నుంచే పాలించాడు. తర్వాతి పాలకులు ఢిల్లీ దారిపట్టి షాజహానాపూర్ (ఓల్డ్ ఢిల్లీ) పేరుతో రాజధానిని మార్చుకున్నారు. కానీ అదీ నా తీరాననే కదా! లోధీలనూ... లోభూలనూ! ఒక్కొక్క రాజవంశం అధికారంలోకి వస్తూ తమ పేరుతో రాజ్యాలను స్థాపించడం, ఉన్న వాటినే పేరు మార్చుకుని తమ ముద్ర వేసుకోవడం, పాత పునాదుల మీదనే కోటలకు కొత్త రూపు తీసుకురావడం... అన్నీ చూస్తూనే ఉన్నాను. ఆ యుద్ధాలు, రక్తపాతాలూ స్మృతిపథం నుంచి చెరిగిపోవడం లేదు. ఢిల్లీని పాలించిన లోధీల ప్రాభవాన్ని చూశాను. రాజపుత్రుల వీరత్వాన్ని, మొఘలుల పోరాటపటిమనూ ఆస్వాదించాను. బ్రిటిష్ పాలకుల లౌక్యాన్నీ గమనించాను. ఇప్పటి పాలకుల అవకాశవాద వ్యూహప్రతివ్యూహాలనూ వీక్షిస్తున్నాను. లెక్క చూసుకోకుండా పరిశ్రమలకు అనుమతులివ్వడం, గాలి నీరు కలుషితమయ్యాయంటూ తీసేయడం, రంగుమారిన తాజ్‌మహల్ పాలరాతి గోడల్ని చూసి పెదవి విరిచిన పర్యాటకుడి సాక్షిగా భరిస్తున్నాను. ‘తాజ్‌మహల్... ఫొటోలో ఉన్నంత అందంగా లేదేంటమ్మా’ అనే పదేళ్ల పిల్లాడి సందేహం తీర్చడానికి ఆ తల్లి దగ్గర ఒక్కమాటలో సమాధానం ఉంటుందా? నా పరిస్థితీ అంతే. ప్రయాణంలో మజిలీలు... పురాతన కాలంలో గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ మనదేశానికి వచ్చినప్పుడు నా తీరాన పర్యటించాడు. ‘ఇండికా’ రాస్తూ నా తీరాన్ని శూరసేనుడి రాజ్యంలో ప్రవహించే ప్రధానమైన నదిగా అభివర్ణించాడు. అలెగ్జాండర్ ప్రతినిధి సెల్యూకస్ నాకు ‘లూమాన్స్’ అంటూ కొత్త పేరు తగిలించాడు. ఎవరెలా పిలిచినా కాదనేదెలా? నా నీరు మేలిమి నీలిరంగులో ఉంటాయి. కానీ అంత చిక్కదనంలో నీలం బదులు నలుపు కనిపించిందో ఏమో ‘కాళింది’ అని కూడా పిలిచారు. నాతోపాటు నా ప్రవాహంలో చేరే ‘టాన్స్, చంబల్, సింధ్, బేత్వా, కెన్, రిషిగంగ, గిరి, కుంత, హనుమాన్గంగ, బాతా నదుల నీరు అంత చిక్కగా ఉండదు. కానీ నాలో కలిసి ఓ ఫర్లాంగు ప్రయాణిస్తాయో లేదో నీలంగా మారిపోతాయి. అన్నట్లు మీకు మరో సంగతి తెలుసా? నేను, గంగమ్మ ఇద్దరం హిమాలయాల్లోనే పుట్టాం, అలహాబాద్ దగ్గర కలుస్తున్నాం, మా ప్రవాహాన్ని ఆకాశం నుంచి చూస్తే రైలుపట్టాల్లా సమాంతరంగా ప్రయాణిస్తున్నట్లే ఉంటుంది. రెండు విభిన్నమైన రంగుల్లో కనిపిస్తాం. ఆ తేడా మేము కలిసిన తరవాత దాదాపు పదిమైళ్ల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత నేను, నా ఉనికి ఏమీ ఉండవు. పచ్చదనాల నేల! రాజధాని దాహార్తి తీర్చిన నేను హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్ల సాగుకు సాయమందిస్తున్నాను. నా నీటితో బాసుమతి బియ్యం పండడం, ఆ బియ్యంతో బిరియానీ ఘుమఘుమల కోసం దేశం అంతా ముక్కుపుటాలు విచ్చుకుని ఆస్వాదించడం చూస్తే నా జన్మ ధన్యమైందనిపిస్తుంది. హరియాణ (హర్యానా) నేలకు ఆ పేరు రావడానికి కారణం నా నీరే. ఆ కృతజ్ఞతతోనే కాబోలు వాళ్లు ఒక జిల్లాకు యమునానగర్ అని పేరు పెట్టుకున్నారు. అక్కడ కట్టిన ఆనకట్ట నుంచి రాజస్థాన్‌కు నీరందుతోంది. సట్లెజ్‌ను - నన్ను కలపాలనే గొప్ప ఆలోచన మన పాలకులకు వచ్చినప్పుడు సంతోషంతో ఉప్పొంగిపోయాను. ఆ అనుసంధానమే కనుక జరిగితే తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి ప్రధాన రవాణా మార్గాన్నవుతాను. ఇప్పుడు హిందూమహాసముద్రం మీదుగా చుట్టుతిరిగి వెళ్తున్న నౌకల ప్రయాణదూరం తగ్గిపోతుంది. కానీ నేను సంతోషించినంత వేగంగా హర్యానా స్పందించింది కానీ పంజాబ్‌కు పట్టడం లేదు. ఆ అనుసంధానం జరిగి ఈ తీరాన్ని- ఆ తీరాన్ని కలిపే ఇరుసు నేనయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ... - యమునా నది ప్రెజెంటేషన్: వాకా మంజులారెడ్డి