హిమాలయాలకు పెడల్‌ తొక్కారు... | Two womens cycling through the Himalayas for the One Billion campaign | Sakshi
Sakshi News home page

హిమాలయాలకు పెడల్‌ తొక్కారు...

Published Tue, Apr 20 2021 12:13 AM | Last Updated on Tue, Apr 20 2021 12:13 AM

Two womens cycling through the Himalayas for the One Billion campaign - Sakshi

24 ఏళ్ల సబిత మహతో, 21 ఏళ్ల శ్రుతి రావత్‌ ఇప్పుడు హిమాలయాలతో సంభాషిస్తున్నారు. ధ్వని లేదు. కాలుష్యం లేదు. నాలుగు కాళ్లు, నాలుగు పెడల్స్‌... అంతే. కశ్మీరులోని పీర్‌ పంజిల్‌ శ్రేణి నుంచి నేపాల్‌లోని మహాభారత శ్రేణి వరకు 5,600 కిలోమీటర్ల ‘ట్రాన్స్‌ హిమాలయా’ను వారు 85 రోజుల్లో సైకిళ్ల మీద చుట్టేయనున్నారు. స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా ‘ఒన్‌ బిలియన్‌ రైజింగ్‌’ కాంపెయిన్‌లో భాగంగా వారు ఈ సాహసకార్యం చేస్తున్నారు. ఫిబ్రవరి 2న మొదలైన వీరి యాత్ర ప్రస్తుతం సిక్కింలో కొనసాగుతోంది. వీరి పరిచయం...

వన్‌ బిలియన్‌ అంటే 100 కోట్లు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ఫ్రపంచ జనాభాలోని ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు లేదా సగటున 100 కోట్ల మంది స్త్రీలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా హింసకు లేదా అత్యాచారానికి లోనవుతున్నారు. ఆ 100 కోట్ల మంది స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకం గా చైతన్యం, ప్రచారం కలిగించాలని అమెరికన్‌ ఫెమినిస్ట్‌ ‘ఈవ్‌ ఎన్స్‌లర్‌’ మొదలెట్టిన కార్యక్రమమే ‘వన్‌ బిలియన్‌ రైజింగ్‌’.

ఈ కార్యక్రమం లో భాగంగా పర్వతారోహకులు సబితా మహతో, శ్రుతి రావత్‌లు చేస్తున్న సైకిల్‌ యాత్రే ‘రైడ్‌ టు రైజ్‌’. హిమాలయ పర్వత శ్రేణులలో సైకిల్‌ తొక్కుతూ స్త్రీ హింసకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ దాదాపు 85 రోజుల పాటు వీరు యాత్ర చేస్తారు. ఫిబ్రవరి 2న నాటి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ఈ యాత్రను ప్రారంభించారు. అంతేకాదు తమ రాష్ట్రానికి చెందిన శ్రుతి రావత్‌ ఈ యాత్ర చేస్తున్నందున లక్షన్నర రూపాయల ఆర్థికసాయం కూడా చేశారు.

ఇద్దరు అమ్మాయిలు
బిహార్‌కు చెందిన సబిత మహతో, ఉత్తరాఖండ్‌కు చెందిన శ్రుతి రావత్‌ ఈ యాత్ర చేస్తున్నారు. అట్టారి సరిహద్దు దగ్గర మొదలెట్టిన ఈ యాత్ర ‘ట్రాన్స్‌ హిమాలయ’గా పేరు పొందిన ఆరు హిమాలయ శ్రేణులను కవర్‌ చేయనుంది. పంజాబ్, జమ్ము కాశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, నేపాల్‌ల గుండా హిమాలయాల అంచులను తాకుతూ వీరిరువురూ సైకిళ్ల మీద కొనసాగుతారు. 5 వేల కిలోమీటర్లకు పైగా ఉండే ఈ దూరం వీరు పూర్తి చేసేందుకు మూడునెలలు పట్టొచ్చు. అయినా మాకు ఇలాంటి సాహసాలు అలవాటే అని వీరు అంటున్నారు. అనడమే కాదు ఇప్పటివరకూ విజయవంతంగా యాత్ర చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు.

చేపలు అమ్మే వ్యక్తి కుమార్తె
సబితా మహతో ఒక చేపలు పట్టే వ్యక్తి కుమార్తె. వీళ్లది బిహార్‌ అయినా తండ్రి కోల్‌కతా వెళ్లి చేపల పని చూసుకొని వస్తుంటాడు. ‘మా నాన్న నేను పర్వతారోహణ స్కూల్‌లో చేరతానంటే మనకెందుకమ్మా అన్నాడు. కాని డార్జిలింగ్‌లోని హిమాలయన్‌ మౌంటనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నేను 2014లో చేరి పర్వతాలు ఎక్కడం మొదలెట్టాక ఎంతో సంతోషపడ్డాడు. ఇప్పుడు మా నాన్న నేను ఏ పని చేసినా మెచ్చుకుంటాడు’ అంటుంది సబితా. ఈమె ఇప్పటికే హిమాలయాల్లోని అనేక ముఖ్య శిఖరాలను అధిరోహించింది. ఎవరెస్ట్‌ అధిరోహించాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ‘ఎవరెస్ట్‌ను ఎక్కిన దారిలోనే ఎవరూ దిగరు. నేను మాత్రం ఎక్కినదారిలోనే దిగి రికార్డు సృష్టించాలనుకుంటున్నాను’ అంటుంది. ప్రస్తుతం ఆమె స్పాన్సర్ల అన్వేషణలో ఉంది.

స్త్రీల కోసం భూమి కోసం
‘స్త్రీల హింస అంటే జన్మనిచ్చిన తల్లి మీద హింస చేయడం. అది పురుషుడు కొనసాగిస్తున్నాడు. అలాగే నేల తల్లి మీద కూడా కాలుష్యం, విధ్వంసంతో పీడన కొనసాగిస్తున్నాడు. మేమిద్దరం చేస్తున్న యాత్ర స్త్రీలపై హింసను మానుకోమని చెప్పడమే కాదు అందమైన ప్రకృతి స్త్రీ మీద కూడా హింస నివారించమని అందరినీ అభ్యర్థిస్తుంది. మా సైకిల్‌ యాత్రలో ఆంతర్యం సైకిల్‌ కాలుష్యం కలిగించదు. ఇలాంటి ఎరుకతో ఈ భూమి తల్లిని కాపాడుకొని భావితరాలకు అందజేయమని కోరుతున్నాం’ అన్నారు సబిత, శ్రుతి.

యాత్ర ఇలా సాగుతోంది

‘మేమిద్దరం రోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం 7.30 వరకూ యాత్ర కొనసాగిస్తాం. ఆ తర్వాత ఆ గమ్యంలోని హోటల్‌లో బస చేస్తాం. ఇప్పటివరకూ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఘటనలు జరగలేదు. దారి పొడవునా జనం మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు చెడ్డవాళ్లను చూసి మనుషులందరూ చెడ్డవాళ్లనుకోకూడదు. ఇంట్లోనే ఉంటే లోకం చాలా ప్రమాదం అనిపిస్తుంది. లోకాన్ని చూడటం మొదలెడితే ఇది కూడా ఎంతో ఆదరణీయమని అర్థమవుతుంది’ అన్నారు వారిద్దరూ.
వారి యాత్ర విజయవంతం అవ్వాలని కోరుకుందాం.

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement